ప్రేమించుకుందాం రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమించుకుందాం రా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి.పరాన్జీ
తారాగణం వెంకటేష్,
అంజలా జవేరి
జయప్రకాశ్ రెడ్డి,
చంద్రమోహన్,
సుధ,
ఆహుతి ప్రసాద్,
బాబూమోహన్,
రఘునాధ రెడ్డి,
పరుచూరి వెంకటేశ్వర రావు,
ఉత్తేజ్,
వేణుమాధవ్
సంగీతం మహేష్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రేమించుకుందాం రా 1997 లో వెంకటేష్ కథానాయకుడిగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రం.[1] ఇది ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. ఈచిత్ర సంగీతం కూడా మంచి ప్రజాదరణ పొందింది.

వీరభద్రయ్య సీమలో పేరు మోసిన ముఠా నాయకుడు. ఈయనకు ప్రేమ పెళ్ళిళ్ళంటే పడదు. ఆయనకు వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్న వారినంతా తన కుడిభుజం లాంటి శివుడు కడతేరుస్తుంటాడు. శివుడికి వీరభద్రయ్య మాటంటే వేదం. ఆయనకు ఎదురు తిరిగిన స్వంత తండ్రిని చంపడానికి కూడా అడ్డు చెప్పడు. వీరభద్రయ్య ప్రత్యర్థి రెడ్డెప్ప. ఇద్దరూ ఒకరినొకరు అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

గిరి హైదరాబాదులోని ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఊరైన కర్నూలు వెళతాడు. బావ ఓ బట్టల కొట్టుకు యజమాని. అక్కడ కావేరి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నెమ్మదిగా కావేరి కూడా గిరి ప్రేమలో పడుతుంది. కావేరి తండ్రి పెద్ద ముఠా నాయకుడు. ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు. గిరి కి తన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడైన ఎస్. ఆర్. కె మాస్టారు కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుని ఉన్న ఫళంగా హైదరాబాదుకు రమ్మంటారు. గిరి వెళ్ళేటపుడు కావేరితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి సమయం లేక తన అక్క కూతురికి ఒక లేఖ ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆమె ఆ లేఖను పొరపాటున జారవిడుస్తుంది. ఈ లోపు హైదరబాదుకు వెళ్ళిన గిరికి తనకు పెళ్ళి నిశ్చయిస్తున్నారని తెలుస్తుంది. తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం గురించి చెబుతాడు. మరో పక్క గిరి అక్క తన తమ్ముడికి పెళ్ళి కుదిరిందని చెబుతుండగా విని గిరిని అపార్థం చేసుకుంటుంది.

కావేరిని కలుసుకోవడానికి మళ్ళీ కర్నూలు వచ్చిన గిరి కావేరి ఇంటి మీద ఆమె తండ్రి ప్రత్యర్థి రెడ్డెప్ప మనుషులు తగలబెట్టడానికి ప్రయత్నం చేయబోతే అడ్డుకుంటాడు. కానీ కావేరి మాత్రం అతను తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యావని నిందిస్తుంది. గిరి ఆమెతో మాట్లాడి నిజం చెప్పడానికి విఫల ప్రయత్నం చేస్తాడు కానీ కుదరదు. విసిగిపోయి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుండగా గిరి అక్క కూతురు ద్వారా నిజం తెలుసుకున్న కావేరి మళ్లీ గిరిని అర్థం చేసుకుంటుంది.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమాలో మొదటగా ఐశ్వర్యా రాయ్ ను కథానాయికగా అనుకున్నారు. దర్శకుడు జయంత్ కు కుటుంబ సభ్యుల ద్వారా ఆమెతో ఉన్న పరిచయం ఇందుకు కారణం. కానీ అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడం వల్ల సెంటిమెంటు కారణంగా చూపి ఆమెను తీసుకోవడానికి చిత్రబృందం ఇష్టపడలేదు.[2]

ఈ సినిమాలో సీమ భాషకోసం జయప్రకాష్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుందని, పరుచూరి సోదరులతో ఒప్పించి కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు వెళ్ళి ఓ టేపురికార్డరు జేబులో పెట్టుకుని టీకొట్టు, ఎరువుల దుకాణం, బస్టాండ్‌ వంటి ఇలా వివిధ ప్రాంతాల్లో, సందర్భాల్లో వాళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో రికార్డు చేసుకొని, నోట్స్‌ రాసుకునేవాడు. అలా రాసుకున్నదంతా పరుచూరి సోదరులకు చూపించి, ముందురోజు సాయంత్రం వాళ్ళు సంభాషణలు రాసివ్వగా రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని సాధన చేసేవాడు.[3]

పాటలు

[మార్చు]
  • మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా , రచన: సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, సంగీతం. మణిశర్మ.
  • ఓ పనైపోతుంది బాబు, రచన; చంద్రబోస్. గాయకుడు: మనో , సంగీతం. మణిశర్మ.
  • పెళ్లికళ వచ్చేసిందే బాలా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి. గాయకులు: మనో, స్వర్ణలత , కే. ఎస్ చిత్ర, సంగీతం. మణిశర్మ
  • చిన్ని చిన్ని గుండెలో , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర,సంగీతం. మహేశ్ మహదేవన్
  • సూర్యకిరీటమే నీవా , రచనభువన చంద్ర , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్, సంగీతం. మహేష్ మహదేవన్
  • అలా చూడు ప్రేమలోకం ,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, సంగీతం.మహేష్ మహదేవన్

సంభాషణలు

[మార్చు]
  • జయప్రకాష్: ఒరే థాయ్! వీడేం పని జేచ్చాడు?
  • రౌడీ: బ్యాంకీ పని
  • జయప్రకాష్: వీడికేం దెల్సు?
  • రౌడీ: కూడికలు
  • జయప్రకాష్: మనమేం జేచ్చాం?
  • రౌడీ: ఫ్యాక్షనిజం
  • జయప్రకాష్: మనకేం దెల్సు?
  • రౌడీ: తీసివేతలు
  • జయప్రకాష్: ఒరే థాయ్! టిక్కెట్లు రిజర్వు జేపిచ్చర్రి. ఫస్టు క్లాసు కాదు సెకండు క్లాసు.
  • జయప్రకాష్: పోరా గబ్బు నా కొడకా!

మూలాలు

[మార్చు]
  1. "ప్రేమించుకుందాం రా". thetelugufilmnagar.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 6 February 2018.
  2. "'ప్రేమించుకుందాం రా'లో ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది!". www.eenadu.net. Retrieved 2020-04-13.
  3. ఈనాడు, సినిమా (8 September 2020). "వెండితెరకు సీమ యాసను పరిచయం చేసి..!". www.eenadu.net. Archived from the original on 9 September 2020. Retrieved 9 September 2020.