పదండి ముందుకు (1962 సినిమా)
పదండి ముందుకు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | తుమ్మల కృష్ణమూర్తి |
తారాగణం | కొంగర జగ్గయ్య, జమున, జి. వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.హేమలత, రమణారెడ్డి |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | జాగృతి చిత్ర |
భాష | తెలుగు |
పదండి ముందుకు వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో జగ్గయ్య, జమున ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.
1963; మాస్కో చలనచిత్రోత్సవాల్లో ఈచిత్రం ప్రదర్శితమైనది.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కథ: రంగయ్య
- మాటలు: కొంగర జగ్గయ్య
- దర్శకత్వం: వి.మధుసూధనరావు
- పాటలు: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
- ఛాయాగ్రహణం: సత్యనారాయణ
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి
నటీనటులు
[మార్చు]- జగ్గయ్య - సత్యదేవ్
- జమున - సరళ
- గుమ్మడి - పోలీసు అధికారి శంకరరావు,
- జి.వరలక్ష్మి - శాంతమ్మ
- రమణారెడ్డి
- హేమలత
- కృష్ణ
- ఎస్.వి.రంగారావు
- చిత్తూరు నాగయ్య
- సి.ఎస్.ఆర్.
- వల్లూరి బాలకృష్ణ
- పేకేటి
- శివరామకృష్ణయ్య
- కమలకుమారి
- రాజసులోచన
- మహంకాళి వెంకయ్య
- కోళ్ళ సత్యం
నిర్మాణం
[మార్చు]నటీనటుల ఎంపిక
[మార్చు]ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే.[1]
కథ
[మార్చు]శ్రీరాంపురంలో శాంతమ్మ, ఆమె కుమారుడు సత్యదేవ్ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. శాంతమ్మ పెంపుడు కొడుకు పదేళ్ళ వయసుగల అర్జున్ కూడా ఉత్సాహంతో సమరాంగణాల ఉరికాడు. మైదానంలో వేలాది ప్రజల జయజయధ్వానాలమధ్య స్తంభం ఎక్కి బ్రిటిష్ పతాకాన్ని దించివేసి, జాతీయపతాకాన్ని ఎగురవేశాడు. దిగమని చెప్పినా వినకపోతే పోలీసులు లాఠీ విసురుతారు. ఆ దెబ్బకు స్తంభం నుండి క్రిందపడి అర్జున్ గాయపడతాడు. కోర్టులో విచారణ చేసి అర్జున్‌కు శిక్ష విధిస్తారు. జైలులో ఉండగా తీవ్రమైన జ్వరం వస్తుంది. అర్జున్‌ను వదిలివేయవలసిందని ప్రజలు అధికార్లను కోరుతారు. కాని వారు అందుకు నిరాకరిస్తారు.
వాస్తవానికి అర్జున్ పోలీస్ డిప్యుటీ సూపరింటెండెంట్ శంకరరావు కుమారుడే.అయితే ఆ సంగతి ఆయనకు తెలియదు. అలాగే శాంతి కూడా ఆయన చెల్లెలే. ఇరవై సంవత్సరాల క్రితం ఆమెను శంకరరావు ఇంటి నుండి గెంటివేశాడు. గర్భవతి అయిన ఆమె రైలుప్రమాదంలో చిక్కుపడి భర్తకు దూరమైపోతుంది. ఆ భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. శాంతకు మగబిడ్డ జన్మిస్తాడు. అతడే సత్యదేవ్. దొంగలు అపరహరించి వదిలివేసిన అర్జున్‌తోను, సత్యదేవ్‌తోను ఆమె జీవిస్తూ ఉంటుంది. అమరవీరుడు భగత్ సింగ్ పద్దతిలో దౌర్జన్య విప్లవోద్యమం వల్ల కానీ స్వాతంత్ర్యం సాధించలేమని సత్యదేవ్, అహింసా విధానాలనే అనుసరించాలని శాంత అభిప్రాయపడుతూ తమలో తాము ఏకీభవించలేక ఘర్షణ పడుతూ వుంటారు. ఇరవై ఏళ్ళ తర్వాత శాంత తన అన్న శంకరరావును కలుసుకుంటుంది. కాని అతడు కసిరివేస్తాడు. శంకరావు కుమార్తె సరళ, సత్యదేవ్ ఒక సందర్భంలో కలుసుకుంటారు. తాము మేనత్త మేనమామ బిడ్డలమని తెలుసుకుని ప్రేమించుకొంటారు. అయితే శంకరరావు ఆమెను సురేష్ అనే సంపన్న యువకుని ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు. సురేష్ అవినీతి ప్రవర్తనను చూసి సరళ అతడిని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. సురేష్ ధర్మారావు రెండవ భార్య కుమారుడు. సరళ తనను తిరస్కరించడంతో ఆమెపై పగబడతాడు. రాజాపురం జైలుకు మార్చబడిన అర్జున్‌ను సత్యదేవ్ ఎత్తుకుపోతూ ఉండగా పోలీసులు తుపాకీతో కాలుస్తారు. గాయపడి కూడా తప్పించుకొన్న సత్యదేవ్‌ను, అర్జున్‌ను ఆ దారిలో కారులో వస్తున్న ధర్మారావు తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తెచ్చి పోలీసుల నుండి దాచివేస్తాడు. సరళ సహాయంతో ధర్మారావు సత్యదేవ్‌ను, అర్జున్‌ని శాంత ఇంటికి చేరుస్తాడు. ఇరవై ఏళ్ళ అనంతరం అతడు తన మొదటిభార్య అయిన శాంతను తిరిగి తొలిసారిగా కలుసుకుంటాడు.
పోలీసులు ఇంటింటినీ గాలిస్తున్న సమయంలో సత్యదేవ్,అర్జున్‌లు డి.ఎస్.పి.శంకరరావు ఇంట్లోనే దాక్కొంటారు. శంకరరావు భార్య అర్జున్ పుట్టుమచ్చను చూసి చిన్నప్పుడు దొంగలెత్తుకుపోయిన తన కుమారుడే అర్జున్ అని గుర్తించి ఆనందం పట్టలేక భర్తతో చెబుతుంది. అయితే భాందవ్యాలకంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ విలువనిచ్చే శంకరరావు వారిని నిర్బందించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు పారిపోతారు.
వారిని పోలీసులకు లొంగిపొమ్మని చెప్పడానికి వచ్చిన శాంత పోలీసు కాల్పులలో మరణిస్తుంది. శాంత మరణంతో శంకరరావుకు కనువిప్పు కలిగి తన ఉద్యోగాన్ని వదిలివేస్తాడు. అతడిని సత్యదేవ్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. శంకరరావు ఖైదు శిక్షను సంతోషంతో స్వీకరిస్తాడు[2].
పాటలు
[మార్చు]- పదండి ముందుకు పదండి తోసుకు కదం - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: శ్రీశ్రీ
- మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
- మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరథి
- ఇన్నాళ్ళు లేని వేగిరపాటు ...ముసినవ్వ్వు వేల్గులోన - ఎస్. జానకి - రచన: డా. సినారె
- తమాషా దేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం సూడవయ్యా - పిఠాపురం - రచన: ఆరుద్ర
- మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- మంచికి కాలం తీరిందా మనిషికి హృదయం మాసిందా - మహమ్మద్ రఫీ - రచన: జగ్గయ్య
మూలాలు
[మార్చు]- ↑ పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.
- ↑ రాధాకృష్ణ (4 February 1962). "చిత్రసమీక్ష - పదండి ముందుకు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 18 February 2020.[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)