Jump to content

బాదుట్ ఆలయం

వికీపీడియా నుండి
(బదుత్ నుండి దారిమార్పు చెందింది)
బాదుట్ ఆలయం
ముందు నుండి బాదుట్ ఆలయం
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిఇండోనేషియా
పట్టణం లేదా నగరంమలాంగ్, ఈస్ట్ జావా.
దేశంఇండోనేషియా
భౌగోళికాంశాలు7°57′28″S 112°35′54″E / 7.957778°S 112.598333°E / -7.957778; 112.598333
పూర్తి చేయబడినదిc. 760

బాదుట్ ఆలయం (ఇండోనేషియా: Candi Badut) అనేది ఇండోనేషియాలో గల ఎనిమిదవ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఇది మలాంగ్ నగరం నుండి పశ్చిమాన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిదర్ ప్రాంతంలో ఉంది. ఈ రాతి నిర్మాణం తూర్పు ఇండోనేషియాలో గల మలాంగ్ రీజెన్సీలోని దౌ అనే ఉపజిల్లాలోని కరాంగ్ బెసుకి గ్రామంలో ఉంది.[1]

ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నప్పటికీ, మలాంగ్ సమీపంలోని ఇతర దేవాలయాల వలె కాకుండా సింగోసరి, కిడాల్ వంటి ఆలయాల నిర్మాణ శైలిని పోలి ఉంది. ఈ ఆలయం ముఖ్యంగా మధ్య ప్రాంతంలోని పాత ఆలయాల శైలిని అనుసరిస్తుంది. ఈ ఆలయం 760 CEలో నిర్మించబడిందని అంచనా వేయబడింది, ఈ ఆలయాన్ని ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని పురాతన దేవాలయంగా గుర్తించారు.[2]

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

జనాదరణ పొందిన నమ్మకాల ప్రకారం "బాదుట్" అనే పేరు ఇండోనేషియా, జావానీస్ అనే పదాలతో అనుసంధానించబడింది, అంటే "విదూషకుడు" అని అర్థం. అయినప్పటికీ, "బదుత్" అనే పేరు సంస్కృత పదం భా-ద్యుత్ నుండి ఉద్భవించింది, ఇది అగస్త్య (కానోపస్ నక్షత్రాన్ని) నక్షత్రాన్ని సూచిస్తుంది.[1]

చరిత్ర

[మార్చు]

ఇండోనేషియా చరిత్రకారుడు పుర్బత్జారకా ఈ ఆలయాన్ని మెర్జోసారి గ్రామంలో కనుగొనబడిన డినోయో శాసనంతో అనుసంధానించాడు. ఈ శాసనం సంస్కృతంలో పాత జావానీస్ లిపిని ఉపయోగించి చంద్రసెంగ్కల (క్రోనోగ్రామ్)తో వ్రాయబడింది. ఇది 682 CE లేదా 760 CE సంవత్సరానికి చెందినదిగా ఉంది, ఇది కంజురుహన్ రాజ్యాన్ని పాలించిన రాజు గజాయన గురించి ప్రస్తావిస్తూ రాయబడింది. అయితే, శాసనానికి ఆలయానికి మధ్య బలమైన సంబంధం లేకపోవడం వల్ల డినోయో శాసనంతో ఆలయ సంబంధం ఇప్పటికీ చరిత్రకారులకు చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆలయ శిథిలాలు 1921లో రాతి, మట్టి దిబ్బ రూపంలో కనుగొనబడ్డాయి. బదుత్ దేవాలయం ఉనికిని నివేదించిన మొదటి వ్యక్తి మలాంగ్‌లో పనిచేసిన డచ్ కంట్రోలర్ మౌరీన్ బ్రెచెర్. డచ్ ఈస్ట్ ఇండీస్ పురావస్తు సేవ నుండి బి. డి హాన్ పర్యవేక్షణలో 1925-1926లో బదుత్ ఆలయం పునరుద్ధరించబడింది. ఆ సమయంలో జరిపిన త్రవ్వకాల ప్రకారం, ఆలయ భవనం పూర్తిగా కూలిపోయిందని, కానీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆలయ అడుగు భాగం మాత్రం మిగిలి ఉందని తెలిసింది.[1]

నిర్మాణం

[మార్చు]

ఈ ఆలయం పశ్చిమ వాయువ్య ముఖంగా ఉంది. ఆలయం ముందు మూడు చిన్న పుణ్యక్షేత్రాల అవశేషాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం ఒకప్పుడు 11 x 11 మీటర్ల పొడవున్న దీర్ఘచతురస్రాకార రాతి కంచెతో చుట్టుముట్టబడి ఉండేది. గోడ అసలు ఎత్తు తెలియదు ఎందుకంటే అక్కడ కంచె పునాది మాత్రమే మిగిలివుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దాని పునాది భాగం రెండు మీటర్ల పొడవైన దీర్ఘచతురస్రాకార సాదా పీఠంగా, ఎటువంటి అతుకులు లేనిదిగా, ఎటువంటి అలంకరణ లేనిదిగా ఉంది.[1]

ఇక్కడి గర్భగుడిలో శివుని చిహ్నమైన లింగం ప్రతిష్టించబడి ఉంది. ప్రధాన గదికి ప్రవేశ ద్వారం ముందు మెట్లు పడమర వైపు ఉన్నాయి. గోడకు వెలుపలి భాగంలో మెట్లు చెక్కుచెదరకుండా చెక్కబడి ఉన్నాయి, అయితే వేణువు ఊదుతున్న వ్యక్తి శిల్పాన్ని చుట్టుముట్టే పూల ఆకృతులు ఇప్పటికీ ఉన్నాయి. గర్భ గృహం (అంతర్గత గర్భగుడి) ప్రవేశద్వారం 1.5 మీటర్ల విస్తీర్ణంతో ముందు గదికి అనుసంధానించబడి ఉంది. కాల-మకర అలంకరణతో ప్రవేశ ద్వారం చాలా వెడల్పుగా ఉంది.

గర్బ గృహం అనేది దాదాపు 5.53 x 3.67 మీటర్ల గది. గది మధ్యలో ఒక శివ లింగం, యోని ఉన్నాయి. గది చుట్టూ ఉన్న గోడపై ఒకప్పుడు హిందూ దేవతల విగ్రహాలు ఉన్నట్లు అనిపించే చిన్న గూళ్లు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న గూడులో దుర్గా మహిషాసురమర్దిని విగ్రహం ఉంది.

సాంబిసరి, గెబాంగ్, మెరాక్ వంటి సమకాలీన సారూప్య జావానీస్ హిందూ దేవాలయాల లేఅవుట్ల ఉదాహరణల ప్రకారం; తలుపు కుడి, ఎడమ వైపున ఉన్న రెండు గూళ్లు మహాకాళి, నందీశ్వర విగ్రహాలను కలిగి ఉండాలి, ఉత్తరం వైపు ఉన్న గూడు దుర్గా మహిషాసురమర్దిని విగ్రహం కోసం, తూర్పున గణేశ విగ్రహం కోసం, దక్షిణ వైపున అగస్త్య విగ్రహం కోసం గూళ్లు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఆ హిందూ దేవతా మూర్తులన్నింటిలో, దుర్గా మహిషాసురమర్దిని విగ్రహం మాత్రమే బదుత్ ఆలయంలో ఇప్పటికీ ఉంది, మిగిలినవి కనిపించలేదు.

ఆ కాలంలోని జావానీస్ హిందూ దేవాలయం సాధారణ నిర్మాణం వలె, మూడు భాగాలుగా ఏర్పాటు చేయబడింది; ఆధార పీఠం, మెట్లు, అడుగుభాగం. ప్రస్తుతం, ఆలయం పునాది, గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి, పైకప్పు నిర్మాణం లేదు, ఆలయ పైకప్పు రాతి భాగాలు లేకపోవడంతో పునర్నిర్మించాల్సి ఉంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Candi Badut (Jawa Timur) - Kepustakaan Candi". candi.perpusnas.go.id (in ఇండోనేషియన్). Archived from the original on 2020-08-15. Retrieved 2020-04-20.
  2. Hoffman, Linda (1995-06-15). Indonesia Tuttle Travel Pack: Your Guide to Indonesia's Best Sights for Every Budget (in ఇంగ్లీష్). Tuttle Publishing. ISBN 978-1-4629-1355-8.

వెలుపలి లంకెలు

[మార్చు]