Jump to content

బోడావుల నాగేశ్వరరావు

వికీపీడియా నుండి

శ్రీ బోడావుల నాగేశ్వరరావు, సహజకవి, శతకరచనలో మేటి. వీరు ఇంకొల్లు గ్రామములో ఒక పేదకుటుంబంలో, రఘుపతి, వరలక్ష్మమ్మ దంపతులకు మూడో కుమారుడుగా జన్మించారు. అప్పటి పరిస్థితులనుబట్టి, ఐదవ తరగతలోనే చదువుకు స్వస్తిపలికినారు. బ్రతుకుదెరువు కోసం, పరిసర గ్రామాలలో భూస్వాముల వద్ద పాలేరుగా పనిచేసారు. జీవితం నేర్పిన పాఠాలు, సమాజం నేర్పిన గుణపాఠాలు, స్వీయ అనుభవాలు ఆయన కవితా రచనకు నేపథ్యంగా నిలిచినవి. పూట్టుకతో వచ్చిన ప్రతిభకు గురువుల ఆశీస్సులు తోడైనవి.

కథాసామ్రాట్
- స్వయంకృషితో పద్యాన్ని సాధనచేసి, "కందం" లోని అందాలను గ్రహించారు. 1965 ప్రాంతంలో ఆయన యువకులకు, విద్యార్థులకు పౌరాణిక, జానపదగాధలను, ఇప్పటి బుల్లితెర లెక్కల ప్రకారం, వందలకొద్దీ ధారవాహికలుగా చెప్పి, "కథాసామ్రాట్" బిరుదును అందుకున్నారు. వ్యవసాయం చేయడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించేవారు.
వేయి కందపద్యముల శోభ
- చదువు పెద్దగా లేకున్నా, సమాజాన్ని లోతుగా చదివినారు. విప్లవాలు, ఉద్యమాలగురించి పెద్దగా తెలియకున్నా, శ్రీశ్రీ లాంటి కవులస్ఫూర్తి వీరి రచనలలో కనిపిస్తుంది. పదం కదుపుతూ పద్యానికి మరింత వన్నె చేకూర్చుచున్నారు. పద్యం వ్రాయడమే గాకుండా, ప్రతి పద్యాన్నీ కంఠతా చెప్పగల ధారణ ఆయన స్వంతం. వివిధ శతకాలు, కవితలు రచించిన నాగేశ్వరరావు, తాజాగా వేయి కందపద్యములతో, "సుజనా శతకం" ప్రచురించారు. తాజాగా ఇంకొల్లులో సాహితీవేత్తలు, కవులు అభిమానుల మధ్య శతకాన్ని ఆవిష్కరించారు.
పురస్కార పథం
- వీరు ఇప్పటివరకు 5,000 పద్యాలు రచించారు. ఆయన స్తోమత సహకరించని తరుణాన, మాతృమూర్తి, మధురసూక్తులు, సుజనాశతకం మాత్రమే ప్రచురణకు నోచుకున్నవి. తల్లిదండ్రులు, హర్షరసాబ్ది, అంతర్మథనం, ఒకరికొకరు కావ్యాలు, అప్పరాయ, వాసవీ, ఇంకొల్లు శివశతకాలు, ధనవంతుడు (ఏకపాత్ర), సత్యాగ్నిజ్వాలలు (ఖండకావ్యం), నక్షత్రమాలౌ (ఏడు), హైందవ, క్రైస్తవ భక్తిగీతాలు, కవితలు రచించి పలువురు మన్ననలను పొందినారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఆంధ్రపద్యకవితా సదస్సు, ఆచార్యరంగా కిసాన్ సంస్థ, కృష్ణదెవరాయ సాంస్కృతిక సేవా సమితి, కవన వేదిక, జాషువా సాంస్కృతిక సేవాసమితి తదితర సంస్థలు వీరికి పురస్కారాలు అందజేసినవి.
పద్యం గురించి వీరి అభిప్రాయం
- సాహిత్యం కలకాలం సజీవంగా ఉండాలి. పద్యం ప్రజలలోకి చొచ్చుకు పోవాలంటే, కవులకు సామాజిక సృహ అవసరం. ఆధునిక కవిత్వానికి పద్యం పనికి రాదనుకునేవారికి, "సుజనా శతకం" చక్కటి సమాధానం. వచనకవులు, పద్యాన్ని వ్యతిరేకించేకంటే, అర్ధం చేసుకొని ఆదరించాలని వీరి అభిప్రాయం.

మూలాలు

[మార్చు]

[ఈనాడు ప్రకాశం; 2014, సెప్టెంబరు-30; 9వపేజీ]