Jump to content

బాలాంత్రపు రజనీకాంతరావు

వికీపీడియా నుండి
బాలాంత్రపు రజనీకాంతరావు
బాలాంత్రపు రజనీకాంతరావు
జననంబాలాంత్రపు రజనీకాంతరావు
(1920-01-29)1920 జనవరి 29
నిడదవోలు
మరణం2018 ఏప్రిల్ 22(2018-04-22) (వయసు 98)
ఇతర పేర్లుబాలాంత్రపు రజనీకాంతరావు
ఉద్యోగంఆకాశవాణి
ప్రసిద్ధికవి, పండితుడు, సాహితీ వేత్త
మతంహిందూ మతం
తండ్రికవిరాజహంస బాలాంత్రపు వేంకటరావు
తల్లివెంకటరమణమ్మ

బాలాంత్రపు రజనీకాంతరావు (1920 జనవరి 29 - 2018 ఏప్రిల్ 22) బహుముఖ ప్రఙ్ఞాశాలి. వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రజనీకాంతరావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించాడు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకడైన బాలాంత్రపు వెంకటరావు అతని తండ్రి. బాలాంత్రపు వెంకటరావు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపకుడు, నిర్వాహకుడు. తల్లి వెంకటరమణమ్మ సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. రజనీకాంతరావు అన్న బాలాంత్రపు నళినీకాంతరావు రచయిత, పాత్రికేయుడు.

అతని బాల్యం పిఠాపురంలో గడిచింది. ఇంటిలో తల్లిదండ్రులు సాహిత్యపరులు కావడంతో సాహితీ వాతావరణం నెలకొంది. దానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో కళకళలాడుతూండేది. సంస్థానానికి ముఖ్యకేంద్రం కావడం, సంస్థానంలో సాహిత్య పోషణ ఉండడం చేతను, పిఠాపురం పానుగంటి లక్ష్మీనరసింహారావు, వేదుల రామకృష్ణశాస్త్రి, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, పెండ్యాల సత్యభామ వంటి పండితులు, కవులు, కళాకారులకు నివాసం కావడం చేతనూ పిఠాపురం సంగీత, సాహిత్య, నృత్య రంగాల్లో విలసిల్లుతూ ఉండేది.[1] ఈ వాతావరణం రజనీ ఎదుగుదలపై ప్రభావం చూపింది. బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తి సంగీతం, మేనమామ దుగ్గిరాల పళ్ళంరాజు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. కాకినాడలో పి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. రజని 1937-1940 మధ్య కాలంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) లో ఎం.ఏ. తెలుగు చదివాడు. పింగళి లక్ష్మీకాంతం అతనికి గురువు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆత్మీయ మిత్రుడు.[2]

ఉద్యోగ ప్రస్థానం

[మార్చు]
విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంత రావు, భానుమతీ రామకృష్ణ పాడిన "పసిడి మెరుంగుల తళతళలు" ప్రసారం చేశారు.[3]

1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరాడు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళాడు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్వీసులో చేరాడు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళాడు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యాడు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశాడు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించాడు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశాడు. ఉద్యోగ ప్రస్థానంలో రజనీకాంతరావు సాధించిన వాటిలో కొన్ని:

  1. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి నెహ్రూ అవర్ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం తర్వాత, రజని రచించి స్వరపరిచిన మాదీ స్వతంత్రదేశం అనే గీతం ప్రసారమయింది.
  2. 1972లో రజనీ రచించి స్వరపరిచిన "కొండ నుండి కడలి దాకా" రూపకం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీనికి జపాన్ వారి "నిప్పాన్ హోసో క్యొకాయ్" బహుమతి లభించింది
  3. కృష్ణశాస్త్రిగారి 'అతిథిశాల' సంగీత రూపకానికి పర్షియన్ సంగీతం ఆధారంగా కూర్చిన సంగీతానికి చాల పేరు వచ్చింది.
  4. 1981లో మేఘసందేశ రూపకానికి బెంగుళూరులో ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది
  5. ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమం ప్రారంభించాడు
  6. భక్తిరంజని కార్యక్రమం ప్రారంభించాడు

లలిత సంగీతం

[మార్చు]

రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని దోహదం చేశాడు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించాడు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించాడు. ఇతర రచయితల గీతాలకు కూడా స్వరరచన చేశాడు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించాడు.

స్వరకర్తగా, గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలో గణుతి కెక్కాయి. స్వర్గసీమ, గృహప్రవేశం ఇత్యాది చిత్రాలకు పాడాడు.

రచనలు

[మార్చు]
  1. శతపత్ర సుందరి గీత సంపుటి. 200 పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది)
  2. విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. 1964లో ప్రచురణ
  3. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. (దీనికి 1958లో తెలుగు భాషా సమితి పోటీ బహుమతి లభించింది)
  4. తండ్రి రచించిన ఏకాంత సేవను ఆంగ్లంలో 'Alone with spouse divine' గా అనువాదం
  5. క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం 'Amourse of the Divine Cowherd' (కేంద్ర సాహిత్య అకాడమీవారికి)
  6. క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు (కేంద్ర సాహిత్య అకాడమీ వారికి) [4]
  7. 'రజనీ భావతరంగాలు' - ఆంధ్రప్రభలో శీర్షిక
  8. క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో)
  9. జేజిమామయ్య పాటలు
  10. మువ్వగోపాల పదావళి
  11. త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవితచరిత్రలు
  12. ఏటికి ఎదురీత (కవితలు)
  13. చతుర్భాణీ (4 సంస్కృత నాటకాలకి తెలుగు అనువాదం)
  14. ఆన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం

శతపత్రసుందరి

[మార్చు]

ఇది రజనీకాంతరావు రచించిన గేయసంపుటి. దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1954 ప్రచురించాడు.[5]

నృత్య/సంగీత రూపకాలు

[మార్చు]
  1. చండీదాసు
  2. మేఘసందేశం
  3. సంధ్యాదీపకళిక
  4. మధురానగరిగాథ
  5. సుభద్రార్జునీయం
  6. గ్రీష్మఋతువు
  7. శ్రీకృష్ణశ్శరణం మమ
  8. మేనకా విశ్వామిత్ర
  9. క్షీరసాగర మథనం (స్వరరచన)
  10. విప్రనారాయణ (స్వరరచన)
  11. కృష్ణశాస్త్రిగారి అతిథిశాల (ఉమర్ ఖయ్యూం) (స్వరరచన) - పర్షియన్ బాణీలో కూర్చిన సంగీతం. దీనికి చాలా పేరు వచ్చింది.
  12. దివ్యజ్యోతి (బుద్ధుడు)
  13. విశ్వవీణ (ఓర్ఫియస్)
  14. కళ్యాణశ్రీనివాసం
  15. నమోస్తుతే హరి

వాద్యబృంద

[మార్చు]
  1. ఆంధ్రి (కళ్యాణి, దేశవరాళి, దేవసాళగం రాగాలతో)
  2. విశ్వయానం (శబ్దచిత్రం) - విశ్వం పుట్టుక, పరిణామం గురించి
  3. సంగీత గంగోత్రి - భారతీయ సంగీతం పుట్టుక, పరిణామం గురించి
  4. కామదహనం

పురస్కారాలు/బిరుదులు

[మార్చు]
  1. ఠాగూర్ అకాడమీ రత్న - రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసింది.
  2. కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం 1981 లో బహుకరించిన గౌరవ డాక్టరేట్.
  3. కళారత్న అవార్డు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన పురస్కారం.
  4. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 1961. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికి.[6]
  5. ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి - అమెరికాలోని అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం.
  6. నాథ సుధార్ణవ - మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ
  7. పుంభావ సరస్వతి
  8. నవీన వాగ్గేయకార
  9. 2008లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

మరణం

[మార్చు]

కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడి, రజనీకాంతరావు 2018 ఏప్రిల్ 22 న మరణించాడు.[7][8]

ప్రభావాలు

[మార్చు]

1940ల నాటి తెలుగు కళారంగం పరిస్థితులకు అనుగుణంగా బాలాంత్రపు రజనీకాంతరావు కూడా బెంగాలీ సంగీతంతో ప్రభావితుడయ్యాడు. అయితే తనకున్న సంస్కార బలం వల్ల తెలుగు వారి సంగీత ఛాయలు లేని సంగీతం ఏదీ అతను చేయలేదని కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.[9]

అందించిన వారసత్వం

[మార్చు]

ఆలిండియా రేడియో లలిత సంగీత విభాగాన్ని అతను తన ప్రతిభతో సుసంపన్నం చేశాడు. రజనీ రచించి, స్వరపరిచిన అనేక కృతులు తెలుగు వారి సాంస్కృతిక, సంగీత రంగాల్లో నిలిచిపోయాయి. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సంగీతంలో లిరిసిజం రజనీ ప్రభావమేనన్నాడు. లలిత సంగీతానికి, తెలుగు సాహిత్యానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పి, దానికి రూపకల్పన చేసిన గొప్ప సంగీతకారులుగా ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరి రాజేశ్వరరావులతో పాటు రజనీకాంతరావు నిలుస్తాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. పరుచూరి, శ్రీనివాస్ (Jan 2001). "తెలుగు లలిత సంగీతంలో "రజనీ" గంధం". ఈమాట. Archived from the original on 2018-04-25. Retrieved 2018-04-25.
  2. "మూగబోయిన 'రజనీ' గానం". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2021-03-27. Retrieved 2021-03-27.
  3. తెలుగు సంగీతంలో రజనీ - పరుచూరి శ్రీనివాస్ - ఈమాట
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-11-01. Retrieved 2014-08-13.
  5. భారత డిజిటల్ లైబ్రరీలో శతపత్రసుందరి పుస్తక ప్రతి.
  6. "Accolades for an achiever". P. SURYA RAO. The Hindu. 10 May 2013. Retrieved 8 February 2016.
  7. సాక్షి (22 April 2018). "ప్రముఖ రచయిత కన్నుమూత". Archived from the original on 23 April 2018. Retrieved 23 April 2018.
  8. మనం న్యూస్ (22 April 2018). "బాలాంత్రపు రజనీకాంతరావు ఇకలేరు". Archived from the original on 23 April 2018. Retrieved 23 April 2018.
  9. 9.0 9.1 కొడవటిగంటి, రోహిణీ ప్రసాద్. "88 ఏళ్ళ యువకులు". ఈమాట. Retrieved 25 April 2018.