భూకైలాస్ (1958 సినిమా)
భూకైలాస్ (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.శంకర్ |
---|---|
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున |
సంగీతం | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎం. ఎల్. వసంతకుమారి |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | ఏ.వీ.ఎం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
భూకైలాస్ 1958 లో కె. శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయా భాషలకు చెందిన మేటి నటీనటులతో ఎవిఎం సంస్థ సారథి ఎ.వి.మెయ్యప్పన్ నిర్మించిన చిత్రం. తెలుగులో ఎన్. టి. రామారావు, జమున, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ చిత్రకథకు కర్ణాటకలోని గోకర్ణ స్థల పురాణం ఆధారం. మైసూరుకు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారు దీని ఆధారంగా భూకైలాస అనే నాటకాన్ని ప్రదర్శించే వారు. ఈ నాటకం ఆధారంగా ఎవిఎం సంస్థ 1938 లో తమిళం, 1940లో తెలుగులో వేర్వేరు నటులతో నిర్మించారు. 1958లో అదే కథతో ఎవిఎం సంస్థ, తెలుగులో ఎన్టీఆర్, కన్నడంలో రాజ్‌కుమార్, తమిళంలో మరో నటుడు ప్రధాన పాత్రల్లో ఏకకాలంలో నిర్మించింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతం అయింది.
పాత్రలు:పాత్రధారులు
[మార్చు]- రావణాసురుడు = ఎన్.టి.రామారావు
- నారదుడు = అక్కినేని నాగేశ్వరరావు
- మండోదరి = జమున
- మయాసురుడు (మండోదరి తండ్రి) = ఎస్.వి.రంగారావు
- కేకసి (రావణుని తల్లి) = హేమలత
- పరమశివుడు = నాగభూషణం
- పార్వతీదేవి = బి.సరోజాదేవి
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. మహాశివుడి ఆత్మలింగాన్ని సాధించి, అమరత్వం పొందాలని రావణాసురుడికి కోరిక కలిగింది. ఆత్మ లింగం కోసం మహాశివుడిని రావణుడు భక్తిశ్రద్ధలతో ప్రార్థించాడు. రావణుడి తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ఆయనకు ప్రత్యక్షమై, ఏం వరం కావాలని అడుగుతాడు. అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు వద్దకు నారద ముని వెళతాడు. రావణుడి మనసును మార్చాలని మహావిష్ణువును ప్రార్థిస్తాడు.
రావణాసురుడి ఆలోచనను శ్రీ మహా విష్ణువు మార్చడంతో రావణాసురుడు మహాశివుని ఆత్మ లింగాన్ని అడగడానికి బదులు పార్వతీ దేవిని అడుగుతాడు. వెంటనే మహా శివుడు అంగీకరించి పార్వతీ దేవిని రావణాసురుడికి ఇచ్చేస్తాడు. పార్వతీ దేవితో సహా రావణాసురుడు తన లంకా పట్టణానికి తిరిగి ప్రయాణమవుతాడు. ఆ దారిలో నారద ముని రావణాసురుడికి కనిపిస్తాడు. మహాశివుడు నిజమైన పార్వతీ దేవిని ఇవ్వలేదని, మహాకాళిని ఇచ్చాడని రావణాసురుడికి నారదుడు చెబుతాడు. అసలు పార్వతీ దేవి పాతాళంలో ఉందని చెబుతాడు. ఆ సమయంలో పార్వతీ దేవి కాళికా అవతారంలో రావణాసురుడికి దర్శనమిస్తుంది. వెంటనే రావణాసురుడు పార్వతీ దేవిని విడిచిపెట్టేస్తాడు.
అసలు పార్వతీ దేవి కోసం వెతుకుతూ రావణాసురుడు పాతాళానికి వెళతాడు. అక్కడ మండోదరిని పార్వతీ దేవిగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు. మండోదరిని తీసుకుని రావణాసురుడు లంకా పట్టణానికి తిరిగి వస్తాడు. అక్కడ రావణాసురుడి తల్లి మహాశివుడి ఆత్మలింగం తెచ్చావా? అని అడిగింది. తాను మోసపోయానని రావణాసురుడికి అర్థమైంది ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని రావణాసురుడికి పట్టుదల పెరుగుతుంది.
రావణాసురుడు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా భక్తిశ్రద్ధలతో మళ్లీ తపస్సు చేస్తాడు. ఆయన తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ప్రసన్నుడవుతాడు. మళ్లీ ప్రత్యక్షమై ఏం వరం కావాలని రావణాసురుడిని అడుగుతాడు. తనకు ఆత్మ లింగం ఇవ్వాలని రావణాసురుడు మహాశివుని ప్రార్థిస్తాడు. ఆయన కోరిన వరం ఇచ్చేందుకు మహాశివుడు అంగీకరించి, ఓ షరతు విధిస్తాడు.
ఆత్మలింగాన్ని ఇస్తూ, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని మహాశివుడు చెబుతాడు. ఆత్మలింగాన్ని నేలపై పెడితే దానిలోని అన్ని శక్తులు మళ్లీ తనకే వచ్చేస్తాయని మహాశివుడు చెబుతాడు. రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకా పట్టణానికి బయల్దేరతాడు.
ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకొస్తున్నట్లు నారద మునికి తెలుస్తుంది. దాని శక్తితో రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించాడు. వెంటనే గణేశుడిని ఆశ్రయించాడు. ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని ప్రార్థించాడు. రావణాసురుడు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేస్తాడని గణేశుడికి తెలుసు. రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలోనే ఆయన నుంచి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక వేస్తాడు.
రావణాసురుడు ఆత్మలింగంతో గోకర్ణమును సమీపిస్తాడు. సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా కనిపించేలా మహావిష్ణువు చేశాడు. దీంతో రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. కానీ చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక తికమక పడతాడు. చేతిలో ఆత్మలింగం ఉంటుండగా సంధ్యావందనం చేయడం సాధ్యం కాదని ఆందోళన చెందుతాడు. దీనిని ఆసరాగా చేసుకుని గణేశుడు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమవితాడు. బ్రాహ్మణ బాలుడి రూపంలో ఉన్న గణేశుడిని రావణాసురుడు పిలిచి, తాను సంధ్యావందనం చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోవాలని కోరతాడు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని చెబుతాడు. ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి గణేశుడు ఓ షరతు విధిస్తాడు. తాను మూడుసార్లు పిలుస్తానని, ఆ లోగా వచ్చి, ఆత్మలింగాన్ని తీసుకోకపోతే నేలపై పెట్టేస్తానని చెబుతాడు. దానికి రావణాసురుడు అంగీకరిస్తాడు.
రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలో గణేశుడు రావణా... రావణా అంటూ మూడుసార్లు పిలుస్తాడు. రావణాసురుడు ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ, గణేశుడి మాటలను వినిపించుకోడు. సంధ్యావందనం పూర్తయిన తర్వాత తిరిగి రావణాసురుడు గణేశుడి వద్దకు వస్తాడు. అప్పటికే ఆత్మలింగాన్ని గణేశుడు నేలపై పెట్టేశాడు. బాలుడు తనను మోసం చేశాడని రావణాసురుడికి పట్టరాని కోపం వస్తుంది. ఆ ఆత్మలింగాన్ని పైకి తీసి, దానిని పెకిలించేందుకు రావణుడు చేసిన ప్రయత్నం వృథా అవుతుంది. ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుని కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహిస్తాడు.
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రకథకు కర్ణాటకలోని గోకర్ణ స్థల పురాణం ఆధారం. మైసూరుకు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారు దీని ఆధారంగా భూకైలాస అనే నాటకాన్ని ప్రదర్శించే వారు.[1] ఈ నాటకం ఆధారంగా ఎవిఎం సంస్థ 1938 లో తమిళం, 1940లో తెలుగులో వేర్వేరు నటులతో నిర్మించారు. 1958లో అదే కథతో ఎవిఎం సంస్థ, తెలుగులో ఎన్టీఆర్, కన్నడంలో రాజ్‌కుమార్, తమిళంలో మరో నటుడు ప్రధాన పాత్రల్లో ఏకకాలంలో నిర్మించింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతం అయింది.
పాటలు
[మార్చు]సముద్రాల రాఘవాచార్య రచనా సామర్థ్యానికి ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే ఒక్క పాట తార్కాణం గా నిలుస్తుంది. (ఈపాటలో భరతుడ్ని ఉద్దేశిస్తూ సాగిన 'కపటనాటకుని పట్టాభిషేకం' అనే పాదం విమర్శలకు గురి అయ్యింది.) ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయమహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు ఘంటసాల వెంకటేశ్వరరావు గళంలో జీవం పోసుకున్నాయి. ‘సుందరాంగా అందుకోరా’, ‘మున్నీట పవళించు నాగశయనా’ వంటి పాటలు కూడా ఆణిముత్యాలే. ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్థనం కలసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మరపురాని మనోజ్ఞ దృశ్యకావ్యంగా మలచిన ఘనత దర్శకుడు కె.శంకర్‌కు దక్కుతుంది.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
తగునా వరమీయా యీ నీతి దూరునకు పరమా పాపునకు | సముద్రాల రాఘవాచార్య | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో | సముద్రాల రాఘవాచార్య | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా | సముద్రాల రాఘవాచార్య | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
మున్నీట పవళించు నాగశయనా | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | ఎం. ఎల్. వసంతకుమారి | |
రాముని అవతారం రవికుల సోముని అవతారం | సముద్రాల రాఘవాచార్య | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా | సముద్రాల రాఘవాచార్య | ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం | పి.సుశీల |
అగ్ని శిఖలతో ఆడకుమా . ఘంటశాల.రచన: సముద్రాల.
జలధార శ్యామా మంగళ నామా.ఘంటశాల.రచన: సముద్రాల.
ప్రేమలీ విధమా..మన రాగమేగా అనురాగం.ఘంటశాల. సుశీల.రచన: సముద్రాల.
సైకత లింగంభు జలది పాలవు (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.
నాకనుల ముందొలుకు (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.
స్వామి దన్యుడనైతి (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.
విశేషాలు
[మార్చు]- ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ జననం ‘భూకైలాస్’ చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే జరిగినది
- సుందరాంగా అందుకోరా పాటలో అప్సరసగా ప్రత్యేక పాత్రలో హిందీ చలనచిత్ర తార హెలెన్ నాట్యము చేసింది.
- ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ ఎన్.టి.రామారావుతో శృంగార రాముడు (1979) లో తీశారు. చిత్రం విజయవంతం కాలేదు.
మూలాలు
[మార్చు]- ↑ Narasimham, M. L (2011-07-10). "Bhookailas(1940)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-10-13.
- "vannetaggani 'bhukailaas`'- Tollywood News at TeluguPeople.com". web.archive.org. 2007-09-27. Retrieved 2024-10-30.