Jump to content

మక్ఖలి గోశాలుడు

వికీపీడియా నుండి
మహాకశ్యపుడు (ఎడమ వైపు చివరలో వున్న వ్యక్తి) ఒక అజీవకునితో బుద్ధుని పరినిర్వాణం గురించి తెలియచేయడం [1]

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో మక్ఖలి గోశాలుడు ప్రసిద్దుడు. అజీవక మత శాఖను స్థాపించినవాడుగా ఇతనిని పేర్కొంటారు. బౌద్ద గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు. ఇతను మహావీరుని, గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు. ఇతనిని జైన బౌద్ద మతాలు ప్రమాదకరమైన ప్రత్యర్థిగా గుర్తించాయి. బౌద్ద మతం కొంతవరకు సమకాలికుల చేత సమ్మానితుడైన దార్శనికుడుగా గుర్తిస్తే, జైన మతం మాత్రం మక్ఖలి గోశాలుని జైన మతానికి ప్రబల విరోధిగా పరిగణించి అతనిని, అతను స్థాపించిన అజీవక మత శాఖను చివరివరకూ ద్వేషించింది.

ఆధార గ్రంధాలు

[మార్చు]

ప్రాచీన భారతీయ భౌతికవాదులలో ఒకడైన మక్ఖలి గోశాలుడు బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా, వైదిక మత విశ్వాసాలను తిరస్కరిస్తూ భౌతికవాదాన్ని ప్రజలలో తీసుకు వెళ్ళడంలో అద్వితీయమైన పాత్ర వహించాడు. అయితే ఇతనిపై దాడి తాత్వికంగాను భౌతికంగాను రెండువైపుల నుంచి జరగటంతో మక్ఖలి గోశాలుని చరిత్ర, బోధించిన భౌతికవాద సూత్రాలు స్పష్టంగా లభించలేదు. మూల ఆధారగ్రంధాలు ధ్వంసమై పోయాయి. ఒకవేళ అవి వుండి వున్నప్పటికీ వాటిని తీవ్రంగా నిరసించిన జైనులు, బౌద్ధులు వాటిని నాశనం చేసి వుండవచ్చు. అసలు మనకు మక్ఖలి గోశాలుని గురించి తెలిసినది, అతనిని విమర్శిస్తూ జైనులు, బౌద్ధులు తమ తమ గ్రంథాలలో ఉటంకించిన వ్యాఖ్యలు, కథనాల నుండి మాత్రమే. ఈ ఉటంకలు కూడా మక్ఖలి గోశాలుని భౌతికవాద బోధనల గురించి యదార్ధంగా చెప్పినవి కావు. అతనిని అపతిష్టపాలు చేయడానికి అతనిపై ద్వేషం, అసహ్యం కలిగించే ప్రయత్నంలో అతని భౌతికవాద బోధనలను వక్రీకరిస్తూ నిందిస్తూ జైన, బౌద్ద మతాల రచయితలు తమ గ్రంథాలలో రాసుకొన్న ఉటంకనలు మాత్రమే. మక్ఖలి గోశాలుని మతం గురించి వివరాలు తెలుసుకోవడానికి సైతం, ఆ మతాన్ని ద్వేషిస్తూ, వక్రీకరిస్తూ, అవహేళన చేస్తూ వచ్చిన ఇతర మతగ్రంధాల ఉల్లేఖనలే దిక్కయ్యేంతగా అజీవకుల మూల ఆధార గ్రంథాలు ధ్వంసం చేయబడ్డాయి.

మక్ఖలి గోశాలుని గురించి అతని తాత్విక ధోరణి గురించి ఉటంకించిన కథనాలు, వ్యాఖ్యలు జైన గ్రంథాలైన భగవతి సూత్ర, సూత్ర కృతాంగ; బౌద్ధ గ్రంథాలైన దిఘ నికాయ, మధ్యమ నికాయ, అంగుత్తర నికాయ, బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” మొదలగు గ్రంథాలలో లభిస్తాయి.

ప్రారంభ జీవితం

[మార్చు]

మక్ఖలి గోశాలుడిని మక్కలి గోశాలుడిగా, మస్కరి గోశాలుడిగా, మస్కరి పుత్ర గోశాలుడిగా కూడా జైన బౌద్ద గంధాలు పేర్కొన్నాయి. జైన వాజ్మయం “భగవతి సూత్ర” ప్రకారం మక్ఖలి గోశాలుడు శ్రావస్తి సమీపంలోని సారవన గ్రామంలో ఒక గోశాలలో జన్మించాడు. తల్లి ‘భద్ద’. తండ్రి ‘మంఖలి’. వీరిది చిత్రపటాలను, బొమ్మలను ప్రదర్శిస్తూ యాచక వృత్తి అవలంబించిన పేద కుటుంబం అని తెలుస్తుంది. మంఖలి శ్రావస్తి నగరానికి చేరుకొన్నప్పుడు వసతి లభించని కారణంగా అప్పటికే నిండు గర్భిణి అయిన భార్యతో సారవన గ్రామంలోని ఒక గోశాలలో (పశువుల శాల) ఉండవలసి వచ్చిందని, అటువంటి నిరుపేద దుర్భర పరిస్థితులలో మక్ఖలి గోశాలుడు జన్మించాడని, గోశాలలో జన్మించినందువల్ల అతనిని గోశాలుడిగా పిలిచారని, తొలిదశలో మక్ఖలి గోశాలుడుకూడా తన తండ్రి వలె యాచక వృత్తి చేపట్టాడని పేర్కొంటున్నది.

బుద్ధఘోషుని “సుమంగళ విలాసిని” ప్రకారం మక్ఖలి గోశాలుడు పూర్వాశ్రమంలో బానిసగా వుండే వాడని, ఒకరోజున నూనె కుండను మోస్తూ బురద నేలలో పోతున్నప్పుడు, అతని యజుమాని మఖలి (తడబడద్దు) అంటూ గదమాయిస్తుప్పటికీ తొట్రుపడి కింద పడిపోయాడని, నూనె కుండ చేజారి పోవడంతో పగిలిపోయిందని, కోపోద్రేకుడైన యజమాని అతనిని వెంటబడి కొట్టబోగా తప్పించుకొని పారిపోయాడని, ఆ తోపులాటలో అతని అంగ వస్త్రం యజమాని చేతికి చిక్కినప్పటికి భయంతో దిగంబరంగానే పరిగెత్తుతూ వీధిలో పారిపోయాడని, ఆప్పటి నుంచి నగ్నంగానే సంచరించాడని అపహాస్యం చేస్తూ పేర్కొంది. ఈ వృత్తాంతాన్ని బట్టి మక్ఖలి గోశాలుడు తన సమకాలీన మత ప్రచారకులైన వర్ధమాన మహావీరునివలె, గౌతమ బుద్ధుని వలె  జన్మతా పాలక వంశాల నుంచి వచ్చిన వాడు కాదని, సంపన్న కులీన వర్గానికి చెందిన వాడు కాదని తెలుస్తుంది. ఒక నిరుపేద యాచక కుటుంబం నుండి వచ్చిన వాడని, దయానీయమైన పరిస్థితులలో పశువుల కొట్టంలో జన్మించాడని, బానిసగా బ్రతికాడని తెలియవస్తుంది. బానిస జీవితం నుండి పారిపోయి తాత్విక ప్రచారకుడిగా మారాడని అవగతమవుతుంది.

వర్ధమాన మహావీరుడితో సాహచర్యం

[మార్చు]

జైనుల “భగవతి సూత్ర” ప్రకారం వర్ధమాన మహావీరుడి కన్నా 16 సంవత్సరాలు పెద్దవాడని పేర్కొంది. వర్ధమాన మహావీరుని వద్ద ఆరు సంవత్సరాలు శిష్యరికం చేసాడని అ తరువాత అభిప్రాయభేదాల కారణంగా వారిరువురూ విడిపోయారని విడిపోయిన అనంతరం మక్ఖలి గోశాలుడు అజీవక శాఖను ప్రారంభించాడని తెలుస్తుంది. మక్ఖలి గోశాలుడు నలందలో వర్ధమాన మహావీరుని వద్ద శిష్యునిగా చేరాడు. మక్ఖలి గోశాలుడు ఆదినుంచి దిగంబరుడిగానే సంచరించేవాడని, ప్రారంభంలో వస్త్రాలు ధరించిన మహావీరుడు తరువాత దిగంబరత్వం లోకి మారడానికి దిగంబర శిష్యుడైన మక్ఖలి గోశాలుని ప్రభావం వుంది అని భద్రబాహుని “కల్పసూత్రం” ద్వారా తెలుస్తుంది. శిష్యుడిగా చేరిన ఆరు సంవత్సరాల పిదప మహావీరుని కన్నా తానే ముందుగా జ్ఞానం పొందిన వానిగా భావించిన మక్ఖలి గోశాలుడు 24 వ తీర్ధంకరుడిగా తనకు తానే ప్రకటించుకొని మహావీరునికి సవాల్ గా నిలిచాడు.

తరువాత మహావీరుని విడిచి అజీవక మతాన్ని స్థాపించాడు. శ్రావస్తి నగరానికి వచ్చి విధవరాలైన ఒక కుమ్మరి స్త్రీ  “హాలాహాల” సంరక్షణలో స్థావరం ఏర్పాటు చేసుకొని తన దిగంబర శిష్యులతో సంచరిస్తూ ప్రజలకు బోధించడం ప్ర్రారంభించాడు. 16 సంవత్సరాల పాటు శ్రావస్తి కేంద్రంగా గంగా మైదాన ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలలో అజీవక మత ప్రచారం చేసాడు. చేర వచ్చిన శిష్యులతో, ఆకట్టుకొంటున్న బోధనలతో ప్రజలలో అజీవకులకు ఆదరణ నానాటికి పెరుగుతుండడంతో సమకాలికులైన గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఇరువురు కలవరపాటుకి గురయ్యారు. ముఖ్యంగా మొదటనుంచి వున్న స్పర్ధ వలన మహావీరునికి ప్రబల శత్రువుగా మక్ఖలి గోశాలుడు మారాడు.

విడిపోయిన పదహారు సంవత్సరాలనంతరం మహావీరుడు శ్రావస్తికి తిరిగి వచ్చినపుడు మక్ఖలి గోశాలుడిని కలిసాడు. కుమ్మరి స్త్రీ సంరక్షణలో ఉంటున్న మక్ఖలి గోశాలుడిని, అతని అనుచరులను “ స్త్రీ దాసులు”గా వర్ర్ధమాన మహావీరుడు తులనాడడంతో మళ్ళీ రెండు మత తెగలు (అజీవక, జైన మతాలు) శ్రావస్తిలో తీవ్రంగా ముఖాముఖి ఘర్షణ పడ్డాయి. రెండు మత తెగల శిష్య గణాలు ముష్టిఘాతాలతో తలపడ్డాయి. చివరకు బాహి బాహి పోరులో వర్ధమాన మహావీరుడు మక్ఖలి గోశాలుని ఓడించి తీవ్రంగా అవమానించాడు. మహావీరుని చేతిలో జరిగిన ఈ అవమానానికి శ్రావస్తిలో అజీవక మత ప్రచారకుడిగా మక్ఖలి గోశాలుని ప్రాభవం పూర్తిగా అడుగంటింది. ఈ దారుణ పరాభవానికి తట్టుకోలేని మక్ఖలి గోశాలుడు వెర్రి వాడై పోయి తాగుబోతుగా మారి విచ్చలవిడిగా బ్రతికాడని, అయితే ఆరు నెలల అనంతరం తెలివి తెచ్చుకొని పశ్చతాపం చెందాడని, చనిపోయే ముందు తన శిష్యులను పిలిచి మరణాంతరం తన కాయానికి ఆగౌరవ పరిచే రీతిలో, అవమానకరంగా ఖననం చేయవలసిందిగా కోరాడని, అయితే శిష్యులు దానిని ఎందువలనో పాటించలేదని జైన గ్రంథాలు వర్ధమాన మహావీరుని ఉన్నతీకరిస్తూ, మక్ఖలి గోశాలుని పట్ల అసహ్యం కలిగించేటట్లు అనేక విధాలుగా పేర్కొన్నాయి.

మరికొన్నిజైన గ్రంథాలు మక్ఖలి గోశాలుడు తన స్థాయిని గుర్తించలేదనే ఆగ్రహంతో మహావీరుని పైకి తన శరీరం నుండి ఒక శక్తి జ్వాలను పంపి దాడిచేయబోగా, మహావీరుడు ప్రతిక్రియగా తన కఠోర వజ్రదేహంతో ఆ జ్వాలను తిరగగొట్టడంతో ఫలితంగా మక్ఖలి గోశాలుని మరణం సంభవించినదని కథలల్లాయి. 

మక్ఖలి గోశాలుని బోదనలు

[మార్చు]

మక్ఖలి గోశాలుడు అజీవక మత శాఖను ప్రారంభించాడు. శ్రావస్తి నగరాన్ని కేంద్రంగా చేసుకొని గంగ మైదాన ప్రాంతాలలో పర్యటిస్తూ పదహారు సంవత్సరాల పాటు ప్రజలలో నియతి వాదాన్ని (Determinism) ప్రతిపాదిస్తూ, అజీవక మత ప్రచారం చేసాడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతికవాద సూత్రాలను ప్రచారం చేసాడు.

  • మక్ఖలి గోశాలుని సిద్దాంతాన్ని నియతి వాదం (Determinism) అంటారు. దీని ప్రకారం జగత్తు అంతా ముందు గానే నిర్ణయించినట్లు ప్రకారమే జరుగుతుంది. దానిని ఎవరూ మార్చలేరు. మానవ ప్రయత్నం ఏదీ కూడా ‘విధి’ని మార్చలేదు. మానవుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమె. అందరూ ‘నియతి’ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇదే నియతివాదం.
  • ఈ నియతివాదంలో మానవుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. అతని చేతులలో ఏమీ లేదు. యాదృచ్ఛికంగా పుణ్యం కలగవచ్చు. లేదా పాపం కలగవచ్చు. పాప పుణ్యాలలో అతని ప్రమేయమేమీ లేదు. మంచి చేసినా పుణ్యం కలుగక పోవచ్చు. చెడు చేసినా పాపం కలుగక పోవచ్చు. అంటే మంచి చేసినా ప్రయోజనం లేదు. చెడు చేసినా నష్టం లేదు. కనుక గోశాలుని దృష్టిలో సమాజం-వ్యక్తి ప్రయత్నించవలసినదేమీ లేదు. దాని వలన ఆహితమే కలుగుతుంది.
  • సృష్టి లోని ప్రతి చర్య నియతి ప్రకారమే జరుగుతుంది తప్ప మానవ ప్రమేయం ఏమీలేదు. అందువలన కర్మ అనేది అవాస్తవం అని వీరు బోధించారు. ఈ విషయంలోనే అజీవక మతం, కర్మను అంగీకరించిన సమకాలిక జైన, బౌద్ద మతాలతో నిరంతర ఘర్షణ పడింది.
  • ప్రతి జీవి యొక్క అస్తిత్వం ఆ జీవి యొక్క స్వభావ సామర్ధ్యాల మీద కాకుండా నియతి సూత్రంపై ఆధారపడి వుంటుంది. మానవ ప్రమేయం లేకుండానే ప్రాపంచిక ఘటనలు (events)  సంభావించడమో, సంభవించకపోవడమో జరుగుతుంది. ఒక విధంగా మక్ఖలి గోశాలుని అదృష్టవాది (Fatalist) అని కూడా పిలవచ్చు. జీవి యొక్క సుఖ దుఖాలు అద్రుష్టాలనుసరించి వుంటాయి.
  • ప్రకృతిలో ప్రతీది (జీవులు, వస్తువులు) జన్మిస్తూ మరణిస్తూ తిరిగి జన్మిస్తూ వుంటాయి. ఈ విధంగా ప్రతీది 84 లక్షల మహాకల్పాల పాటు జన్మలు ఎత్తుతుంది. చివరికి జినత్వం చెంది, మోక్షం పొందుతుంది. అంటే సృష్టిలో ప్రతీది చిట్ట చివరకు తీర్ధంకరుడు అవుతుంది. అయితే ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది తప్ప దానిని వేగిరపరచడం లేదా ఆలస్యం చేయడం అనేది ఆ వస్తువు లేదా జీవి స్వభావంలో గాని, సామర్ధ్యంలో గాని, చేతల్లో గాని ఏమీ లేదు.
  • అనగా ఏ ప్రాణి ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడు పొందుతుంది. దానిని త్వరితం చేయలేము. ఆలస్యము చేయలేము. నివారించానూ లేము. మంచి పనులు చేయడం వలన దాన్ని త్వరితం చేయలేము. చెడ్డ పనులు చేయడం వలన దానిని ఆలస్యమూ చేయలేము. అసలు మన చేతులలో ఏమీ లేదు. ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడే వస్తుంది తప్ప అంతకు ముందు ఎంత గింజుకొన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజీవకులు మోక్ష సాధనకై మానవ ప్రయత్నం వృధా అని తేల్చి చెప్పినట్లయ్యింది. అందుకే మోక్ష సాధనకై (జైనుల ప్రకారం 'కేవల జ్ఞానం' పొందడానికై, బౌద్ధుల ప్రకారం 'నిర్వాణం' పొందడానికై) మానవుడు ఆచరించాల్సిన పనులను సూచించిన జైన, బౌద్ద మతాలు ‘అసలు మోక్ష సాధనకై ప్రయత్నించడమే వృధా’ అని చెప్పినందుకు మక్ఖలి గోశాలుని బోధనలను తీవ్రంగా విమర్శించాయి.
  • దేవతల విగ్రహాలపై మూత్రం పోసేవాడని, బ్రాహ్మణులచే నుగ్గు నుగ్గుగా చితకగొట్టబడ్డాడని జైన మత గ్రంథాలు పేర్కొనడం పరికిస్తే మక్ఖలి గోశాలుడు విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించాడని అవగతమవుతుంది.

మహావీరుడు, గౌతమ బుద్ధుడులకి దీటుగా మక్ఖలి గోశాలుని బోధనలకు నాడు ప్రజాదరణ వుండేదని తెలుస్తుంది. అజీవకమతం ఆ సమయంలో ప్రభావశీలిగా వుండేది. ఇతనికి ఆరు దిక్కులలో తిరిగే శిష్యులు తయారయ్యారు. వారు జ్ఞాన, కలంద, కర్ణికార, అచ్చ్చిద్ర, అగ్ని వైశ్యాయన, గోమాయ పుత్ర అర్జనుడు. మక్ఖలి గోశాలుడు తన అజీవక మత వ్యాప్తి కొరకు జైన మత విరోధ విద్వాంసులందరిని కలుపుకొనేవాడు.

మూలాలు

[మార్చు]
  1. Marianne Yaldiz, Herbert Härtel, Along the Ancient Silk Routes: Central Asian Art from the West Berlin State Museums ; an Exhibition Lent by the Museum Für Indische Kunst, Staatliche Museen Preussischer Kulturbesitz, Berlin, Metropolitan Museum of Art, 1982 p. 78

ఆధారాలు

[మార్చు]
  • History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L. Basham
  • The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
  • భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
  • ప్రాచీన భారతంలో చార్వాకం –సి.వి.

ఇతర లింకులు

[మార్చు]