పమ్మిన రమాదేవి
పమ్మిన రమాదేవి | |
---|---|
జననం | పమ్మిన రమాదేవి జూన్ 19 1972 పొందూరు, శ్రీకాకుళం జిల్లా |
నివాస ప్రాంతం | పొందూరు |
ఇతర పేర్లు | పమ్మిన రమాదేవి |
వృత్తి | ఉపాధ్యాయులు |
ప్రసిద్ధి | జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత 2015 |
మతం | హిందూ |
భార్య / భర్త | యెచ్చిన గోపాలరావు |
పిల్లలు | దివ్యశ్రీ దీప్తి సంతోష్ |
తండ్రి | పమ్మిన కూర్మారావు |
తల్లి | అమ్మలు |
పమ్మిన రమాదేవి ఉపాధ్యాయురాలు. ఆమె 2015 భారత జాతీయ ఉత్తమ పురస్కార గ్రహీత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె శ్రీకాకుళం జిల్లా లోని ఖద్దరుకు ప్రసిద్ధి చెందిన పొందూరు గ్రామంలో పమ్మిన కూర్మారావు, అమ్మలు దంపతులకు జూన్ 19 1972 న జన్మించారు. ఆమె తండ్రి కూర్మారావు ఉపాధ్యాయునిగా పనిచేసాడు. ఆయన పలు సమాజ సేవా కార్యక్రమాలతోపాటు తన వృత్తికి చేసిన సేవలకు గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 1989 లో భారత ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఆమె చిన్నతనం నుండి తన తండ్రి చేసే సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలైంది. ఆమె 1995 లో ఉపాధ్యాయురాలిగా రాపాక గ్రామంలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆమె పొందూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు యెచ్చిన గోపాలరావును వివాహమాడారు. ఆయన కూడా సమాజ సేవా కార్యక్రమాలూ చేస్తుండేవాడు. ఆయన విద్యారంగానికి, సమాజ సేవా కార్యక్రమాలకూ చేసిన కృషికి గానూ 2008 లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుండి అందుకున్నారు. రమాదేవి తన తండ్రి, భర్త యొక్క స్ఫూర్తితో వివిధ పాఠశాలలలో పనిచేస్తూ బాలల విద్యాభివృద్ధికి కృషిచేయడమే కాకుండా ఆ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు, భోధనోపకరణాలకొరకు విశేష కృషిచేసారు.
సేవా కార్యక్రమాలు
[మార్చు]ఆమె పనిచేసే పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లోనే విద్యాబోధన చేయటమే కాక కృత్యాధారణ పద్ధతుల్లో, సరళమైన విధానాల్లో పాఠాలు చెప్పడం ఆమెకు అలవాటు. ఒకటో తరగతి విద్యార్థులకు చక్కటి పునాది అవసరమని, అటువంటి గట్టి పునాదులు వేయకపోతే భవిష్యత్తులో నష్టపోతారని రేడియో, టీవీలలో వచ్చే విద్యాబోధన కార్యక్రమాలను పిల్లలకు చూపి విద్యాబోధన చేసేది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి.సి.ఇ విధానంలో విద్యార్థులకు పాఠ్యాంశాలపై మంచి అవగాహన కలిగిస్తున్నది. ఆమె విద్యార్థులకు పుస్తకపరిజ్ఞానమే కాకుండా.. క్షేత్రపర్యటనల ద్వారా, కృత్యాల ద్వారా విషయాన్ని ఆకలింపు చేసుకునే విధానాన్ని అందించి విద్యార్థులకు అవగాహన శక్తిని పెంపొందించే విద్యాబోధన చేస్తున్నారు.[2]
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
[మార్చు]ఆమెకు 2014 లో శ్రీకాకుళం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. 2015 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా సెప్టెంబరు 5 2015 న ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా సన్మానింవబడినది. ఆమె జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన యెచ్చినగోపాలరావు సతీమణి. ఈ గ్రామానికి చెందిన జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన పి.కూర్మారావు యొక్క కుమార్తె. ఆమె పొందూరు మండలంలోని తండ్యాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ విశేషమైన సేవలందించారు.[3] ఈమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి 2015 ను ఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి సెప్టెంబరు 5, 2016 న అందుకున్నారు.[4]
చిత్రమాలిక
[మార్చు]ఒకే కుటుంబంలో మూడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార విజేతలు
[మార్చు]-
ఉపరాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ ద్వారా అరార్డు స్వీకరిస్తున్న ఆమె తండ్రి పమ్మిన కూర్మారావు
-
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ద్వారా జాతీయ అవార్డు స్వీకరిస్తున్న ఆమె భర్త గోపాలరావు
-
సెప్టెంబరు 5, 2016 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పమ్మిన రమాదేవి.
మూలాలు
[మార్చు]- ↑ National Award to Teachers - 2015 (given in 2016)[permanent dead link]
- ↑ "సర్కారు స్కూళ్లకు ఏం తక్కువ?16-09-2016". Archived from the original on 2016-09-19. Retrieved 2016-09-19.
- ↑ "Rc 45 ap best teacher awards 2015 list of all districts". Archived from the original on 2016-03-07. Retrieved 2016-09-19.
- ↑ "national award teachers 2015-andhra pradesh" (PDF). Archived from the original (PDF) on 2016-09-09. Retrieved 2016-09-19.