Jump to content

బోర్సాడ్ సత్యాగ్రహం

వికీపీడియా నుండి


బోర్సాడ్ సత్యాగ్రహం గుజరాత్కు చెందిన బోర్సాడ్ ప్రాంతంలో 1923లో సాగిన సహాయ నిరాకరణోద్యమ ఘట్టం. వల్లభ్ భాయి పటేల్ ఈ సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం సెప్టెంబరు 1923లో ఆనంద్, బోర్సాడ్ తాలూకాల్లో బందిపోటు దొంగల దోపిడీలు సాగుతున్నాయని, ప్రభుత్వానికి ప్రజలు సహకరించట్లేదనీ కనుక తమకు అదనపు సైన్యం, పోలీసుల ఖర్చు అవసరమౌతోందంటూ లెవీ పన్ను విధించింది. ఐతే బందిపోట్లకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తూండగా, వారిని పట్టించే సమాచారం చెప్పిన ప్రజలు ఆ కారణంగా బందిపోట్ల దాడికి మరణించారు. ఈ నేపథ్యంలో దీన్ని అవమానకరంగా, అన్యాయంగా భావించిన ప్రజలు వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేశారు. పటేల్ స్థానికులు, నిజాయితీ పరుడైన ఓ ప్రభుత్వ చిరుద్యోగి సహకారంతో పోలీసులు-బందిపోట్ల అనుబంధం గురించి సాక్ష్యాధారాల సంపాదించి ప్రభుత్వ వాదనలు తిప్పికొట్టారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి లెవీ రద్దుచేసి, బందిపోటు నాయకుల్ని పట్టుకుని శిక్షించింది.

నేపథ్యం

[మార్చు]

బబ్బర్ దేవా అన్న ప్రఖ్యాత బందిపోటుది బోర్సాడ్ తాలూకాలోని గోలెల్ గ్రామానికి చెందిన పాటన్ వాడియా జాతి. జోగన్ అనే గ్రామం కేంద్రంగా 1919, 1923 మధ్యకాలంలో బబ్బర్ దేవా బందిపోటు ముఠా దోపిడీలు, అపహరణలు, పదుల సంఖ్యలో హత్యలు చేసింది. ముఠాసభ్యుల్లో అత్యధికులు అదే గ్రామానికి చెందిన పాటన్ వాడియాలే. బోర్సాడ్ పట్టణానికి చెందిన అలీమియా లేదా ఆలియా అనే మరో బందిపోటు ముఠా నాయకుడు కూడా ప్రసిద్ధుడే. అతను 1918, 1923 మధ్యకాలంలో దాదాపు 35 హత్యలు, 55 దోపిడీలకు పాల్పడ్డాడు. బరైయ్యా, పాటన్ వాడియా జాతుల వారైన మరికొందరు ముఠాల నాయకులు ఆలియాకు, బబ్బర్ దేవాకు నకిలీలుగా తిరుగుతూ, తాము వారి పేర్లు పెట్టుకుని భయపెట్టి దోపిడీలు చేసేవారు. ఈ బందిపోటు జాతుల వారికి గతంలో అదే ప్రాంతంలో విస్తారమైన భూములు, ఆధిపత్యం, పరిపాలన ఉండేవి. కానీ క్రమంగా తమ ఆస్తులు పటేళ్ళకు అమ్మడం, బ్రాహ్మణ వైశ్యుల వద్ద తీసుకున్న అప్పుకింద జమ కావడం వంటి కారణాలతో భూమిలేని వారయ్యారు. వీరిని బ్రిటీష్ ప్రభుత్వం నేరస్థజాతుల కింద వర్గీకరించింది. ఆ చట్టం ప్రకారం నేరస్థ జాతిలో జన్మించినవారు, నేరచరిత్ర ఉన్నా లేకున్నా పోలీసుస్టేషన్ కు వెళ్ళి ప్రతీరోజూ హాజరు వేయించుకోవాలి. ఏ దోపిడీ జరిగినా అనుమానం కారణంగా వీరిని జైలుపాలు చేసేవారు, క్రమంగా నేరప్రవృత్తి అలవరుచుకున్నారు. ఈ జాతుల వారికి తమకు నేరస్థ జాతి అన్న ముద్ర పోవాలనీ, ఠాకూర్లు లేక క్షత్రియులని అనిపించుకోవాలనీ అంతర్గతంగా ఉండేది.

ఈ బందిపోట్లతో కొన్నిచోట్ల పోలీసులు కుమ్మక్కయ్యారు. బబ్బర్ దేవాను అణచివేయడానికి పోలీసులే ఆలియాకు మందుగుండు, తూటాలు వంటివి ఇచ్చారు. కానీ అతను ఆ దిశగా ఏమీ చేయలేదు. పోలీసులకు ప్రజలు బందిపోట్ల గురించి సమాచారాన్ని ఇచ్చినప్పుడు ఆ బందిపోట్ల వద్ద సొమ్ము తీసుకున్న పోలీసులు ఇన్ఫార్మర్ల వివరాలు బందిపోట్లకు చేరవేసేవారు. సమాచారమిచ్చిన వ్యక్తులను బందిపోట్లు చెట్లకు మేకులు కొట్టి, తూటాలతో కాల్చడం వంటి తీవ్రమైన చర్యలతో చంపేసేవారు. ఈ వాస్తవాలను వక్రీకరించి ప్రజలు బందిపోట్లను పట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించట్లేదంటూ, ఈ ప్రాంతంలో జరిగిన పోలీసు కార్యక్రమాలకు లెవీగా రెండున్నర లక్షల రూపాయలు విధించింది. దాని ప్రకారం పదహారేళ్ళు నిండినవారంతా రెండు రూపాయల ఏడణాల లెవీ చెల్లించాల్సివుంటుంది.[1]

ఉద్యమం

[మార్చు]

ప్రభుత్వం ఈ లెవీని విధించినప్పుడు ప్రజలు అందుకు నిరసనగా బోర్సాడ్ పట్టణంలో దుకాణాలు మూసివేశారు. పురపాలక సంఘాధ్యక్షుడు భోగీలాల్ చోక్సీ తన పదవికి రాజీనామా చేశారు. అదనపు పోలీసులు అవసరమౌతున్నారన్న కారణం చూపి వేసిన లెవీ కావడంతో పోలీసులు తమ గ్రామానికి రానక్కరలేదనీ, తామే బందిపోట్ల సంగతి తేల్చుకుంటామని రాస్ గ్రామస్థులు స్పష్టం చేశారు.

మూలాలు

[మార్చు]
  1. గాంధీ, రాజ్ మోహన్ (మే 2015). వల్లభ్ భాయ్ పటేల్ జీవిత కథ (in తెలుగు (అనువాదం)) (2 ed.). విజయవాడ: ఎమెస్కో పబ్లికేషన్స్. pp. 162–170.{{cite book}}: CS1 maint: unrecognized language (link)