పొన్నాడ సుబ్బారావు
పొన్నాడ సుబ్బారావు భారత రాజకీయ నాయకుడు, న్యాయవాది. అతను భారతదేశ 1వ లోక్‌సభలో సభ్యునిగా నవరంగపూర్ నియోజకవర్గం నుండి 1952లో ఎన్నికై ప్రాతినిధ్యం వహించాడు.
ప్రారంభజీవితం
[మార్చు]అతను విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో 1889 నవంబరు 7న జన్మించాడు. అతని తండ్రి పొన్నాడ రామయ్య. [1] అతను విశాఖపట్నంలోని లండన్ మిషన్ హైస్కూల్ లోనూ, పర్లాకిమిడి రాజా కళాశాలలోనూ, మద్రాసులోని పచైయప్పాస్ కళాశాలలోనూ, విజయనగరం మహారాజా కళాశాలలోనూ విద్యాభ్యాసం చేసాడు. అతను మద్రాసు న్యాయ కళాశాలలో చదివాడు. [1] అతను బి.ఎ, బి.ఎల్ డిగ్రీలను పొందాడు.[1] 1908లో శేషమ్మ ను వివాహమాడాడు. వారికి ఎనిమిదిమంది పిల్లలు(వారిలో ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు) కలరు.[1] అతను జూలై 1913 నుండి జూలై 1915 మధ్య కాలంలో సి.బి.మిషన్ స్కూలులో విద్యాబోధన చేసాడు.[1] అతను తెలుగు భాషలో రోం చరిత్ర గూర్చి పుస్తకాన్ని 1914లో రచించాడు. [1]
స్వాతంత్ర్యోద్యమంలో...
[మార్చు]సుబ్బారావు 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా చేరాడు. [1] 1921-1922 కాలంలో అతను తన న్యాయవాద ప్రాక్టీసును విడిచిపెట్టి భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. [1] ఆ కాలంలో అతను విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా భాద్యతలను నిర్వహించాడు. [1]
పార్లమెంటు సభ్యునిగా...
[మార్చు]అతను 1951లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వాన్ని పరిత్యజించాడు. [1] 1952లో అతను నవరంగపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్ పార్టీ తరపున పోటీచేసి మొదటి లోక్‌సభకు ఎన్నికైనాడు. అతను ఆ ఎన్నికలో 67,257 ఓట్లు (46.96%) సాధించాడు.[2] అతను మొదటి లోక్‌సభలో ఒడిశా నుండి ఎన్నికైన ఆరుగురు ఎ.ఐ.జి.పి సభ్యులలో ఒకడు.[2]
అతను భారత లోక్‌సభ అధికారికంగా వెలువరించిన సభ్యుల జీవిత చరిత్రల ప్రకారం అతనికి హిందూ, క్రిస్టియన్ సాహిత్యం పట్ల, రైల్వే, గణాంకాల పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. [1]