నేను హిందువు నెట్లయిత?
నేను హిందువు నెట్లయిత హిందూ తత్వం, సంస్కృతి, రాజకీయ అర్థశాస్త్రం పై శూద్ర విమర్శ చేస్తూ కంచ ఐలయ్య వ్రాసిన పుస్తకం.[1]
పుస్తక పరిచయం
[మార్చు]'నేను హిందువు నెట్లయిత' అనే పుస్తకం, 1996లో కంచ ఐలయ్య ఆంగ్లంలో వ్రాసిన Why am not a Hinduఅనే పుస్తకానికి తెలుగు స్వేచ్ఛానువాదం. తెలుగులోకి రచయిత ఎ.సురేందర్ రాజు అనువాదం చెయ్యగా, రచయిత దానికి మరికొంత చేర్చి జనవరి 2000 లో తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చాడు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ముద్రించారు. పుస్తకం కవరు డిజైన్, లోపలి బొమ్మలు లక్ష్మన్ ఏలే వేశాడు. ఫోటోల సేకరణను కంచ ఐలయ్య, భరత్ భూషణ్ చేసారు.
రచయిత గురించి
[మార్చు]కంచ ఐలయ్య 1952లో తెలంగాణాలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాడు. శూద్రకూలంలోని కురుమ (గొర్రెలకాపరులు) కులానికి చెందినవాడు. హైదారాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1976లో M.A. చేసాడు. భూసంస్కరణలపై M.Phil, గౌతమబుద్ధుని తత్వ విచారణపై Ph.D చేసాడు. అదే విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవిభాగంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేసాడు. గత ముప్పై సంవత్సరాలుగా దళిత బహుజన, మానవహక్కుల ఉద్యమాల్లో భాగస్వామి. ఉస్మానియాలో 'సత్యశోధక్'అనే అధ్యయన సంస్థ వ్యవస్థాపకులలో ఒకడు.1994-97 వరకు ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక తీన్‍మూర్తి లైబ్రరీలో నెహ్రూఫెలోగా పరిశోధన చేశాడు.1989లో "ది స్టేట్ అండ్ రిప్రెసివ్ కల్చర్"అనే పుస్తకం వ్రాసాడు. ఈ పుస్తకం మొదటిసారి కులవ్యవస్థకు మానవహక్కుల అణచివేతకు గల సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. 1994 లో అర్తర్ బానర్‍తో కలిసి "డెమోక్రసీ ఇన్ ఇండియా-ఎ హాలోషెల్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీన్ని వాషింగ్‍టన్ విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఎకనామికల్ పొలిటికల్ వీక్లీ, ప్రాంటియర్, మెయిన్‍స్ట్రీం, సెమినార్ వంటి ప్రఖ్యాత పరిశోధనా పత్రికల్లో వ్యాసాలు వ్రాసాడు.
ఈయన 'నలుపు' పత్రిక వ్యవస్థాపకులలో ఒకడు. అందులో రచయిత వ్రాసిన వ్యాసాలు రాష్ట్రమంతటా గుర్తింపు పొందాయి. రచయిత వ్రాసిన పెక్కు వ్యాసాలు, పుస్తకాలుగా అచ్చు అయ్యాయి. ఐలయ్య వ్రాసిన "మన తత్వము" అనే పుస్తకం ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురించబడి, అచ్చై, చాలా చర్చకు దారితీసింది. రచయిత దేశంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలైన 'ది హిందూ', 'దక్కన్ క్రానికల్', 'ఇండియన్ ఎక్సుప్రెస్' లలో ఎన్నోవ్యాసాలు వ్రాసాడు.
పుస్తకంలోని అంశాలు
[మార్చు]ఈ పుస్తకం అఖిలభారత అనుభవాలనుండి, చారిత్రక పరిణామ క్రమాన్ని, ఇక్కడి మత జీవన విధాలను పరిశోధించి, ప్రధానంగా తెలుగు దేశపు దళిత బహుజనుల ప్రసవవేదనలో పుట్టిందని రచయిత చెప్పాడు. ఐలయ్య ఈ పుస్తకాన్ని 7 విభాగాలుగా విభజించాడు. అవి.
- బాల్యపు రూపురేఖలు
- పెండ్లి, మార్కెట్ సామాజిక సంబంధాలు
- నయాక్షత్రియుల రంగప్రవేశం-అధికారసంబంధాల పునర్నిర్మాణం
- సమకాలీన హిందూతత్వం
- హిందూదేవతలు -మనం: మనదేవతలు-హిందువులు
- హిందువుల చావు-మనచావు
- హిందువీకరణ కాదు, దళితకరణ
బాల్యం నుండి చావు వరకు దళితబహుజనులు ఏవిధంగా జీవనవిధానంలో, ఆచారవ్యవహారాలలో, పెళ్ళి తదితర వ్యవహారాలలో, దైవారాధనలో, చావుకు సంబంధించిన విధివిధానాలలో హిందూమతంతో ఎంత భిన్నమైనవిధంగా ఉన్నది సోదాహరణంగా వివరించాడు.
- రచయిత అభిప్రాయాలు
- సామాజిక ఆచరణ రూపాలను ఒకదానితో ఒకటి పోల్చి, తేడాలు చూపడానికి వ్యక్తిగత జీవితానుభవాల సంపుటి బాగా పనికి వస్తుంది. వ్యక్తి అనుభవం వాస్తవాన్ని సూటిగా వెలికి తీస్తుంది.
- దళితబహుజన కులాలు, బాపన, కోమటి, క్షత్రియ, నయా క్షత్రియ వంటి హిందూకులాలు నేటి సమాజంలో ఒకే గ్రామములో నివసిస్తున్నా, వారి మధ్య భౌతికంగా, ఆధ్యాత్మికంగా చాలా అగాధాలున్నాయి. కాబట్టి హిందూ అగ్రకులాల సంస్కృతిని దళితబహుజన కులాలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాలు లేవు.
- ఎవరైతే కొత్త ప్రశ్నలు వినేందుకు, కొత్త సమాధానాలు తెలుసు కొనేందుకు నిరాకరిస్తారో, వారు నశిస్తారే తప్ప బాగుపడరు.
- గ్రామఆర్థిక వ్యవస్థలో సంఖ్యాపరంగా కురుమ, గొల్ల, గౌడ, కాపు, శాల, చాకలి, మంగలి, మాదిగ, మాల కులాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉండేవారు. ఈ కులాల వారి రోజు వారి కార్యకలాపాల ద్వారానే ఊరి ఆర్థికజీవనం నడిచేది. అక్కడ సామూహిక జీవనం మతంతో ముడి వెయ్యబడలేదు; కులాల మధ్య ఉత్పత్తి సంబంధంగా మాత్రమే ఉండేది.