నెట్టెంపాడు ప్రాజెక్టు
నెట్టెంపాడు ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది పై ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలలో ఒకటి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిల్వ నీటి మీద ఆధారపడిన ప్రాజెక్టు ఇది. అందులో నుంచి 21. 425 టి.ఎం.సి. ల నీటిని వినియోగించుకుని, రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని, తాగునీటిని అందించడానికి ఏర్పాటుచేశారు. అప్పట్లో రాష్ట్రమంత్రిగా పనిచేసిన డి.కె. సమరసింహరెడ్డి ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.
ఉనికి
[మార్చు]జిల్లాలోని ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, ఉప్పేరు గ్రామాల సమీపాన ఈ ప్రాజెక్టు ఆరంభమవుతుంది.
పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]ఈ ప్రాజెక్టు పరిధిలో గద్వాల నియోజకవర్గంలోని ఘట్టు, ధరూర్, మల్దకల్ మండలాలు, ఆలంపూర్ నియోజకవర్గంలోని ఐజ, ఇటిక్యాల మండలాలలోని భూములకు సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందుతుంది.
ప్రాజెక్టు అంచనా వ్యయం
[మార్చు]ప్రాజెక్టుకు మొదటగా 134.3 కోట్లుగా అంచనా వేశారు. కాని వ్యయం 141.20 కోట్లకు చేరుకుంది.
అభివృద్ధి పనులు
[మార్చు]డి.కె. సమరసింహరెడ్డి రాష్ట్రమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2004 ఫిబ్రవరి 18 న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి దశలో 27 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పనుల కొరకు జీవో 25 విడుదల చేసి, 50 కోట్ల రూపాయలు మంజూరి చేశారు. తిరిగి వై.యస్. రాజశేఖర్ రెడ్డి పరిపాలనా కాలంలో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామం దగ్గర రెండో దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు[1]..
ప్రాజెక్టు ముంపు నష్టం
[మార్చు]ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన దాదాపు 21, 942. ఎకరాల సాగు భూమి ముంపుకు గురయ్యింది.
ప్రాజెక్టు స్వరూపం
[మార్చు]ఈ ప్రాజెక్టు కింద రెండు ప్రధాన బ్యాలెన్‌సింగ్ రిజర్వాయర్లను, నాలుగు మిని రిజర్వాయర్లను ఏర్పాటుచేశారు.
ప్రధాన జలాశయాలు
[మార్చు]- గుడ్డెందొడ్డి బ్యాలెన్‌సింగ్ రిజర్వాయర్: దీనిని ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామం దగ్గర ఏర్పాటు చేసారు. దీని నీటి నిల్వ సామర్థ్యం ఒక టి.ఎం.సి. ఇక్కడ మొదటి మొదటి లిఫ్ట్‌ను ఏర్పాటుచేశారు. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 62 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలని అంచనా.
- ర్యాలంపాడు బ్యాలెన్‌సింగ్ రిజర్వాయర్: దీనిని ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామం దగ్గర ఏర్పాటు చేసారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.3 టి.ఎం.సి.లు. ఇక్కడ రెండవ లిఫ్ట్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 1,38,000 ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల మధ్య దూరం 8 కిలోమీటర్లు.
చిన్నపాటి జలాశయాలు
[మార్చు]- సంగాల రిజర్వాయర్: గద్వాల మండలంలో ఏర్పాటుచేయబడింది.
- ముచ్చినోనిపల్లి రిజర్వాయర్: గట్టు మండలంలో ఏర్పాటుచేయబడినది,
- తాటికుంట రిజర్వాయర్: మల్దకల్ మండలంలో ఏర్పాటుచేయబడింది.
- నాగర్‌దొడ్డి రిజర్వాయర్: మల్దకల్ మండలంలో ఏర్పాటుచేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 31