పర్వత కనుమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెసోతోలోని సాని కనుమ .

పర్వత కనుమ, ఒక పర్వత శ్రేణి గుండా లేదా ఒక శిఖరం మీదుగా ప్రయాణించదగిన మార్గం. ప్రపంచంలోని అనేక పర్వత శ్రేణులు, ప్రయాణాలకు గట్టి అడ్డంకులుగా నిలిచినందున, వాణిజ్యం లోను, యుద్ధాల్లోనూ చరిత్ర అంతటా మానవ, జంతువుల వలసల్లోనూ కనుమ దారులు కీలక పాత్ర పోషించాయి. తక్కువ ఎత్తులో ఉన్న కనుమలను కొండ కనుమ అని అంటారు.

అవలోకనం

[మార్చు]
ఓ నమూనా పర్వత కనుమ. ఆకుపచ్చ గీత కనుమ దారి. ఎరుపు రంగులో ఉన్న బిందువు కనుమదారి లోని ఉచ్ఛతమ బిందువు. ఇదే శిఖరాల మధ్య ఉన్న నిమ్నతమ బిందువు కూడా. దీన్నే శాడిల్ పాయింటు అంటారు.

పర్వత కనుమలు రెండు శిఖరాల మధ్య ఉన్న గండి లేదా పల్లాన్ని వాడుకుంటాయి. ఈ పల్లాన్ని శాడిల్ అని కూడా అంటారు. శాడిల్ పాయింటు శాడిల్‌ మధ్యలో ఉండే చదునైన ప్రదేశం. ఇది రెండు లోయల మధ్య ఉన్న ఉచ్ఛతమ బిందువునూ రెండు శిఖరాల మధ్య ఉన్న నిమ్నతమ బిందువునూ సూచిస్తుంది. [1] [2] టోపోగ్రాఫిక్ మ్యాప్‌లో, కనుమ‌లు అవర్‌గ్లాస్ ఆకారంలో ఆకృతి రేఖలతో చూపించబడతాయి. ఇది రెండు ఎత్తైన బిందువుల మధ్య ఉన్న అత్యంత లోతైన స్థానాన్ని సూచిస్తుంది. [3]

కనుమలు ఎక్కువగా నదీమూలానికి కొంచెం పైన, పరీవాహక ప్రాతాలను విభజిస్తూ ఉంటాయి. కనుమ చాలా చిన్నదిగా, బాగా నిటారుగా ఉన్న వాలులతో ఉండవచ్చు. లేదా చాలా కిలోమీటర్ల పొడవున ఉన్న లోయ కూడా కావచ్చు. ఇలాంటి కనుమల ఎత్తైన ప్రదేశాన్ని సర్వే ద్వారా మాత్రమే గుర్తించవచ్చు.

చాలా కాలం నుండీ కనుమల గుండా రహదారులు నిర్మించారు. రైల్వేలనూ ద్వారా నిర్మించారు. కొన్ని ఎత్తైన, కఠినమైన కనుమ‌ల గుండా ఏడాది పొడవునా వేగంగా ట్రాఫిక్ ప్రవాహాన్ని అనుమతించడానికి సమీపంలోని కొండల గుండా సొరంగాలు తవ్వారు.

కనుమలో ఎత్తైన స్థానమే సాధారణంగా ఈ ప్రాంతంలోని ఏకైక చదునైన మైదానమై ఉంటుంది. చుట్టుపక్కల అంతా కనిపించే స్థానం కూడా ఇదే. అందుచేతనే కొన్ని సందర్భాల్లో ఇది భవనాలను నిర్మించేందుకు బాగా అనుకూలమైన స్థలం కూడా అవుతుంది. ఒక పర్వత శ్రేణి దేశాల మధ్య సరిహద్దుగా ఉంటే, ఆ పర్వతాల్లో ఉండే కనుమ ఇరుదేశాల సరిహద్దు నియంత్రణ కేంద్రాలు, కస్టమ్స్ కార్యాలయాలకూ నెలవై ఉంటుంది. కొన్నిచోట్ల సైనిక స్థావరాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, అర్జెంటీనా, చిలీల మధ్య ప్రపంచంలోనే మూడవ అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు (5,300 కిలోమీటర్లు) ఉంది. ఉత్తర-దక్షిణాలుగా ఉండే ఈ సరిహద్దు వెంట అండీస్ పర్వతశ్రేణి ఉంటుంది. ఈ సరిహద్దుపై మొత్తం 42 కనుమలు ఉన్నాయి. కనుమ గుండా పోయే రహదారిపై, ఆ కనుమ పేరు, సముద్ర మట్టం నుండి అది ఉన్న ఎత్తును చూపే చిన్న రోడ్డు సూచికలు ఉండడం ఇక్కడ సాధారణం.

లోయల మధ్య తేలిగ్గా ప్రయాణించగల మార్గాన్ని అందించడంతో పాటు కనుమలు, రెండు పర్వత శిఖరాల మధ్య కనిష్ఠ దూరం ఉండే మార్గాన్ని కూడా అందిస్తాయి. ఈ కారణంగా, కనుమ‌లో వివిధ దారులు కలుసుకోవడం సర్వసాధారణం. అందుచేత ఒక పర్వత శిఖరం నుండి పక్కనున్న లోయ అడుగు భాగానికి ప్రయాణించడానికి కూడా ఇది అనుకూలమైన మార్గం. సాంప్రదాయకంగా కనుమలు వాణిజ్య మార్గాలు, సమాచార మార్పిడి, సాంస్కృతిక మార్పిడి, సైనిక దండయాత్రలు మొదలైనవాటికి నెలవు. ఆల్ప్స్ పర్వతాల్లోని బ్రెన్నర్ పాస్ దీనికి ఒక ఉదాహరణ.

చెట్ల వరుసకు పైన ఉన్న కొన్ని కనుమల్లో శీతాకాలంలో మంచు కదలడంతో సమస్యలు ఏర్పడతాయి. అలాంటి చోట్ల, నేల నుండి కొన్ని మీటర్ల ఎత్తులో రోడ్డును నిర్మించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

పర్యాయపదాలు

[మార్చు]
ఇంగ్లాండ్‌లో కెన్స్‌గ్రిఫ్, యార్ల్సిడైన్ ల మధ్య ఉన్న కోల్ (కనుమ)

ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో కనుమకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అమెరికాలో పాస్ అని, గ్యాప్ అని, నాచ్ అని, శాడిల్ అనీ రకరకాల పేర్లతో పిలుస్తారు. [4] ఫ్రెంచి నుండి ఉద్భవించిన కోల్ అనే పదాన్ని ఐరోపాలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ వంటి చోట్ల కనుమలను "లా" అని అంటారు. ఈ ప్రాంతాల్లోని కనుమల పేర్లు లా తో అంతమౌతాయి. ఉదాహరణకు సె లా (అరుణాచల్ ప్రదేశ్), నాథూ లా (సిక్కిం), ఖార్దుంగ్ లా (లడఖ్) మొదలైనవి.

ప్రపంచవ్యాప్తంగా వేలాది కనుమలున్నాయి, వాటిలో కొన్ని ప్రసిద్ధమైనవి: ఆల్ప్స్ లోని గ్రేట్ సెయింట్ బెర్నార్డ్ పాస్ 2,473 మీటర్లు (8,114 అ.), జమ్మూ కాశ్మీర్‌లో చాంగ్ లా 5,360 మీటర్లు (17,590 అ.), ఖార్దుంగ్ లా 5,359 మీటర్లు (17,582 అ.). భారత చైనా సరిహద్దుకు సమీపంలోని మానా పాస్ 5,610 మీటర్లు (18,410 అ.), మార్సిమిక్ లా 5,582 మీటర్లు (18,314 అ.) ఎత్తున ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాహన యోగ్యమైన కనుమల్లో ఈ రెండూ ఉన్నాయి. పాకిస్తాన్, చైనాల మధ్య ఖుంజేరబ్ కనుమ 4,693 మీటర్లు (15,397 అ.) కూడా ఎత్తైన వాహనయోగ్యమైన కనుమయే. ప్రసిద్ధమైన వాహనయోగ్యం కాని కనుమ, 5,416 మీటర్లు (17,769 అ.) ఎత్తున ఉన్న థొరాంగ్ లా. ఇది నేపాల్ లోని అన్నపూర్ణ పరిరక్షణ ప్రాంతంలో ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eberhart, Mark E. (2004). Why Things Break: Understanding the World by the Way it Comes Apart. Random House. p. 232. ISBN 978-1-4000-4883-0. Retrieved 6 November 2010.
  2. Bishop, Michael P.; Shroder, John F. (2004). Geographic Information Science and Mountain Geomorphology. Springer. pp. 86–87. ISBN 978-3-540-42640-0. Retrieved 6 November 2010.
  3. Harvey, Mark William Thornton; Simer, Peter (1999). The National Outdoor Leadership School Wilderness Guide: The Classic Handbook. Simon & Schuster. p. 185. ISBN 978-0-684-85909-5. Retrieved 6 November 2010.
  4. Map showing "saddle" names in Idaho

ఉల్లేఖన లోపం: <references> లో "pasos" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.

ఉల్లేఖన లోపం: <references> లో "pasos_chile" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.