Jump to content

బాయిలరు నీటి చికిత్స

వికీపీడియా నుండి

బాయిలరు నీటి చికిత్స అనగా బాయిలరు లో స్టీము ఉత్పత్తికై వాడు నీటినుండీ కరగిన పదార్థాలను తొలగించు ప్రక్రియ. బాయిలరు నీటి చికిత్సను ఆగ్లంలో బాయిలరు వాటరు ట్రీట్మెంట్(boiler water treatment)అంటారు.బాయిలరు నుండి ఉత్పత్తి అగు స్టీము, ఉపయోగించిన ఇంధన ఉష్ణశక్తికి అనులోమానుపాతంలో ఉండాలంటే, అది బాయిలరు ఫీడ్ వాటరులోని కరిగిన పదార్థాల శాతాన్ని బట్టి వుండును. నాణ్యమైన నీటిని అందించినపుడే ఉష్ణశక్తి వృధా కాకుండా స్టీము ఉత్పత్తి అవును. కావున బాయిలరుకు పంపే నీటిలో తక్కువ పరిమాణంలో కరిగిన పదార్థాలు, ఇతర మలినాలు వుండేలా నీటిని చికిత్స/శుద్ధిచేసి చేసి బాయిల రుకు పంపాలి.

బాయిలరు నీటిలో కరిగివున్న పదార్థాల ప్రవర్తన -బాయిలరు పనితీరు పై ప్రభావం

[మార్చు]

బాయిలరుకు పంపే నీటిలోని కరిగిన ఘనపదార్థాలు మామూలు వాతావరణ వత్తిడిలో,నీటి అణువు లతో కలసిపోయి ప్రత్యేకంగా కనిపించవు.కాని బాయిలరులో (బాయిలరులోని వత్తిడి/పీడనం పెరిగే కొలది నీటి మరుగు / బాయిలింగు ఉష్ణోగ్రత పెరుగును)1Kg/cm2 ప్రెస్సరు వద్ద 102°C వద్ద స్టీముగా మారే నీరు 10Kg/cm2 వత్తిడి వద్ద 180°C స్టీముగా పరివర్తన చెందును.నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది మరి యు నీటిలో కరిగిన పదార్థాల ఘనపరిమాణం పెరిగే కొలది, కరిగివున్నపదార్థాల అణువులు ఒకదానికొకటి దగ్గరగా చేరి అవక్షేపంగా నీటిలో తేలియాడటం మొదలవ్వును.ఆ తరువాత తెల్లని అవక్షేపంగా వున్న కరిగిన పదార్థం క్రమంగా మరింత చిక్కబడి బాయిలరు ట్యూబుల్లో పేరుకు పోవును.[1] ఇలా ట్యూబులలో పేరుకు పోయిన పదార్థాన్ని ఇంగ్లీసులో స్కేల్(scale)అంటారు.తెలుగులో పొలుసుపొర అనవచ్చు.ఇలా బాయిలరు ట్యూ బుల ఉపరితలం మీద పేరుకు పోయిన స్కేల్ మందం పెరిగే కొలది ట్యూబుల నుండి ఉష్ణమార్పిడి వేగం తగ్గిపోవును. స్కేల్ కారక పదార్థాలు తక్కువ ఉష్ణవాహక, తక్కువ సంవాహక గుణాన్ని కలిగి వుండును. అందువలన స్కేల్ ట్యూబుల మీది స్కేల్ పొరల వలన బాయిలరులోని నీరు త్వరగా స్టీముగా మారదు. తత్ఫలితంగా ఫ్లూగ్యాస్ ఎక్కువ ఉష్ణోగ్రత తో చిమ్నికి/పొగ గొట్టం(stocking)కు వెళ్ళును.అంతేకాదు ఫైర్ ట్యూబు బాయిలర్లలో ఇలా ట్యూబు వెలుప లి ఉపరితలం మీద స్కేల్ దళసరిగా పేరుకు పోవడం వలన, ఫ్లూ గ్యాస్ ఉష్ణోగ్రత నీటికి అందక పోవడం వలన ఫైర్ ట్యూబులు వేడెక్కి, వ్యాకోచించి సాగి పోవడం వలన ట్యూబులో రంధ్రాలు /బెజ్జాలు ఏర్పడి స్టీము, వాటరు బయటకు వచ్చును. కొన్ని సందర్భాలలో ట్యూబులు పేలిపోవును. అందువలన బాయిలరును ఆపి వెయ్యాల్సి వస్తుంది. అలాగే వాటరు ట్యూబు బాయిలరు అయినచో ట్యూబుల లోపల స్కేల్ దళసరిగా పేరుకు పోవడం వలన ట్యూబులు వేడెక్కి కరిగి పోవును. అందు వలన బాయిలరుకు వాడు నీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీడ్ వాటరు అధిక ఉష్ణోగ్రత, పీడనంలో వున్న బాయిలరు షెల్ లో ప్రవేశించాక, ఫీడ్ వాటరులోని కరిగి వున్న పదార్థాలు, వాటి సాంద్రత పెరిగే కొలది నీటి నుండి పరమాణుమయ(particulate) ఘనపదార్థాలుగా వేరుపడును. కొన్ని స్పటిక రూపంగా వేరుపడగా, మరి కొన్ని నిరిష్ట రూపంలో కాకుండా బురుద వలే అనిర్దిష్ట రూపంలో బాయిలరు వాటరులో తెలియాడును. వీటి సాంద్రత పెరిగే కొలది ఇవి క్రమంగా బాయిలరు షెల్ అడుగు భాగాన, ట్యూబుల ఉపరితలంపై(ఫైర్ ట్యూబు బాయిలరు), లేదా ట్యూబుల్లో(వాటరు ట్యూబు బాయిలరు) పేరుకు పోవును. తరువాత వేడి ఫ్లూ వాయువుల వలన వేడిక్కి ఈ బురద వంటి అవక్షేప పదార్థాలు ట్యూబుల లోపల లేదా లోపల గోడల మీద గట్టిగా దళసరిగా పేరుకు పోవును.ఇలా గట్టిగా ట్యూబుల గోడల ఉపరితలం మీద పేరుకు పోయిన పదార్థాన్నే స్కేలు అందురు.

బాయిలరు నీటిలో స్కేలు/పొలుసులు ఏర్పడు కారకాలు

[మార్చు]

ముఖ్యంగా బాయిలరు ఫీడ్ వాటరులో వుండే కాల్సియం, మెగ్నీషియం మూలక కార్బోనేటులు,ఆక్సైడులు, నైట్రేటులు,క్లోరైడుల వలన ఫీడ్ వాటరు(బాయిలరుకు అందించు నీరు) కఠినత్వం పెరుగును. కాల్షియం, మెగ్నీషియం,బేరియం వంటి లవణాల వలన కఠినమైన లవణ పొరలు బాయిలరు ట్యూబుల వెలుపలి లేదా లోపలి ఉపరితలం మీద పేరుకు పోవును.[2] ఈ మూలక లవణాలు అధమ ఉష్ణవాహాకాలు కావడం వలన ఫ్లూగ్యాసేస్ ఉష్ణోగ్రత ట్యూబుల గుండా నీటికి చేరక పోవడం వలన నీరు నెమ్మదిగా వేడెక్కును.అధిక ఉష్ణోగ్రత కారణంగా బాయిలరు ట్యూబులు పాడైపోవును.

కాల్షియం,మాగ్నిషియంల కార్బోనేటులు నీటిలో కరిగి, క్షార ద్రావణాన్ని ఏర్పరచును. ఈ కార్బోనేటుల వల్ల నీటికి క్షార కఠినత్వం ఏర్పడును. అయితే ఇలాంటి కార్బో నేటులను కల్గిన నీటిని వేడిచేసినపుడు నీటిలోని కార్బోనేటులు వియోగం వలన కార్బన్ డయాక్సైడ్ విడుదల అయ్యి మెత్తని బురద వంటి పదార్థాలుగా ఏర్పడును. కార్బొనేటుల వలన నీటికి కల్గు కఠినత్వాన్ని తాత్కాలిక కఠినత్వం అంటారు. నీటిని వేడి చెయ్యడం వలన ఇంలాంటి తాత్కాలిక కఠినత్వాన్ని కల్గించిన కార్బోనేటులను వేరు చెయ్యవచ్చును. కాల్షియం, మాగ్నిషియంల సల్ఫేటు, క్లోరైడు, నైట్రైటులు బాయిలరు ఫీడ్ వాటరులో వున్నచొ, ఇవి రసాయన నికంగా తటస్థ గుణం కల్గినందున వీటిని క్షారయుతము కాని కఠినత్వకారకాలు అందురు[3]. బాయిలరు నీటికి శాశ్విత కఠినత్వాన్ని కల్గిస్తాయి. వీటి అవక్షేపం వలన ట్యూబుల మీద లేదా లోపల పేరుకున్న పొలుసులు/స్కేలును బాయిలరు నుండి సులభంగా తొలగించడం అసాధ్యం.కాల్షియం మాగ్నిషియంల సంయోగ పదార్థాలు (కాల్సియం, మాగ్నిషియంల సల్ఫేటు, క్లోరైడు, నైట్రైటు వంటి వాటిని ఆయా మూలకాల సంయోగ పదార్థాలు అందురు)నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది వాటి ద్రావణీయత తగ్గి పోవడం వలన,అధికవత్తిడి వద్ద నీరు వేడి చెంది స్టీముగా మారునపుడు ఈ సంయోగ పదార్థాల సాంద్రత లేదా గాఢత పెరిగి, తెల్లని లేదా బూడిదరంగు అవక్షేపాలుగా వేరు పడినీటిలో తెలియాడుచుండును.

బాయిలరు నీటిలోని సిలికా

[మార్చు]

బాయిలరు నీటిలో వుండు మలినాల్లో సిలికా ఒకటి.బాయిలరు ఫీడ్ వాటరులో సిలికా ఉన్నచో కఠినమైన సిలికా స్కేల్ ఏర్పడును.సిలికా కాల్సియం మెగ్నీషియం లవణాలతో కలిసి అతితక్కువ ఉష్ణవాహక /ప్రసారగుణమున్న కాల్సియం, మెగ్నీషియం సిలికేట్ సంయోగ పదార్థాలను ఏర్పరచును.అందువలన సిలికా మలినాలు లేని తక్కువ కరిగిన పదార్థాలలో తక్కువ కఠినత్వం కల్గించే రసాయన పదార్థాలను కలిగివున్న నీటిని మాత్రమే బాయిలరులో స్టీము ఉత్పత్తికి వాడాలి.

బాయిలరు నీటి చికిత్స

[మార్చు]

బాయిలరుకు ఫీడ్ చెయ్యు నీటిని రెండు రకాలుగా సంస్కరించి/ట్రీట్మెంట్ చేసి ఉపయోగిస్తారు.

  • 1.అంతర్గత/బాయిలరు లోపలి నీటి చికిత్స/ ట్రీట్మెంట్
  • 2.బాయిలరు వెలుపలనే బాయిలరు నీటి చికిత్స/ట్రీట్మెంట్

అంతర్గత/బాయిలరు లోపలి నీటి ట్రీట్మెంట్

[మార్చు]

ఈ విధానంలో బాయిలరులోపల వున్న నీటికి కొన్నిరకాల రసాయన పదార్థాలను చేర్చి బాయిలరులో కఠినమైన స్కేల్ ఏర్పడ కుండా నిరోధించేదరు. అంతే కాకుండా ఏర్పడిన స్కేల్ మృదువుగా వుండి నీటిలో తేలియాడుతూ బ్లోడౌన్ సమయంలో, ఈ బురద వంటి పదార్ధం నీటితో పాటు బయటకు పోవునట్లు ఈ రసాయనాలు సహాయ పడును.అంతే కాకుండా కొన్ని రసాయనాలు బాయిలరు నీటి pH ని 9.5-10.5 మధ్య వుండేలా చెయ్యును. కావున బాయిలరు నీటి అంతర్గత సంస్కరణ రసాయనాలు బాయిలరు నీటిలోని కరిగిన ఆక్సిజను తొలగించును, నీటి pHని తగిన రేంజిలో ఉంచును. ఏర్పడిన స్కేల్ మృదువుగా వుండి నీటిలో తేలి యాడుతూ వుం డునట్లు చేయును. అయితే ఈ రసాయనాలు ఫీడ్ వాటరు(అనగా బాయిలరుకు పంపే నీరు) తక్కువ పరిమాణంలో కఠినత్వం కల్గించే సంయోగ పదార్థాలను, కరిగిన పదార్థాలను కల్గి వుండి, pH 7.0 వుండినపుడు మాత్రమే పని చేయును.కావున బాయిలరు ఫీడ్ వాటరును మొదట తగు పద్ధతులలో సంస్కరించి/శుద్దీకరించి బాయిలరుకు పంపి, పిదప ఈ అంతర్గత రసాయానాలను వాడిన మంచి పలితం కన్పించును. ఎక్కువ కఠినత్వాన్ని కల్గించు కాల్సియం, మెగ్నీషియం సంయోగపదార్థాలను కల్గిన, ఎక్కువ పరిమాణంలో కరిగిన ఘనపదార్థాలను కలిగిన నీటిని, ఆమ్లగుణాన్ని, ఎక్కువ కరిగిన ఆక్సిజను కల్గిన నీటిని,సిలికా అధిక మొత్తంలో వున్న నీటిని, తప్పనిసరిగా బాయిలరుకు పంపే ముందు తగు విధంగా సంస్కరించిన/ చికిత్స చేసి, వాటి ని పూర్తిగా లేదా అవసరం మేరకు పాక్షికంగా తగ్గించిన తరువాత బాయిలరుకు పంపి, ఆపైన తగు మోతాదులో అంతర్గత వాటరు ట్రీట్మెంట్ రసాయానాలు వాడాలి.

ఉపయోగించిన నీటిని బట్టి(భూ ఉపరితల జలాలు,భూగర్బ జలాలు)వాటరు ట్రీట్మెంట్కు ఉపయోగించు రసాయనాలు మారుతాయి. వాటరు ట్రీట్మెంట్ కై సోడియం కార్బోనేట్, సోడియం అల్యుమినేట్, సోడియం పాస్ఫేట్, సోడియం సల్ఫేట్, సేంద్రియ, అసెంద్రీయ మూలక రసాయానాలు కూడా ఉపయోగిస్తారు.ఇలా వాటరు ట్రీట్మెంట్ రసాయనాలను వివిధ ఉత్పత్తి దారులు వివిధ బ్రాండ్ పేర్లతో మార్కెట్లో అమ్ముచున్నారు.

ఎక్సుటేర్నల్ వాటరు ట్రీట్మెంట్

[మార్చు]

ఎక్సుటేర్నల్ వాటరు ట్రీట్మెంట్ పద్దతిలో నీటిలో కరుగని (సస్పెండ్ ఘనపదార్థాలుగా తేలియాడు పదార్థాలు, బురద వంటి అవక్షేపాలు)కరిగిన(ప్రత్యేకంగా కాల్షియం, మెగ్నీషియం అయానులు,వీటి వలననే బాయిలరులో స్కేలు ఏర్పడును.) అలాగే నీటిలో కరిగిన ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను తొలగించెదరు. వాటరు ఎక్సుటేర్నల్ ట్రీట్మెంట్ పద్దతులు చాలా ఉన్నాయి.అవి అయాన్ ఎక్సెంజి విధానం, డిమినర లైజేసన్, రివర్సు ఆస్మాసిస్, డిఎరేసన్. పై పద్దతులలో నీటిని శుద్దికరించుటకు ముందు నీటిలో తేలియాడు, అవక్షేప బురద వంటి నీటిలో కరుగని ఘన పదార్థాలను, నీటికి రంగును కల్గించు పదార్థాలను వాటిని తొలగించాలి. లేనిచో ఇవి నీటిని సుజలీకరించు రెసిన్‌ను కలుషితం చెయ్యు అవకాశం వున్నది.

వర్షాకాలంలో నదులనుండి, కాలువలనుండి, చెరువుల నుండి వాడు నీటిలో సిలికా వుండి నీటిలోని కరుగని రంగు పదార్థాలను అధిక మొత్తంలో కరిగి వుండును.ఇలాంటి సిలికాయుత బురదను తొలగించుటకు నీటిని మొదట సెటిలింగు టాంకులలో నిల్వచేసి, బురద వంటి పదార్థాలు అడుగు భాగంలో సెటిల్ అయ్యేలా చేసి తరువాత ఎక్సుటేర్నల్ ట్రీట్మెంట్ పద్దతిలో నీటిని శుద్దిచెయ్యుదురు.సెటిలింగు ట్యాంకుల ద్వారా నీటిని తేర్చి మడ్డి/బురద/సెడిమెంట్ ను తొలగించుటకు ఎక్కువ సమయం పట్టును. నీరును త్వరగా తేర్చుటకై క్లారిపై ట్యాంకుల్లో పటిక వంటి ఘనీభవకాల (coagulants) /flocculants సహాయాన నీటిని త్వరగా తేర్చి నీటిలోని మడ్డి /బురదను తొలగించెదరు. ప్రెసరు సాండ్ ఫిల్టరుల ద్వారా, స్ప్రే ఎరేసన్ ద్వారా నీటిలోని కార్బన్ డై ఆక్సైడ్, ఐరన్ ను తొలగిస్తారు.ఈ ప్రెసరు సాండ్ ఫిల్టరుల ద్వారా బోరు వాటరు లోని లోహ లవణాలను కూడా తొలగించవచ్చు.

అయాన్ ఎక్చింజి విధానం లేదా కేటాయాన్ మార్పిడి

[మార్చు]

అయాన్ మార్పిడి విధానాన్ని వాటరు సాఫెనరు(Softener) విధానం అనికూడా అంటారు. ఈ విధానంలో నీటికి అధిక కఠినత్వాన్ని కల్గించు కాల్షియం, మెగ్నీషియం అయానులను తొలగించి,వాటి స్థానంలో తక్కువ కఠీనత్వంవున్న సోడియం అయానులను ప్రవేశపెడతారు.ఈ పద్దతతిలో సహజంగా లభించు జియోలైట్ లేదా రసాయనికంగా తయారు చేసిన రెసిన్ అనే పదార్థం గుండా నీటిని పంపి నీటిలోని కాల్షియం మెగ్నీషియం అయానులను సోడియం అయానులతో భర్తీ చెయ్యుదురు. సోడియం లవణాలు నీటిలో ద్రవణీయత కల్గి ఉండుట వలన నీటి లో లవణపొలుసు/స్కేలు ఏర్పడనివ్వవు. రసాయన సంయోగ పదార్థాలు కేటాయాన్ అనయాన్ అయానులను కల్గి వుండును. సంయోగ పదార్ధంలోని కాల్సియం, మెగ్నీషియం, బేరియం వంటిఅయాన్లు కేటాయాన్లు,ఇవి ధనాత్మకత కల్గి వుండును.క్లోరైడు,క్లోరేట్,నైట్రేట్ వంటివి అనయాన్లు.ఇవి ౠణాత్మకత కల్గి వుండును. నీటిలోని కాల్షియం,మెగ్నీషియం వంటి కేటాయానులను తొలగించు రసాయనానిక ప్రక్రియనే కేటాయాన్ మార్పిడి విధానం అంటారు.ఈ పద్దతిని బేస్ ఎక్స్చేంజి(base exchange) అని కూడా అంటారు. కేటాయాన్ అయాను మార్పిడి ప్రక్రియలో వాడు రెసిన్ మొదట సోడియం అయానులను సమృద్దిగా కల్గి వుండును.రెసిన్ ద్వారా నీటిని పంపినపుడు నీటిలోని కాల్షియం,మెగ్నీషియం అయానులను రెసిన్ గ్రహించి,సోడియం అయానులను నీటికి విడుదల చేయును. కొంత కాలానికి రెసిన్‌లోని సోడియం అయానుల స్థానంలో కాల్సియం, మెగ్నీషియం అయానులు భర్తీ అవ్వడంతో రెసిన్ నుండి అయానుల మార్పిడి ఆగిపోవును. తిరిగి రెసిన్ లో సోడియం అయా నులను నింపుటకై సంతృప్త ఉప్పునీటితో రెసిన్‌ను వాష్ చెయ్యడం వలన రెసిన్‌లో మళ్ళి కాల్షియం, మెగ్నీషియం అయానుల స్థానంలో సోడియం అయానులు చేరి పోవును. ఇలా రెసిన్ ను ఉప్పు నీటితో వాష్ చెయ్యుటను రెసిన్ రీజనరేసన్ అందురు. వాటరు సాఫనింగు విధానంలో కేవలం కేటాయాన్ల మార్పిడి జరుగును. అనగా నీటికి ఎక్కువకఠినత్వాన్ని కల్గించే కాల్షియం మెగ్నీషియం అయానుల స్థానం లో మృదువైన కఠినత్వాన్నికల్గించని సోడియం అయానులను ప్రవేశ పెట్టెదరు. అందువలన కేటాయాన్ మార్పిడి విధానంలో నీటిని శుద్ధిచెయ్యడం వలన నీటి కఠినత్వం తగ్గుతుంది. కాని నీటిలో కరిగి వున్న మొత్తం కరిగిన పదార్థాల(TDS) పరిమాణం మాత్రం తగ్గదు. అంతే కాదు నీటి క్షారగుణంలో మార్పు వుండదు.

సాఫనింగు పద్దతిలో జరుగు చర్య

Na2R + Ca(HCO3)2 « CaR + 2 Na(HCO3)

క్రియరహితం అయ్యిన కేటయాన్ రెసిన్‌ను ఉప్పు నీటితో రిజనరేసన్ (క్రియాశీలకం)చెయ్యునపుడు జరుగు రసాయన చర్య

CaR+MgR + 2 NaCl « Na2R + CaCl2+ MgCl2

డిమినరలిజేసన్ విధానం

[మార్చు]

బాయిలరు ఫీడ్ వాటరు కఠినత్వం తగ్గించు మరో నీటి శుద్ధికకరణ విధానం డిమినరలిజేసన్.పైన పేర్కొన్న సాఫనింగు లేదా కేటయాను విధానంలో నీటిలో కరిగి ఉన్న పదార్థాల కేవలం కేటయాన్ అయానుల మార్పిడి మాత్రమే జరుగగా, డిమినరలిజేసన్ విధానంలో నీటిలో కరిగి ఉన్న మొత్తం పదార్థాలను కేటయాన్, అనయాన్ మార్పిడి విధానంలో (నీటిలో కరిగి ఉన్న పదార్థాలను) తొలగించడం జరుగును.ఈ విధానంలో రెండు దశల్లో నీటిని సంస్కరించెదరు.మొదట కేటయాను మార్పిడి ప్రక్రియలో నీటిలో వున్న కాల్షియం, మెగ్నీషియం అయానుల స్థానంలోహైడ్రోజన్(H+)అయానును,రెండవ దశలో అనయాన్ల అయానుల స్థానంలో హైడ్రాక్సైడ్(OH-)అయానులను ప్రవేశ పెట్టెదరు.అందువలన డిమినరలిజేసన్ పద్ధతిలో రెండు రకాల రెసిన్ లను వాడెదరు.ఈ విధానంలో కేటయాన్రెసిన్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో,అనయాను రెసిన్ ను కాస్టిక్ సోడా తో రిజనరేసన్ చెయ్యుదురు.

డిఎరేసను(De-aeration)

[మార్చు]

ఈ విధానంలో నీటిలో కరిగి వుండు ఆక్సిజను,కార్బన్ డయాక్సైడు వంటి వాయువులను నీటిని వేడి చెయ్యడం ద్వారా తొలగించెదరు.బయట సహజంగా లభించు అన్నిరకాల నీటిలో కొంత పరిమాణంలో వాయువులు సహజంగా కరిగిన స్థితిలొ వుండును.కార్బన్ డయాక్సైడు వంటి వాయువులు లోహ క్షయికరణ(తోహాన్ని కరిగించు,క్షయించు గుణం)లక్షణాన్ని కల్గి ఉన్నందున,ఇలా వాయువులు కరిగి ఉన్న నీటిని బాయిలరు లో వేడి చేసినపుడు విడుదల అయ్యి తిరిగి అధిక ఉష్ణోగ్రతలో నీటితో చర్య జరిపి కార్బోనిక్ (H2CO3) ఆమ్లాన్ని ఏర్పరచును. కార్బోనిక్ఆమ్లం వలన లోహ క్షయం జరుగును. కార్బోనిక్ఆమ్లం కు ఇనుము ను కరిగించుకొను(తినివేయు)గుణం వుంది., నీటికి అధిక క్షారగుణాన్ని కల్గించడం వలన నీటి pH పెరిగే ప్రమాదం వుంది. బాయిలరు లోని నీటి pH 11.0కు మించి వున్న బాయిలరు షెల్ లోహాన్ని తిని వేయును.

నీటి నుండి వాయువులను రెండు విధానాల్లో తొలగిస్తారు.

  • 1.యాంత్రిక విధానం.
  • 2.రసాయన విధానం

యాంత్రిక విధానం

[మార్చు]

యాంత్రిక విధానంలో నీటిలో కరిగిన వాయువులను తొలగించు విధానం చార్లెస్, హేన్రిల భౌతిక శాస్త్ర నియామానుసారంగా పనిచేయును.వాతావరణ పరిస్థితిలో నీటిని వేడి చేసిన,అందులోని వాయువులు తొలగింప బడును. నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది నీటిలో కరిగిన వాయువుల శాతం తగ్గును.

యాంత్రిక విధానంలో కూడా రెండు పద్ధతులు కలవు.ఒకటి నీటిని వాక్యుం కలిగిన ట్యాంకులో 82°C వరకు వేడి చేసిన నీటిలో వాయువుల పరిమాణం 0.02 మీ. గ్రాము/లీటరుకు తగ్గును. రెండో విధానంలో వత్తిడి/ప్రెసరు వున్న ట్యాంకులో 105°C వరకు వేడి చేసిన నీటిలోని వాయువులు బయటకు ఆవిరి రూపంలో వెలువడును.నీటిలో వాయువుల పరిమాణం 0.005 గ్రా ము/లీటరుకు వరకు తగ్గును.

రసాయనిక డి ఏరేసన్(Chemical de-Aeration)

[మార్చు]

యాంత్రిక విధానంలో నీటిలోని వాయువులను తొలగించినను తక్కువ ప్రమాణంలో ఇంకా ఆక్సిజన్ వుండును.దీనిని తొలగించుటకు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు.ఇందుకై సోడియం సల్ఫైట్ (Sodium sulphite) లేదా హైడ్రాజైన్(hydrazine)రసాయనాలను వాడవచ్చును. సోడియం సల్ఫైట్ నీటిలోని ఆక్సిజనుతో రసాయనచర్య వలన సోడియం సల్ఫేట్(sodium sulphate)గా మారును.అయితే ఇలా ఏర్పడిన సల్ఫేట్ నీటిలో ఉండి పోవడం వలన నీటి TDS(మొత్తంగాకరిగిన పదార్థాలు)శాతం పెరుగును. కావున బ్లోడౌన్ వాటరును ఎక్కువగా ఇవ్వవలసి వుండును. హైడ్రాజైన్ నీటిలోని గాలితో రసాయన చర్య జరిపి నైట్రోజన్, నీటిని ఏర్పరచును. హైడ్రాజైన్‌ను అధిక వత్తిడి బాయిలరులో ఉపయోగిస్తారు.ఈ రసాయనాన్ని వాడటం వలన బాయిలరు వాటరులో TDS పెరగదు.

బాయిలరుకు పంపు నీటికి ఉండాల్సిన లక్షణాలు

[మార్చు]

బాయిలరు నీటీని శుద్ధీచేసినతరువాత ఉందాల్సిన గుణాలు

లక్షణం/గుణం 20Kg/cm2 21-39 Kg/cm2 40-59 Kg/cm2
ఐరన్ ppm 0.05 0.02 0.01
రాగి ppm 0.01 0.01 0.01
సిలికా ppm 1.0 ౦.3 0.1
ఆక్సిజను 0.02 0.02 0.01
pH 25°C 8.8-9.2 8.8-9.2 8.8-9.2
కఠినత 1.0 0.5 -

ఈవ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "TDS and pH". safewater.org. Archived from the original on 2018-04-22. Retrieved 2018-04-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "The Causes of Hardness in Water: Magnesium and How to Remove It". culligannation.com. Archived from the original on 2017-07-07. Retrieved 2018-04-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "What is the Cause of Hard Water Problems?". softerwaterconditioners.com. Archived from the original on 2017-08-28. Retrieved 2018-04-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)