ప్రళయకావేరి కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రళయకావేరి కథలు - రచన: స.వెం.రమేశ్

ముఖచిత్రం
స.వెం.రమేశ్

పుస్తక పరిచయము

[మార్చు]

21 అచ్చతెలుగు కథలున్న సంకలన పుస్తకము. ఇందులోని కథలు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' లో మొదట ధారావాహికంగా ప్రచురింపబడినవి. ఈ పుస్తకంలోని 'ఉత్తరపొద్దు'కథ 'ఆదివారం ఆంధ్రజ్యోతి, 2003, డిసెంబరు, 7న మొదటిసారి వచ్చింది. మిగతా కథలు 2004మార్చి 21 ఆదివారము ఆంధ్రజ్యోతిలో ప్రారంభమై, జూలై 25 సంచిక వరకు ప్రతి ఆదివారం ప్రచురింపబడినవి. ప్రళయకావేరి కథలు సరళమైన గ్రామీణ వ్యవహరిక తెలుగులో వ్రాయబడినవి. అందులోను నెల్లూరు మాండలికం (యాస) లో వ్రాసిన కథలు.'ఉత్తరపొద్దు'కథను చదివిన దాశరథిరంగాచార్య -" 'ఉత్తరపొద్దు' తెలుగు పున్నమి వెన్నెట్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం. కలుపు మొక్కలేని తెలుగు పంట.."అని ప్రశంసించినాడు.

ఈ కథల సంపుటం జనవరి2005 లో మీడియా హౌస్ పబ్లికేషన్, హైదరాబాదు వారిచే పుస్తకరూపంలో వచ్చినది. ఈపుస్తకాన్ని రచయిత " నీవు కథలు వ్రాయగలవని" ప్రోత్సహించిన డా. సామల రమేష్ బాబు కు (నడుస్తున్న చరిత్ర మాసపత్రిక సంపాదకుడు), ఆయన పత్ని డా. సామల దుర్గావతి కి "ప్రేమతో "అంకితమిచ్చాడు. ఉత్తరపొద్దుకథకు అక్బరు, మిగిలిన కథలకు చిదంబరం బొమ్మలేశారు. ఈ పుస్తక ముఖచిత్రంగా వేసిన ఫోటోను సుంకర హరీష్ అందించగా, ఆర్టిస్టు మోహన్ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దాడు.

ప్రళయకావేరి సరస్సు

[మార్చు]

రచయిత మాటల్లో ప్రళయకావేరి

" అందమైన పేరుగల అందమైన సరస్సు, ఆంధ్రప్రదేశ్‍లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు. ప్రళయకావేరి తల తమిళనాడులో, మొండెం ఆంధ్రలో. సరస్సులో నలభై వరకూ దీవులు. మనిషికీ మనిషీకి, దీవికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు. ప్రళయకావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లీయులనోట ఎన్నెన్ని కథలో, ఎన్నెన్ని పాటలో...ప్రళయకావేటి పుట్టుక గురించి, ప్రళయకావేటి లోని పెద్దపుణ్యక్షేత్రం 'పంటరంగం' గురించి పల్లె పల్లెలోనూ రకరకాల కథనాలు. ప్రళయకావేరి బతుకొక యిసిత్రం. ప్రళయకావేరే ఒక యిసిత్రము. అవ్వ నీలికోకమింద పచ్చపూల మాదిరిగా, నాలుగు తట్టులా నీలాపు నీళ్లతో నిండిన ప్రళయకావేట్లో పచ్చపచ్చని దీవులు. ప్రళయకావేట్లోని నీళ్లను నోట్లోపోసుకోలేము. వుప్పుకసిము. దీవుల్లోని దొరువుల్లో నీళ్లుమటుకు మీగడగట్టిన ఎర్రనీళ్ల (కొబ్బరి) మాదిర తియ్యగుంటాయి. సముద్రాన్నీ ప్రలయకావేరిని కలుపుతూ నాలుగు ముఖద్వారాలు, నాలుగు ముఖద్వారాలనూ తాకుతూ పోయే ఉప్పుకాలువ, ఎగువ సిద్ధలయ్య కొండల్లోంచి బిరబిర పరుగెత్తి వచ్చి ప్రళయకావేరమ్మ ఒళ్లుతడిపే నదులూ, వంకలూ, వాగులూ, ఎక్కడో ఎరగని తీరాలనుంచివచ్చి వాలి, ఆరునెలలు సేదతీరే వలస పక్షులు, చిన్నతోటలో చిక్కగా పరుసుకున్న చిల్ల చెట్లసాళ్ళూ, కరిపేటికి చిలకేటికి నడుమ నూర్లు నూర్లుగా బార్లుదీరిన తాళ్ళూ, అప్పుడొక్కటి అప్పుడొక్కటి ఉప్పుకాలువలో సాగే పడవలూ, పక్కనే పడమట ఉన్న గట్టినేలనుండి వచ్చి ఆడిపాడి అలరించే జానపదకళాకారులూ, పెద్దీటిగొల్లలు, యానాదులూ, తూరుపు రెడ్లు, వెలమలూ, బేరిశెట్లూ, పట్టపు కాపులు, దేశూరురెడ్లు, ఒకే సమాజంగా బ్రతుకుతూ కూడా కులకులానికీ మారే తెలుగు యాసా, మాటలూ...."

ప్రళయకావేరి గురించి రచయిత చేసిన పైవర్ణన ఈనాటిది కాదు.దాదాపు 30-35 సంవత్సరములముందునాటిది. ప్రళయకావేరి గుండెకాయ అయిన శ్రీహరికోటలో ఇస్రోవాళ్లు రాకెట్ లాంచింగ్ (ఉపగ్రహ ప్రయోగ వేదిక) కేంద్రం నిర్మించకముందు ఉన్న స్థితి. రాకెట్ కేంద్రం నిర్మాణం కారణంగా దీవిలోని ప్రజలు నిరాశ్రయులైనారు. చంగలపాలెం, కీపాక జోనిగపాలం, పల్లివీధి, కాకరమూల, కిళివేడు, రవణప్ప సత్రం, వంటోరిపాళం, సూళ్లదొరువు వంటి పలుగ్రామాల ప్రజలను నూరుమైళ్ల దూరంలోని మెట్టపొలాలకు తరిమింది కేంద్రప్రభుత్వం.పల్లెబతుకులతోపాటు అక్కడి ప్రాచీనదేవాలయాలు కూడా శిథిలమై రాకెట్ కేంద్రం స్థాపన మూలంగా నాశనమై పోయాయి. ఆ తరువాత పదేళ్లకు అభివృద్ధి పేరుతో ప్రళయకావేరి దీవుల్లో వేసిన గులకబాటలు, కరెంటుతీగెలు పట్టణనాగరికతను పల్లెలోకి తెచ్చింది. ప్రభుత్వంవేసిన గులకబాటలు, వర్షాధారమైన తమిదల్ని పండించడం మానివేసి, వరి పండించుటకై ప్రజలు వేసుకున్న చెరువుకట్టలు కలిసి, ప్రళయకావేట్లోని సహజమైన ఉప్పునీటిని కదలకుండచేశాయి. ప్రళయకావేట్లో కలిసే ప్రవాళం, కాళంగి, స్వర్ణముఖి, అరుణ కరిపేరు, చిలికేరుల్లో వానలేకా, ఎగువ ఆనకట్టలు కట్టెయడం వలన నీరు పారడం అగిపోయింది. ముఖద్వారాలలో ఇసుకమేటవేసి ఆటుపోట్లద్వారా వచ్చే సముద్రపు నీరు తగ్గిపోయింది. పేటలోని సినిమాలు మరిగి, ప్రళయకావేటి వారు జానపదాలను మరచిపోయినారు. ఇందతా, కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమైపోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ తపించిపోయిన రచయిత నాటి వైభవాన్ని సజీవంచేసి, పాఠకులముందుంచిన ప్రయత్నమే ఈ 'ప్రళయకావేరి కథలు'.

ప్రళయకావేరనే పేరు అట్లాసులలోకాని, రాష్ట్ర పటంలోకాని, పర్యటకశాఖ వారి పుస్తకాలల్లోకాని కనిపించదు. ఎందుకంటే బ్రిటిషు వలస పాలన పుణ్యాన ప్రళయకావేరి అనే పేరు పులికాట్ సరస్సుగా మారింది కనుక. ఒకనాటి ప్రళయకావేరే నేటి పులికాట్. కొన్ని వేలసంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రళయకావేరి ఉన్న ప్రాంతంలోనే కావేరి నది సముద్రంలో కలిసేది. ఈ ప్రాంతంలో వరుసగా సంభవించిన భూకంపాల వలన కావేరినది, సముద్రసంగమ స్థానం దిశమారినది.

రచయిత గురించి....

[మార్చు]

రచయిత స.వెం.రమేశ్ జననము 1970 ఆగస్టు26. ఉన్నత విద్యావంతుడు. ఎం.ఎ. (మానవ సమాజ పరిణామ శాస్తం-ఆంత్రొపాలజీ, ఎం.ఎ. (తెలుగు) చదివాడు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి అతని కార్యక్రమం. అతని నిరంతర కృషిని గుర్తించిన తెలుగు భాషోద్యమ సమాఖ్య.అతనిని రాష్ట్రేతర ప్రాంతాల కార్యదర్శిగా నియమించింది. తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగువాణి' (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నాడు. ప్రళయకావేరి కథలతో కథాసాహిత్యాన్ని ఇష్టపడే తెలుగు ప్రజలకు స.వెం.రమేశ్ సన్నిహితుడయ్యాడు.

ప్రళయకావేరి కథలు

[మార్చు]

ఈ పుస్తకంలో మొత్తం 21 కథలున్నాయి.అవి వరుస క్రమంలో,1.ఉత్తరపొద్దు,2.కాశెవ్వబాగోతం,3.పాంచాలి పరాభవం,4.ఎచ్చలికారి సుబ్బతాత,5.కత్తిరిగాలి,6.మామిడిచెట్టు-కొరివిదెయ్యం,7.ఆడే వొయిసులో ఆడాల,8.కొత్త సావాసగోడు,9.నల్లబావ తెంపు,10.పద్దినాల సుట్టం,11.తెప్ప తిరునాళ,12.ప్రవాళ ప్రయాణం,13.పుబ్బ చినుకుల్లో,14.అమ్మపాల కమ్మదనం,15.అటకెక్కిన అలక, 16.సందమామ యింట్లో సుట్టం,17.పరంటీది పెద్దోళ్ళు, 18.మంట యెలుతుర్లో మంచు,19.దాపటెద్దు తోడు,20.ఆడపొడుసు సాంగెం,21.వొళ్ళెరగని నిదుర.

ఈ కథలన్నింటిలోని కథానాయకుడు పండ్రెండెళ్ల బక్కోడు.బక్కోడనే పేరు, వాడి తాత గారి వూళ్ళోళ్లు పిలిచేపేరు. బక్కోడు అమ్మనాన్నలతోపాటు పేటలో ఉండి చదువుకుంటున్నాడు. బడికి సెలవులిచ్చినప్పుడు, ప్రళయకావేరిలో ఉన్న తన తాతగారి ఊరు 'జల్లలదొరువు'వచ్చి, సెలవులైపోయాక పీటకు పోతాడు. లోలాకులు, కత్తోడు, దిబ్బోడు, ముద్దలోడు, పొప్పోడు, పొందోడు, కర్రోడు, బర్రోడు, ఇలిందరగోడు, పొట్టిపద్మ, గుండు పద్మ-ఇళ్లందరు బక్కోడి సవాసగాళ్లు. బక్కోడి కథలు చదువుతుంటే, పట్టణాలలో పుట్టి పెరిగిన వారిని మినహాయించి, పల్లెల్లో పుట్టిపెరిగిన పాఠకులందరికి తమచిన్ననాటి రోజులు నెనపుకొస్తాయి. బక్కోడి జీవితంలో జరిగినవన్ని మనకు జరిగిన సంగతి గెవనానికొస్తాయి. కాలగమనం వెన్నక్కి మళ్లి, తిరిగి పిల్లగాండ్రమైతే 'ఏంతబాగుండు'ననిపిస్తుంది. కొన్ని కథలు పడిపడి నవ్వేలా చేస్తాయి. కొన్ని కథలు చదువుతున్నప్పుడు పెదాలపై చిన్న దరహాసం వెలుస్తుంది. కొన్ని కథలు కన్నీళ్లు తెప్పిస్తాయి. కొన్ని కథలు అబ్బురపరుస్తాయి. సుబ్బుతాత, నల్లబావ, వసంతక్క, కాశెవ్వ, లోలాకులు, వెంకుతాత, బక్కోడి అవ్వ, బక్కోడి చిన్నాన మరచిపోలేని పాత్రలు.

స్పందన

[మార్చు]

ప్రళయకావేరి కథల పై ఆంధ్రజ్యోతిలో పాఠకులనుండి వచ్చిన స్పందననలో మచ్చుకు కొన్ని...

  • రమేశ్ గారి ఉత్తరపొద్దు తెలుగు పున్నమి వెన్నెట్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకుచక్కదనం. కలుపుమొక్కలేని తెలుగు పంట. అది కావేరి తరంగం-గాలి అల-మార్గశిరపు ఎండపొడ-దాశరథి రంగాచార్య, హైదరాబాదు.
  • అయ్యా రమేశ్‌గారూ, యిన్నినాళ్ళు యాడున్నారు సామీ మీరు. నామిని గార్ని చదివి 'అబ్బ ఇట్ట రాసే వోడే లేడ్రా సామీ ' అనుకుంటాంటే 'దర్గామిట్ట, పోలేరమ్మ బండ ' అంటా ఖదీరు కొన్నినాళ్ళు నవ్విచ్చి, ఏడ్పిచ్చి పోయా. ఇప్పుడనంగా మీరు కావేరిని అడ్డంగా ఈదుకోనొచ్చి మా ముంద పడిరి. మీ దాపటెద్దిల్ని, కాశెవ్వబాగోతాన్ని, మీ తాత ధైరాన్ని, సుబ్బయ్య తాత డంబాల్ని చదివి నవ్వి చచ్చామంటే నమ్మున్నాన్నో. ఆ పంతరంగ సోమి మీకు ఆయురారోగ్యాన్ని యియ్యాలని ప్రార్థిస్తున్నాను-పుట్టా పెంచల్దాస్, దేవమాచుపల్లి.
  • ప్రళయకావేరి-పేరే అందంగా ఉంది. పులికాట్ సరస్సుకు ఇంత అందమైన పేరు ఉండగలదని ఊహించలేము. అయితే జిజ్ఞాస గల రచయిత కాబట్టి శంకరాచార్య తెలుగు వాడనీ, నంబూద్రిపాదుల మూలం తెలుగుదేశమనీ చెప్పినట్లుగానే ప్రళయకావేరిని పులికాట్ నుండి వెలికి తెచ్చారు. ఒక్కొక్క కథ చదువుచుంటే హాయిగా అనిపించింది. పరిచయంగా ఉన్నట్టు, ఏ మాలిన్యమూ అంటని ఒక జీవితపు కాంతి తడిమినట్టుగా ఉంది. ఇలాంటి ప్రపంచం ఇకటుందని, ఉండేదని మరచిపోయిన చాలా ఏళ్లకి ఈ కథలు. ఈ జీవితంలో కష్టం వుంది, దైన్యం ఉంది. అయితే ఇదే పైచెయిగా కథల్లో కనిపించదు. అంతర్లీనంగా ఒక జీవితపు సొగసు, వేదనలో కూడా ఒక జీవితేచ్ఛ, అజ్ఞానంలో ఒక అమాయకత్వం...కనిపిస్తాయి. వేసవిలో మల్లెలుగా వైశాఖంలో అగ్నిపూలుగా నెల్లూరు మాండలికం అందంగా అమరింది. అభినందనతో-దేవసేన.తిరుపతి.
  • నేను మీకు తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రళయ కావేట్లో...మీ మీద రెండుసార్లూ పీకలదాకా కోపమొచ్చింది. రెండుసార్లూ అంతులేని దుఃఖం వచ్చింది. మొదటిసారి లోలాకోడ్ని తిరణాలో తప్పిపోయేలా చేసినందుకూ, ఇప్పుడిలా అర్థంతరంగా ఈ ప్రళయకావేరిని ముగిచ్చినందుకూ. గ్లాసునిండా పాయసంపోసుకొని, ఆరారాం తాగుతా, అట్టడుగుని అట్టగట్టుకు మిగిలిలున్న సగ్గుబియ్యం గింజల్ని జుర్రుకుందామని చూస్తున్నంతలో చేతిలోని పాయసం గిన్నె నేలపాలైతే కలిగినంత బాధ. ఏం చెప్పేది?నా శరీరానికి అరవై. మనస్సులోని స్పందనకు ఇరవై. రిటైర్డ్ టిచర్ని. చిన్నపాటి రైటర్ని. ఆనాటి శరత్, చలం, గోపిచంద్, కొడవకంటి నుండి ఈ నాటి పులికంటి, నామిని, మీరు నాపంచ ప్రాణలైపోయారు-వేమిరెడ్డి పద్మావతమ్మ .నెల్లూరు.