పింగళి నాగేంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పింగళి నాగేంద్రరావు
పింగళి నాగేంద్రరావు
జననం(1901-12-29)1901 డిసెంబరు 29
శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం
మరణం1971 మే 6(1971-05-06) (వయసు 69)
ఇతర పేర్లుపింగళి, మాటల మాంత్రికుడు
వృత్తిరచయిత, పత్రికా ఉపసంపాదకుడు
తల్లిదండ్రులు
  • గోపాల క్రిష్ణయ్య (తండ్రి)
  • మహాలక్ష్మమ్మ (తల్లి)

పింగళి నాగేంద్రరావు (1901 డిసెంబరు 29 - 1971 మే 6) పేరొందిన రచయిత. సినిమా, నాటకాలు, పత్రికల్లో రచనలు చేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించిన పింగళి ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత ఖరగ్ పూర్ లోని రైల్వే వర్క్‌షాపులో సహాయకుడిగా చేరాడు. తర్వాత ఆఫీసు పనిలోకి మారాడు. అక్కడ రైల్వే యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1920లో జాతీయ నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితుడై ఉత్తరభారతదేశ యాత్ర చేశాడు. అక్కడే ఆయనకు దివ్యజ్ఞాన సమాజం వారితో కూడా పరిచయం కలిగింది. పర్యటనలో భాగంగా ఆయన గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం చేరుకుని వైరాగ్యంవైపు ఆకర్షితుడయ్యాడు కానీ ఆశ్రమంలో ఉండేవారి సలహాతో భారత జాతీయ కాంగ్రెసులో ఉద్యోగిగా చేరాడు. అక్కడ పనిచేస్తున్నపుడే కొన్ని దేశభక్తి గేయాలు రాసి జన్మభూమి అనే పుస్తకంగా ప్రచురించాడు. ఆ పని చేసినందుకు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి హెచ్చరిక చేసి వదిలిపెట్టింది. తర్వాత కాంగ్రెస్ కు భారంగా ఉండటం కాదని పట్టాభి సీతారామయ్య ఇచ్చిన సలహాతో కాంగ్రెస్ ఆర్గనైజరు పదవికి రాజీనామా చేశాడు. తర్వాత కౌతా శ్రీరామశాస్త్రి ప్రారంభించిన శారద పత్రికలో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.

బాల్యం

[మార్చు]

నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల కృష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.

విద్యాభ్యాసం

[మార్చు]

నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

ఉద్యోగం

[మార్చు]

1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్లోని రైల్వే వర్క్‌షాపులో అప్రెంటీస్ గా చేరాడు. వర్క్‌షాప్ లో పనిచేసేందుకు ఆయన ఆరోగ్యం సహకరించదని ఆయన్ను ఆఫీసు పనికి మార్చారు. ఆయన ఉండగానే బి.ఎన్ రైల్వే కార్మికుల తొలి యూనియన్ ఏర్పాటు అయింది. నాగేంద్రరావు తన బావమరిది యైన దండపాణితో కలిసి ఈ యూనియన్ స్థాపనకు విశేషంగా కృషి చేశాడు. దండపాణి ఆ యూనియన్ కు అధ్యక్షుడు. అదే సమయంలో చిత్తరంజన్ దాస్ రైల్వే ఫెడరేషన్ కు అధ్యక్షుడు.

ఇట్లావుండగా ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావుగారు ఖర్గపూరులో జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలివ్వసాగారు. ఈ ఉపన్యాసాల ఫలితంగా 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. ఖరఘ్ పూర్ లో వుండగానే ఆయన దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది. దివ్యజ్ఞాన సమాజంవారి మకాములలో బసచేస్తూ ఆయన ఉత్తరదేశం పర్యటించి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. అసలే బ్రహ్మచారి, అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమం వారు అనుమతించలేదు. నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్న కాంగ్రెస్ సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు.

సబర్మతీలో పదిహేనురోజులున్న తరువాత ఈ నిర్ణయం జరిగింది. దీన్ని అమలు చేయగలందులకు కాకా కలేల్కర్ గారు, అప్పట్లో కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులుగా వుంటూవుండిన ధన్వాడ రామచంద్రరావు గారికి ఒక లేఖ వ్రాసియిచ్చారు. దానిసహాయంతో నాగేంద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం, వేతనంతోసహా లభించింది. ఈ ఉద్యోగం చేస్తూ ఆయన కొన్ని దేశభక్తి పద్యాలు రచించి జన్మభూమి అనే పుస్తకంగా ప్రచురించాడు. ఈ పని చేసినందుకు నాగేంద్రరావును బెజవాడలో అరెస్టు చేశారు. అయితే జిల్లా కలెక్టరు ఆయనను హెచ్చరించి విడిచిపెట్టారు.

ఒకనాడు పట్టాభి సీతారామయ్య కాంగ్రెసు ఆఫీసుకొచ్చి అక్కడ నాగేంద్రరావును చూసి, ఆర్థిక స్తోమత కలవాళ్ళే కాంగ్రెసు సంస్థకు సేవచేయగలరనీ, బ్రతుకు తెరువుకు కాంగ్రెసుపై ఆధారపడేవారు భారమనీ, నాగేంద్రరావు లోగడ చేస్తూవుండిన ఉద్యోగం మానడం పొరపాటనీ సలహా ఇవ్వగా, దాన్ని గురూపదేశంగా భావించి నాగేంద్రరావు కాంగ్రెసుకు రాజీనామా యిచ్చాడు.

రచనా వ్యాసంగం

[మార్చు]

ఈ సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రి మోడరన్ రివ్యూ, ప్రవాసి పత్రికల పద్ధతిలో ఉత్తమ సాహిత్య పత్రికను ప్రారంభించాలని యత్నం చెయ్యసాగాడు. ఆ పత్రికలో పనిచేయటానికి డాక్టర్ పట్టాభి నాగేంద్రరావుని సిఫార్సు చేశారు. 1923లో శారద అనే పేరుతో ఈ పత్రిక వెలువడింది. శ్రీరామశాస్త్రికి సహాయంగా వుంటూ నాగేంద్రరావు ఆ పత్రికను నడపసాగాడు. 1924లో ఈ పత్రిక నిలిచిపోయే పర్యంతమూ ఆ పనిలోనేవుంటూ ఆ పత్రికమూలంగా డాక్టర్ అహోబలరావు వంటి పెద్దల మైత్రికూడా సంపాదించుకున్నాడు నాగేంద్రరావు.

చిన్నతనం నుంచీ విద్యార్థి దశలోకూడా, నాగేంద్రరావుకు రచనలుచేసే అభ్యాసం వుండేది. ముఖ్యంగా నాటకాలమీద ఆయనకు మక్కువ ఎక్కువ. శారద పత్రికను నడిపేరోజులలోనే ఆయన ద్విజేంద్రలాల్ రాయ్ బెంగాలీ నాటకాలు మేవాడ్ పతన్, పాషాణి తర్జుమాచేసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. ఆయన సొంతనాటకాలు జేబున్నీసా (1923), వింధ్యరాణి కృష్ణా పత్రికలో ధారావాహికగానూ,[1] నా రాజు (1929) భారతిలోనూ పడ్డాయి. జేబున్నీసా నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపడానికి మహమ్మదీయులు ఈ నాటకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తత్ఫలితంగా, హిందూ-ముస్లిం ఘర్షణలకు దారితీస్తుందనే నెపంతో మద్రాసు ప్రభుత్వం 1923లో ఈ నాటక ప్రదర్శనను నిషేధించింది.[2]

శారద పత్రిక నిలిచిపోక పూర్వమే బందరులోని డి.వి. సుబ్బారావు నాగేంద్రరావు రచించిన నాటకాలను కొన్నిటిని ఆడటం జరిగింది. ఆకారణంగా శారద నిలిచిపోగానే, నాగేంద్రరావుకు డి.వి.సుబ్బారావు యొక్క ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో సెక్రటరీ పదవి లభించింది. 1946 దాకా నాగేంద్రరావు ఆ కంపెనీలోనేవుంటూ, వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ, నాటకాలాడిస్తూ, నాటక రచనగురించీ ప్రేక్షకుల అభిరుచులను గురించీ, ప్రదర్శనంలో మెళుకువలను గురించీ అపారంగా నేర్చుకున్నాడు. దీనిమూలంగా డి. వి. సుబ్బారావు "నారాజు", "వింధ్యరాణి" నాటకాలు అద్భుతమైన విజయం సంపాదించాయి. ఆ తరువాత 1956లో క్షాత్రహిందూ అనే మరో చారిత్రక నాటకాన్ని వ్రాశాడు.[3] ఈ నాటకాలు అన్నీ పింగళీయం పేరుతో ఇటీవల విడుదలయాయి.

వింధ్యరాణి

[మార్చు]

వింధ్యరాణి నాటకం యొక్క విజయం ఎంతదాకా వెళ్ళిందంటే, బందరులో డాక్టర్ వి. దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డి. వి. సుబ్బారావుతో సహా సినిమాగా తీయటానికి వైజయంతి ఫిలింస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకే ఎన్. జగన్నాధ్ బందరు వచ్చాడు. జగన్నాధ్‌కు అంతకు పూర్వం తారుమారు అన్న ఆరు రీల్ల చిత్రాన్ని తీసిన అనుభవం ఉంది. మరో పదివేల అడుగుల చిత్రంతీసి రెంటినీ కలిపి విడుదల చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ రెండో చిత్రం తీయటంలో వైజయంతి ఫిలింస్ వారు తమకు భాగస్వాములుగా ఉండాలని కోరటానికి జగన్నాధ్ బందరు వచ్చి, ఇప్పుడీ రెండవ చిన్న చిత్రం తీసి, ఆ అనుభవంతో వింధ్యరాణి తీస్తే బాగుంటుందని దుర్గా నాగేశ్వరరావుని ఒప్పించాడు. జగన్నాథ్ తీయదలచినది మోలియర్ నాటకానికి అనుసరణ "భలే పెళ్ళి". ఈ చిత్రానికి రచయితగా పనిచేసే బాధ్యత వింధ్యరాణి కర్తయిన నాగేంద్రరావు మీదనే పడింది.

సినిమా కెరీర్

[మార్చు]

ఇది నాగేంద్రరావుకు తొలి సినిమా అనుభవం. భలే పెళ్ళి సినిమాకి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవలే పుట్టిల్లు సినిమా తీసి ఉన్న గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే భలే పెళ్ళి నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది.

వింధ్యరాణి చిత్రంగా తయారయ్యే రోజు 1946లో వచ్చింది. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబూనుకున్నది. దీనికి సి. పుల్లయ్యగారి దర్శకత్వం. ఇందులో డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి. వరలక్ష్మి, పండిట్ రావు ప్రభృతులు పాత్రధారులు. నాగేంద్రరావు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణలో వింధ్యరాణి స్క్రిప్టు తయారుచేసాడు.

విజయా సంస్థలో

[మార్చు]

వింధ్యరాణి తయారవుతున్న సమయంలో నాగేంద్రరావుకు వాహినీ నిర్మాతా, దర్శకుడూ ఐన కె.వి.రెడ్డితో పరిచయం లభించింది. వాహినీ సంస్థ ప్రారంభం నుంచీ ఆ సంస్థలో పనిచేస్తూ యోగి వేమనలో కె.వి.రెడ్డికి సహాయదర్శకుడుగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు కూడా బందరు వాసే కావడంతో నాగేంద్రరావును కె.వి.రెడ్డికి పరిచయం చేసాడు. ఈ పరిచయం ఫలితంగా కె. వి. రెడ్డి తాను తీయబోతున్న గుణసుందరికథ సినిమాకి పాటలు మాటలు రాయటానికి నాగేంద్రరావును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు కె. వి.రెడ్డికీ, నాగేంద్రరావుకూ, ఆంధ్రా సినిమా ప్రేక్షకులకుకూడా లాభించిందని చెప్పాలి. కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు. దర్శకుడు కె. వి. రెడ్డి కానట్టయితే నాగేంద్రరావు సినిమా రచన భలేపెళ్ళి, వింధ్యరాణికి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగుచిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.

గుణసుందరి కథ నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయారై, విజయావారి నిర్వహణ కిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ కూడా గుణసుందరి కథదే. గుణసుందరి కథ పూర్తి అయేలోగా విజయా వారు భవిష్యత్తు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయాసంస్థలోకి తీసుకోబడ్డారు.

అయితే కె.వి.రెడ్డి విజయావారి ద్వితీయచిత్రం పాతాళభైరవి దర్శకత్వం చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. దీని ఫలితమే పాతాళభైరవి. ఈ సినిమా చాలా విజయవంతంగా నడవటమేగాక చిత్రనిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు. పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.

ఆ తర్వాత నాగేంద్రరావు తనను సినిమాలోకి తీసుకురావటానికి తోడ్పడిన కామేశ్వరరావుతో కలిసి విజయవారి నాలుగో చిత్రం చంద్రహారానికి పనిచేశాడు. ఈ చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు.

పింగళి నాగేంద్రరావు 1971 మే 6న కన్నుమూశాడు.[4]

చిత్ర సమాహారం

[మార్చు]
  1. రాజకోట రహస్యం (1971) గీతరచన
  2. అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
  3. సి.ఐ.డి (1965) (రచయిత)
  4. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
  5. మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
  6. గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
  7. జగదేకవీరుని కథ (1961) (రచయిత)
  8. మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
  9. అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
  10. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
  11. మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
  12. మిస్సమ్మ (1955) (రచయిత)
  13. చంద్రహారం (1954) (రచయిత)
  14. పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
  15. గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
  16. వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
  17. భలే పెళ్లి (1941) (గీతరచన)
  18. శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).

మూలాలు

[మార్చు]
  1. The press and the national movement in South India, Andhra, 1905-1932 K. Subramanyam
  2. Proscribed Telugu literature and national movement in Andhra, 1920-1947 Penta Sivunnaidu
  3. South Indian theatre - Biswajit Sinha
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-30. Retrieved 2010-07-25.

బయటి లింకులు

[మార్చు]