బి. వి. ఆర్. చారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జననంతెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధిచిత్రకారులు, శిల్పి

బి.వి.ఆర్‌. ప్రముఖ శిల్పి, చిత్రకారుడు. తెలంగాణ తల్లి రూపకర్త. ఎన్నెన్నో కళా శిబిరాల్లో, ప్రదర్శనల్లో పాల్గొంటూ తన ముద్రవేసిన బివిఆర్‌ చారి రూపకల్పనచేసిన చిత్రాలను శిల్పాలను ఎందరో కళా హృదయులు సేకరించారు. ఇప్పటికదాకా వందల సంఖ్యలో చిత్రాలు గీసిన ఈ సృజనాత్మకశీలి సుమారు రెండువందల శిల్పాలను మలిచాడు.

జననం, బాల్యం, విద్యాభాసం

[మార్చు]

ప్రవృత్తిరీత్యానే కాకుండా వృత్తిరీత్యా దేవతల విగ్రహాలు చెక్కే కుటుంబంలో స్వాతంత్ర్య సమరయోధుడు రాజలింగం, ప్రమీల దంపతులకు పాత ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌లో పుట్టారు, పెరిగారు.

తండ్రి ఆర్‌ఎంపీ డాక్టర్‌ కావడంవల్ల మేనమామ ఊరు వారికోసం చేసే వీధి గణపతి విగ్రహాల కోసం చెరువులోని బంకమట్టి తెచ్చి పిసికినప్పుడు, అతనుతోకలిసి తన ఐదారేండ్ల ప్రాయంలోనే మట్టి పిసికి, బొమ్మలు చేయడం అభ్యాసం చేశాడు. ఐదారో తరగతి చదివే నాటికి అతను అన్నలు చేసే లోహ శిల్పాల మర్మాలు గ్రహించాడు. చిన్నచిన్న దేవతా విగ్రహాలు చేయడం ప్రారంభించాడు. పదో తరగతిలోకి వచ్చాక అతను తీర్చిదిద్దిన ‘సరస్వతి’ విగ్రహానికి జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు.

జవహర్‌లాల్‌ నెహ్రూ వాస్తుశిల్పం, లలితకళల విశ్వవిద్యాలయంలో చేరి రెండేండ్ల ఎం.ఎఫ్‌.ఏ. పూర్తి చేశారు. సాంకేతిక విద్యాశాఖనుంచి డ్రాయింగ్‌లోనూ ఉపాధ్యాయకోర్సు పూర్తి చేశాడు.

శిల్పిగా ప్రస్థానం

[మార్చు]
ఒకవంక చదువుకుంటూ, మరోవంక బుల్లి విగ్రహాలు తయారుచేస్తూ, చిత్రాలు గీస్తూ తనలోని సృజనను వెల్లడిస్తున్న తరుణంలో బి.వి.ఆర్‌. చారిని, జీవశాస్త్రం బోధించే కట్టా నాగచారి ఎంతగానో ప్రోత్సహించాడు. అత్యంత సుప్రసిద్ధ శిల్పి కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన వడ్లూరి బ్రహ్మయ్యచారి, ఒక ఆలయంకోసం నిర్మల్‌లో విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. మూర్తుల చెక్కడంలో ముక్కలైపడిన అద్భుత శిలలను సేకరించి బివిఆర్‌ చారి బుల్లిబుల్లి విగ్రహాలు రూపొందించాడు. ఒక అడుగు లేదా అంతకు తక్కువ ప్రమాణంతో చేసిన శిల్పాలను అతను బ్రహ్మయ్యచారికి చూపిస్తే, చిన్నచిన్న సవరణలు, మార్పులు చేసేవాడు. అట్లా ఆ ప్రముఖ శిల్పి ప్రభావంతో బివిఆర్‌ చారి వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, గణపతి, సరస్వతి, బుద్ధుడు, లక్ష్మి, పార్వతివంటి ఎందరో దేవతల శిల్పాలు మలిచాడు. చిత్రలేఖనంలోనూ కృషి కొనసాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రీడిగ్రీ కోర్సు తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సీటుకోసం వస్తే, శిల్ప-చిత్రలేఖనం ఎంట్రెన్స్‌లో రెండింటిలో సీట్లు వచ్చాయి. ఏదో ఒకటే చదవాలి కాబట్టి శిల్పంలో మొదటి బ్యాచ్‌లో నాలుగేండ్ల బిఎఫ్‌ఏలో చేరి పూర్తి చేశాడు. అక్కడ దురుగడ్డ రామాచారి నేతృత్వంలో శిల్పంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు.

ఉద్యోగం

[మార్చు]

జీవనయానం కోసం హైదరాబాద్‌ నగరంలో ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులకు చిత్ర శిల్పకళ నేర్పారు. ఒక ప్రైవేటు కంపెనీలో చేరి రెండు ఆయతనాల యానిమేషన్‌ చెప్పారు.

ప్రస్తుతం అతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్ప-చిత్రలేఖనం శాఖలో అకాడమిక్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పలు అనాథాశ్రమాలలో, ఎన్జీవోలు, జాతీయ, అంతర్జాతీయ పాఠశాలల్లో చిత్రలేఖనం వర్క్‌షాప్‌, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు. పేద విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడు.

తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన

[మార్చు]

తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనకోసం కేసీఆర్‌ కలలుకంటున్న కాలంలో-సుప్రసిద్ధ శిల్పులెందరినో తన కార్యాలయానికి పిలిపించి చర్చిస్తున్న దశలో ఒకరోజు బి.వి.ఆర్‌. చారి వారి వద్దకు వెళ్ళారు. అప్పటికే చారి రూపొందించిన శిల్పం గురించి తెలుసుకుని ఉన్నందున, ఆ విగ్రహానికి చేయవలసిన మార్పుచేర్పులగురించి చర్చిస్తూ తల్లి ముఖం ప్రసన్నంగా, నిర్మలంగా ఉండాలన్నారు. మొత్తంమ్మీద దైవత్వం విగ్రహంలో ఉట్టిపడాలనీ, ఎడమ చేతిలో తంగెడుపూలు, గునుగుతో పేర్చిన బతుకమ్మ, కుడిచేతిలో మొక్కజొన్న, జొన్నకంకి ఉంటే తెలంగాణకు సంకేతం కాగలవన్నారు. వారు చేసిన సూచనలు తు.చ. తప్పకుండా పాటించి కిరీటంలో కోహినూర్‌ వజ్రం అలంకరించారు. పోచంపల్లికోక కట్టారు. మెడలో కంటె, పెద్దహారం, మరో ఆభరణం పెట్టారు. కాళ్ళకు కడియాలు, పట్టా గొలుసులు, వేళ్ళకు మట్టెలు, చేతికి కంకణాలు తొడిగారు. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో ఇవ్వాళ్ళ మన కన్నుల వెలుగులు నింపుతున్న తెలంగాణ తల్లికి తుదిరూపునిచ్చాడు బి.వి.ఆర్‌. చారి.

ప్రత్యేక శిల్ప, చిత్ర రూపకల్పన

[మార్చు]

సమయం చిక్కించుకుని త్యాగయ్యగానం చేస్తున్న తీరులో, అన్నమయ్య కూర్చున్న భంగిమలో ఫైబర్‌ శిల్పాలు మలిచాడు. సాధారణంగా అన్నమయ్య ఎప్పుడూ నిలుచునే ఉంటాడు. కానీ బివిఆర్‌ చారి సావధానంగా కూర్చున్న అన్నమయ్యను రూపకల్పన చేశాడు. అట్లాగే పాల్కురికి సోమనకు అన్ని బొమ్మలలో గడ్డం చూస్తాం. కానీ ఈయన పరిశోధనచేసి గడ్డంలేని సోమన్నను, మెడలో లింగంతో వేశాడు. ధ్యాన బుద్ధుణ్ణి చెక్కాడు. తెలంగాణ మహిళలను టెర్రకోటలో తీర్చిదిద్దాడు. ఈ మహిళలకు ఆభరణాలు, అలంకరించినతీరు, చెవుల రంధ్రాలు, వారిలో తొంగిచూసే వృద్ధాప్యం ఆ శిల్పాల్లో ద్యోతకమవుతుంది. ఇవేకాకుండా దారు, లోహ, మృణ్మయ, శిల, పేపర్‌పల్ఫ్‌, సుధాశిల్పం (సిమెంట్‌), పాత ఇనుప సామానుతో చూడచక్కని శిల్పాలు చెక్కడంలో చారిది ఒక ప్రత్యేక బాణి. అట్లాగే ఏ దృశ్యాన్నైనా నీటి రంగులో, ఆక్రిలిక్‌తో, క్రేయాన్స్‌తో, పెన్సిల్‌తో గీయడంలో చారి సాధన చేశాడు.

పాఠ్య పుస్తక చిత్రాల రూపకల్పన

[మార్చు]
4, 5, 8, 9 తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాలకు బొమ్మలు వేసినందుకు బివిఆర్‌ చారిని విద్యాశాఖమంత్రి సత్కరించారు. అంతకుముందు 2012లోనే ఈయన 5, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో పలు బొమ్మలు వేశాడు. తెలంగాణ ప్రముఖులు, కవులు, పండుగలు, జీవనవికాసం ప్రతిబింబించే ముఖ చిత్రాలు సుమారు వంద పుస్తకాలకు ఈయన వేశాడు. భారతదేశంలో, అరబ్బు దేశాల్లో బోధించే ప్రథమ్‌ ముంబై విద్యా ట్రస్టు వారి ఐదు పాఠ్యపుస్తకాలకు ఈయన బొమ్మలు వేశాడు.

పాల్గొన్న ప్రధాన కార్యక్రమాలు

[మార్చు]

‘సహజ ప్రకృతి శిల్పి’ బిరుదును ప్రీ ఆడిటింగ్‌ సంస్థ 2011న అందజేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1999లో శిల్పంలో నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందారు. 2013లో 2557 బుద్ధ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ సమన్వయించి, అందులో పాల్గొన్నాడు. స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 2013లో నిర్వహించిన డోక్రా శిల్ప శిబిరంలో పాల్గొన్నాడు. 2015లో సంగారెడ్డి జైళ్ళశాఖ నిర్వహించిన కళా శిబిరంలో పాల్గొని బొమ్మ వేశాడు. సచ్చిదానంద యోగా మిషన్‌ ఏర్పాటు చేసిన జీవన్‌ జాగరణ్‌ శిబిరం 2011లో డ్రాయింగ్‌-శిల్ప ఇన్‌స్ట్రక్టర్‌గా పాల్గొన్నాడు. స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 2014లో నిర్వహించి ‘కొత్త పండుగ’ ప్రదర్శనలో పాల్గొన్నాడు. అక్కడే 2013లో ‘బుద్ధుని పరంపరపై ఏర్పాటు చేసిన సామూహిక కళా ప్రదర్శనలో పాల్గొన్నాడు. పర్యాటకశాఖ శిల్పారామంలో నిర్వహించిన జీవవైవిధ్య జాతీయ శిల్ప వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. కళల బతుకమ్మపై బిఆర్‌ అంబేద్కర్‌ కాలేజీలో జరిగిన శిల్ప శిబిరంలో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొని గౌతమబుద్ధ జాతక కథలు ఫెర్రో సిమెంట్‌తో రూపుకట్టారు. ప్రస్తుతం ఇవి నాగార్జునకొండ మ్యూజియంలో ఉన్నాయి.

పొందిన సన్మానాలు, పురస్కారాలు

[మార్చు]

ఈ నేపథ్యంలో అతను రూపులుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2015 ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ప్రదానం చేశారు. ఈ మధ్య ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలోని తరతరాల తెలుగు మ్యూజియంలో అలంకరించడానికి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఈయన రూపొందించారు. ఈ విగ్రహాన్ని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అతనును సత్కరించారు. విశ్వబ్రహ్మ పీఠం 41వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని 2016లో సన్మానించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2015లో ‘తానా పురస్కారం’ అందజేసింది. 2014లో పి.వి. నరసింహారావు 96వ జయంతి సందర్భంగా కళానిలయంవారు ‘పి.వి. నరసింహారావు పురస్కారం’ ప్రదానం చేశారు. 2013లో మచస థియేటర్‌ ఉగాది పురస్కారం అందించారు. 2012లో విశ్వకర్మకవులు కళాకారుల వేదిక విశిష్ట పురస్కార ప్రదానం చేసింది. అదే యేడాది విశ్వభారతి ఉగాది పురస్కారమిచ్చింది. 2011లో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ తోట సత్యమ్మ అవార్డు గెలుచుకున్నారు. తిరుపతి కళాక్షేత్ర ‘కళాక్షేత్ర అవార్డు’ ఇచ్చింది. 2010లో న్యూఢిల్లీలో సీఎంఎస్‌ వాతావరణ అవార్డు ప్రదానం చేసింది.

మూలాలు

[మార్చు]

● తెలంగాణ మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం [1]