Jump to content

బౌద్ధమత గ్రంథాలు

వికీపీడియా నుండి


బౌద్ధ మతము యొక్క గ్రంథములన్నియు పాళీ భాషలో వ్రాయబడినవి.

పాళీ భాష- దాని విభజన

[మార్చు]

పాళీ అనగా గీత, లేక హద్దు అని అర్ధము. కాలక్రమమున ఆ అర్ధముపోయి పాళీ అనగా వాక్యము, మతపుస్తకము, పవిత్ర గ్రంథము అని వ్యవహరింపబడెను. అందువలన పవిత్ర గ్రంథముల వ్యాఖ్యాన, టీకాతాత్పర్యములను పాళీ అను పిలిచెడివారు. తరువాత బౌద్ధమతగ్రంథములు వ్రాయబడిన భాష అంతయు పాళీ అని పిలువబడెను. సిలోన్, బర్మా దేశములలో నివసించు బౌద్ధ మతస్థుల మత గ్రంథములు తిపిటిక మను పేరుతో వ్యవహరింపబడుచున్నవి. తక్కిన చక్కని శైలి గల పురాణభాషలవలె పాళీ భాషయొక్క శైలి కుదుటపడినది కాదు. పాళీ భాషకు నిస్పష్టమైన క్రమతలేదు. పాళీ భాష ప్రాకృత భాషలలో పురాతనమైనప్పటికిని, ఇది కొసవరకును పవిత్రమైనదిగా నుండక సంకరమైనది. ప్రాకృతభాషలతో మిళితమై ఇది ముఖ్యముగ నాలుగు భాగములగ విభజింపబడింది.

1. పాళీభాష యొక్క బాల్యదశ పద్య రూపము చెంది గాధ లలో కనిపించుచున్నది. ఈ గాథలు పాళీగద్యమత గ్రంథములలో సమ్మేళనమై యున్నది.
2. పాళీభాష యొక్క రెండవదశ గద్యరూపమగు మత గ్రంథములలో కనిపిస్తున్నది. ఇందు నవీనత్వము కొంచము గోచరించును.
3. పాళీభాష మూడవదశ బౌద్ధ మతేతర గ్రంథములగు మిళిందపయి-హ మొదలగు గ్రంథములలో కనబడుచున్నది.

తిపిటిక

[మార్చు]

పాళీబౌద్ధమత గ్రంథములన్నియు తిపిటక మను పేరుతో పిలవబడుచున్నవి. తిపిటక మనగా మూడుబుట్టలు అని అర్ధము. అవి యేవన - 1. వినయ పిటక 2. సుత్తపిటక 3. అభిధమ్మపిటక. ఈ మూడింటిలోను బౌద్ధధర్మములు, బౌద్ధశీలము, మతచర్చ మొదలగునవి వ్రాయబడినవి.

వినయపిటకలో (1) మహావిభంగ (2) భిక్కునీవిభంగ (3) మహావగ్గ అను గ్రంథములు చేర్చబడినవి.

సుత్తపిటకను 5 నికాయములుగా విభజించిరి. నికాయము అనగ సమూహము. ఇందు (1) దీఘనికాయ (2) మధ్యమనికాయ (3) సమ్యుక్తనికాయ (4) అంగుత్తరనికాయ (5) ఖుద్దకనికాయ అను గ్రంథములు చేర్చబడినవి.

అభిధమ్మపిటకలో 7 గ్రంథములు చేర్చబడినవి. అవి (1) ధమ్మసంగణి (2) విభంగ (3) కథావత్తు (4) పుగ్గలపరిజత్తి (5) ధాతుకథ (6) యమక (7) మహాపరాన.

ఇవి అన్నియు క్రీ.పూ.500 సం. క్రితము పూర్వమే వ్రాయబడినవి. వీటికి బుద్ధదత్తుడు, ఆనందుడు, ధమ్మపాలుడు మొదలగు బౌద్ధ భిక్షువులు ప్రఖ్యాత వ్యాఖ్యాతలు.

పాళీ వాజ్మయపు పుట్టుక, దాని అభివృద్ధిగురుంచి విపులముగా చెప్పుటకు ఆధారములు అంత హెచ్చుగా ఏమియులేవు. బౌద్ధమతగ్రంథములు బుద్ధుడు కాలములోనె పుట్టినవనుటకు ఏమీ సందేహములేదు. కాని తిపటిక మంతయు అప్పుడే వ్రాయబడియుండదు. కాలక్రమమున ఒక్కొక్క పుస్తకము చేర్చబడియుండును. తిపిటక్ములోని కొన్ని భాగములు అశోకుడు కాలమునాటికే ఉన్నవని తెలియుచున్నది.

అశోలుడు బైరాత్ శాసనమువలన తిపిటకము యొక్క వినయసుత్తభాగములు క్రీ.పూ.250 సం.నాటికే వున్నవని చెప్పుదురు. సాంచి, బర్ హట్ డగోబా స్తూపముల వద్ద శాసనములు, రాతి ద్వారములపై బుద్ధుని జీవితచరిత్రను చిత్రించిన శిలాచిత్రములు తిపిటకములోని జాతక కథలను నిరూపించుచున్నవి. ఇక్కడ శాసనములలో నికాయములు తెలిసిన భిక్షువుల పేర్లు తెలుపబడినవి. క్రీ.పూ. 1వ శతాబ్దమునకు చెందిన మిళిందపజహ అను గ్రంధమూలముగా తిపిటకము క్రీ.పూ.1 వ శతాబ్దమునకు పూర్వమే యున్నదని తెలియుచున్నది.

తరువాత కాలక్రమమున సంస్కృతము భాష వలె మృతభాషయై పాళీభాష కొద్దిమంది పండితులచే చదువబడెను. రానురాను పండితులు పాళీ భాషను ధారాళముగా వ్రాయలేక సంస్కృతపదములు ఎక్కువుగా చేర్చి కొన్ని వ్యాఖ్యానములు చేసిరి. సంస్కృత భాషకు గల నిబంధనలే పాళీభాషకు అనుకరించిరి.

పాళీతిపిటక గ్రంథములు సింహళ (Srilanka), బర్మా, సయాం దేశభాషలలో వ్రాయబడినవి. ఆంధ్రదేశానికి సింహళమునకును పూర్వకాలము నుండి మతస్నేహవాణిజ్య బాంధవ్య ముండుటయేగాక ఆంధ్రచక్రవర్తులు సింహళదేశపు రాజ కన్యలను (బోధిశ్రీ, చామతిశ్రీ) వివాహమాడినట్లును, వారిని మెప్పించుటకై కొన్ని విహారములను నిర్మించిరనియు చరిత్రవలన తెలియుచున్నది. ఆ విహారములే అమరావతి, నాగార్జున విహారము లని చరిత్రకారులు చెప్పుచుందురు. పాలన్నరుశిథిల విహారములో (సిలోన్) మెట్ల క్రిందన పరచిన అర్ధచంద్రాకారపు చంద్రశిలలు (Moonstones) కృష్ణానదీ ప్రాంతము నుండి ఎగుమతి అయినవే.

మూలాలు

[మార్చు]
  • 1947 వొల్ 8 భారతి మాస పత్రిక.