బలిపీఠం (నవల)
బలిపీఠం | |
బలిపీఠం నవల ముఖచిత్రం. | |
కృతికర్త: | రంగనాయకమ్మ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | |
విడుదల: | 1962 |
బలిపీఠం బహుళ ప్రచారం పొందిన తెలుగు నవల. దీనిని రంగనాయకమ్మ రచించారు. ఇది 1962-63 ప్రాంతంలో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికగఅ వచ్చింది.
కథా సారాంశం
[మార్చు]విశాఖపట్నంలో అనాథలు, అభాగ్యుల సేవకు అంకితమైన "కరుణ సమాజం" అనే సేవాసంస్థ కార్యదర్శి భాస్కరరావు. అట్టడుగు కులంలో పుట్టినా గొప్ప సంస్కారం, సొంత వ్యక్తిత్వం, స్వతమ్త్ర ఆలోచనాశక్తి, సంఘసేవా దీక్షాదక్షతలు గలిగిన వ్యక్తి అతడు. కరుణ సమాజానికి మూలపురుషుడైన మహర్షికి సంఘసేవే సర్వస్వం. అతడికి సంసారం లేదు. భాస్కరరావుకి ఆయనే తండ్రి, గురువు, స్నేహితుడు, ఆప్తుడు అన్నీ. మహర్షి మాటసాయం వలన భాస్కర్ జిల్లా బోర్డులో ఉద్యోగం సంపాదించాడు. తీరిక సమయాల్లో కరుణ సమాజానికి సేవలందిస్తుంటాడు. ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పాసై, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, టెలిగ్రఫీలు నేర్చుకున్నాడు. మొదట్లో కమ్యునిష్టు నాయకుల ఉపన్యాసాలు ప్రత్యేకాభిమానంతో వింటూ విప్లవపథం వైపు మొగ్గుతున్న దశలో మహర్షి భాస్కర్ మనసును మార్చి సంఘసేవ దిశగా మళ్లించాడు. కరుణ సమాజాన్ని దర్శించడానికి వచ్చిన పొట్టి శ్రీరాములు భాస్కర్ సేవానిరతిని గమనించి చాలా మెచ్చుకున్నాడు. భాస్కర్ ను అతనికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని అతని భావాలకు, అనుభవాలకు పరిపూర్ణత సంతరించుకోవాల్సిందిగా శ్రీరాములు సలహా ఇస్తారు. మహర్షి కూడా అదే అభిప్రాయంతో భాస్కర్ ని వివాహానికి సుముఖునిగా చేయడానికి ప్రయత్నిస్తారు.
ఆ రోజుల్లోనే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసులో నిరాహారదీక్ష ప్రారంభించారు. భాస్కర్ మద్రాసు వెల్లీ అతనికి దర్శించుకొని అతని ఆశీస్సులు తీసుకొని విశాఖపట్నం తిరిగివస్తాడు. శ్రీరాములు గారు 58 రోజుల దీక్ష మూలంగా కన్నుమూస్తారు. ఆ వార్త తెలిసిన భాస్కర్ చాలా బాధపడతాడు.
శ్రీరాములు గారికి ఇచ్చిన మాటను త్వరలో నెరవేర్చాలని మనసులో అనుకుంటాడు. వధువు విషయంలో అతనికి కొన్ని అభిప్రాయాలున్నాయి. వివాహం సంస్కారయుతమైనది కావాలి, వధువు బాలవితంతువో, కులాంతర యువతో అయి ఉండాలి, తనకన్నా నిన్నదై, గుణవతి అయి చదువుకున్నది కావాలి. భవిష్యత్తు జీవితంలో తనకు చేయూతనిచ్చి సహకరించే వ్యక్తి కావాలి. శాకాహారి కావాలి. ఇటువంటి వధువు కోసం అతని అన్వేషణ సాగుతుండగా యాదృచ్ఛికంగా ఓ బర్మా కాందిశీక కుటుంబంలోని యువతి తారతో పరిచయమౌతుంది. అది ప్రేమంగా మారుతుంది. పరస్పరం మనసులు ఇచ్చిపుచ్చుకున్నా ఆ సంగతి వ్యక్తపరిచే సమయం కోసం నిరీక్షిస్తుంటారు. భాస్కర్ కి సన్నిహితుడైన రామనాథం గారి సాయంతో హైదరాబాదు చేనేత సహకార సంస్థలో ఉద్యోగానికి ఎంపిక చేయబడతాడు. తార, భాస్కర్ లిద్దరూ విచారంగా వీడ్కోలు చెప్పుకుని పరస్పరం ఉత్తరాలు రాసుకోవడానికి వాగ్దానం చేసుకుంటారు.
భాస్కరరావు హైదరాబాదులో కొత్త ఉద్యోగంలో చేరతాడు. రామనాథం గారి ద్వారా అరుణ అనే బ్రాహ్మణ యువతి బాలవితంతువు పరిచయమౌతుంది. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆమె ఎక్కువకాలం జీవించదని డాక్టర్లు చెబుతారు. అమెకి ఒక్కరోజైనా సౌభాగ్యవతిగా తిరగాలని, సుమంగళిగా మరణించాలని విపరీతమైన కాంక్ష. తన గురించి అంతా భాస్కర్ కి చెప్పగా ఆమె కథనం అతడిని కదిలించివేస్తుంది. దుంఖంతో జీరబోయిన ఆమె గొంతు, నీళ్లు నిండిన ఆమె కనులు, దీనాతిదీనమైన ఆమె అర్ధింపు- అతని హృదయాన్ని ద్రవించేస్తుంది. ఆమెను పెళ్ళిచేసుకోడానికి దృఢంగా నిర్ణయించుకుంటాడు. తనకోసం నిరీక్షిస్తున్న తారని మనసులోంచి అయిష్టంగా చెరిపేసుకుంటాడు. అరుణకు తన కులం, కుటుంబ నేపథ్యం అంతా చెబుతాడు. అవన్నీ పట్టించుకోనని, భాస్కర్ ని భర్తగా పొందగలిగే అదృష్టం ఒక్కటే చాలని అంటుంది అరుణ. అరుణ అత్తయ్య జగదాంబ, మామయ్య సీతాపతి శాస్త్రి కులం తక్కువ వాణ్ణి పెళ్ళిచేసుకోవడాన్కి తిరస్కరించినా అన్నీ సహించి ఇల్లు విడిచి వచ్చేస్తుంది. భాస్కర్ ఆమెను డాక్టర్ రాధాపతి ప్రకృతి ఆశ్రమంలో చికిత్స చేయిస్తాడు. అరుణ పిన్ని కూతురు కమల అభ్యుదయ భావాలు గలిగి అరుణ నిర్ణయాన్ని అభినందిస్తుంది. డాక్టర్ రాధాపతి, ఆయన సతీమణి శ్రీదేవి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేసిన చికిత్స మూలంగా అరుణ తిరిగి ఆరోగ్యవంతురాలౌతుంది. ఆమె కోరుకున్నట్లుగా అరుణ భాస్కర్ ల వివాహం శాస్త్రోక్తంగా జరిగుతుంది. భాస్కర్ ప్రయాసపడగా అరుణకి ఆఫీసు క్లర్కుగా ఉద్యోగం దొరికింది. ఇద్దరి సంపాదనతో ఏ లోటూ లేకుండా వారి సంసారం జరిగిపోతుంది.
అరుణకి కుతురు పుట్టింది.బారసాల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది. అత్తయ్య నిష్టూరంగా మాట్లాడింది. భాస్కర్ అక్క సీతమ్మ తన కొడుకు గోపితో సహా హైదరాబాద్ వస్తుంది. ఆమె తరపువాళ్ల రూపు రేఖలు, మాటతీరు, తినేపద్ధతి వగైరాలన్నీ అరుణకి తీవ్ర అసహ్యాన్ని కలిగిస్తాయి. అదే కారణంగా ఇద్దరి మధ్యా భేదాన్ని కలిగించి కోర్టుకెక్కి విడాకులు పొందుతారు.
అరుణ గుండెజబ్బు తిరగబెట్టి, ఉన్న ఉద్యోగం ఊడి జగదాంబ మాటలు అరుణ గుండెకు గుచ్చుకోగా, చేతిలో డబ్బుల్లేక ఒక్కసారి గతాన్ని సింహావలోకనం చేసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. చివరగా బిడ్డలిద్దరినీ భాస్కర్ కి అప్పగించి, క్షమాపన అర్థించి, అతని ఒడిలో తుదిశ్వాస విడుస్తుంది.
ప్రముఖుల అభిప్రాయాలు
[మార్చు]- కొడవటిగంటి కుటుంబరావు బలిపీఠం నవలని వీరేశలింగంగారి రాజశేఖర చరిత్రము, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి మాలపల్లి నవలలతో పోల్చి, తెలుగు నవలా సాహిత్యంలో ఇదొక మైలురాయని అన్నారు.
సినిమా
[మార్చు]- ఈ నవల ఆధారంగా బలిపీఠం (1975) సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడింది.