పాండురంగ మహత్యం
పాండురంగ మహత్యం.(అను పుండరీకుని కథ) (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | త్రివిక్రమరావు |
రచన | సముద్రాల(జూనియర్) |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి , బి.సరోజాదేవి నాగయ్య, కస్తూరి శివరావు, పద్మనాభం, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, పేకేటి శివరాం |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, చిత్తూరు నాగయ్య |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | సముద్రాల(జూనియర్) |
సంభాషణలు | సముద్రాల(జూనియర్) |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహ్మాన్ |
కళ | తోట తరణి |
రికార్డింగ్ | ఏ.ఆర్.కృస్ణన్ |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎ.టి. పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
పంపిణీ | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్, చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ |
దేశం | భారతదేశము |
భాష | తెలుగు |
పాండురంగ మహాత్మ్యం 1957 నవంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి ,బి.సరోజాదేవి, నాగయ్య, కస్తూరి శివరావు, పద్మనాభం, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, పేకేటి శివరాం తదితరులు నటించారు.
ఉపోద్ఘాతం
[మార్చు]జీవన సంధ్యలో ఉన్న కన్నవారిని వదిలేసి... కాసుల వేటలోనో, మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే కొడుకుల్ని చూస్తూనే ఉన్నాం. ఇక చెంతనే అమ్మా నాన్నలున్నా- వారి ఆలనాపాలనా చూడని బిడ్డలూ కనిపిస్తున్నారు. ఎంత సంపాదించినా... ఎన్ని పూజలు చేసినా... 'మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ' లేదని చాటిన చిత్ర రాజం 'పాండురంగ మహాత్మ్యం'. 1957 నవంబరు 28న విడుదలైన ఈ ఆపాత మధురం నాటి ప్రేక్షక లోకాన్ని తన్మయత్వంలో ముంచెత్తింది. తరాలు మారుతున్నా తెలుగు సినీలోకంలో ఉత్తమ చిత్రంగా సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. కథాంశమే కాదు - 'హే కృష్ణా ముకుందా మురారి', 'అమ్మా అని అరచినా', 'తరం తరం నిరంతరం ఈ అందం' లాంటి గీతాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీ రామారావు నట వైదుష్యాన్ని చాటిన చిత్రాల్లో ఇదీ ఒకటి.
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]పండరీపురం క్షేత్ర మహాత్మ్యం కథను పలు సినిమాల్లో అప్పటికే చిత్రీకరించారు. తమిళ చిత్రం 'హరిదాసు' 1946లో విడుదలైంది. త్యాగరాజ భాగవతార్, వసుంధరాదేవి నటించారు. ఈ భక్తిరస చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా మళ్లీ 1955-56ల్లో విడుదలైంది. మద్రాసులోని ఓ థియేటర్లో ప్రదర్శితమవుతోందంటే ఎన్టీఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమరావు, మరి కొందరు మిత్రులు వెళ్లి చూశారు. కథాంశం ఎన్టీఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ భక్తి కథకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటే తెలుగువాళ్లని మెప్పించవచ్చన్నది ఆయన ఆలోచన.
తమ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్‌ఏటీ) ద్వారానే 'హరిదాసు' కథను 'పాండురంగ మహాత్మ్యం'గా నిర్మించాలని ఆయన సంకల్పించారు. పండరీపురం క్షేత్ర వైభవాన్ని మరింత శోధించి ఈ చిత్ర కథను తయారుచేసుకున్నారు. కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంచుకున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమరావు (చిత్ర నిర్మాత)లకు 'ఆయన్నెందుకండీ... మరొకర్ని తీసుకోండి' అని సన్నిహితులు సలహా ఇచ్చారు. ఎందుకంటే కమలాకర అంతకు ముందు తీసిన 'చంద్రహారం', 'పెంకి పెళ్లాం' సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. అయినా దర్శకుడి మీద నమ్మకంతో చిత్రానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్.
సినిమాకు మాటల రచయితగా సముద్రాల జూనియర్ ని నియమించుకున్నారు. అప్పటికి పాటల రచయితగానే పేరొందిన ఆయనకు ఇది మాటల రచయితగా తొలిచిత్రం.[1]
కథ
[మార్చు]స్థూలంగా చూస్తే ఇది మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటే కథ. కానీ యాభయ్యేళ్లకు పూర్వం ఉన్న సనాతన సంప్రదాయాల్నీ, నాటి సామాజిక పరిస్థితుల్నీ, భావితరాల కోసం అభ్యుదయ భావాల్నీ ఎన్టీఆర్ ఇందులో జోడించారు. కథానాయకుడు పుండరీకుడిని శోత్రియ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా చూపించారు. ఆ పాత్రను జల్సారాయుడిగా తీర్చిదిద్దారు. ఆ వ్యసనాలు ఎంతటి దురవస్థల పాల్జేస్తాయో చూపించారు. అంతిమంగా నాటి జనానికే కాదు - భావితరాలకు సైతం సందేశాన్నిస్తూ - కన్నవారికి సేవ చేసుకోవడం ద్వారానే ముక్తి దొరుకుతుందని చెప్పారు. పుండరీకుడు భగవంతుడిలో ఐక్యమయ్యే ఘట్టంలో తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ భాషల గీతాలు వినిపిస్తాయి. తరాల అంతరం లేని కథా వస్తువుని చిరంజీవిని చేసేలా సంగీతాన్ని సమకూర్చారు టి.వి. రాజు. ఇందులో ఘంటసాల ఆలపించిన 'హే కృష్ణా ముకుందా మురారి' గీతం నిడివి 15 నిమిషాలుంటుంది.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]నటి / నటుడు | పాత్ర |
---|---|
నందమూరి తారక రామారావు | పుండరీకుడు |
అంజలీ దేవి | రమ |
చిత్తూరు నాగయ్య | జాహ్నవి |
ఋష్యేంద్రమణి | లక్ష్మి |
బి.పద్మనాభం | పుండరీకుని సోదరుడు |
బి.సరోజాదేవి | కళావతి |
గోవిందరాజుల సుబ్బారావు | |
కె.వి.ఎస్.శర్మ | వికటాసురుడు |
కస్తూరి శివరావు | |
వంగర వెంకట సుబ్బయ్య | |
బొడ్డపాటి | |
ఛాయాదేవి | |
బాలకృష్ణ | |
పేకేటి శివరాం | |
అమ్మాజీ | చంప |
షావుకారు జానకి | |
విజయనిర్మల | బాలకృష్ణుడు |
అవీ ఇవీ
[మార్చు]- కథానాయకుడిగా ఎన్టీఆర్‌కిది 61వ సినిమా.
- బరువైన సమాసాలతో కూడిన శ్లోకాలను ఆయన ఒకే టేక్‌లో ఓకే చేశారట.
- ఇందులో బాల కృష్ణుడిగా విజయనిర్మల నటించారు. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం.
- వేశ్య పాత్రను బి.సరోజా దేవి పోషించారు. కన్నడ చిత్రాల్లో నటించిన ఆమెకిదే మొదటి తెలుగు సినిమా.
- అప్పట్లో ఈ చిత్ర నిర్మాణానికి రూ.4 లక్షలు వ్యయమైంది. 2 గంటల 55 నిమిషాల నిడివి ఉంటుంది.
- 'పాండురంగ మహాత్మ్యం' అప్పట్లో తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది.
- విజయవాడ, గుంటూరుల్లో 24 వారాలు ప్రదర్శితమైంది.
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా - ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | ఘంటసాల |
తరంతరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం - అందం ఆనందం | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | ఘంటసాల |
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | ఘంటసాల పి.సుశీల |
వన్నెల చిన్నెల నెర, కన్నెల వేటల దొరా | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | ఘంటసాల పి.లీల |
ఓం నమఃశివాయ, హర హర శంభో | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | ఘంటసాల |
హే కృష్ణా ముకుందా మురారీ జయకృష్ణా ముకుందా మురారీ జయగోవింద బృందా విహారీ | సముద్రాల | టి.వి.రాజు | ఘంటసాల |
సన్నుతి సేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని | సముద్రాల జూనియర్ | టి.వి.రాజు | వి.నాగయ్య |
శ్రీ కామినీ కామితాకర (దండకం) ఘంటసాల, రచన:సముద్రాల జూనియర్.
ఆదీ భీజా ఏకలే (మరాఠీ) ఘంటసాల, రచన: శాంతారామ్ ఆర్వాలే
ఆజ్కా సున్ హెరా దిన్ హై (హిందీ) ఘంటసాల, రచన: నాయ్ దేవ్
ఆటలార రా రా కన్నయ్యా , ఘంటసాల, రచన:సముద్రాల జూనియర్
అక్కడ ఉండే పాండురంగడు (పండరి భజన)
మూలాలు
[మార్చు]- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.