Jump to content

భట్టిప్రోలు లిపి

వికీపీడియా నుండి
తెలుగులిపిపరిణామ క్రమంలో భట్టిప్రోలు లిపి

తెలుగు లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశమందలి తెలుగునాడులో కృష్ణానదీమైదానంలో సముద్రతీరానికి సమీపములో గల గ్రామం భట్టిప్రోలులో లభించిన బౌద్ధస్తూపము వలన తెలుస్తున్నది.

చరిత్ర

[మార్చు]

క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడేవారు. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకునేందుకు రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాల వలన తెలుస్తున్నది. . ప్రాకృత – సంస్కృత ప్రభావంతో అనేక పదాలు తెలింగభాషలో చేరి బౌద్ధ సంపర్కంతో అంధక, లేక ఆంధ్రీ అనబడిన ఆంధ్రభాష బలపడింది. ఎన్ని మార్పులు వచ్చినా అజంతత్వాన్ని వదులుకోలేదు. అంటే ‘వనం’ అనే సంస్కృత పదాన్ని ‘వనము’ అని అజంతంగా వ్రాయటం సాహిత్యానికి, సంగీతానికి అనువైన భాషగా అయ్యింది.[1]

లిపి

[మార్చు]
భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )

తెలుగు దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.[2][3] స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,.[4] భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.[5] [6]

శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు.[7] భట్టిప్రోలు స్తూపంలో దొరికిన స్పటికపు బరిణెల మీదనున్న అక్షరాలలో కొన్ని అచ్చతెలుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. వాటిలో ఇప్పటి తెలుగు ‘ళ’ అక్షరం భట్టిప్రోలు అక్షరానికి పరిణామమే. అలాగే ద అనే అక్షరము. హల్లుల పైన ఉండే తలకట్టుకు మూలమైన గీత భట్టిప్రోలు శాసనం నాటి లిపిలో కనబడుతుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పి. వి. పరబ్రహ్మశాస్త్రి. "తెలుగు భాషా ప్రాచీనత". ఈమాట. Archived from the original on 2017-06-17.
  2. G. Buhler (1894). "The Bhattiprolu Inscriptions". Epigraphica Indica. 2: 323.
  3. Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, సికింద్రాబాద్
  4. "Antiquity of Telugu language and script:". The HIndu. 2007-12-20. Archived from the original on 2012-05-30. Retrieved 2008-08-02.
  5. "Buddhist heritage of Andhra Pradesh". Ananda Buddha Vihara. Archived from the original on 2007-10-14.
  6. "Epigraphist extraordinaire". Hyderabad: The Hindu. 2007-03-19. Archived from the original on 2007-03-26. Retrieved 2008-08-02.
  7. భట్టిప్రోలు ఆంజనేయ శర్మ, (2007). భట్టిప్రోలు మహాస్తూపము,. భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.{{cite book}}: CS1 maint: extra punctuation (link)

ఇవి కూడా చూడండి

[మార్చు]