Jump to content

పొదుపు

వికీపీడియా నుండి
పిగ్గీ బ్యాంకు ద్వారా తరచుగా ఉపయోగిస్తున్న పొదుపు విధానం.

సాధారణ వాడుకలో పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి.[1] ఆర్ధిక శాస్త్రం పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా పొదుపు ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను.

ఆర్ధిక శాస్త్రంలో పొదుపు

[మార్చు]

అర్థశాస్త్రంలో వ్యక్తిగతమైన పొదుపు అంటే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత వినియోగాన్ని తీసివేస్తే వచ్చే మిగులు.[2] మరోరకంగా చెప్పాలంటే ఆదాయంలో వెనువెంటనే వస్తుసేవలకై ఖర్చు చేయని భాగమే పొదుపు. వ్యక్తులు కాకుండా పరిశ్రమలు లేదా సంస్థలు చేసే పొదుపును తమ ఆదాయ భాగంలో పన్నులు, డివిడెంట్లు, ఇతర ఖర్చులు పోగా మిగిలే భాగంగా నిర్వచించవచ్చు. ప్రభుత్వాలు చేసే పొదుపు అనగా బడ్జెటులో వచ్చే మిగిలు.

పొదుపుగా చెప్పబడిన అర్థంలో ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన ఆదాయంలో ఖర్చుచేయకున్ననూ పాతబాకీలు చెల్లించడానికి వెచ్చించిన డబ్బు కూడా నిర్వచనం ప్రకారము పొదుపుగా పరిగణించబడుతుంది. అమెరికా స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు వడ్డీలకు చెల్లించిన చెల్లింపులను పొదుపుగా పరిగణించవు.

ఖర్చు తగ్గించడం (Saving), పొదుపు చేయడం (savings) పదాలకు అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలున్నాయి. మొదటిది దాని వలన వ్యక్తి నికర ఆస్తులు పెరిగితే రెండో దాని వలన ఆస్తులలో ఒక భాగం సాధారణంగా పొదుపు భాగం పెరుగుతుంది. పొదుపును దీర్ఘకాలంలో నది (ప్రవాహం) మాదిరిగా, స్వల్ప కాలమైతే చెరువు (ప్రవాహం లేనిది) గా పేర్కొనవచ్చు.

పొదుపుకు పెట్టుబడికి సన్నిహితమైన సంబంధం ఉంది. వస్తుసేవలకై ఖర్చు చేయకుండా పొదుపు ఉంచబడిన డబ్బు పెట్టుబడికి దోహదపడుతుంది. అదే సమయంలో పొదుపు కాకుండా ఖర్చు చేయబడిన వినిమయం వలన వస్తుసేవలకు డిమాండు పెరిగి మూలధనం పెరుగుతుంది తద్వారా ఆర్థికవృద్ధి జరుగుతుంది. కాబట్టి పొదుపు అనేది ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుగా ప్రభావితం చేయగలుగుతుంది.

అయినప్పటికినీ పొదుపు పెరిగితే సర్వవేళలా పెట్టుబడి పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. పొదుపును బ్యాంకులలో కాని పొదుపు గుణకంగా పనిచేసే మరే విధంగా చేయనప్పుడు అంటే వ్యక్తులు అట్టే డబ్బును డబ్బురూపంలోనే ఇంట్లో దాచుకోవడం వలన ఆ పొదుపు ఆర్థికవ్యవస్థకు ఏ విధంగానూ లాభకరం కాదు. అలాంటి పొదుపు వలన పెట్టుబడి పెరగదు సరికదా ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గి దాని వలన వస్తుసేవలకు డిమాండు తగ్గుతుంది. తత్ఫలితంగా ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తిలో కోత విధించడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే కార్మికులను తొలిగించడానికి కూడా సంస్థల నిర్వాహకులు సిద్ధపడతారు. అంటే పెట్టుబడికి పనికిరాని పొదుపు వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా, వస్తుసేవలకు డిమాండు తగ్గడం, ఆదాయ, ఉద్యోగిత తగ్గడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమన మార్గంలో పయనించడం జరుగుతుంది. పొదుపు మరీ తగ్గి ఖర్చు పెరిగినా దీనికి వ్యతిరేక ఫలితాలు కలిపిస్తాయి. పొదుపు తగ్గడం వలన వినిమయం అధికంగా జరిగి వస్తుసేవలకు డిమాండు పెరుగుతుంది. దానివలన ధరలు ఒక్క సారిగా పెరిగి ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు.

ఆర్థిక వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందని ప్రాథమిక వ్యవసాయదశ ఆర్థికవ్యవస్థలో పొదుపు చేసే డబ్బు రైతులకు తదుపరి సాగుచేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ వారు ధాన్యం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బును వెంటనే వినియోగం చేస్తే ఆ తరువాత వారికే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగులుతుంది.

పొదుపు, వడ్డీ రేటు

[మార్చు]

సాంప్రదాయ ఆర్థిక వేత్తలు వడ్డీరేటు పొదుపు, పెట్టుబడులను సమన్వయ పరుస్తాయనే అభిప్రాయాన్నివెలిబుచ్చారు. పొదుపు పెరిగితే వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడి పెరుగుతుందని, పొదుపు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడి తగ్గుతుందని సాంప్రదాయక ఆర్థికవేత్తలు సిద్ధాంతీకరించారు. కాని జె.ఎం.కీన్సు ఆర్థికవేత్త వడ్డీరేట్లను నిర్ణయించేది పొదుపుకు కాని పెట్టుబడి దగ్గరి సంబంధం లేదని (ఆ రెండూ వడ్డీరేటుతో అవ్యాకోచసంబంధం కలిగినవిగా) నిర్థారించాడు. స్వల్పకాలంలో వస్తువులకు ఉండే డిమాండు, సప్లయి సామర్థ్యమే వడ్డీరేటును నిర్ణయిస్తుదని కీన్సు తన సిద్ధాంతంలో తెలిపినాడు.

వ్యక్తిగతమైన పొదుపు

[మార్చు]

భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ ద్రవ్యోల్బణం వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా వడ్డీ లభించే డిపాజిట్ రూపంలో భవిష్యత్తు వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. నగదుగా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది. చాలా సందర్భాలలో పొదుపు, పెట్టుబడి పదాలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడడానికి ఇలాంటి స్థితే కారణం. ఉదాహరణకు: చాలా డిపాజిట్ అక్కౌంట్లు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి పెట్టుబడి అక్కౌంట్లుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తులు చేసిన పొదుపు ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడి రూపంలో ఆర్థికవ్యవస్థలో ప్రవేశిస్తుంది.

ఒక్కరే చాలు లేదా అసలే వద్దు

[మార్చు]

ఓవైపు ఆర్థికమాంద్యం.. మరోవైపు పెరుగుతున్న ధరలు... సంతానం విషయంలోనూ ‘పొదుపు’ పాటించేలా చేస్తున్నాయి. ఖర్చు తగ్గాలంటే ఒక్క సంతానం చాలని కొత్త దంపతులు భావిస్తున్నారు. పెళ్లైన కొత్తలోనే పిల్లలు కావాలనుకునే వారు సైతం మూడేళ్ల తర్వాత చూద్దాంలే అన్న అభిప్రాయానికి వచ్చేశారు. మరికొందరు ఖర్చులకు భయపడి అసలు పిల్లలే లేకున్నా ఫర్వాలేదన్నట్లుగా ఉన్నారు. పిల్లల ఆలన, పాలన కష్టమన్న భావనతో ఒక్కరితో సరి పెట్టుకుంటున్నారు. ఒకరికంటే ఎక్కువ పిల్లలు పుడితే వారి పెంపకం కష్టమవడంతో పాటు.. వారికోసం ఎక్కువ సెలవులు పెడితే జీతంలో కోత పడుతుందన్న భయంతో చాలామంది ముందుచూపుతో వ్యవహరి స్తున్నారు. ఆర్థికమాంద్యం, ఉద్యోగాల్లో కోత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఇంటి అద్దెల మోత, స్కూలు ఫీజులు ఇతర కారణాలు ప్రతి ఒక్కరి జీవితంపైనా ప్రభావం చూపుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు పోయి అప్పుల బాధపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘ టనలూ ఇటీవలికాలంలో పెరుగుతున్నాయి. ఒక సంతానం ఉంటేనే భారంగా ఇల్లు గడుస్తున్న తరుణంలో రెండో సంతానం వద్దంటే వద్దన్న భావనతో చాలామంది ఉన్నారు. కుటుంబ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం వస్తోంది.గతంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కావాలనుకునేవారు సైతం ప్రస్తుతం ఆడైనా, మగైనా ఒక్కరు చాలన్న భావనకు వచ్చేశారు. చిన్నకుటుంబం నినాదం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది.బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతోందని గగ్గోలు పెడుతున్నా స్ర్తీలు సైతం మగపిల్లలే కావాలని కోరుకుంటున్నారు. సమాజంలో మహిళలపై పెరుగుతున్న, జరుగుతున్న దారుణాల నేపథ్యంలో చాలామంది తమకు ఆడపిల్లలు వద్దని స్పష్టంగా చెబుతున్నారు. ఆడ శిశువు అని తెలిసిన క్షణాల్లోనే తమకు అబార్షన్‌ చేయమని వైద్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.అద్దె ఎక్కువ చెల్లిస్తేనే ఇళ్లు దొరికే పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువ సంతానం ఉంటే ఖర్చులు పెరుగుతాయన్న ఆలోచనతో ఒకరితో సరిపెట్టుకుంటున్నారు.http://www.suryaa.com/showStateNews.asp?ContentId=14953

వడ్డీ రేటులు

[మార్చు]

వాస్తవ వడ్డీరేటు అనగా పన్ను మినహాయింపులు, ద్రవ్యోల్బణ రేటు తగ్గింపులు. కొన్ని సందర్భాలలో వాస్తవ వడ్డీరేటు శూన్యం కంటే తక్కువ ఉండవచ్చు దాన్నే ద్రవ్యోల్బణ నష్ట ప్రభావంగా పేర్కొనవచ్చు.

పొదుపును నిర్ణయించే కారకాలు

[మార్చు]

అర్థశాస్త్రం ప్రకారం పొదుపును నిర్ణయించే కారకాలను క్రిందివిధంగా విభజించవచ్చు:

ఆదాయం

పొదుపును నిర్ణయించే ప్రధాన కారకం ఆదాయం. ఆదాయం అధికంగా ఉంటే సాధారణంగా పొదుపు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆదాయానికి, పొదుపునకుఆవినాభావ సంబంధం ఉన్నట్టు. తక్కువ ఆదాయం కలవారికి వారికి లభించే కొద్ది ఆదాయం వారి అవసరాలను తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి వినియోగం చేయగా పొదుపుగా మిగిలే భాగం అతిస్వల్పంగా ఉంటుంది.

వస్తుసేవల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం)

నిత్యావసరాలకు వినియోగించే వస్తుసేవల ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ సమయంలో దానికి తగనట్లుగా ఆదాయం పెరగనిచో ఖర్చు పెరిగి పొదుపు భాగం తగ్గడం సాధారణమే.

భవిష్యత్తు అవసరాలు

పొదుపుపై భవిష్యత్తు అవసరాలు కూడా ప్రభావం చూపిస్తుంది. వివాహాలు, వేడుకలు, ముసలితనం, స్వంత గృహం మొదలగు భవిష్యత్తు అవసరాలకై పొదుపు చేయడం సాధారణంగా తక్కువ ఆదాయం కలవారిలో జరుగుతుంది.

మానసిక కారణాలు

వ్యక్తుల మానసిక కారణాలు కూడా పొదుపును నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో ధరలు తగ్గవచ్చని భావిస్తే వ్యక్తులు ప్రస్తుత వినియోగాన్ని తగ్గించి పొదును పెంచవచ్చు. లేదా కొందరి వ్యక్తులకు స్వభావరీత్యా ఉండే పిసినాసితనం కూడా పొదుపుకు దోహదపడుతుంది.

ప్రభుత్వ పథకాలు

ఆర్థిక వ్యవస్థలో పొదుపు అవసరమైనప్పుడు ప్రభుత్వం పొదుపునకు ప్రాత్సాహం కల్పించడానికి వడ్డీరేట్లను పెంచుతుంది. ఇవి సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వాలు తీసుకొనే సాధారణ చర్యలు. ప్రభుత్వాలు కల్పించే అనేక సబ్సిడీ పథకాలు కూడా వ్యక్తుల వినియోగ ఖర్చులను తగ్గించి పొదుపును పెంచుతాయి.

పొదుపు వైపరీత్యం

[మార్చు]

సాధారణంగా పొదుపు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. పొదుపు వలన పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం వలన పరిశ్రమలు అధికంగా స్థాపించబడి కార్మికులను ఉపాధి అవకాశాలు అధికమౌతాయి. కాని ఇవి నాణేనికి ఒకవైపు మాత్రమే. స్వల్పకాలంలో పొదుపు లాభకరమైనప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే ఆర్థిక వ్యవస్థకు పొదుపు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకాలంలో అధిక పొదుపు వలన వస్తుసేవల యొక్క డిమాండు పడిపోయి సంస్థలు ఉత్పత్తి తగ్గించే దశ రావచ్చు. అదే జరిగితే పరిశ్రమలలో కార్మికుల సంఖ్య తగ్గి నిరుద్యోగాలు పెరగవచ్చు. స్థూలంగా ఆర్థిక వ్యవస్థ సంక్ష్యోభంలోకి కూరుకుపోతుంది. దీన్నేఆర్థికవేత్తలు పొదుపు వైపరీత్యంగా పిలుస్తారు.

దీన్ని మరోరకంగా చెప్పవచ్చు. ఒకరి ఖర్చు మరొకరి ఆదాయం. ఒక వ్యక్తి పొదుపు చేస్తునాడంటే వినిమయం ఆ మేరకు తగ్గించినట్లే. వినిమయం తగ్గడం వలన ఇతరుల ఆదాయం కూడా తగ్గినట్లు. కాబట్టి పొదుపు అనేది ఒక వ్యక్తి దృష్ట్యా చూస్తే ప్రయోజనకరమేమో కాని ఆర్థిక వ్యవస్థ మొత్తం దృష్ట్యా చూస్తే నష్టమే అధికం. అంతేకాకుండా ఒక వ్యక్తి ఖర్చు ఇతరులకు ఎన్నో రెట్ల ఆదాయాన్ని కల్పిస్తుంది. ఆర్థిక పరిభాషలో ఇది వినిమయ గుణకంగా పిలువబడుతుంది. ఉదాహరణకు A వ్యక్తి ఖర్చు B వ్యక్తికి ఆదాయం, B తనకు ఆదాయంగా లభించిన మొత్తంలో నుంచి ఖర్చు చేస్తే C వ్యక్తికి ఆదాయంగా లభిస్తుంది. ఇలా వినిమయం చేసిన డబ్బు గుణకం రూపంలో అనేకులకు ఆదాయంగా వస్తుంది. పొదుపు చేయడం వలన ఆ మేరకు డబ్బు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Random House Unabridged Dictionary." Random House, 2006
  2. Keynes, J: "The General Theory of Employment, Interest and Money", Chapter 6, Section II. Macmillan Cambridge University Press, for Royal Economic Society, 1936
"https://te.wikipedia.org/w/index.php?title=పొదుపు&oldid=3879543" నుండి వెలికితీశారు