Jump to content

మత సామరస్యం

వికీపీడియా నుండి
ఐకమత్యాన్ని, మత సామరస్యాన్ని ప్రబోదిస్తున్న రోడ్డు పక్క ఏర్పాటు చేసిన బోర్డు.

మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం. ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి. అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే. "మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు. మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం. చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం. మతాన్ని మారణ కాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు నరకానికే పొతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు, సహనం, శాంతి, క్షమ, దయ మనలో వుంటే మత కలహాలు జరగవు. స్వర్గం ఇక్కడే వుంటుంది. పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం. హిందూ ముస్లిం భాయీ భాయీ. సహించడమే గొప్ప స్వర్గ ద్వారం. ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది. అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని చేయద్దు. పూర్వం ఎవరో చేసిన పాడు పనులు ఇప్పటికీ గుర్తు చేసేకంటే మన ప్రజలు శాంతి సామరస్యాల కోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది. అన్ని మతాలలోనూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారున్నారు. ఒక మతం కొమ్ముకాసే వారికి సొంత మతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు. ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్థులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధ భావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే. శాంతియుత జీవనం గడిపే నేటి ప్రజలకు వారి పూర్వీకుల అకృత్యాలను పదేపదే గుర్తు చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే. శాంతియుత జీవనం గడుపుతున్న భరత మాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి. కౌరవ సంతతినైనా సరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది. ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్న ఈనాటి వారసుల్ని నిందలు వేసి అవమానించే వారికి మోక్షం సిద్ధించదు. హింసకు జవాబు హింస కాదు. ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం. జీనా యహా, మర్నా యహా, ఇస్కేసివా జానా కహా' అంటూ అజాత శత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి. వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు.

చక్కిలం విజయలక్ష్మి ఉపదేశం

[మార్చు]

"కడివెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు అమృతమయమైన మతాన్ని 'ఛాందసం' ఉన్మాదం కింద మార్చివేయగలదు. మతం ఆధ్యాత్మికతను రక్షించే సంగతి దేవుడెరుగు. మతమే ఛాందసుల దుర్వినియోగంతో విపరిణామానికి గురవుతోంది. నేడు మత ఛాందసం, మత దుర్వినియోగం, మతోన్మాదం సమాజ శ్రేయాన్ని చిందరవందర చేస్తోంది, ఛిద్రం చేస్తోంది. ఒకే పునాది మీద లేచిన అనేక భవనాల్లా మతాలు గోచరిస్తాయి. రామకృష్ణ పరమహంస 'గమ్యం ఒక్కటే. దానికి ఎన్ని మార్గాలో అన్ని మతాలు' అన్నారు. మతంతో మనం అమృత పానం చేయకుండా దాన్ని గరళంగా మార్చుకుంటున్నాం. మామిడి ఫలంలా మతాన్ని ఆస్వాదించకుండా టెంక లోపలి జీడితో సహా పండును ఛిద్రం చేసి రసాస్వాదనకు బదులు విషాస్వాదన చేస్తున్నాం. ఇది కాదు మతం ఉద్దేశం. ఇది కాదు మత ప్రవక్తల త్యాగాలకు అర్థం. విశ్వాసాల పేరిట వినాశాన్ని ప్రేరేపించటం కాదు. పక్కవాడి ఆస్తిని పక్కవాడినే అనుభవించనిస్తున్నాం. పక్కవాడి ఇంట్లో పక్కవాడినే ఉండనిస్తున్నాం. కానీ ఈ మతాల గొడవేమిటి? పక్క మతం మీద రాళ్లు వేయటమేమిటి? ఒక గొప్ప ఉద్దేశంతో ఉత్పన్నమైన మతాన్ని ఎందుకిలా పలచన చేస్తున్నాం? లేని కల్మషాన్ని ఎందుకని పులుముతున్నాం? ఏ మతం వారిని ఆ మతాన్ని అనుసరించనిద్దాం. ఎవరి మతంతో వారిని మనుగడ సాగించనిద్దాం. ఇతర మతావలంబకుల హక్కుల్ని, విశ్వాసాల్ని కాలరాయకుండా మన మతానికి గౌరవాన్ని తెద్దాం".[1]

ఆదర్శనీయులు

[మార్చు]
  • "ప్రస్థాన త్రయం అంటే "భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు " . అంతే కాదు " భగవద్గీత, బైబిల్, ఖురాను కూడా" --వివేకానందుడు
  • షహనాయి విద్వాంసుడు భారతరత్న బిస్మిల్లా ఖాన్ ,నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ , ఉస్తాద్ అల్లారఖా . ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ , లాంటి వారు హిందువుల గౌరవాభిమానాలను చూరగొన్నారు..వారణాసి వదిలి వచ్చేయండని బిస్మిల్లా ఖాన్ ని ప్రాధేయపడితే, నేనిక్కడ షెహనాయ్ వాయించకపోతే, కాశీ విశ్వనాధుడికి మేలుకొలుపు ఎలా అవుతుందయ్యా... పోయేదాకా నేనిక్కడే విశ్వనాధునికి మేలుకొలుపు చేస్తూనే ఉండాలి అన్నాడట.
  • ఒక ముస్లిమ్ మహిళ పెళ్ళి కోసం భాగ్‌పత్ జిల్లాలోని సున్హెరా గ్రామంలోని హిందువులంతా కలిసి చందాలు వసూలు చేశారు.[2]
  • మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
  • తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
  • నాగూర్ బాబు (మనో) కుటుంబం రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటారో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటారు.భార్య జమీలా తో కలిసి ప్రతి ఏటా తిరుమలకు కాలినడకన వెళతారు. శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు.[3]
  • చిలుకూరి నారాయణరావు గారిదే మొదటి "తెలుగు కురాను" (1925).రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నారు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది.ఇదియే గ్రంథకర్తకును గ్రంథ ప్రకాశకులకును బహుమానము".
  • అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు.ఆ గుడి దగ్గర షాపుల్లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.ఇంకా దేశంలోని పలుదేవాలయాల్లో ముస్లిములు పూలదండలు, మంచి గంధం సరఫరా చేస్తున్నారు.
  • కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
  • భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ఆదినుండి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వస్తాయి.
  • బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య) ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్, హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిములు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.ఆనాటి బ్రిటీష్ అధికారి సర్ థామస్ మన్రో సమర్పించిన మన్రో గంగాళం లోనే నేటికీ నైవేద్యం తెస్తున్నారు.[4], [5]
  • షిర్డీ శాయిబాబా హిందువా, ముస్లిమా, అనే దానిపై పలు వాదాలున్నాయి.సాయిబాబా ఒక మసీదులో నివసించాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే).ఆ మసీదు ( ద్వారకామాయి) లోనే శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు.[6]
  • "అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి.కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు" -- పుట్టపర్తి శాయిబాబా .
  • అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
  • శబరిమలై అయ్యప్పకు వావర్ అనే ముస్లిం మిత్రుడున్నాడట.భక్తులు దగ్గరలోని వావర్ దర్గాకు కూడా వెళతారు.వావర్‌ స్వామి కోసం ప్రత్యేకంగా మిరియాల పొట్లం ఇరుముడిలో పెట్టుకొని తీసికెళతారు.శబరిమలైలో భక్తులు అయ్యప్పను కలవడానికి ముందే వావార్ మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాతే అయ్యప్పను కొలుస్తారు. అయ్యప్పే అలా ఆదేశించాడని స్థలపురాణం చెబుతుంది.[7]
  • నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
  • జోధా అక్బర్‌, మణిరత్నం "బొంబాయి", కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రాలు కూడా హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండాలని చాటిచెప్పేవే.
  • చార్మినార్‌ లోని దర్గా శుభ్రతలో చేయూత నిస్తుంది హిందువు. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల హిందువులు తమలపాకులు, పువ్వులు, అరటిపళ్లు ముస్లింల నుండే కొనుగోలు చేస్తారు.చార్మినార్‌ ప్రక్కనే ఆలయం వుంటుంది.
  • పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళలో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
  • నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది.తుల్జాబాయిని ప్రతిపక్షనేతలు నారా చంద్రబాబునాయుడు, బండారు దత్తాత్రేయ, దేవేందర్ గౌడ్ తదితరులు ప్రశంసించారు.ప్రజాగాయకుడు గద్దర్‌ భైంసాకు వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించారు.ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈమెను సన్మానించారు.
  • సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌, హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
  • హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
  • పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
  • బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ గత 25 సంవత్సరాలుగా తనదుకాణం 'హషామ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
  • ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కడప పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్థనలు జరిపారు. దర్గాను దర్శించుకున్న తరువాతే తన పేరు గిన్నీస్ బుక్ లో చేరిందని, పెద్ద దర్గా మత సామరస్యానికి ప్రతీక అని గజల్ శ్రీనివాస్ అభివర్ణించారు.
  • విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నిర్వహించిన భగవద్గీత శ్లోకాలపఠన పోటీల్లో తుంగతుర్తి మండలం అన్నారం ఉన్నత పాఠశాలలో చదివే ముగ్గురు ముస్లిం సోదరులు అలీమ్‌ (16) అజీమ్‌ (14), అజామ్‌ (13) లు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను దక్కించుకున్నారు.తెలుగు ఉపాధ్యాయుడు వి.కృష్ణమాచార్యుల కారణంగా ఆ సోదరులు ప్రస్తుతం 60 శ్లోకాలను సరియైన ఉచ్ఛారణతో పఠించటంతో పాటు వాటి తాత్పర్యాన్ని కూడా చెప్పగలుగుతున్నారు.ఈ ముగ్గురు యువకులు సాధించిన విజయాల పట్ల వారి తల్లిదండ్రులు అహ్మద్‌ హుస్సేన్‌, రజీయాలు గర్వపడుతున్నారు.
  • విశ్వ హిందూ పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహింఛిన భగవద్గీత శ్లోక పఠన పోటీలలో ఖమ్మం జిల్లా ఏన్కూరు గురుకులంలో 10,6, తరగతులు ఛదువుతున్న షేక్ సాజిద్, షారుక్ బాబాలు పాల్గొని ప్రథమ బహుమతులు గెలిఛారు.సాజిద్ 64 శ్లోకాలను ఛెప్పేస్తాడు.[8]
  • మహంకాళీ అమ్మవారి బోనాల పండుగలో హైదరాబాదు పాతబస్తీకి చెందిన ముస్లిములు కొందరు తమ భార్యలతో సహా భక్తి శ్రద్ధలతో పాల్గొనటం, తమకు అమ్మవారి దయవల్ల బిడ్డలు పుట్టారని చెప్పటం 8.8.2010న టీ.వీ చానెళ్ళు ప్రసారం చేశాయి.
  • హైదరాబాద్‌కి చెందిన 55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా ఉమెన్‌ రిసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ప్రస్తుతం ఫీల్డ్‌ వర్కర్‌గా పనిచేస్తూ స్త్రీల జీవితాల్లో వెలుగు నింపే దిశగా సామాజిక కార్యకర్తగా డొల్లగా ఉన్న సాంఘిక నియమాలు, మతాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది.1980లో మత కల్లోలాల్లో భయంకరమైన హింసని చూసిన ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోంది.నవీన మహిళా కాంటెస్ట్‌ 2008 కి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
  • కృష్ణా జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ శంషీర్ అహ్మద్ షిర్డీ శాయిబాబా భజన కీర్తనలను స్వయంగా రాసి ప్రచురించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
  • లంగర్‌హౌజ్‌ గొల్లబస్తీ హిందువులు హనుమాన్‌ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. స్థానిక ముస్లిములు ముందుకొచ్చారు. 'మనం కలిసి ఉండేవాళ్లం. ఒకరిపై మరొకరు దాడులకు దిగడమేంటి' అంటూ హిందూ సోదరులతో చేయి చేయి కలిపారు. వారిని హిందూ సోదరులు ఆహ్వానించారు. మనలోమనకు గొడవలోద్దని అందరూ కలిసి అన్నదాన కార్యక్రమంలో సహపంక్తి భోజనం చేశారు.[9]
  • చంద్రాయణగుట్ట లాల్‌దర్వాజాలో ఒక ముస్లిం యువకుడు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నాడు. మతవిద్వేషాలుకాదు అన్నిమతాల సారం ఒక్కటే అని చెబుతున్నాడు.ఇదే తరహాలోఅమీర్‌పేట్‌కు చెందిన షఫీక్‌ చాంద్రాయణగుట్టలో ట్రేడ్‌ యూని యన్‌ నాయకుడిగా పనిచేసిన పాషా ప్రతి యేడు చాంద్రాయణగుట్ట చౌరస్తాలో వినా యక మండ పాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ఎంతో మంది ప్రశంసలను అందుకుంటున్నారు.[10]
  • మంగళగిరి మిద్దె సెంటర్లో 19.2.1975న హిందూ ముస్లిములు కలిసి బాలగణపతి గుడి ప్రారంభించారు.ఇప్పటికీ షేక్ ఖాసిం మొదలైన ముస్లింసోదరులు హిందువులతో కలిసి నవరాత్రిఉత్సవాలు నిర్వహిస్తున్నారు.[11]
  • గుంటూరు కొత్తపేటలోని గణేశ్ వారి వీధికి చెందిన ముస్లిం యువకులు 5 ఏళ్ళుగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.ముస్లిం యువత ఏర్పాటు చేసిన వినాయకుడికి శాసన సభ్యులు షేక్ మస్తాన్ వలి పూజలు చేశారు.[12]
  • ఔరంగాబాద్ లోని ఓ దర్గామసీదులో వినాయకచవితి వేడుకలు 35 సంవత్సరాలనుండి స్థానిక ముస్లిములు చేస్తున్నారు.[13]
  • పీర్ల పండుగకు బూంది, సాంబ్రాణి సమర్పించి, గుండంలోని బూడిదను నుదుట దిద్దుకునే హిందూ ప్రజలున్నారు. దీపావళి, దసరా వేడుకల్లో, క్రిస్మస్ వేడుకల్లో, ఈద్ విందుల్లో పాల్గొనే క్రైస్తవ, ముస్లిం ప్రజలున్నారు.
  • కాశ్మీర్‌లో పండిట్ల గ్రామాల్లో ముస్లింలే హిందువులకు దేవాలయాలను నిర్మించారు. కాశ్మీరీ పండిట్లంతా ఏటేటా జరిగే హజరత్ సయీద్ అక్బరుద్ దిన్ ఉర్సు వేడుకల్లో అత్యంత ఉత్సాహంతో పాల్గొంటారు. సొంత వేడుకగానే జరుపుకునేవారు.ఉర్సులలో హిందువులు పాలుపంచుకోవడం పరిపాటే.

కాశ్మీర్‌లో పుల్వామా గ్రామంలో నేటికీ హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకే ముస్లిం పవిత్ర స్థలంలో ఒకపక్క హోమం, మరో పక్క నమాజు చేస్తారు.

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న పిరానా గ్రామంలోని 600 ఏళ్ల నాటి ఇమామ్ దర్గాలో హిందూ ముస్లింలు కలిసి ప్రార్థనలు చేస్తారు.
  • ఉత్తరప్రదేశ్‌లో దుసావా కాలా గ్రామంలోని ముస్లింలు తమ మతస్తుల సమాధులను పంచాయితీ కేటాయించిన మరో స్థలంలోకి మార్చేపని చేపట్టారు. ఆ తవ్వకం పనుల్లో రాతి శివలింగం, నంది బయటపడ్డాయి. వెంటనే గ్రామ పెద్దలంతా సమావేశమై లింగం, నంది లభించిన స్థలంలో శివాల యం కట్టుకోవాలని, మిగతా స్థలాన్ని ముస్లింలు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.[7]
  • హైదరాబాద్‌లో జరిగే వినాయక ఉత్సవాలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తాయని నిరూపించారు జఫరుల్లాఖాన్. వేలంలో లక్షా రెండు వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకుని ఆయన మత సామరస్యాన్ని చాటారు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో శ్రీరాంనగర్-బి, సి బ్లాక్‌ల అధ్యక్షుడైన జఫరుల్లాఖాన్ పది మందితో పోటీపడి మరీ లడ్డూను దక్కించుకున్నారు. ఏటా వినాయక చవితి, శ్రీరామనవమి ఉత్సవాలను కాలనీ వాసులంతా కలిసి నిర్వహిస్తామని, ఏటా తన సమక్షంలో వేలం పాట జరిగేదని, ఈసారి తానే లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.[14]
  • అయోధ్యలోని హనుమాన్ గర్హి ప్రాంతంలో కొలువైన ‘సత్యార్’ సర్వమత ప్రార్థనాలయం.అక్కడ ఓ వైపు రాముడు, మరోవైపు గౌతమ బుద్ధుడు, ఇంకోవైపు మహావీరుడు, ఓ చోట మక్కా-మదీనా చిత్రపటం, ఇంకో చోట క్రిస్ట్రియన్ మత చిహ్నాలు ఇలా.. అన్ని మతాలకు చెందిన పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త లాల్జీబాయ్ సత్య సనేహి 60 ఏళ్ల క్రితం ఈ ప్రార్థనాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలోకి వచ్చిన వారు తమ మతానికి చెందిన దేవుడిని పూజించిన అనంతరం .. పక్కనే ఉన్న ఇతర మతాలకు చెందిన దేవుళ్లను ప్రార్థిస్తారు.[15]
  • "నేను ముస్లిం మతానికి చెందిన కుటుంబంలో పుట్టినా,ఊహ తెలిసిన తర్వాత క్రైస్తవాన్ని పుచ్చుకున్నాను.మా అమ్మ గొప్ప ఆధ్యాత్మికవాది.ఆమె నన్ను చర్చి వాతావరణంలో పెంచలేదు.క్రీస్తు బోధనలు నా భావి జీవితానికి మార్గాన్ని సుగమం చేశాయి. అందుకే క్రైస్తవాన్ని ఎంచుకున్నాను.నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తు శిలువపై చనిపోవడం,మానవులుగా మనందరిలో ఉండాల్సిన నమ్రతను గుర్తు చేసింది. మనందరం పాపులం. తప్పులు చేస్తాం. మనలోనే దోషాలు ఉన్నాయి. దేవుని ప్రేమతోనే అందరికీ విముక్తి లభిస్తుంది.నాకు పరమత ద్వేషంలేదు.మతనమ్మకం ఉన్నవాళ్లనూ, మతనమ్మకం లేనివాళ్లనూ ఈ ప్రపంచం సమానంగా ఆదరిస్తోంది.మన దగ్గర క్రైస్తవుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ యూదులు, ముస్లింలు, హిందువులు, నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులు కూడా ఉన్నారు. విముక్తిపై మనకు నమ్మకం ఎలా ఉందో అలాగే వారికీ విశ్వాసాలు ఉన్నాయి. మన నమ్మకాన్ని ఎలా గౌరవిస్తామో వారి నమ్మకాలనూ అలాగే గౌరవించాలి".--- అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుసేన్ ఒబామా [16]
  • పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న చారిత్రక కాళీమాత ఆలయంలో ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.[17]
  • గుంటూరు జిల్లా మాచవరం మండలం జింకలపాలెం 25 ముస్లిం కుటుంబాలు సుమారు వందసంవత్సరాలనుండి ధ్వజస్థంభాలు తయారుచేస్తున్నారు.ఆకురాజుపల్లెలో ఆంజనేయుడికి పూజలుచేశాక పని ప్రారంభిస్తారట.[18] http://epaper.sakshi.com/apnews/Guntur/28102010/Details.aspx?id=648233&boxid=25694080[permanent dead link]
  • నడికుడి పంచాయతీ పరిధిలోని మన్షూర్షాపేటకు చెందిన షేక్ మస్తాన్‌బీ నేపాల్ నుంచి ఒక పంచముఖ రుద్రాక్ష మొక్కను తెప్పించి పెరట్లో నాటింది.ఆ చెట్టు నుంచి కాచిన పంచ ముఖ రుద్రాక్షలతో రోజూ తిరుపతమ్మ తల్లికి పూజలు చేస్తోంది.[19] http://epaper.sakshi.com/apnews/Guntur/02112010/Details.aspx?id=655473&boxid=25672094 Archived 2016-03-07 at the Wayback Machine
  • హైదరాబాద్‌ పాతబస్తీలోని ఎంఐఎం పార్టీకి చెందిన శాలిబండ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ వినాయక చవితి, బోనాల పండుగల్లో ప్రతి ఏడాది పాల్గొంటారు. గణనాథుల నిమజ్జన ఊరేగింపును పురస్క రించుకొని చారిత్రక చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు వద్ద ఎంఐఎం పార్టీ తరపున ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేసి గణనాథులకు స్వాగతం పలుకుతారు.బోనాల ఊరేగింపులో సైతం మక్కామసీదు వద్ద వేదికను ఏర్పా టుచేస్తారు. ఇవేగాకుండా మాతా విశాల్‌ జాగరణ్‌ వంటి హిందూ వేడుకల్లో ఆయన పాల్గొంటూ హిందూ, ముస్లిం భాయ్‌..భాయ్‌ అని చాటుతారు.[20] http://www.suryaa.com/main/showFeatures.asp?cat=4&subCat=1&ContentId=24725[permanent dead link]
  • " హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి ఈ యాత్ర ప్రతీక.ఇటువంటి సద్భావన శిబిరాల వల్ల సామాజిక సామరస్యం మరింత పెరుగుతుంది.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం అనేది దేశ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం" .--ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌
  • బాల్యంలోనే ఇరాక్ నుండి వచ్చి చిత్తూరు జిల్లాలో యాచకురాలిగా వచ్చిన డబ్బుతో దర్గాలు, శివాలయం కట్టించిన స్త్రీకి "మస్తానమ్మ" అనే పేరుపెట్టుకొని అక్కడి జనం ఆదరిస్తున్నారు.[21]
  • ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని తురకపాలెం గ్రామంలో 600 ముస్లిం కుటుంబాలు, ఒకే ఒక్క హిందూ కుటుంబం ఉన్నాయి.ఆ ఒక్క హిందూ కుటుంబం కోసం ముస్లిములు రామాలయం నిర్మించారు [22]
  • మెదక్‌ జిల్లా ముత్తంగి గ్రామంలోని పిఈఎస్‌కాలనీలో వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన వేలంలో ఓ ముస్లిం యువకుడు యూనస్‌ రూ24,600కి లడ్డూను చేజిక్కించుకున్నారు. లడ్డూను అందరికీ పంచిపెడితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వేలంలో పాల్గొన్నట్లు యూనస్‌ తెలిపారు..[23]
  • హైదరాబాదు పోలీస్ కమీషనర్ ఏ.కె.ఖాన్ టీ.వీ.9 వారు నిర్వహించిన మట్టి వినాయకుని పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మత సామరస్యాన్ని చాటారు.[24]
  • మదనపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్ ముంతాజ్ ఆలి అనే ఆధ్యాత్మిక వేత్త నిర్వహిస్తున్నారు ..http://satsang-foundation.org/?page_id=80
  • చిలకలూరిపేట దగ్గర పురుషోత్తమపట్నంలో అనేక ముస్లిం కుటుంబాలు హిందూ దేవతామూర్తుల తయారీలో ఉన్నాయి.http://epaper.sakshi.com/apnews/Guntur/02102011/Details.aspx?id=1047774&boxid=28128996 [25]
  • మంగళగిరి దగ్గర 'పుట్టతోట' లోని హిందువులు ముస్లిములు పాముల పుట్టకు, జెండా చెట్టుకు రెంటికీ కలిపి పూజలు చేస్తున్నారు.[26]
  • ప్రకాశం బ్యారేజి దిగువన సీతా నగరం లోని పల్లె కారులు ప్రతి యేటా నాగుల మీరా జెండా పండుగ కృష్ణానదీ తీరంలో జరుపుతారు.[27]
  • అనంతపురం జిల్లా నార్పల మండలం లోని గూగూడు గ్రామంలో కుళ్ళాయిస్వామి, ఆంజనేయస్వామికి కలిపి ఒకే చోట సరిగెత్తు జరుగుతుంది.హిందూ ముస్లిమ్ భక్తులు ఇటు కుళ్ళాయి స్వామి పీర్లకు అటు ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకుంటారు.
  • కర్నూలు జిల్లా కౌతాళం లోని ఖాదర్ లింగా స్వామి దర్గాలో అక్కడి బ్రాహ్మణులు ప్రతి ఉగాది రోజున పంచాంగ పఠనం నిర్వహిస్తున్నారు [28]
  • గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఎం.బి.ఏ.చదువుతున్న షేక్ జాన్ బాబు భగవద్గీత లోని పది ఆధ్యాయాలను అనర్గళంగా చెబుతూ అనేక బహుమతులు పొందాడు.[29]
  • వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట గండి పుణ్యక్షేత్రానికి సమీపంలోని వీరన్నగట్టుపల్లెకు చెందిన కమాల్ బీ, మదార్‌ఖాన్ ల కుమారుడు ఖాదర్‌ఖాన్ (రామానంద కబీర్‌) ( 80 ) ఉమామహేశ్వర ఆలయాన్ని కట్టించి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం అన్నదానం చేస్తున్నాడు.[30]
  • అనంతపురం జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో ఆయుర్వేద డాక్టర్ అన్వర్ బాషా కోసం శివాలయం కట్టించాడు.ఈయన సత్య ధర్మ మకరందం, ఓ మనిషీ తెలుసుకో, కస్తూరి రంగనాధ స్వామి చరిత్ర, ఫకీర్ బాబా, మోక్ష మార్గం పుస్తకాలను రచించారు.[31]
  • గుడ్ల వల్లేరు మండలం అంగలూరులో ఒకే ప్రాంగణంలో తాజుద్దీన్ బాబా కుటీర్, జ్ఞాన శాయి మందిరం ఉన్నాయి .ఇక్కడ కుల మతాలకతీతంగా పండుగలు చేసుకుంటున్నారు.ఇది ఒక అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం .[32]
  • ఆదోనిలోని మహాలక్ష్మమ్మనగర్ ముస్లిములు ప్రతియేటా వినాయకచవితి పూజల్లో పాల్గొంటున్నారు.అక్కడ ఖాజావలి పూజారిగా వ్యవహరిస్తున్నాడు.అక్కడి హిందువులు కూడా పీర్లకు దర్గాలకు మొక్కుతున్నారు. (సాక్షి 13.9.2013)

కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-11. Retrieved 2010-08-08.
  2. Hindus raise donations for muslim girl wedding|http://twocircles.net/2010may24/hindus_raise_money_muslim_girls_wedding.html
  3. ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర
  4. http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html[permanent dead link]
  5. సాక్షి ఆదివారం అనుబందం 25.9.2011
  6. http://te.wikipedia.org/wiki/%E0%B0%B7%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%80_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE
  7. 7.0 7.1 సాక్షి 22.9.2010
  8. ఈనాడు విజయవాడ 2.12.2011
  9. http://www.prajasakti.com/hyderabad/article-90627[permanent dead link]
  10. సూర్య 25.8.2009
  11. సాక్షి మంగళగిరి 12.9.2010
  12. సాక్షి గుంటూరు12.9.2010
  13. జీ టీవీ వార్త17.9.2010
  14. సాక్షి 23.9.2010
  15. సాక్షి 26.9.2010
  16. ఈనాడు30.9.2010
  17. సాక్షి 25.10.2010
  18. సాక్షి గుంటూరు 28.10.2010
  19. సాక్షి గుంటూరు 2.11.2010
  20. సూర్య 20.04.2011
  21. స్టూడియో ఎన్. వార్త20.6.2011
  22. స్టూడియో ఎన్ 8.7.2011
  23. ఈనాడు12.9.2011
  24. టీ.వి.9 వార్త 13.9.2011
  25. సాక్షి గుంటూరు2.10.2011
  26. ఈనాడు గుంటూరు 31.10.2011
  27. ఈనాడు గుంటూరు 12.11.2011
  28. ఈనాడు కర్నూలు21.12..2011
  29. ఈనాడు గుంటూరు 5.1.2012
  30. సాక్షి కడప 9.1.2012
  31. ఈనాడు అనంతపురం23.1.2012
  32. సాక్షి కృష్ణా 2.2.2012