Jump to content

పెదవేగి

అక్షాంశ రేఖాంశాలు: 16°48′34.1417″N 81°6′24.3968″E / 16.809483806°N 81.106776889°E / 16.809483806; 81.106776889
వికీపీడియా నుండి
పెదవేగి
పెదవేగి రహదారి నామ ఫలకం
పెదవేగి రహదారి నామ ఫలకం
పటం
పెదవేగి is located in ఆంధ్రప్రదేశ్
పెదవేగి
పెదవేగి
అక్షాంశ రేఖాంశాలు: 16°48′34.1417″N 81°6′24.3968″E / 16.809483806°N 81.106776889°E / 16.809483806; 81.106776889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంపెదవేగి
విస్తీర్ణం42.97 కి.మీ2 (16.59 చ. మై)
జనాభా
 (2011)[1]
11,846
 • జనసాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,033
 • స్త్రీలు5,813
 • లింగ నిష్పత్తి964
 • నివాసాలు3,153
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534435
2011 జనగణన కోడ్588377

పెదవేగి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన ఒక గ్రామం, అదే మండలానికి పరిపాలనా కేంద్రం. పెదవేగి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరుకు 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3153 ఇళ్లతో, 11846 జనాభాతో 4297 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6033, ఆడవారి సంఖ్య 5813. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3690 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 137. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588377.[2]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి, పెదవేగిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామం స్వరూపం

[మార్చు]

జిల్లా కేంద్రం ఏలూరు నుండి గోపన్నపాలెం మీదుగా పెదవేగి చేరుకోవచ్చును. ఇది మెరక ప్రాంతం. (కాలువల వంటి సదుపాయాలు లేవు). ప్రధానమైన వూరుతో బాటు గార్ల మడుగు, దిబ్బగూడెం లక్ష్మీపురం, దిబ్బగూడెం సెంటర్ వంటి శివారు గ్రామాలు జనావాస కేంద్రాలు. చాలా ఇండ్లు వూరిలో కేంద్రీకృతం కాకుండా తోటలలో విస్తరించి ఉంటాయి.మండల వ్యవస్థ రావడానికి ముందు పెదపాడు బ్లాక్ (పంచాయితీ సమితి) లో ఒక వూరిగా, ఏలూరు తాలూకాలో ఉండేది. తరువాత ఇది పెదవేగి మండల కేంద్రమైంది.

చరిత్ర

[మార్చు]
పెదవేగిలో బయల్పడిన శిల్పాలు

పెదవేగి ప్రస్తుతము ఒక చిన్న గ్రామం గాని, దీనికి ప్రముఖమైన చరిత్ర ఉంది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. పెదవేగి సమీపంలో జీలకర్రగూడెం, కంఠమనేనివారిగూడెం వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన శాతవాహనుల, ఇక్ష్వాకుల, కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. అంతకు పూర్వం సా.శ.140 కాలంలో గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ వేంగి నగరం శాలంకాయనుల రాజధాని అని వర్ణించాడు. విష్ణుకుండినుల కాలంలోను, తూర్పు చాళుక్యుల ఆరంభ కాలంలోను ఆంధ్రదేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.

  • బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (సా.శ.300) - వేంగినగరం వారి రాజధాని.
  • శాలంకాయనులు - సా.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి (సూర్యుడు) భక్తికి చెందిన ఆలయ శిథిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.[3][4]
  • విష్ణుకుండినులు, పల్లవులు - సా.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
  • తూర్పు చాళుక్యులు - పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగుభాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా తూర్పు చాళుక్యులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.

పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో పెక్కు శిథిలాలు బయట పడినాయి. వీటిలో ఒక మంటపం ఉంది.

త్రవ్వకాలు

[మార్చు]
పెదవేగి, ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం
దస్త్రం:APvillage Pedavegi 1.JPG
పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు

పూర్వం పెదవేగిని వేంగీపుర అని పిలిచేవారు. పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన ఇటుకలతో కూడిన పెద్ద రాతి కట్టడం బయల్పడినది. గదుల నిర్మాణం వంటి దీనిని ఒక బౌద్ధ స్థూపంగా గుర్తించారు.ఆ ప్రదేశంలో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, పూసలు, కర్ణాభరణాలు, పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే నగర దేవత అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తుంది.[5] చాలా శిల్పాలను శివాలయంలోని వరండాలో ఉంచారు.

సాహిత్యంలో పెదవేగి

[మార్చు]

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తమ "ఆంధ్ర ప్రశస్తి" ఖండ కావ్యంలో "వేంగి క్షేత్రం" అనే కవితలో ఈ స్మృతులగురించి చక్కగా వర్ణించాడు. వాటిలో మచ్చుకు రెండు పద్యాలు...

ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే! లేవుపో: భావనా
స్ఫుట మూర్తిత్వమునైన బొందవు, నెదో పూర్వాహ్ణ దుష్కాలపుం
ఘటికల్ గర్భమునందిముడ్చుకొనియెం గాబోలు, నీ పల్లెచో
టట లోకాద్భుత దివ్య దర్శనమటే! యాభోగమేలాటిదో!
వేగిరాజ్యపు పల్లెవీధుల జెడుగుళ్ళ రిపుల గవ్వించు నేరుపుల దెలిసి
ఎగురుగోడీబిళ్ళ సొగసులో రిపుశిరస్సు బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పు దెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొరపు గఱచి
కోతికొమ్మచ్చిలో కోటగోడల నెగబ్రాకి లంఘించు చంక్రమణమెరిగి
తెనుగు లంతప్డె యవి నేర్చుకొనియ యుందు
రెన్నగా తెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గు పాలతో రంగరించి
బొడ్డు కోయని కూనకే పోయుదురట!

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప బాలబడి పెదవేగిలో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏలూరులో, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెదవేగిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెదవేగిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెదవేగిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 369 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 157 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 397 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 141 హెక్టార్లు
  • బంజరు భూమి: 618 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2615 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 618 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 2615 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెదవేగిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 2615 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెదవేగిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, వేరుశనగ

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

పామాయిల్,

వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు]
పెదవేగి గ్రామంలో కూలిపనులకు వెళుతున్న వ్యవసాయ శ్రామికులు. వెనుక ప్రొద్దు తిరుగుడు తోటలు

పెదవేగి ప్రాంతంలో నేల అధికంగా ఎర్రచెక్కు నేల. పైన ఒకటి అడుగు వరకు ఇసుక ఉండి దాని క్రింద ఎర్రమట్టి, రాతినేల (గ్రావెల్) ఉంటాయి. ఇక్కడ ప్రధానముగా మెరక పంటలు - కొబ్బరి, నిమ్మ, బత్తాయి, కూరగాయలు, పామాయిల్, పుగాకు వంటి వ్యవసాయము ఎక్కువగా జరుగుతున్నది. ఒక పెద్ద చెరువు, మరి రెండు చిన్న చెరువులు (మిరపకుంట, ఏనుగు గుండం) ఉన్నాయిగాని, భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. 1970 వరకు ఎక్కువగా బీళ్ళు, చిట్టడవులుగా ఉన్న ఈ ప్రాంతంలో కరెంటు సదుపాయము వల్ల వ్యవసాయం చాలా వేగముగా అభివృద్ధి చెందింది. అడవులతో పోటీపడే దట్టమైన తోటలు చుట్టుప్రక్కల కనువిందు చేస్తాయి.

1990ల వరకు పుగాకు, నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, మొక్కజొన్న, కూరగాయలు కొద్దిపాటి వరి పంటలు మాత్రమే ఈ ప్రాంతంలో కనిపించేయి. తరువాతి కాలంలో రైతులు చొరవగా క్రొత్త పంటల ప్రయోగాలు మొదలు పెట్టారు. మల్బరీ తోటలతో పట్టు పురుగుల పెంపకం, పామాయిల్ తోటలు క్రొత్త మార్పులకు నాంది పలికాయి. ముందునుండి వేసే పంటలకు తోడుగా ఇప్పుడు పూల తోటలు, ఔషధి మొక్కలు, టేకు, జామాయిల్, పామాయిల్, కంది, మొక్క జొన్న, వేరుశనగ, కోకో, మిరియం, తమలపాకు, ప్రొద్దు తిరుగుడు వంటి రకరకాలైన తోటలు చూడవచ్చును. పెరుగుతున్న విద్య, వ్యాపార, రవాణా సౌకర్యాలు ఈ మార్పులకు సహకారం అందించాయి. 1960 నాటికి వూరిలో చెదురుమదురుగా వున్న మోటబావులు, చెరువులు మాత్రమే నీటివనరులు. తరువాత బోరులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మొదటిలో 200 అడుగుల లోతులో పడే నీటికోసం ఇప్పుడు 1000 అడుగుల కంటే అధికంగా బోరు వేయవలసివస్తున్నది. దాదాపు అన్నీ 'సబ్మెర్సిబుల్' పంపులే. కనుక రైతులకిచ్చే ఉచిత విద్యుత్తు సౌకర్యం ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా గోదావరి-కృష్ణా నదులను కలిపే కాలువ ఈ వూరి సమీపంనుండి వెళుతుంది. ప్రస్తుతం (2008లో) నిర్మాణంలో ఉన్న ఈ కాలువ ద్వారా నీటి సదుపాయం కలిగితే ఈ ప్రాంత వ్యవసాయంలో గణనీయమైన మార్పులు రావచ్చునని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలలాగానే రైతులు అరకొర ఆదాయంతోను, వర్షాభావ పరిస్థితులతోను, అకాలవర్షాలతోను సతమతమవుతున్నారు. వ్యవసాయంపైన వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడం, పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరిగిపోవడం వలన వ్యవసాయం గిట్టుబాటుగా ఉండడంలేదు. ఇందుకు తోడు కొద్దిమంది పెద్దరైతులను మినహాయిస్తే చాలా వరకు చిన్న చిన్న కమతాలు. ఈ పరిస్థితులలో చోటు చేసుకొన్న మరొక పరిణామం- స్థానికేతరుల పెట్టుబడులు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద తోటలను ఇతర పట్టణాలకు చెందిన సంపన్నులైన వ్యాపారులు, ఉద్యోగులు కొనుగోలు చేయడం జరిగింది. కనుక స్థానికుల స్వంతమైన భూమి విస్తీర్ణం క్రమంగా తరుగుతున్నది. - దీని వలన వూరిలోకి గణనీయమైన పెట్టుబడి వస్తున్నది. కార్పొరేట్ వ్యవసాయం పోకడలు కనిపిస్తున్నాయి. కాని రైతులకు భూమితో ఉన్న అనుబంధం పలుచబడుతుంది.

పరిశ్రమలు

[మార్చు]
భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి
దస్త్రం:APvillage Pedavegi 2.JPG
సహకార పామాయిల్ కర్మాగారం

భారత ప్రభుత్వము, పెదవేగిలో జాతీయ పరిశోధనా కేంద్రము (పామ్ ఆయిల్) ను నెలకొల్పింది. ఈ కేంద్రములో పామాయిల్ సాగులోని ఆధునిక మెళుకువలలో రైతులకు శిక్షణ ఇస్తారు.[6] సహకార పామాయిల్ కర్మాగారము ఈ వూరిలోనే ఉంది.

ఆలయాలు

[మార్చు]
పెదవేగిలోని సాయిస్తూపం

పెదవేగి గ్రామంలో శివాలయం చాలా పురాతనమైనది. గర్భగుడి మాత్రమే ఆ కాలానికి చెందినది. చుట్టూరా ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. వూరిలో క్రొత్తగా కట్టిన ఒక చిన్న బ్రహ్మంగారిగుడి ఉంది. శివారు గ్రామాలలో చిన్నచిన్న గుళ్ళు ఉన్నాయి. గార్ల మడుగులో ఒకషిర్డీ సాయిబాబా గుడి ఉంది. విమానాశ్రయం వద్ద (లక్ష్మీపురం తోటలలో) ఒక చక్కనిషిర్డీ సాయిబాబా గుడి ఉంది. అక్కడ వెయ్యి అడుగుల సాయి స్తూపం ఉంది. పెదవేగి, గోపన్నపాలెం రొడ్డుమీద పెద్ద రావిచెట్టు క్రింద నాగేంద్ర స్వామి, హనుమంతుడు విగ్రహాలుండేవి. 2005 తరువాత అక్కడ ఒక ఆలయంలా నిర్మించి నాగాంజనేయ స్వామి మందిరం అని పిలుస్తున్నారు. దిబ్బగూడెం సెంటరులో ఒక మసీదు ఉంది. క్రైస్తవులు ఎక్కువగా నివసించే గూడెంలలో చర్చిలు ఉన్నాయి. పెదవేగి చుట్టుప్రక్కల గ్రామాలలో జరిగే రాట్నాలమ్మ తల్లి జాతర (రాట్నాలకుంట), అచ్చమ్మ పేరంటాళ్ళ తిరుణాలు (గాలాయగూడెం), బలివే జాతర (బలివే) ఈ ప్రాంతంలో ముఖ్యమైన ఉత్సవాలు.

సదుపాయాలు

[మార్చు]

రవాణా

[మార్చు]

జిల్లా కేంద్రానికి దగ్రరలోనే ఉన్నందున పెదవేగి గ్రామానికి ఏలూరు పట్టణానికి మధ్య ప్రయాణ సదుపాయాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం మండలంలో దాదాపు అన్ని గ్రామాలూ మంచి తారు రోడ్లతో కలుపబడి ఉన్నాయి. గట్టి నేల కావడంతో రోడ్లు బాగానే ఉంటాయి. (త్వరగా పాడవ్వవు). 1970కి ముందు తారు రోడ్లు లేవు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపాలెం అతి దగ్గరి బస్ స్టాప్‌గా ఉండేది. అక్కడికి వెళ్ళి ఏలూరుకు బస్సు ఎక్కవలసి వచ్చేది. (తడికలపూడి, జంగారెడ్డిగూడెంలనుండి ఏలూరుకు వెళ్ళే బస్సులు). అప్పటిలో సైకిళ్ళు, ఎడ్లబండ్లు మాత్రమే ముఖ్యమైన ప్రయాణ సాధనాలు. గోపన్నపాలెంనుండి ఏలూరుకు జట్కా బళ్ళు కూడా నడిచేవి. రోజువారీ పట్టణంలో పాలు అమ్ముకొనేవారు సైకిల్‌పై వెళ్ళేవారు. చుట్టుప్రక్కల అడవులలో కట్టెలు కొట్టుకొని అమ్ముకొనేవారు ఏలూరువరకు నడచివెళ్ళి అమ్ముకొనేవారు. మగవారు కావిళ్లలాగా మోపులు కట్టుకొని, ఆడువారైతే నెత్తిమీద మోపు పెట్టుకొని వెళ్ళేవారు. కూరగాయలు, మామిడికాయలు వంటి పంటలు అమ్ముకోవడానికి ఎడ్లబళ్ళే ముఖ్య రవాణా సాధనాలు. వైద్యం వంటి అవసరాలకు నడచి, లేదా కలిగినవారు ఎడ్లబళ్ళు కట్టుకొని పట్టణానికి వెళ్ళేవారు. ఏలూరులో చదువుకొనే కుర్రాళ్ళు సైకిల్‌పై వెళ్ళేవారు. ఆ రూటులో ఒకటి రెండు మోటర్ సైకిళ్ళు మాత్రం వెళుతూ ఉండేవి.

సుమారు 1973 ప్రాంతలో మొట్టమొదటి ప్రైవేటు బస్సు ఈ రూటులో నడవడం మొదలయ్యింది. ఏలూరు నుండి గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా రంగాపురం వరకు బస్సు వెళ్ళేది. తరువాత మరో బస్సు జీలకర్రగూడెం వరకు ఉండేది. క్రమంగా ఆరు బస్సులయ్యాయి. ఈ బస్సులు క్రిక్కిరిసి ఉండేవి. బస్సులోపలా, టాపు పైనా, వెనుక నిచ్చెన మీద నుంచుని కూడా ప్రయాణాలు చేసేవారు. ఆ బస్సులను 1742 (రిజిస్ట్రేషన్ నంబరును బట్టి), 6565 (రిజిస్ట్రేషన్ నంబరును బట్టి), కూచింపూడి (వూరునుబట్టి), లేలాండ్ (తయారీ బట్టి) - ఇలాంటి పేర్లతో పిలిచేవారు. సుమారు 1995 సమయంలో గవర్నమెంట్ (ఆర్.టి.సి.) బస్సులు ప్రారంభమయ్యాయి. వీటికీ ప్రైవేటు బస్సులకూ గట్టి పోటీ ఉండేది. క్రమంగా ప్రైవేటు బస్సుల సర్వీసులు నిలిపివేశారు. 1742 బస్సును కూరగాయలు రవాణా చేసే ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుగా మార్చారు. ప్రస్తుతం (2008లో) ఏలూరు నుండి పెదవేగి (దిబ్బగూడెం వరకు మాత్రమే) సిటీ బస్సు సదుపాయం కూడా ఉంది. ఆర్.టి.సి. బస్సులు నడుస్తున్నాయి. కాని రాష్ట్రమంతటిలో లాగానే బస్సుల వినియోగం బాగా తగ్గింది. సైకిళ్ళు కూడా చాలా అరుదుగా వాడుతున్నారు. స్తోమతు కలిగినవారు బళ్ళు (మోటర్ సైకిళ్ళు) వాడుతున్నారు. అత్యధికులు షేరింగ్ (సర్వీస్) ఆటోల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆటోల ద్వారా ప్రయాణం ఏలూరు పట్టణానికి, చుట్టుప్రక్కల గ్రామాలకు మాత్రమే పరిమితం కాదు. రోజువారీ పొలంలో కూలి పనులకు వెళ్ళే శ్రామికులకు ఇది ముఖ్యమైన ప్రయాణ విధానం. ఏలూరు వెళ్ళే సర్వీస్ ఆటోలో సుమారుగా 8 మంది ప్రయాణం చేస్తారు. కాని పొలాలకు వెళ్ళే ఆటోలలో 10 నుండి 20 మంది వరకు ఎక్కడం సాధారణం. దాదాపు ప్రతి ఆటో డ్రైవరూ కస్టమర్లతోనూ, సహ ఆటో డ్రైవర్లతోనూ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుతూ తన సర్వీసులను ప్లాన్ చేసుకొంటాడు.

విద్య

[మార్చు]

మండల కేంద్రమైనా పెదవేగి ప్రాంతంలో విద్యావకాశాలు అంతగా అభివృద్ధి కాలేదనే చెప్పాలి. వూరిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇటీవలికాలంలో ఉన్నత పాఠశాలగా మఅర్చారు. క్రొత్త భవనం నిర్మాణం కూడా 2007లో దాదాపు పూర్తి అయ్యింది. శివారు గ్రామాలైన గార్లమడుగు, కూచింపూడి (1984) ముక్కు బులలో పది సంవత్సరాల ముందునుండి హైస్కూళ్ళు ఉన్నాయి. దిబ్బగూడెంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ప్రైవేటు రంగంలో ఇటీవలి కాలంలో ఒక కాన్వెంటు (అక్కల నాగరాజు పాఠశాల), ఒక మిషనరీ విద్యాలయం వచ్చాయి. సోమవరప్పాడులోని జె.ఎమ్.జె.కాన్వెంటులో కొందరు చదువుకొంటున్నారు. ఉన్నత విద్యకు, కాస్త నాణ్యమైన ప్రాథమిక విద్యకు తమ పిల్లలను ఏలూరులోనే చదివించడానికి ఎక్కువమంది ఇష్టపడుతారు. అవకాశం ఉన్నవారు తమ పిల్లలను ఏలూరులో అద్దెఇళ్ళలోను, లేదా హాస్టళ్ళలోను ఉంచి చదివించడం జరుగుతుంది. స్తోమత లేని చాలా మంది తమ పిల్ల చదువులను ప్రాథమిక విద్యతోనే ఆపివేయడం జరుగుతున్నది.

వైద్యం

[మార్చు]

చాలా కాలంగా వూళ్ళలోని ఒకరిద్దరు ఆర్.ఎమ్.పి. వైద్యులు చుట్టుప్రక్కల గ్రామాలలో అత్యవసర వైద్య సదుపాయం అందించేవారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కాని ముఖ్యమైన చికిత్సావసరాల కోసం ఏలూరు వెళ్ళక తప్పదు. ఇటీవల పెరిగిన ప్రయాణ సదుపాయాల వలన అది అంత కష్టం కావడంలేదు.

వ్యాపారం

[మార్చు]

వూరిలో వ్యాపారం నిత్యావసర సరుకులను అందించేంతవరకు లభిస్తున్నది. కాని అధికంగా కొనుగోళ్ళు ఏలూరు పట్టణంలో చేస్తారు. చాలా గ్రామాలలాగానే పచారి సరుకులు, కాఫీ హోటళ్ళు, కిళ్ళీకొట్లు, మందుల షాపులు, మంగలి షాపులు, సైకిల్ షాపులు కనిపిస్తాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే ఈ వూరిలో ఉత్పాదన అయ్యే సరుకుల వ్యాపారం ఇక్కడ ఏమీ కనిపించదు. అలాగే ఇక్కడి వ్యవసాయానికి అవసరమయ్యే సరుకుల అమ్మకం కూడా ఇక్కడ కనిపించదు. వారం వారం ఒక సంత జరుగుతున్నది.

ఇతరాలు

[మార్చు]

మండల కేంద్రమైనందున పెదవేగి గ్రామంలో మండల ఆఫీసులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. పెదవేగిలో ఒక పోస్టాఫీసు బాగా ముందుకాలంనుండి (1970కి ముందే) ఉంది. పిన్ కోడ్ 534450 (గోపన్నపాలెం). దూరవాణి కేంద్రం ద్వారా ఇప్పుడు టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు లభిస్తున్నాయి. దేశమంతటి లాగానే సెల్ ఫోనుల వినియోగం బాగా పెరిగింది.

దిబ్బగూడెం సెంటరులో ఒక సినిమాహాలు ఉన్నది (సుమారు 1995 సంవత్సరంలో కట్టారు. 2008లో మూసివేశారు). వినోదానికి కేబుల్ టెలివిజన్ ద్వారా లభించే ప్రసారాలదే అగ్రస్థానం. పెదవేగి దగ్గరలో (ముండూరు, ఏడోమైలు దగ్గర) ఒక పాతకాలం విమానాశ్రయం ఉంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో సైన్యం అవసరాలకోసం నిర్మించబడింది. తరువాత దీని వినియోగం లేదు. ఖాళీ స్థలంగా ఉండేది. ఇప్పుడు ఈ స్థలంలో జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. D. R. Bhandarkar Volume By Devadatta Ramakrishna Bhandarkar, Bimala Churn Law పేజీ.216 [1]
  4. Sculptural Heritage of Andhradesa By Mohan Lal Nigam పేజీ.35
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-02-24. Retrieved 2007-10-13.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-17. Retrieved 2007-10-13.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పెదవేగి&oldid=4259016" నుండి వెలికితీశారు