Jump to content

పినపాల వెంకటదాసు

వికీపీడియా నుండి
(పి.వి.దాసు నుండి దారిమార్పు చెందింది)
పినపాల వెంకటదాసు

పి.వి.దాసు గా ప్రసిద్ధిచెందిన పినపాల వెంకటదాసు (1870-1936) తొలి రోజుల్లో తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత. వీరు బందరు, రేపల్లెలో సినిమా హాళ్ల నిర్మించడమే కాకుండా టి.రాజన్, సి.డి.సామి, సి.పి.సారథి, జయంతీలాల్ థాకరేలతో కలసి 1934లో వేలు పిక్చర్స్ ప్రారంభించారు. మద్రాసులో తొట్టతొలి టాకీ స్టూడియో వేల్ పిక్చర్స్ స్టూడియో. అంతకు ముందు సినీ నిర్మాతలు బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, పూణే లోని సాంకేతికులపై ఆధారపడేవారు. ఈ స్టూడియో నాలుగేళ్ళ పాటే నిలిచినా తమిళ, తెలుగు సినీ నిర్మాణంతో మహోన్నతమైన పాత్రపోషించింది. మద్రాసులోనే నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసింది.[1] వేల్ పిక్చర్స్ పతాకంపై వెంకటదాసు సీతాకళ్యాణం, కృష్ణలీలలు, మాయాబజార్ మొదలైన చిత్రాలను నిర్మించారు. ప్రభాత్ పిక్చర్స్ వారి తమిళ సినిమా ఆధారంగా ఈయన తెలుగులో తీసిన సీతాకళ్యాణం సినిమా, మద్రాసులో నిర్మించబడిన తొలి తెలుగు చిత్ర్రం.[2] తన స్వస్థలమైన బందరులో మునిసిపల్ కౌన్సిల్ సభ్యులుగాను, జిల్లా బోర్డు సభ్యులుగాను పనిచేశారు. ఈయన మహోన్నతంగా తీయాలనుకున్న మాయాబజార్ సినిమా నిర్మాణము ఇంకా పూర్తికాక మునుపే వెంకటదాసు 1936 మే 10 తేదీన పరమపదించారు. పి.వి.దాసు మరణానంతరం వేల్‌ పిక్చర్స్ కనుమరుగై నరసు స్టూడియోస్ పేరుతో రూపాంతరం చెందింది.

వేల్ పిక్చర్స్

[మార్చు]

కృష్ణాజిల్లా సినిమా పంపిణీరంగంలో తొలి విజయాలు చవిచూసిన పంపిణీదారుడు పి.వి.దాసు. ఆయన రేపల్లె కృష్ణాటాకీసు ఎగ్జిబిటరు, మచిలీపట్నం మినర్వా టాకీసు భాగస్వామి. అయితే చిత్రనిర్మాణం తమకు అనుకూలమైన చోట జరగడంలో కలిగే ప్రయోజనాలను ఊహించిన పి.వి.దాసు ఎలాగైనా అవిభక్త మద్రాసు రాష్ట్రంలోనే చిత్రనిర్మాణం జరపాలని సంకల్పించారు. అందుకు తోటి పంపిణీదారుల సహకారం అవసరమని భావించిన పి.వి.దాసు మద్రాసులోని తన మిత్రులు సి.డి.సామి, సి.పి.సారథి, జయంతిలాల్‌ థాకరేవంటి వారితో కలసి సుధీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చి, వారంతా భాగస్వాములుగా వేల్‌ పిక్చర్స్‌ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.[3] అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలు అన్నీ బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, పూణేలలో తీసేవారు. దర్శకునితో సహా నటీనటులందరూ అక్కడికి వెళ్లేవారు. అలా ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా మద్రాసులోని గిండీ ప్రాంతంలో వేల్‌ పిక్చర్స్ స్టూడియోను 1934లో నిర్మించారు పి.వి.దాసు. స్టూడియో నిర్మించిన తర్వాత దాన్ని నిర్వహించడానికి చిత్ర సాంకేతిక రంగంలో ప్రసిద్ధులైన కె. రామనాథ్‌, ఎ.కె.శేఖర్‌, టి.ఎస్‌.ముత్తుస్వామి (మురుగదాస) లను నియమించారు. ఈ ముగ్గురికీ అప్పటికే వి. శాంతారామ్‌ దగ్గర స్వయంగా పనిచేసి స్టూడియో థియేటర్‌ నిర్వహణ బాధ్యతలను నేర్చుకున్న అనుభవం ఉంది. కె. రామనాథ్‌ ఛాయగ్రహకుడైతే, ఎ.కె. శేఖర్‌కి ఛాయాగ్రహాణంలోనూ, నిర్మాణంలో అనుభవం ఉంది. ముత్తుస్వామి మంచి రచయిత. వి.శాంతారామ్‌ తమిళ చిత్రం సీతాకళ్యాణం విజయానికి ఈ ముగ్గురూ దోహదపడ్డారు. పి.వి.దాసు రాక్సీ థియేటర్‌నుంచి సి.ఇ.బిగ్స్‌ని తీసుకొచ్చి టాకీ రికార్డింగులో పలువురికి శిక్షణ ఇప్పించారు. ఈ విధంగా స్టూడియో నిర్మాణం పూర్తయ్యాక, అన్ని శాఖలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతో సాంకేతిక సహకారాన్ని సమకూర్చారు.

మూలాలు

[మార్చు]
  1. Indian cinema By National Film Development Corporation of India, India. Ministry of Information and Broadcasting. Publications Division పేజీ.60 [1]
  2. The cinemas of India By Yves Thoraval పేజీ.346
  3. తొలి స్టూడియో అధినేత పి.వి.దాసు Archived 2010-06-12 at the Wayback Machine - ఈనాడు సాహిత్యంలో చీకోలు సుందరయ్య వ్యాసం

బయటి లింకులు

[మార్చు]