పెమ్మసాని చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని పెమ్మసాని చంద్ర శేఖర్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
పెమ్మసాని చంద్రశేఖర్

కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు గల్లా జయదేవ్
నియోజకవర్గం గుంటూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1976-03-07) 1976 మార్చి 7 (వయసు 48)
బుర్రిపాలెం, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్‌
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు
జీవిత భాగస్వామి శ్రీరత్న కోనేరు
సంతానం అభినవ్, సహస్ర
నివాసం ఇంటి.నెం 5-1/2, కల్యాణ మండపం దగ్గర, బుర్రిపాలెం గ్రామం , తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిన్ కోడ్ - 522301
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు

పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు.[1][2]

పెమ్మసాని చంద్రశేఖర్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3] ఆయనకు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిత్వ శాఖలు కేటాయించారు.[4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామంలో 1976 మార్చి 7న పెమ్మసాని సాంబశివరావు, సువర్చల దంపతులకు జన్మించాడు. ఆయన 1991లో పదవ తరగతి, 1993లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డాక్టర్ కావాలనే లక్ష్యంతో 1993-94లో ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించిఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. చంద్రశేఖర్‌ మెడిసిన్ పూర్తి చేసి తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000లో అమెరికాకు వెళ్లి పీజీ, 2005లో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గీసింజర్‌ మెడికల్‌ సెంటర్‌ నుంచి ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ఎండీ పట్టా అందుకొని ఆ తరువాత జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ అమెరికాలో మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేస్తూ చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ను ఆన్‌లైన్‌ లో అందించేవాడు. ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కడంతో ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చంద్రశేఖర్‌ ఆ తరువాత వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చేందుకు 'యు వరల్డ్‌' సంస్థను ప్రారంభించాడు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవాడు.

సేవ కార్యక్రమాలు

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ పెమ్మసాని ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచితవైద్య సేవలు, వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచాడు. ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చి గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చాడనికి వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వో ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాడు. పెమ్మసాని చంద్రశేఖర్‌ గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ అని స్కూల్ ను ప్రారంభించాడు. ఆయన పెమ్మసాని ట్రస్టును ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలపట్ల ఆసక్తితో 2014 ఎన్నికల సమయంలో రాజకీయ, ప్రచార పనులలో చురుకుగా పాల్గొన్నాడు. చంద్రశేఖర్ 2014లో టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించగా 2014, 2019లో మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం పని చేసి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఇండియన్ సెల్‌లో చురుకుగా పాల్గొన్నాడు.

పెమ్మసాని చంద్రశేఖర్‌ 2024లో నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఆశించాడు కానీ, గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో చంద్రశేఖర్ కు టీడీపీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 344695 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. పెమ్మసాని చంద్రశేఖర్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. EENADU (5 June 2024). "గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లోనూ ఘన విజయం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Guntur Loksabha Election Result". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (9 June 2024). "బుర్రిపాలెం డాక్టర్‌ గారు... కేంద్ర మంత్రి అయ్యారు". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. EENADU (10 June 2024). "రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. EENADU (10 June 2024). "తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  6. EENADU (10 June 2024). "పెమ్మసాని చంద్రశేఖర్‌ అనే నేను..." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  7. BBC Telugu (10 June 2024). "పెమ్మసాని చంద్రశేఖర్: పోటీ చేసిన తొలిసారే గెలిచి కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న డాక్టర్". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.