Jump to content

బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్

వికీపీడియా నుండి

రోడియో బెన్ గా సుప్రసిద్ధుడైన బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్ ఒక యూదు దర్జీ. వ్రాంగ్లర్ జీన్స్ ని రూపొందించిన తొలి వ్యక్తి. ఇతను 1894 లో పోలండ్ లోని లోడ్జ్ లో జన్మించాడు.

బాల్యం నుండి వివాహం వరకు

[మార్చు]

చిన్నప్పటి నుండి బెన్ దర్జీ అయిన తన తండ్రి ఇజాక్ లిఖ్ టెన్ స్టైన్ విద్యని పుణికి పుచ్చుకొన్నాడు. చదువుకొనే వయసులోనే చేనేతలోనూ, ఇంజినీరింగ్ లోనూ మర్మాలను అవపోసన పట్టాడు. తండ్రి చూపు దెబ్బ తినడంతో పెద్ద కుమారుడైన బెన్ కుటుంబ భారాన్ని తన భుజాల పై వేసుకొన్నాడు. బెన్ రోజాను పెళ్ళి చేసుకొనే సమయానికి చాలా మార్పులు జరిగిపోయాయి. కోల్పోయిన స్వతంత్ర్యాన్ని పోలండ్ తిరిగి సంపాదించుకొన్నది. లోడ్జ్ క్జార్ ల పరిపాలన నుండి విముక్తి పొందినది.

అమెరికా బయలుదేరిన బెన్

[మార్చు]

బెన్ తన తల్లిదండ్రులను కోల్పోయేనాటికి యూదుల జీవితం దుర్భరమైనది. జర్మనీ నుండి యూదుల వివక్ష పై వచ్చే వార్తలు భరింపరానివిగా ఉండేవి. దీంతో బెన్ బంధువులు కొంతమంది పాలెస్టీనా కి మరికొంత మంది అమెరికాకి వలస వెళ్ళారు. తన దర్జీకొట్టుని అమ్మేసి అప్పులని తీర్చేసి, క్రొత్తగా పెళ్ళైన తన కుమారుడికి కొంత ఆస్తిని వ్రాసిచ్చి, తన వస్తువులతో బాటు ఒక కుట్టు మిషను తీసుకొని అమెరికా బయలుదేరాడు.

మొట్ట మొదటి డెనిం వస్త్రాలు

[మార్చు]

తన 43వ సంవత్సరంలో, 1937 లో బెర్నార్డ్ మొదటి సారిగా అమెరికా నేలని తాకాడు. తనకి గానీ తన కుటుంబానికి గానీ ఆంగ్లం అసలు తెలియదు. మన్ హట్టన్ లో బెన్ కుటుంబం నివాసముండేది. అమెరికాకి తన ప్రయాణంలో సూట్ కేసులతో బాటు కుట్టు మిషనులు ఎవరి దగ్గర ఉన్నవని గమనించాడు బెన్. ఫిలడెల్ఫియా లో దర్జీలకు మంచి గిరాకీ ఉన్నదని తెలుసుకొని అక్కడకు మకాం మార్చాడు. తండ్రి మరణించిన తర్వాత సిట్జర్ ల్యాండ్ నుండి తెప్పించిన బెర్నీనా అను కుట్టు మిషను తో ట్రౌజర్లు, షర్టులు, కోటులను కుట్టేవాడు. రోడియో రోడ్ షో కు కౌబాయ్ లకు తీసుకురావలసిన దుస్తుల కారు ప్రమాదానికి గురయ్యి తగులబడి పోవటంతో ఒక వ్యక్తి వచ్చి బెన్ ని రంగులమయంగా ఉండే గుడ్డలు కావాలని అడిగాడు. చిన్నప్పటి నుండి కౌబాయ్ లు అంటే ఇష్టం ఉన్న బెన్ 10 డెనిం షర్టులని తయారు చేసి ఒక్కరోజులో ఇచ్చేస్తానని వచ్చీ రాని ఇంగ్లీషులో మాటిస్తాడు.

చిన్నప్పుడు తను చదివిన కౌబాయ్ నవలల ఆధారంగా వారి అభిరుచులుకు అనుగుణంగా రాత్రంతా కుట్టిన షర్టుల ను చూసి ఆ వ్యక్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే బుల్ ఫైటింగ్ (రోడియో) లలో మామూల గుండీ (బొత్తా)లు సకాలంలో తెరుచుకోకపోవటం కౌబాయ్ ప్రాణాలకే ప్రమాదం తెచ్చిన ఘటనల దృష్ట్యా వాటి స్థానే 'స్నాప్ ఫాస్ట్నర్' (నొక్కుడు గుండీలు) లని వాడమని సలహా ఇస్తాడు. ఆ వ్యక్తి బెన్ ని తన స్నేహితులకి పరిచయం చేయటం, వారు తమకి కూడా బెన్ ని దుస్తులు కుట్టమని ఇవ్వటం, వ్యాపారం అభివృద్ధి కోసం తను కన్సాస్ నగరానికి వెళ్ళటం జరిగాయి. ఇప్పుడిక బెన్ వద్దకు కొలొరాడో, టెక్సాస్, క్యాలిఫోర్నియా నుండి వచ్చి దుస్తులు కుట్టించుకొనేవారు. సంగీతకారులు, జానపద గాయకులు, సైన్యాధికారులు, నటుల వద్ద కూడా బెన్ పని చేస్తూ ఉండేవాడు.

రోడియో క్రీడాకారుల కోసం ఉద్భవించిన వ్రాంగ్లర్ 13 MZW జీన్స్

[మార్చు]

దూడలని తరిమి బంధించటం, పొగరుబోతు గుర్రాలని నియంత్రించగలగటం, ఎద్దుల పైకి ఎక్కీ స్వారీ చేయగలగటం రోడియోలో భాగం కావటం మూలాన ఇవి చేసే వ్యక్తుల బట్టలు చూడటానికి ఆకర్షణీయంగానే కాకుండా సౌకర్యంగా ఉంటూ శరీర కదలికను అడ్డుకోకుండా కూడా ఉండాలి. కౌబాయ్ లతో బెన్ కున్న పరిచయం వారి దుస్తులను రూపొందించటంలో అనుభవాన్ని గమనించి బ్లూ బెల్ కంపెనీ అతనికి దర్జీగా అవకాశం ఇచ్చింది.

13 మార్లు జీన్స్ ఆకృతిని కౌబాయ్ లకి అనుగుణంగా మార్చి ఐదు జేబులు, స్ట్రెయిట్ ట్రౌజర్ లెగ్స్, గడియారానికి ఊహించని చోట జేబు ని రూపొందించి దానికి 13 MZW (13 tries, man’s western zipper) ట్రౌజర్లని తయారు చేశాడు. బొత్తాలని కాకుండా జిప్ ని ప్రయోగించిన మొట్టమొదటి ట్రౌజర్లు అవి. బ్లూ బెల్ కంపెనీ సంప్రదింపుల తర్వాత, వ్రాంగ్లర్ అనునది కౌబాయ్ కి పర్యాయపదం కావటంతో ఆ ట్రౌజర్లని అదే పేరుతో పిలిచేవారు.

రోడియో బెన్ 1979 లో కన్ను మూశాడు.

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]