Jump to content

పెరుమాండ్ల -సంకీస

అక్షాంశ రేఖాంశాలు: 18°18′01″N 78°06′10″E / 18.3003691°N 78.10265°E / 18.3003691; 78.10265
వికీపీడియా నుండి

పెరుమాండ్ల - సంకీస, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, డోర్నకల్ మండలంలోని గ్రామం.[1].

పెరుమాండ్ల -సంకీస
—  రెవిన్యూ గ్రామం  —
పెరుమాండ్ల -సంకీస is located in తెలంగాణ
పెరుమాండ్ల -సంకీస
పెరుమాండ్ల -సంకీస
అక్షాంశరేఖాంశాలు: 18°18′01″N 78°06′10″E / 18.3003691°N 78.10265°E / 18.3003691; 78.10265
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు
మండలం డోర్నకల్లు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,989
 - పురుషుల సంఖ్య 2,003
 - స్త్రీల సంఖ్య 1,986
 - గృహాల సంఖ్య 1,017
పిన్ కోడ్ 506381
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన డోర్నకల్ నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1017 ఇళ్లతో, 3989 జనాభాతో 1620 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2003, ఆడవారి సంఖ్య 1986. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 582 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1663. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578671.[3] పిన్ కోడ్: 506381.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి దోమకల్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దోమకల్లోను, ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలో ఉన్నాయి.

రజాకర్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరయోధుల గడ్డ

[మార్చు]

తెలంగాణ సాయుధ పోరులో పెరుమాళ్లసంకీస కీలకపాత్ర పోషించింది. డోర్నకల్ మండలంలోని పెరుమాళ్లసంకీసతోపాటు బూరుగుపాడు, ఉయ్యాలవాడ, వెన్నారం తదితర గ్రామాలకు చెందిన అనేక మంది రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. తెలంగాణ ప్రాంతం నుంచి రజాకార్లను తరిమికొట్టాలంటూ దళాలతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరిచాడు. ఒక్కో దళంలో 12 మంది సభ్యుల చొప్పున 8 దళాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1948 సెప్టెంబరు 1వ తేదీన రాక్షస రజాకార్ల దమనకాండలో 21 మంది యోధులు సజీవ దహనమయ్యారు. ఇది జరిగిన కొద్దిరోజులలోనే 1948 సెప్టెంబరు 17న రజాకర్ల పాలన అంతమయింది. తెలంగాణ గడ్డ మీద స్వేచ్ఛా వాయువులు వీచాయి. రజాకార్ల పీడ విరగడ అయిన ఈ రోజునే తెలంగాణ ప్రజలంతా విమోచన దినంగా ఆచరిస్తూ, ఆనందోత్సాహాలతో సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జరిగి 68 సంవత్సరాలు గడచినా వీరుల త్యాగాలను తమ హృదయంలో పదిలపరచుకొని ప్రతి సెప్టెంబరు 17న అమరవీరుల త్యాగాలను నెమరువేసుకుంటూ ఆ పోరాటాలకు సజీవ సాక్షులుగా నిలిచిన స్వాతంత్ర్య సమర యోధులను గ్రామస్థులు సత్కరించుకుంటున్నారు.

1947 లో నైజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పెరుమాండ్ల సంకీస ఉద్యమ కారులు 3 దళాలను నిర్మించుకొని అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ గ్రామానికే చెందిన తుమ్మ శేషయ్య నాయకత్వంలో ప్రజా చైతన్యాన్ని రగిలిస్తూ ఆయుధాలను సేకరించుకొని పటిష్ఠమైన ఉద్యమానికి రూపుదిద్దారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సంకీస గ్రామ యోధులను ఏకత్రాటిపై నిలిపిన తుమ్మ శేషయ్య పన్నుల నిరాకరణోద్యమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే భూస్వాముల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు పంపిణీ చేసే కార్యాచరణను రూపొందించి ఆచరించారు. ఇదే సమయంలో ప్రాంతీయ ఆంధ్రమహాసభ సంకీస గ్రామ పెద్దచెరువు సమీపంలో జరిగింది. ఈ మహాసభలో మంచికంటి రామకిషన్‌, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి లాంటి ఉద్దండులు పాల్గొని ఉద్యమ తీరుతెన్నుల గురించి విశ్లేషించుకునే సమయాన, రజాకార్లు మహాసభపై విరుచుకుపడ్డారు. అందుకు ప్రతి దాడి చేసిన ఉద్యమకారులు ఇద్దరు రజాకార్లను మట్టుబెట్టారు. మూడు సార్లు గ్రామంపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు చావబాదారు. అడ్డు వచ్చిన ఆడవాళ్లను హించించి మానభంగం చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలంటే తుమ్మ శేషయ్యను అంతమొందించాలని రజాకార్లు శేషయ్య ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబరు 1వ తేదీన 200 మంది పోలీసులతో కలిసి పెరుమాండ్ల సంకీస గ్రామంపై ముప్పేట దాడి చేశారు. దొరికిన మగవారందరిని చేతులు కట్టేసి బూటుకాళ్లతో తన్నారు. అయినా శేషయ్య జాడకాని, దళం జాడ కాని చెప్పించలేక పోయారు. ఆ కోపంతో బందెలదొడ్డి ప్రాంతంలో ఉన్న గడ్డి వాము దగ్గర కాల్పులు జరిపి, కొన ఊపిరితో ఉన్నవారితో సహా మొత్తం 21 మందిని సజీవదహనం చేశారు. ఇందులో తేరాల రామయ్య, తేరాల మల్లయ్య, బుట్టి పిచ్చయ్య, శెట్టి పెదనర్సయ్య, శెట్టి రామయ్య, శెట్టి వెంకటనర్సయ్య, దండు ముత్తయ్య, కూరపాడు సత్తెయ్య, కాసం లక్ష్మీనర్సయ్య, మోటమర్రి పట్టయ్య, గండు ముత్తయ్య తదితరులు అమరులయ్యారు. పోరాట యోధుల స్మృతి చిహ్నంగా పెరుమాండ్ల సంకీస గ్రామ పంచాయతీ ఆవరణలో 1994లో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న అమరులను స్మరించుకుంటున్నారు. ఆ తరువాత ఉద్యమ నాయకుడు తుమ్మ శేషయ్య కొంతకాలం తరువాత నర్సంపేట ప్రాంతానికి వలసవెళ్లి 1967 -68 ప్రాంతంలో అస్వస్థతకు లోనై మరణించారు.

రామాలయం

[మార్చు]

పూర్వం ఇక్కడ చిన్న గోపాల స్వామి ఆలయం వుండేదట, అప్పటి గ్రామా దొర అయిన వీరసాని అనే అతడు, గోపాల స్వామి మూర్తి స్థానంలో శ్రీతిరుపతి వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిస్థించాలని తిరుమలలోని పనివారికి విగ్రహాన్ని చేసే పని అప్పటించారట అయితే మూలవిరాట్టుని మలచడానికి శిల్పులు ప్రయత్నించిన ప్రతిసారి శ్రీ రాముడి రూపమే ఆవిష్కృతమైందట. దాంతో అది స్వామివారి మహిమగా భావించి అతను విగ్రహాన్నే ప్రతిష్ఠించారు. సాధారణంగా గర్భాలయాలలో సీతారాములు లక్ష్మణ హనుమంతులు మాత్రమే దర్శన మిస్తుంటారు. కానీ ఇక్కడి గర్భాలయంలో సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొలువుదీరి వుండటం విశేషం. గర్భాలయం ఎదురుగా హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. హనుమ తమ మహిమలను చూపే క్షేత్రంగా 'పెరుమాండ్ల సంకీస' కనిపిస్తుంది. ఇక్కడి రామాలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నుంచి ఉంది. శ్రీరాముడి ఇష్టపడి కొలువైన క్షేత్రమిదంటున్నారు.

శతాబ్దాల చరిత్ర గల ఇక్కడి ఆలయ వైభవానికి రాజగోపురం అద్దం పడుతూ వుంటుంది. విశాలమైన ప్రాంగణం ఓ వైపున నైవేద్యాలను తయారుచేసే 'తిరువంటపడి' మరో వైపున కల్యాణోత్సవం జరిపే మంటపం కనిపిస్తాయి. అక్కడి నుంచి లోపలికి వెళితే వేణుగోపాలస్వామి మందిరం ఆండాళ్ మందిరం ఆళ్వారుల మందిరం దర్శనమిస్తాయి. ఆ పక్కనే గల అద్దాల మంటపంలో, ఉత్సవాల సమయంలో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తుంటారు. ఇక్కడి శ్రీ రాముడు సౌందర్య మూర్తి ఈ అందం అటు మూలమూర్తిలోను ఇటు ఉత్సవ మూర్తిలోను తొణికిసలాడుతుండటం విశేషం. ఈ కారణంగానే వైభవంలో భద్రాద్రి రాముడు ... చక్కదనంలో సంకీస రాముడు అని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ శ్రీ రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి.

శివాలయం

[మార్చు]

డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో ప్రజలకు సిరిసంపదలను ప్రసాదించే శివుడు కొలువై ఉన్నాడు. శివుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. శివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించినా ప్రతి పుణ్యక్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ఈ క్షేత్రంలో శివుడిని దర్శించుకుంటే సంపదలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని సమాచారం

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెరుమాండ్ల -సంకీసలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెరుమాండ్ల -సంకీసలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెరుమాండ్ల -సంకీసలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 374 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 41 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 147 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 32 హెక్టార్లు
  • బంజరు భూమి: 226 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 800 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 670 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 356 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెరుమాండ్ల -సంకీసలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 356 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెరుమాండ్ల -సంకీసలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, జొన్న

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]