Jump to content

పంటలు (ఆటలు)

వికీపీడియా నుండి

పిల్లలు ఆడుకునే కొన్ని సాంప్రదాయిక ఆటల్లో ఎవరు ఏ పాత్ర వహించాలో నిర్ణయించుకునేందుకు అవలంబించే పద్ధతి పంటలు వేసుకోవడం. సాధారణంగా ఒకరు దొంగగా ఉండే ఆటల్లో దొంగ ఎవరో నిర్ణయించుకునేందుకు ఈ పంటలు వేస్తారు.[1]

పద్ధతి

[మార్చు]

బేసి సంఖ్యలో ఉండే ఆటగాళ్ళు, ముగ్గురో ఐదుగురో, ఒకరి అరచేతులు ఒకరు పట్టుకుని వృత్తాకారంలో నిలబడతారు. అందరూ ఒక్కసారిగా చేతులను విడిపించుకుని తమ తమ అరచేతిలో రెండవ అరచేతిని వేసుకుంటారు - చప్పట్లు కొట్టే రీతిలో. అయితే ఒక అరచేతిలో రెండవదాన్ని బోర్లా వెయ్యవచ్చు, వెల్లకిలా కూడా వెయ్యవచ్చు. ఏ విధంగా ఎక్కువ మంది వేస్తారో వాళ్ళు పండినట్లు, మిగతావాళ్ళు పండనట్లు. ఈ పండనివాళ్ళు మళ్ళీ పంటలు వేస్తారు.

ముగ్గురు వేసే పంటలు: పంటలు వేసే ఆటగాళ్ళు ముగ్గురైనపుడు, ఇద్దరు పండుతారు. మూడవవ్యక్తి దొంగ అయినట్లు.

ఐదుగురు వేసినపుడు: మొదటి విడతలో, ఐదుగురిలో కనీసం ముగ్గురు పండుతారు. మిగతా ఇద్దరు మళ్ళీ పంటలు వేస్తారు. అయితే బేసి సంఖ్యలో పంటలు వెయ్యాలి కాబట్టి, ఈ సరికే పండినవారిలో ఒకరు తోడుగా పంటలు వేస్తారు. దీన్ని తోడుపంట వెయ్యడం అంటారు. పండని ఇద్దరిలో, పండిన ఆటగాడి లాగా చప్పట వేసిన ఆటగాడు పండినట్లు, రెండో వ్యక్తి దొంగ అయినట్లు. ఈ రెండవ విడతలో పండని ఇద్దరూ ఒకేలా వేస్తే, మళ్ళీ పంటలు వేస్తారు.

ఇంకా ఎక్కువ మంది ఉన్నపుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. ఉదాహరణకు, తొమ్మిది మందిలో మొదటి విడతలో కనీసం ఐదుగురు పండుతారు, రెండవ విడతలో కనీసం ఇద్దరు పండుతారు, మూడవ విడతలో దొంగ మిగులుతారు.

సరి సంఖ్యలో ఆటగాళ్ళుంటే: ముందు ఒక ఆటగాణ్ణి మినహాయించి మిగతావాళ్ళు పంటలు వేస్తారు. ఆ తరువాతి విడతలో ఈ మిగలిన ఆటగాడు కూడా చేరుతారు.

ఉజ్జీలు

[మార్చు]

ఆటగాళ్ళు రెండు జట్లుగా చీలిపోయి ఆడే సందర్భాల్లో ఎవరెవరు ఏ జట్టులో ఉండాలో తేల్చేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఆటగాళ్ళలో వివిధ వయసుల వాళ్ళు, వివిధ స్థాయిల్లో ఆటలో నేర్పు ఉన్నవాళ్ళూ ఉంటారు కాబట్టి, మంచి ఆటగాళ్ళలో ఎక్కువమంది ఒకే వైపున ఉంటే, రెండో జట్టు బలహీనపడి ఆటలో సమతూకం పోతుంది. ఈ ఉజ్జీల పద్ధతిలో ఒకే స్థాయి నేర్పు, కుశలత గల ఇద్దరేసి ఆటగాళ్ళను ఎదురెదురుగా నిలబెడతారు. వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలన్నమాట. అలా ఆటగాళ్ళందరిలో సమ ఉజ్జీలైన వారినందరినీ ఇలా వరుసలో ఎదురెదురుగా నిలబెడతారు. అప్పుడు ఒక వరుసలో ఉన్నవారంతా ఒక జట్టు లోకి, ఎదురు వరుసలో ఉన్నవాళ్ళంతా రెండో జట్టు లోకి చేరుతారు. ఆట మొదలుపెడతారు.

మూలాలు

[మార్చు]
  1. "హుషారునిచ్చే పాత ఆటలు | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.