పురుషార్థ ప్రదాయిని
సంపాదకులు | ఉమా రంగనాయకులు నాయుడు |
---|---|
తరచుదనం | మాస పత్రిక |
మొదటి సంచిక | 1872 |
పురుషార్థ ప్రదాయిని 19 వ శతాబ్దంలో వెలువడ్డ తెలుగు మాస పత్రిక. ఉమా రంగనాయకులు నాయుడు మచిలీపట్నంలో ఈ పత్రికను ప్రారంభించాడు. సాహిత్యం సకల శాఖల్లోనూ విరివిగా వృద్ధి పొందాలని దీని ఆశయం. విధవా పునర్వివాహం అంశంపై తొలిసారిగా చర్చ జరిగింది ఈ పత్రిక లోనే.
చరిత్ర
[మార్చు]పురుషార్థ ప్రదాయిని ప్రచురణ 1872 లో మచిలీపట్నం లో మొదలైంది. ఉమా రంగనాయకులు నాయుడు ఈ మాస పత్రికను ప్రారంభించాడు.[1] ఆయనే సంపాదకుడు. మత, సాంఘిక విషయాలలో వివేకవర్థనికీ, పురుషార్థ ప్రదాయినికీ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండేవి.[2] బ్రిటిషు ప్రభుత్వ అధికారులు నెలనెలా పంపే గోప్య నివేదిక ప్రకారం 1878 లో పత్రిక సర్క్యులేషను 206.[3]
సుమారు 20 సంవత్సరాల పాటు ప్రచురితమై, ఆ తరువాత ఆగిపోయింది.
రచనలు
[మార్చు]సాహితీ వ్యాసాలు పుస్తక విమర్శలు, వై ద్య విషయాలు, వింతలు విశేషాలు, సామెతలు, సమస్యాపూరణలు దీనిలో ఉండేవి. మహాభారత టిప్పణిని ప్రచురించారు. ఆంధ్రభాషా సంజీవనికి దీనికి విద్యావిషయమైన వాదప్రతివాదాలు జరిగేవి. "శాస్త్రము, భాష, మతము, వైద్యం, జౌషధములు, నీతి, వ్యవ సాయము, దోహదము, వర్తకము, కళలు, చేతిపనులు, విద్యావిషయములు, దేహా రోగ్య విషయములు, గృహవిద్యలు, దేశకాలబీవ చరితములు, పురాతన నీతులు, పౌరాణికములు, వినోదములు, ఆశ్చర్యములు, కథలు, లోక వ్యవహారములు, థర్మ శాస్త్ర విషయములు, విశేషాభి పాయములు, సంవాదములు, సిద్ధాంతములు, వృత్తాంతములు, మొదలగు నంశములను గురించి సంగ్రహముగా విశేషము ఆంధ్రమున వ్రాయబడును, గనుక తెలుగు భాషను కొంచెము చదివిగాని వినిగాని గ్రహించగల ప్రతివారును ఈ ప్మతికను పుచ్చుకొని శ్రద్ధగా చదవవలయు నని కోరెదము” అని పత్రికలో ప్రకటించారు.[4]
తెలుగుతో పాటు ఇంగ్లీషు విభాగం కూడా ఉండడం ఈ పత్రికలో ఒక విశేషం. అప్పటి అధికారులకు తెలుగు నేర్చుకొనడానికి వీలుగా పద్యాలకు తెలుగులో అర్థాలు ఇంగ్లీషులో వివరణలు ఉండేవి. ఈ విధంగా మహాభార తానికి గుంటూరు ఆంగ్లో వర్నాక్యులర్ స్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేసే పరవస్తు వెంకటరంగాచార్యులు టిప్పణి రాసాడు.
అన్ని శాఖలలోను సాహిత్యం విరివిగా వృద్ధి పొందాలని దీని ఆశయం. భాషోత్పత్తిపె చర్చను తొలిసారిగా పురుషార్థ ప్రదాయిని ప్రారంభించింది. భాషోత్ప త్తి, లిపి మొదలయిన వాటి గురించి పరవస్తు శ్రీనివాస భట్టనాథాచార్యులు రాసాడు.[5]
పురుషార్థ ప్రదాయిని సాహిత్య విషయాల కంటే సామాజిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చేది. స్థానిక ప్రభుత్వం లోని లోపాలను నిర్భయంగా విమర్శించేది.[6] ఈ పత్రిక లోనే తొలిసారిగా విధవా పునర్వివాహం అంశంపై చర్చ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చలో ఇరుపక్షాల వాదనలూ - సమర్థకులు వ్యతిరేకులూ - ఈ పత్రిక లోనే ప్రచురించారు.[7]
పురుషార్థ ప్రదాయిని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన మాసపత్రిక. కొక్కాండ వేంకటరత్నం పంతులు స్థాపించిన ఆంధ్రభాషా సంజీవని పత్రికకూ, వురుషార్థ ప్రదాయినికీ వివాదాలు జరుగుతూ ఉండేవి. వీరేశలింగం పంతులుగారు వురుషార్థ ప్రదాయినిలో రచనలు చేస్తూ ఉండేవాడు.[8]
కైస్తవ సంస్థలు చేసే మతమార్పిడి కార్యక్రమాల్ని పురుషార్థ ప్రదాయిని వ్యతిరేకించింది. దాదాభాయి నౌరోజీ వంటి నాయకుల ఉపన్యాసాల్ని ప్రచురించి జాతీయ భావాల ప్రచారానికి తోడ్పడింది.[9]
1872 లో నరహరి గోపాల చెట్టి రాసిన "శ్రీ రంగరాజు చరిత్రము" తెలుగులో తొట్టతొలి నవల అని ఈ పత్రిక ప్రకటించింది. అయితే ఆ పుస్తకానికి నవల లక్షణాలు లేనందున ఆ తరువాత ఆరేళ్ళకు వచ్చిన రాజశేఖర చరిత్రము తొలి తెలుగు నవలగా పరిగణించబడింది.[10]
మూలాలు
[మార్చు]- ↑ జి వి., పూర్ణచందు, ed. (2016). కృష్ణాతీరం. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ. p. 1040.
- ↑ మాగంటి, బాపినీడు (ed.). ఆంధ్రసర్వస్వము. p. 382.
- ↑ ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
- ↑ తిరుమల, రామచంద్ర (1989). తెలుగు పత్రికల సాహిత్యసేవ. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 19.
- ↑ తిరుమల, రామచంద్ర (1992). మనవి మాటలు. హైదరాబాదు: ప్రాకృత అకాడమీ. p. 30.
- ↑ అక్కిరాజు, రమాపతిరావు (1998). "తెలుగువారి సామాజిక వికానంలో చరిత్ర నృష్టించిన తొలి పత్రికలు". In వై.వి., కృష్ణారావు; ఏటుకూరి, ప్రసాద్; సురవరం, సుధాకరరెడ్డి; మల్లిక్, మల్లిక్ (eds.). ఆంధ్రప్రదేశ్ దర్శిని. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 535.
- ↑ దిగవల్లి, శివరావు (1985). వీరేశలింగం - వెలుగు నీడలు. విజయవాడ: వేమన వికాస కేంద్రం. pp. VIII.
- ↑ అక్కిరాజు, రమాపతిరావు (1967). "తొలి తెలుగు నవల". In శివలెంక, శంభుప్రసాద్ (ed.). భారతి. Vol. 44 (12 ed.). p. 4.
- ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, నాస పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 19.
- ↑ టి.వి., సుబ్బారావు (1999). "ఆరిజిన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలుగు నావెల్". In టి.ఎస్., గిరిప్రకాష్ (ed.). నావెల్ ఇన్ ద్రవిడియన్ లిటరేచర్ (in ఇంగ్లీషు). మదురై: మదురై కామరాజ్ యూనివర్సిటీ. p. 65.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)