బహుజనపల్లి సీతారామాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బహుజనపల్లి సీతారామాచార్యులు
జననం1827
మరణంమార్చి 20, 1891
వృత్తిరచయిత, కవి

బహుజనపల్లి సీతారామాచార్యులు (1827 - మార్చి 20, 1891) ప్రముఖ తెలుగు రచయిత.[1]

వీరు ద్రవిడదేశ వైష్ణవులు. సీతారామాచార్యుల వారి పేరు వినగానే అందరికీ స్పురించునది. శబ్దరత్నాకరము. అచ్చ తెలుగులో (తెలుగు-తెలుగు) న వెలువడిన గ్రంథం. దీని తర్వాత శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. వీరు చెన్నపురి (ప్రస్తుత చెన్నై) లోని పాఠశాల నందు1864లొ తెలుగు పండితులుగా ఉద్యొగమారంభించి ప్రథమ పండితులుగా కొనసాగారు.

రచించిన గ్రంథములు

[మార్చు]
  • సౌందర్యరాజస్వామి శతకము
  • 1849-వైకృతదీపిక,
  • పదార్థనామకోశము,
  • బాలచంద్రోదయము,
  • 1871- ఆలఘుకౌముది
  • 1872-నీతిమాల
  • 1872- సతీధర్మసంగ్రహము,
  • ప్రపన్న పారిజాతము
  • 1887-ఆంధ్రశబ్దమంజరి,
  • ఉపాధ్యాయబోధిని,
  • వినాయక శతకము,
  • త్రిలింగ లక్షణశేషము,
  • ప్రౌఢ వ్యాకరణము
  • శబ్దరత్నాకరము 1855.

సాహిత్య సేవ

[మార్చు]

సీతారామాచార్యులుగారి పేరు చెప్పినంతనే శబ్దరత్నాకరము, ప్రౌడ వ్యాకరణము జ్ణప్తికి వచ్చుచుండును. శబ్దరత్నాకరప్రాశస్త్యమును గనిపెట్టి చెన్నపురిలోని దేశభాషాగ్రంధకరణసభ వా రాచార్యులుగారి కైదువేలు సన్మానముగా నిచ్చిరి. నిజమాలోచించినచో నైదులక్ష లిచ్చినను దెలుగువారు వారియప్పు దీర్చుకొనలేరు. "శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక" రేలుంబవళ్లు శ్రమించి రచించిన నిఘంటువని నిఘంటుకారులు వ్రాసికొనియేయున్నారు. శబ్దరత్నాకరములోని శబ్దములరూపనిర్ణయము సర్థనిర్ణయము శాస్త్రసమ్మతమైనది. పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనది. అక్షరక్రమముగా రచింపబడిన నిఘంటువులలో నిదిశ్రేష్టము. తెలుగున నీరకమైన నిఘంటువులకు దారితీసినవారు ఎ.డి.కాంబెలు పండితుడు, సి.పి.బ్రౌను పండితుడును. వీరిర్వురు నాంగ్లేయులే. అక్షరక్రమ నిఘంటువులు తెలుగులో వెలయుట కాంగ్లేయులదే యాదిభిక్షము.

తరువాత బరవస్తు చిన్నయసూరిగా రాంధ్రజనసామాన్యమునకందు బాటులో నుండునటు లొక తెనుగుపదముల నిఘంటువును రచింప దలచి పదములు స్రామాణికగ్రంధములనుండి యెత్తివ్రాసికొని యచ్చటచ్చట గొన్నిపదముల కర్థనిర్ణయము చేసికొని యీమహోద్యమము తుద ముట్టకుండగనే పరమపద మలంకరించిరి. వారియనంతరము సీతారామాచార్యులవారు సంస్కృతాంధ్రపదములు తదర్థములు కొన్నిప్రయోగములు చేర్చి శబ్దరత్నాకరము సంధానించిరి. ఇది 1885లో వెలువడినది. శబ్దరత్నాకరము తరువాత 'శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు' వెలువడిన విషయము తెలుగువారికి దెలిసినదే.

చిన్నయసూరి వెనుక లాక్షణికులలో సీతారామాచార్యులుగారు ముఖ్యులు. ఈయన సూరికి శిష్యుడ నని వ్రాసికొనలేదు. కాని శిష్యుడైనట్లు జనశ్రుతి. ఆచార్యుల వారు కొండొకచో నిటులనుచున్నారు. "ఫరవస్తు చిన్నయసూరిగారి కాంధ్రమునందును దదుపయుక్త సంస్కృత ప్రాకృతములయందును దలస్పర్శియగు పరిజ్ణానము కలదని వారుచేసిన లక్ష్యలక్షణగ్రంధములే నిరూపించుచున్నవి. మేము వారితో జిరకాలము సావాసము చేసియుంట వారిపాండిత్యము మాకనుభవసిద్ధము." ఇది చూచి వీరి శైష్యోసాధ్యాయిక తెలిసికొన వచ్చును.

ఆచార్యులవారు పండితోత్తముడు సజ్జనాగ్రేసరుడునగు తమ తండ్రిగారికడ విద్యాభ్యాసము చేసిరి. కవితారసథార యథోచితముగ బసినాటనే కలిగినది. అప్పుడు బాలవయోవష్టాకాల వాసస్థానమైన నాగపట్టణములో నున్న సౌందర్యరాజ స్వామిపై శబ్దాలంకారభరితమైన శతక మొకటి రచించిరి. ఈ శతకము శతక కవిచరిత్ర కారులకు దొరికినది. కవిత ప్రాథమికమైనను నిటులు మాధురీభరితముగ నున్నది.

హరశూల నామశరదా
శరదాసితగాత్ర భక్తజనహితసరదా !
వరదామరుచిర సురదా
మరక్షాస్య మహిత సురాజ సుందరరాజా ! మలయజ శిశిర తనురుచిర
జలరుహదళ సదృశనయన జలనిధిశయనా !
కలరవ కలిత కటకయుగ
సులలిత మృదుపద పయోజ ! సుందరరాజా !

ఇది వ్రాయునాటికి గవియీడు ఇరువది రెండేడులు. అప్పటికి జిన్న సాహితియు గవితాధోరణియుగల యాచార్యులుగారు, ఇంక నిచట కూపమండూకమువలె నుండరాదని సమీపమునగల మదరాసునకు వచ్చెను. వచ్చి యానాడు చెన్నపురిలో మంచి వ్యుత్సన్నుడై ప్రామాణికుడైయున్న పరవస్తు చిన్నయసూరిని జేరి యతనితో ననేకవిషయములు చదివెను. సూరి రాజధానికళాశాలలో బ్రధాన పండితుడు. పురాణము హయగ్రీవశాస్త్రిగారు రెండవపండితులు. ఈయిర్వుర సాహచర్యము సీతారామాచార్యులుగారికి విద్యాసంగ్రహణమున జాల నుపకరించింది. 'శబ్దరత్నాకర' నిఘంటురచనాబీజ మాచార్యులవారి హృదయకేదారమున బడినది యీసమయమే. సూరి యహోరాత్రము లదేపనిగా విశ్వనిఘంటురచనోపయోగి పరికర సంగ్రహణ మొనరించుచున్న సమయమది. పాపము! అతనితలచినపని పూర్తికాకుండగనే 1862 మ్రింగి వైచింది. సూరి తత్సమపదములకర్థము వ్రాయవలయునని తలపెట్టలేదు. మన యాచార్యులుగారు తత్సమ పదములుచేర్చి, సూరినిఘంటువు నాదర్శముగా దీసికొని సర్వప్రశస్తముగా "శబ్దరత్నాకరము" నావిష్కరించిరి. సూరి గతించిన 1862 లో నారంభమై యించుమిం చిరువదిమూడేడుల వఱకు సాగి 1885 లో నీనిఘంటువు బయటికివచ్చినదని చరిత్రజ్ణానువులకు దెలివిడి. శబ్దరత్నాకరరచన సాగుచున్న కాలముననే యాచార్యులవా రనేకకృతులు వ్రాసిరి. నిఘంటునిర్విఘ్న పరిసమాప్తికి 'వినాయక శతకము', రచించిరి.[2] దానిలోని పద్యములు సొగసుగా నున్నవి.

వంకర తొండము చేటల
సొంకము గలచెవులు పెద్దపొట్టయు దగ ని ర్వంకల వందులు వొగడగ
బింకముతో దాల్తువయ్య వేర్వెనకయ్యా!
తల్లిని పరిగొన భక్తుల
కుల్లాసము పుట్టజేసి యురు మదధారల్
వెల్లిగొన సొంపుసూసెడు
బల్లిదు నిను గొల్తునయ్య భవు వెనకయ్యా !

మూలాలు

[మార్చు]
  1. "బాల ప్రౌడ వ్యాకరణములు విశ్లేషణాత్మక అధ్యయనము | BalaProudaVyakaranamu". www.freegurukul.org. Retrieved 2020-04-07.[permanent dead link]
  2. వంగూరి సుబ్బారావు (1924). శతక కవుల చరిత్రము. బెజవాడ. pp. 377–8.{{cite book}}: CS1 maint: location missing publisher (link)