Jump to content

బొబ్బిలి రాజా

వికీపీడియా నుండి
బొబ్బిలి రాజా
దర్శకత్వంబి.గోపాల్
రచనపరుచూరి సోదరులు
స్క్రీన్ ప్లేబి.గోపాల్
కథపరుచూరి సోదరులు
నిర్మాతడి. సురేష్ బాబు (నిర్మాత), డి.రామానాయుడు (సమర్పణ)
తారాగణంవెంకటేష్,
దివ్యభారతి
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుకె. ఎ. మార్తాండ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 14, 1990 (1990-09-14)
భాషతెలుగు

బొబ్బిలి రాజా 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, దివ్యభారతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 1990 సెప్టెంబరు 14లో విడుదల అయింది.[1] దివ్యభారతి తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా డి. రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించి వెంకటేష్ కు మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

సుందరయ్య ఒక ప్రజాసేవకుడు. వాళ్ళ ఎదురింట్లో ఉండే రాజేశ్వరి దేవి కోటీశ్వరురాలు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని ఆమె కోరిక. సుందరయ్య ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబెడతాడు. సుందరయ్యకు ప్రజాబలం ఉండటం వల్ల ఆయన చేతిలో తాను ఓడిపోతానని భావించిన రాజేశ్వరి దేవి సుందరయ్య కుటుంబంపై చెడు ప్రచారం చేస్తుంది. సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి రాజేశ్వరి తమ్ముడు సూర్యం ప్రేమించుకుని ఉంటారు. ఫలితంగా రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని బజారుకీడుస్తుంది. ఈ విషయం తెలిసిన సూర్యం, అహోబలరావుల మధ్య గొడవ జరిగి సూర్యం మేడ మీద నుంచి పడిపోయి మరణిస్తాడు. ఆ హత్యను సుందరయ్య, రాజ్యలక్ష్మి మీద వేసి వాళ్ళను జైలుకు పంపిస్తుంది రాజేశ్వరి దేవి. అక్కడ ఇన్‌స్పెక్టర్ రాజ్యలక్ష్మి మీద బలాత్కారానికి ప్రయత్నించడంతో అతన్ని హత్య చేసి తండ్రితో కలిసి అడవిలోకి పారిపోతుంది రాజ్యలక్ష్మి.

రాజ్యలక్ష్మి కొడుకు రాజా తన అమ్మ, తాతలతో కలిసి అడవిలో నివసిస్తూ ఉంటారు. రాణి మంత్రియైన రాజేశ్వరి దేవి కూతురు. స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళిన రాణికి రాజా గైడుగా వస్తాడు. మొదట్లో తగాదాలతో పరిచయమైన వారి స్నేహం ప్రేమగా మారుతుంది. తన తల్లిని అవమానించిన రాజేశ్వరి దేవి కూతురినే తాను ప్రేమించిందని తెలుసుకున్న రాజా తర్వాత ఏంచేశాడు, ప్రేయసీ ప్రియులు ఎలా ఒక్కటయ్యారు అన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

వెంకటేష్, బి. గోపాల్ కాంబినేషన్లో సినిమా తీయాలనుకున్న రామానాయుడు పరుచూరి సోదరులు ని కథ చెప్పమన్నాడు. పరుచూరి గోపాలకృష్ణ పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక కథ చెప్పాడు. ఒక కలెక్టరు కుటుంబం, వారికి మరో కుటుంబంతో గొడవ, కలెక్టరు కుటుంబంలోని అబ్బాయి, రెండో కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం ఇందులో ప్రధాన కథాంశం. ఇందులో అటవీ నేపథ్యం ఏమీ లేదు. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం ఈ కథకు అంగీకరించలేదు. తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమాకు కథను తీర్చి దిద్దారు. ఈ చిత్రంపై గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే విదేశీ చిత్ర ప్రభావం ఉంది. ఈ సినిమా స్క్రిప్టు దశలో ఉండగా రామానాయుడు తనయుడు సురేష్ బాబు వచ్చి దర్శకుడు బి. గోపాల్ కు ముందుగా యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మాత్రమే పేరుందని , ఇందులో ప్రేమ సన్నివేశాలు ఉండటం వల్ల వేరే దర్శకుడిని తీసుకుందామని ప్రతిపాదించాడు కానీ పరుచూరి బ్రదర్శ అందుకు ఒప్పుకోలేదు. తర్వాతి కాలంలో దర్శకుడిగా మారిన జయంత్ సి పరాన్జీ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు.

ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన రాజేశ్వరి దేవి పాత్రకు మొదటగా నటి శారదను అనుకున్నారు. కానీ అప్పటికే శారద అలాంటి పాత్రలు చాలా చేసి ఉండటంతో సురేశ్ బాబు సూచన మేరకు కొత్తదనం కోసం వాణిశ్రీని తీసుకున్నారు. కథానాయిక పాత్రకు కూడా మొదటగా రాధను అనుకున్నారు. కానీ గోపాలకృష్ణ కొత్త అమ్మాయిని తీసుకుందామని ప్రతిపాదించడంతో దివ్యభారతిని ఎంపిక చేశారు. అలా దివ్యభారతి తొలిసారిగా తెలుగు చిత్రపరిశ్రమలో ప్రవేశించింది.

చిత్రీకరణ

[మార్చు]

ఈ చిత్రంలో కనిపించే అటవీ ప్రాంతమంతా తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు సంబంధించింది. అక్కడ 40 రోజులకు పైగా చిత్రీకరణ జరిగింది. తొలిసారిగా కెమెరామెన్ బాధ్యతలు చేపట్టిన కె. రవీంద్రబాబు జంతువులను చిత్రీకరించడానికి బాగా కష్టపడ్డాడు. పతాక సన్నివేశాల్లో కదిలే రైల్లో పోరాటాలు చిత్రీకరించారు. ఒక్కో బోగీల్లో కొన్ని జంతువులను ఉంచి చిత్రీకరించారు.

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి.అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన చేశారు.

  • అయ్యో అయ్యో , గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • కన్యాకుమారి కనపడదా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • బలపం పట్టి బామ ఒళ్ళో, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఒద్దంటే వినడే , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • చెమ్మ చెక్క , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1990 వెంకటేష్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం - తెలుగు గెలుపు
ఇళయరాజా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం - తెలుగు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "'బొబ్బిలి రాజా' @ 30: ఈ విశేషాలు మీకు తెలుసా?". www.eenadu.net. Retrieved 2020-09-14.