మచిలీపట్నం ముట్టడి
బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. మచిలీపట్నాన్ని ఐరోపా దేశాల వారు అ రోజుల్లో మసూలిపటం అనేవారు. అందుచేత దీన్ని మసూలిపటం ముట్టడి (Siege of Masulipatam) అని కూడా అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విజయంతో ముగిసింది. దీంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచి వారి నిష్క్రమణ సంపూర్ణమైంది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డు నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్‌ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు.
నేపథ్యం
[మార్చు]మచిలీపట్నం ముట్టడి నాటికి బ్రిటిషు సైన్యాలు విజయోత్సాహంలో ఉన్నాయి. క్లైవు ఆదేశాలతో ఉత్తర సర్కారులపై దండయాత్ర చేసి ఫ్రెంచి వారి ప్రాబల్యానికి గండి కొట్టేందుకు కలకత్తా నుండి కలనల్ ఫోర్డు వచ్చాడు. విజయనగర రాజు ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని ఫోర్డు, ఫ్రెంచి వారిపై దాడి చేసాడు. చెందుర్తి యుద్ధంలో ఫోర్డు ఫ్రెంచి వారిని ఓడించాక, ఫ్రెంచి సైన్యం పారిపోయి, రాజమండ్రి చేరుకుంది. బ్రిటిషు సైన్యం వారిని అక్కడినుండి కూడా పారద్రోలింది. కాన్‌ఫ్లాన్స్ తన సైన్యాన్ని తీసుకుని మచిలీపట్నంలోని తమ స్థావరానికి పారిపోయాడు. ఈలోగా బ్రిటిషువారికీ, ఆనందరాజుకూ మధ్య అంతంత మాత్రంగా ఉన్న మైత్రి మరింత చెడింది. బ్రిటిషు వారి తరపున ఆండ్రూస్ కలగజేసుకుని తిరిగి మైత్రిని నెలకొల్పాక, ఇరు సైన్యాలూ మచిలీపట్నం ముట్టడికి సిద్ధమయ్యాయి. ఇందుకు ఆరు వారాలకు పైగా సమయం పట్టింది. ఈలోగా ఫ్రెంచి వారు మచిలీపట్నంలోని తమ స్థావరాన్ని బలోపేతం చేసుకుని, యుద్ధ నష్టాల నుండి కొంత తేరుకున్నారు.
మచిలీపట్నం ప్రయాణం
[మార్చు]1759 జనవరి 28 న ఫోర్డు రాజమండ్రి నుండి తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఆనందరాజు తన సైన్యంలోని బ్రిటిషు అధికారి బ్రిస్టల్‌ను రాజమండ్రి కోటకు కాపలాగా ఉంచాడు. ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారిని కూడా అక్కడే ఉంచారు. ఫిబ్రవరి 6 న ఫోర్డు ఏలూరును ఆక్రమించుకున్నాడు. అక్కడ అంతకుముందు ఉన్న ఫ్రెంచి సైనికులను కాన్‌ఫ్లాన్స్ వెనక్కి, మచిలీపట్నం వెళ్ళేటపుడు తన వెంట తీసుకువెళ్ళాడు. ఇక్కడ కూడా ఆనందరాజుకు, ఫోర్డుకు మధ్య తలెత్తిన వైరుధ్యాఅల కారణంగా ఏలూరు నుండి బయలుదేరడం ఆలస్యమైంది.
ఇదిలా ఉండగా నర్సాపురం, కైకలూరుల్లో కాన్‌ఫ్లాన్స్ రక్షణ దుర్గాలను నిర్మించి అక్కడ సైనిక కాపలా ఏర్పాటు చేసాడు. మచిలీపట్నంకు దగ్గరిలో ఉన్న ఈ రెండు స్థావరాలూ ఫ్రెంచి రక్షణకు పనికొస్తాయి. దు రోచర్ నాయకత్వంలో 2250 మందిని అక్కడ నియమించాడు. ఫోర్డు, నాక్స్ నాయకత్వంలో కొంత సైన్యాన్ని నర్సాపురానికి దాడి పంపాడు. వారిని చూసి అక్కడ కాన్‌ఫ్లాన్స్ ఉంచిన 500 మంది సైనికులు పారిపోయి, దు రోచర్ వద్దకు చేరుకున్నారు. నాక్స్ నర్సాపురం దుర్గాన్ని ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఆయుధాలు, సరకులను స్వాధీనం చేసుకుని, తిరిగి ఏలూరులో తమ ప్రధాన సైన్యం వద్దకు చేరుకున్నాడు.
మార్చి 1 న ఫోర్డు తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆనందరాజు ససైన్యంగా అతడి వెంట నడిచాడు. నర్సాపురం జమీందారు కూడా 1,500 మంది సైన్యంతో ఫోర్డుతో జత కలిసాడు. మార్చి 2 న ఫోర్డు సైన్యం కొల్లేరు సరస్సును దాటింది. మార్చి 3 న కైకలూరుపై దాడి చేసి దాన్ని కూడా పట్టుకున్నాడు. మార్చి 6 న ఫోర్డు మచిలీపట్నం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. పట్టణం బైట కాన్‌ఫ్లాన్స్ మంచి రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
మచిలీపట్నం
[మార్చు]1751 లో తమ అధీనంలోకి తీసుకున్నాక, ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని దుర్భేద్యంగా చేసుకున్నారు. 800 మీ పొడవుతో 500 మీ వెడల్పుతో కోటను తయారు చేసుకున్నారు. దక్షిణాన కృష్ణా నది ముఖద్వారం సహజ రక్షణ ఇస్తూ ఉంది. మిగతా మూడు వైపులా మట్టి, ఇటుక గోడలతో మూసేసారు. ఆ గోడలకు 11 బురుజులు ఉన్నాయి. చుట్టూ ఒక కందకం కూడా ఉంది. ఆ కందకానికీ గోడకూ మధ్య కంచె వేసిన సన్నటి ఖాళీ స్థలం ఉంది. కోట చుట్టూ చిత్తడి నేల, అడుగు పెడితే దిగిపోతూ ఉంది. మచిలీపట్నానికి వెళ్ళే 2.5 కి.మీ. దారి కోటకు వాయవ్యంగా కట్ట మీదుగా పోతుంది. కోటకు తూర్పున, పశ్చిమాన ఉన్న ఇసుక తిన్నెలే కోటకు చేరువలో ఉన్న గట్టి నేల. వీటిలో గోడకు 730 మీ దూరంలో ఉన్న తూర్పు గుట్టను ఫోర్డు అనుకూల స్థలంగా ఎంచుకున్నాడు. అక్కడే తన శతఘ్ని స్థావరాలను (బ్యాటరీలు) ఏర్పాటు చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు.
ముట్టడి సన్నాహాలు
[మార్చు]1759 మార్చి 7 నుండి 25 వరకు, ఫోర్డు దళాలు 3 శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) నిర్మించాయి; వాయవ్యాన, సముద్రానికి పక్కనే ఒకటి, ఉత్తరాన ఒకటి, మధ్యలో మొదటి రెంటికీ 100 మీటర్ల వెనగ్గా మూడోది. ముట్టడికి ఉపయోగపడే ఫీల్డుగన్నులను ఓడలోంచి దించారు. ఈ ఓడలు, భూమిపై సైన్యపు కదలికలకు అనుసరిస్తూ వచ్చాయి. రెండు వైపుల ఉన్న స్థావరాలపై రెండేసి రకాల చొప్పున, మధ్య స్థావరంపై మూడు రకాల ఫీల్డుగన్నులనూ మోహరించారు.
ఈ రోజుల్లో ఫోర్డుకు ఏమాత్రం కాలం కలిసివచ్చినట్లుగా కనబడలేదు. అతడు మచిలీపట్నం చేరగానే దు రోచర్ సైన్యం అకస్మాత్తుగా మేల్కొని, రాజమండ్రిలో బ్రిటిషు కోటను పట్టుకుంది. అక్కడ ఆనందరాజు నియమించిన బ్రిటిషు అధికారి బ్రిస్టల్ వారికి లొంగిపోయి, పట్టణం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తన వద్ద బెంగాల్ నుండి వచ్చిన సంపదను, సరుకునూ కాకినాడ వద్ద ఉన్న డచ్చి కర్మాగారానికి పంపేందుకు అంగీకరించాడు. దాంతో ఫోర్డుకు రావాల్సిన డబ్బు సరఫరా ఆగిపోయింది. దు రోచర్ రాజమండ్రిని ఆక్రమించుకుని, ఆ తరువాత, తమపై తిరుగుబాటు చేసిన ఆనందరాజుపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తరంగా అతడి రాజ్యం వైపు బయలుదేరాడు. రాజుకు ఈ సంగతి తెలిసి, తన ధనాన్నిగానీ, తన సైన్యాన్ని గానీ బ్రిటిషు సైన్యానికి ఇచ్చేందుకు నిరాకరించాడు. తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు ససైన్యంగా మచిలీపట్నం నుండి వెనక్కి వెళ్ళిపోయాడు[1].
అప్పటికే ఫోర్డు తన ఆఫీసర్ల నుండి కూడా అప్పులు తీసుకుని ఉన్నాడు. సైన్యానికి జీతం డబ్బుల కోసం ఎవరిని అడగాలో అతడికి తెలీలేదు. సైనికులు అసంతృప్తి చెంది ఉన్నారు.
కోటలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న కాన్‌ఫ్లాన్స్‌కు కావాల్సింది శత్రువుపై వెనకనుండి దాడిచేసే మిత్రుడు. అతడు నిజాము సలాబత్ జంగ్‌తో సాయం కోసం అప్పటికే సంప్రదింపులు జరిపాడు. అతడు 35,000 సైన్యంతో బయలుదేరాడు. అంతకుముందే ఆనందరాజుకు, నర్సాపురం జమీందారుకు కూడా ససైన్యంగా తనతో చేరమని ఆదేశాలిచ్చాడు.
మార్చి 19 న, బ్రిటిషు సైనికులు తిరుగుబాటు చేసి, యుద్ధం వదలిపెట్టి వెళ్ళిపోతామని ఫోర్డును బెదిరించారు. అతి కష్టం మీద ఫోర్డు వారిని ఒప్పించి దారికి తెచ్చుకున్నాడు.
ముట్టడి మొదలైంది
[మార్చు]మార్చి 25 న శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) తయారయ్యాయి. బ్రిటిషు వారు కాల్పులు మొదలుపెట్టి, కోటకు నష్టం కలగజేసారు. కానీ ఫ్రెంచి వారు రాత్రి పూట కోటకు మరమ్మత్తులు చేసారు. ఇలా పగటిపూట బ్రిటిషు సైన్యం కలిగించిన నష్టాన్ని రాత్రి పూట బాగు చేసుకునేవారు.
సలాబత్ జంగ్ 40,000 మంది సైన్యంతో కృష్ణానది ఒడ్డుకు చేరాడని మార్చి 27 న వార్త చేరింది. అది తెలిసిన ఫోర్డు కలత చెందాడు. తన రాజ్యానికి తిరిగి వెళ్తున్న ఆనందరాజు వద్దకు జాన్సన్‌ను పంపించాడు. బ్రిటిషు వారితో మైత్రి ఒప్పందం నుండి విడిపోయి అతడు తప్పు చేస్తున్నాడనీ, ఓ వైపున సలాబత్ జంగ్, మరోవైపు నుండి దు రోచర్‌ల మధ్య అతడు నలిగిపోతాడనీ నచ్చచెప్పించాడు. తమతో మైత్రిని కొనసాగిస్తే, మచిలీపట్నం కూలగానే బ్రిటిషు వారి మద్దతు అతడికి దొరుకుతుందని కూడా చెప్పించాడు. ఆనందరాజుకు వెనక్కి రాక తప్పలేదు. ఫోర్డు సలాబత్ జంగుతో సంప్రదింపులకు ప్రయత్నించగా, అతడు చర్చించేందుకు అంగీకరించి, ముందుకు సాగకుండా ఆగేందుకు ఒప్పుకున్నాడు.
చర్చలు సాగుతూండగా ముట్టడి కొనసాగింది. బ్రిటిషు వారి గన్ను కాల్పులకు కోట బురుజులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 5 న కుంభవృష్టి కురవడంతో, కాల్పులకు తెరపడింది. మరుసటి రోజున వర్షం ఆగింది. సలాబత్ జంగ్ ముందుకు సాగుతున్నాడని, దు రోచర్ కూడా దగ్గరిలోకి చేరుకున్నాడనీ ఫోర్డుకు చేరింది. మరోవైపు, ఇక రెండు రోజులకు సరిపడా మాత్రమే మందుగుండు సామాగ్రి ఉందని అతడి అధికారులు చెప్పారు. ముట్టడి ఇక ముగింపు దశకు చేరింది. ముందు చూస్తే, కోటలో తమ కంటే పెద్ద సైన్యం, వెనక చూస్తే, తమకు పదిరెట్ల సంఖ్యలో మరో సైన్యం. తన సమాచార మార్గాలా.. మూసుకుపోయాయి. మందుగుండు, డబ్బూ కూడా అయిపోవచ్చాయి. ఓడలెక్కి పారిపోవడమో, సర్వాన్నీ పణంగా పెట్టి అంతిమ దాడి చెయ్యడమో తేల్చుకోవాల్సిన క్షణం అది. అతడు రెండోదాన్నే ఎంచుకున్నాడు.
చివరి దాడి
[మార్చు]ముట్టడి కొనసాగుతూండగా, కోటకు బయట నైరుతి మూలన కందకం తవ్వలేదని తెలిసింది. చిత్తడిగా, ఊబిలా ఉన్న నేలే కందకం కంటే నయమని ఫ్రెంచివారు అనుకున్నారు. స్థానికులు మాత్రం ఈ నేల గుండానే నడుచుకుంటూ పోవడాన్ని బ్రిటిషువారు గమనించారు. కెప్టెన్లు యోర్కు, నాక్సూ, ఈ నేలపై కొంత నడిచి పరీక్షించి చూసారు. అది గట్టిగానే ఉందని, మోకాలిలోతు కంటే లేదనీ గమనించారు. ఇక్కడి నుండి ఒక పొల్లు దాడి (ఫాల్స్ ఎటాక్- శత్రువును ఏమార్చేందుకు, శత్రు సైన్యాన్ని చీల్చేందుకూ యుద్ధంలో పన్నే ఒక వ్యూహం) చెయ్యవచ్చని అనుకున్నారు. ఫోర్డు దీన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్నాడు. ప్రధాన ద్వారం ముందున్న కందకం మీద నుండి పొల్లు దాడి చెయ్యాలనుకున్నాడు. అసలైన దాడి మాత్రం శతఘ్నుల దాడికి దెబ్బ తిన్న కోటగోడల ద్వారా చెయ్యాలని అనుకున్నాడు. ఈశాన్యాన ఉన్న కమేలియన్ బురుజును ఈ అసలు దాడికి ఎంచుకున్నాడు. కావలసిన ఏర్పాట్లు చకచకా చేసారు. ఆనందరాజు దళంలో కొందరు శిబిరానికి కాపలాగా ఉండాలి, మిగతా వాళ్ళు ద్వారం ముందున్న కందకం వద్ద హడావుడి చెయ్యాలి. నాక్స్, 700 మంది సిపాయీలతో నైరుతిలో పొల్లు దాడి చెయ్యాలి. మిగిలిన దళం కమేలియన్ బురుజుపై అసలు దాడి చెయ్యాలి. ఫోర్డు, 372 మంది బ్రిటిషు సైనికులను రెండు భాగాలుగా చేసి, ఒకదానికి కెప్టెన్ కాలెండరును, రెండో దానికి కెప్టెన్ యోర్కునూ నాయకులుగా నియమించాడు. 700 మంది సిపాయీలతో కూడిన మూడవ దళాన్ని కెప్టెన్ మెక్లీన్ నాయకత్వాన ఉంచాడు. మిగిలిన వాళ్ళను తనకిందే ఉంచుకున్నాడు. అర్ధరాత్రి, సముద్రం పాటులో ఉన్నపుడు, కందకంలో ఒక మీటరు కంటే ఎక్కువ నీళ్ళు ఉండని ఆ సమయంలో అసలు దాడి, పొల్లుదాడీ రెండూ ఒక్కసారే మొదలవ్వాలని ఫోర్డు ఆదేశించాడు; కోటలో మోగే చివరి గంట దాడి దళాలు ముందుకు సాగేందుకు సంకేతం.
1759 ఏప్రిల్ 7 పగలంతా బ్రిటిషు బ్యాటరీలు కోటయొక్క మూడు బురుజుల మీదా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. చీకటి పడేసరికి కాల్పులు ఆగాయి. రాత్రి పది గంటలకు దాడి ప్రయత్నాలు మొదలయ్యాయి. నాక్స్ నేతృత్వంలో మొదటి దళం బయల్దేరి చీకట్లో కలిసిపోయింది. రెండవ దళానికి నాయకుడైన కాలెండరు ఎక్కడున్నాడో కనబడలేదు. ఓ అరగంట పాటు చూసాక, ఫోర్డు అతడి స్థానంలో ఫిషరును నియమించి రెండో దళాన్ని బయల్దేరదీసాడు. అర్ధరాత్రికి కూడా దళాలు ఇంకా ఆ బురదలో నడుస్తూనే కమేలియన్ బురుజు వైపు సాగుతూనే ఉన్నాయి. అప్పుడు కాల్పుల శబ్దం వినబడింది. నాక్స్ తన పొల్లు దాడిని మొదలుపెట్టాడని అర్థమైంది. ఆనందరాజు కూడా తన సైన్యంతో అన్ని వైపులా కాల్పులు జరుపుతూ విపరీతంగా శబ్దం చేస్తూ కాజ్‌వేపై సాగి పోయాడు. కోటలో ఫ్రెంచి వారు అప్రమత్తమై, కోట ప్రవేశద్వార రక్షణకు సిద్ధమయ్యారు.
చిత్తడిలో మోకాళ్ల లోతు బురదలోను కందకంలో నడుం లోతు నీళ్ళలోనూ సాధ్యమైనంత వేగంగా అడుగులు వేస్తూ మూడు దళాలూ ముందుకు సాగాయి. అప్పుడు, కోటకు పడ్డ రంధ్రాల్లోంచి, బురుజుల మీద నుంచీ వారిపై ఫ్రెంచి వారి కాల్పులు మొదలయ్యాయి. కంచె మీదా, బురుజుల మీదా బ్రిటిషు దళాలు తీవ్రంగా కాల్పులు జరిపారు. కంచె పడిపోయింది. ఫిషరు నాయకత్వంలో మొదటి బ్రిటిషు దళం కోటలోకి చొరబడి, కమేలియన్ బురుజు నుండి ఫ్రెంచి వారిని తరిమిగొట్టారు. రెండో దళం కూడా లోపలికి వచ్చేదాకా అగి, ఒక దళం కోటలో ఉత్తర భాగానికీ, రెండో దళం తూర్పు భాగానికీ వెళ్ళాయి.
కమేలియన్ బురుజుపై ఫీల్డుగన్నును చూసిన యోర్కు దాన్ని దక్షిణం వైపు గురిపెట్టాడు. తనూ అటువైపు వెళ్ళే ప్రయత్నంలో ఉండగా, పట్టణం దిశనుండి కోట గోడవైపు వస్తూన్న ఫ్రెంచి సైనికులను చూసాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి, ఆ దళ నాయకుణ్ణి పట్టుకుని, దళాన్ని లొంగిపొమ్మని ఆదేశించాడు. నిశ్చేష్టులైన సైనికులు లొంగిపోయారు. వాళ్ళను, ఆక్రమించుకున్న బురుజు వద్దకు పంపించారు; యోర్కు, ఆ దళం వచ్చిన దారిలోనే వెళ్ళి సెంట్ జాన్ బురుజుపై దాడి చేసాడు. బురుజుపై ఉన్న ఫ్రెంచి కాపలావాళ్ళు బ్రిటిషు వారిపై కాల్పులు జరిపి కొందరు సైనికులను చంపి, ఆ తరువాత లొంగిపోయారు. వాళ్ళను కూడా కమేలియన్ బురుజుకు పంపించాడు. బందీలకు సిపాయీలు కాపలా ఉన్నారు. యోర్కు, డచ్ బురుజు అనే మూడవ బురుజు పైకి వెళ్ళాడు. అక్కడ కూడా అదే దృశ్యం పునరావృతమైంది. ఆ బందీలను కూడా బురుజు వద్దకు, సిపాయీల కాపలా లోకి పంపించాడు అన్నిటికంటే దక్షిణాన ఉన్న ఫ్రాన్‌స్వా బురుజు ఇంకా లొంగలేదు. యోర్కు దానిపైకి కూడా వెళ్ళాలని తహతహలాడాడు. కానీ అతడి సైనికులు వెనకాడారు. కాల్పుల్లో కొందరు మరణించడవలన, బందీల కాపలా కోసం కొందరు పోవడంతో అతడి దళ సంఖ్య తగ్గడంతో, మిగిలిన కొద్దిమందీ, ఇది ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. యోర్కు వాళ్ళను బెదిరించి, బతిమిలాడీ కార్యోన్ముఖుల్ని చేసాడు.
డచ్చి బురుజు దాటాక, ఓ మందుగుండు గది గుండా పోతూండగా, ఓ సైనికుడు మందు బారెళ్ళను చూసి "మైన్ మైన్" అని అరిచాడు. అందరూ కంగారుగా కమేలియన్ బురుజు వైపు పరుగెత్తారు. యోర్కు ఒక్కడే, పక్కనుండే డప్పుగాళ్ళతో సహా మిగిలిపోయాడు. అదృష్టవశాత్తూ, ఆక్రమించుకున్న బురుజుల్లోని కాపలా సైనికులు పారిపోలేదు. పారిపోయి వచ్చిన సైనికులు కోటను కూడా వదిలి పారిపోయే ప్రయత్నంలో ఉండగా యోర్కు, పారిపోబోయే మొదటి సైనికుణ్ణి చంపేస్తానని బెదిరించి వాళ్ళను ఆపాడు. 36 మందిని వెంటబెట్టుకుని తిరిగి ఫ్రాన్‌స్వా బురుజు మీదికి వెళ్ళాడు. కానీ ఈలోపు ఫ్రెంచి సైన్యం కూడగట్టుకుని వారిపై ఒక గన్నును గురిపెట్టి ఉంచింది. వాళ్ళు దగ్గరికి రాగానే కాల్పులు జరిపింది. 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. యోర్కుతో సహా అనేకమంది గాయపడ్డారు. మిగిలిన సైనికులు అతణ్ణి మోసుకుని తీసుకుపోయారు. దానితో ఆ ప్రదేశంలో దాడి ముగిసింది.
ఉత్తరం వైపున ఫిషరు మరింతగా విజయవంతమయ్యాడు. మొదటి రెండు బురుజులను సునాయాసంగా ఆక్రమించాడు. కాజ్‌వే వైపున ఉన్న మూడవ బురుజును చేరగానే తలుపులను మూసివేసి, బయట ఉన్న ఫ్రెంచి దళాలు లోపలికి రాకుండా చేసాడు. కనబడకుండా పోయిన కెప్టెన్ కాలెండరు ఎక్కడి నుండి వచ్చాడో గానీ, అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. వచ్చీరాగానే తుపాకీ గుండుకు బలయ్యాడు. ఫిషరు ఇంకా ముందుకు పోతూండగా, ఆగమంటూ ఫోర్డు నుండి ఆదేశాలు వచ్చాయి.
దాడి జరుగుతున్నంతసేపూ కాన్‌ఫ్లాన్స్, కోటకు దక్షిణ భాగంలో ఉన్నాడు. యుద్ధం జరుగుతున్నంత సేపూ అతడు ఇస్తూ వస్తున్న దేశాలు పరస్పరం వ్యతిరేకంగా ఉంటూ, అప్పటికే ఉన్న ఫ్రెంచి వారిలో ఉన్న అయోమయాన్ని ద్విగుణీకృతం చేసాయి. ఓ పక్క నాక్స్ దాడి అతణ్ణి కలవరపెట్టింది. మరో వైపు రాజు సైన్యం చేసిన గోల, తూర్పు వైపున మూడో దళం చేసిన దాడీ కలిసి అతణ్ణి మరింత ఆందోళనకు గురిచేసి, అతడి మనోధైర్యాన్ని దెబ్బతీసాయి. ఫ్రాన్స్వా బురుజు నుండి బ్రిటిషు సైన్యం వెనక్కి వచ్చేస్తున్న సమయంలోనే అతడు, గౌరవనీయమైన నిబంధనలకు అనుగుణంగా లొంగిపోతానని సందేశం పంపాడు. తనకు లొంగుబాటు అన్న పదం తప్ప మరేమీ వినిపించడం లేదని, తక్షణం బేషరతుగా లొంగిపోకపోతే, ప్రతీ ఒక్క సైనికుణ్ణీ చంపేస్తాననీ సమాధానం పంపించాడు, ఫోర్డు[2].[3] మరోదిక్కు లేని కాన్‌ఫ్లాన్స్ లొంగిపోయాడు. 500 మంది ఫ్రెంచి సైనికులు, 2,539 మంది సిపాయీలు ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. 113 మంది ఫ్రెంచి సైనికులు మరణించారు.
దాడిలో బ్రిటిషు వారు ఇద్దరు ఆఫీసర్లు, 22 ఐరోపా సైనికులు, 50 మంది సిపాయీలను కోల్పోయారు. మొత్తం 150 మంది గాయపడ్డారు.
1759 ఏప్రిల్ 8 ఉదయానికి బ్రిటిషు వారు ఫ్రెంచి బందీలను మైదానంలో నిలబెట్టి, వారికి 300 మంది సైనికులను కాపలా పెట్టి, బ్రిటిషు జెండాను ఎగురవేసారు. మసూలిపటం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వశమై పోయింది.
పర్యవసానాలు
[మార్చు]నిజాము సంధి ఒడంబడిక
[మార్చు]దాడి సమయానికి సలాబత్ జంగ్ మచిలీపట్నం నుండి కేవలం 24 కి.మీ. దూరంలో ఉన్నాడు. దు రోచర్ అంతకంటే దగ్గరిలోనే ఉన్నాడు. కానీ యుద్ధంలో పాల్గొనలేదు. బ్రిటిషు వారు సాధించిన విజయం వారిని నిశ్చేష్టులను చేసింది. ఈలోగా హైదరాబాదులో తాను లేని సమయం చూసి, తన తమ్ముడు నిజాం ఆలీఖాన్ తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నాడని సలాబత్ జంగ్‌కు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుకు బ్రిటిషు వారి పరోక్ష మద్దతు ఉందని కూడా అతడికి తెలియవచ్చింది. వెంటనే హైదరాబాదు తిరిగి వెళ్ళాల్సిన అత్యవసర పరిస్థితి అతడిది. ఈ పరిస్థితులలో బ్రిటిషు వారితో సంధి చేసుకోవడానికి మించి గత్యంతరం అతడికి కనిపించలేదు. అతడు వారితో చర్చలకు సిద్ధపడి, 1759 మే 14 న వారితో ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆ ఒడంబడిక పూర్తిగా ఏకపక్షంగా కనిపిస్తుంది.
- నిజాం పట్నం నుండి మచిలీపట్నం వరకూ తీర ప్రాంతాన్ని, తీరం నుండి 20 కి.మీ. లోపలి వరకు, బ్రిటిషు వారికి ఈనాముగా అప్పగించాలి.
- ఫ్రెంచి వారిని 15 రోజులలో ఉత్తర సర్కారుల నుండి పంపించి వెయ్యాలి. వారితో ఎప్పుడూ చేతులు కలపకూడదు. వారికి సాయం చెయ్యకూడదు, వారి సాయం తీసుకోకూడదు.
- విజయరామరాజు ఇకపై నిజాముకు కప్పం చెల్లిస్తాడు. కానీ అతడి పాత బకాయీలను అడగకూడదు.
- ఇందుకు ప్రతిఫలంగా ఇంగ్లీషు వారు అతడికి పెద్దగా ఇచ్చిందేమీ లేదు. కనీసం నిజాము రక్షణ కోసం శాశ్వత సైనిక మద్దతు ఇవ్వాలన్న నిబంధన కూడా లేదు.[2][4]
ఈ ఒడంబడికతో హైదరాబాదు దర్బారులో ఫ్రెంచి వారి స్థానంలో బ్రిటిషు వారి ప్రాభవం ఏర్పడింది. కొండపల్లి (ముస్తఫా నగర్), నిజాంపట్నం, మచిలీపట్నం ఆంగ్లేయుల వశమయ్యాయి. తక్కిన ఉత్తర సర్కారులపై నిజాము అధికారాన్ని ఆంగ్లేయులు గుర్తించారు.
ఆనందరాజు సహాయం, అతడి సైనిక సాయం అవసరం ఫోర్డుకు తీరిపోయింది. ఆనందరాజు సైన్యం యుద్ధంలో తమకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహించారు. కాజ్‌వే మీద తమకు అప్పగించిన పనిలో వాళ్ళలో చాలామంది గాయపడ్డారు. ఆనందరాజు తన రాజ్యానికి తిరిగి వెళ్తూ, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట సంస్థానాలను ఆక్రమించుకున్నాడు. అతడు 1760లో మశూచి సోకి మరణించాడు.
యుద్ధం ముగిసాక, బ్రిటిషు సైన్యంలోని బెంగాలు ఐరోపా దళం వెనక్కి వెళ్ళిపోయింది. 1759 అక్టోబరు 15 ప్రాంతంలో కోట కాపలాను కెప్టెన్ ఫిషరుకు, 1100 మంది సైన్యంతో సహా అప్పజెప్పి, కల్నల్ ఫోర్డు ఓడపై కలకత్తా వెళ్ళిపోయాడు. మద్రాసు ప్రెసిడెన్సీ మచిలీపట్నాన్ని తన అధీనంలోకి తీసుకుని అక్కడ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆండ్రూస్‌ను అధికారిగా నియమించింది.
1759 డిసెంబరు 5 న ఫిషరు సైన్యాన్ని తీసుకుని కాకినాడపై దాడికి వెళ్ళి, అక్కడ చెవాలియర్ పేట్‌కు చెందిన సైన్యాన్ని బందీలుగా పట్టుకున్నారు. చెవాలియర్, కొంతమంది అనుచరులతో పారిపోయాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "1758 లో దక్కనులో బ్రిటిషు వారి వ్యాపకాలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-09-02.
- ↑ 2.0 2.1 Orme, Robert (1861). A history of the military transactions of the British nation in Indostan : from the year MDCCXLV. Madras: Pharoah. pp. 492, 493.
- ↑ Staff Officer (1843). Historical Record of the Honourable East India Company's First Madras Regiment. Smith, Elder. p. 168.
- ↑ గ్రిబుల్, జెడిఇ (1896). దక్కను చరిత్ర. లండన్: లుజాక్ అండ్ కం. p. 58.