బి.శశికుమార్
బి.శశికుమార్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1949 ఏప్రిల్ 27 |
మూలం | భారతీయుడు |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వాయులీన విద్వాంసుడు, సంగీతకారుడు |
వాయిద్యాలు | వయోలిన్ |
క్రియాశీల కాలం | 1967 నుండి ప్రస్తుతం |
వెబ్‌సైటు | www.bsasikumar.in |
బి.శశికుమార్ కేరళ రాష్ట్రానికి కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1949, ఏప్రిల్ 24వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరువల్ల గ్రామంలో ఎం.కె.భాస్కర పణికర్, సరోజిని అమ్మ దంపతులకు జన్మించాడు.
ఇతని తండ్రి ఎం.కె.భాస్కర పణికర్ నాదస్వర విద్వాంసుడు. ఇతడు మొదట తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత తంజావూరులోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో చేరి చాలకూడి ఎన్.ఎస్.నారాయణస్వామి శిష్యరికంలో అభ్యసించి గానభూషణం, గానప్రవీణ పట్టాలు సంపాదించాడు.
ఇతడు 1967లో తాను చదివిన స్వాతి తిరునాళ్ సంగీత కళాశలలోనే లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత 1971లో ఇతడు ఆకాశవాణి తంజవూరు కేంద్రంలో నిలయ విద్వాంసునిగా చేరాడు.
ఇతడు చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, డి.కె.జయరామన్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.డి.రామనాథన్, కె.వి.నారాయణస్వామి, అలత్తూర్ బ్రదర్స్, శీర్కాళి గోవిందరాజన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.వి.శంకరనారాయణన్, టి.ఎన్.శేషగోపాలన్, టి.కె.గోవిందరావు, కె. జె. ఏసుదాసు, ఎన్.రమణి, సుందరం బాలచందర్, చిట్టిబాబు మొదలైన అగ్రశ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలకు వయోలిన్ సహకారం అందించాడు. మద్రాసు, ఢిల్లీలలో జరిగిన పండిట్ జస్రాజ్, మంగళంపల్లి బాలమురళీకృష్ణల జుగల్బందీ కార్యక్రమానికి కూడా ఇతడు వయోలిన్ సహకారం అందించాడు.
సేవలు
[మార్చు]ఇతడు ఏ గ్రేడు కళాకారుడిగా ఆకాశవాణిలో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. "నాదోపాసన", "సప్తస్వరగళిల్", "లయిచ మహానుభావన్", "గణేశ ప్రభావం", "స్వాతి ప్రణామ్", "భావయామి రఘురామం", "నవరత్న కీర్తి మహిమ" వంటి శీర్షికలతో ఇతడు ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలను నిర్వహించాడు. 2001లో ఆధ్యాత్మ రామాయణం కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు. ఇతని "గురుసాక్షాత్ పరబ్రహ్మ","మాధవమానవం", "కావేరి", "సంఘగానం", "కర్ణకి" మొదలైన సంగీత కార్యక్రమాలు జాతీయస్థాయిలో ఆకాశవాణి వార్షిక అవార్డులను గెలుచుకున్నాయి. ఇతడు ఇంకా ఆకాశవాణి కోసం కొన్ని హాస్యనాటికలను రచించి దర్శకత్వం వహించాడు. లలిత గీతాలకు సంగీతం సమకూర్చాడు. యువ సంగీత కళాకారులతో కేవలం తంత్రీ వాద్యాలతో "స్ట్రింగ్" అనే వాద్యసమ్మేళనాన్ని నిర్వహించాడు. అనేక భక్తి గీతాలను ఇతడు సి.డి.ల రూపంలో విడుదల చేశాడు. ఇతడు "వాద్యతరంగం" పేరుతో కర్ణాటక సంగీత సమ్మేళన కార్యక్రమాలను అనేక ప్రదేశాలలో నిర్వహించాడు.
ఇతడు స్వరకర్తగా 100కు పైగా కృతులను "చంద్రపుత్ర" పేరుతో స్వరపరిచాడు. వీటిలో మలయాళ, తమిళ, సంస్కృత కీర్తనలు, పల్లవులు ఉన్నాయి. ఇతడు "చతురంగం" అనే క్రొత్త తాళాన్ని ప్రవేశపెట్టాడు.
ఇతడు సంగీత గురువుగా అనేక మందిని సంగీత ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతని శిష్యులలో బాలభాస్కర్, జి.వేణుగోపాల్, కవలం శ్రీకుమార్, కల్లార గోపన్, విధు ప్రతాప్, అట్టుకల్ బాలసుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, సౌందరరాజన్, మావెలికర సతీష్ చంద్రన్ మొదలైన వారున్నారు.
గుర్తింపులు, అవార్డులు
[మార్చు]- సంగీత నాటక అకాడమీ అవార్డు - 2008
- కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ - 2002
- సింధూరం కల్చరల్ అవార్డు -1999
- త్రిస్సుర్ యువ సాంస్కృతిక కేంద్రం అవార్డు - 1997
- భాషా సాహిత్య పరిషత్ అవార్డు - 1990
- వయోలిన్ సమ్రాట్-2011
మూలాలు
[మార్చు]- TM Dance Academy
- Bhasabharathi Archived 2008-07-25 at the Wayback Machine
బయటి లింకులు
[మార్చు]- Interview on Friday review Archived 2007-11-02 at the Wayback Machine - The Hindu
- Concert review[permanent dead link] - The Hindu
- Sangeet Natak Academy Award announcement Archived 2007-04-18 at the Wayback Machine
- 1974 program of Madras Music Academy