Jump to content

నాలాయిర దివ్య ప్రబంధం

వికీపీడియా నుండి
(నాలాయిరం నుండి దారిమార్పు చెందింది)
నమ్మాళ్వార్, 12మందిఆళ్వారులలో ముఖ్యైనవాడు. అతను ప్రబంధాన్ని రాసాడు.

నాలాయిర దివ్య ప్రబంధం 8 వ శతాబ్దానికి ముందు, పండ్రెండు మంది ఆళ్వారులు రచించిన 4000 పాశురాల సమాహారం. తమిళంలో నాలాయిర మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో నాథముని వీటిని క్రోడీకరించాడు. నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను దివ్య దేశములు అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ద్రావిడ వేదం అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు తిరుక్కురుగూరుకు చెందిన నమ్మాళ్వారు రచించాడు. వీటినే తిరువాయ్‌మొళి అని కూడా పిలుస్తారు. తిరువాయ్‌మొళి అనగా, పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.

సంకలన నేపథ్యం

[మార్చు]

ఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి కాట్టు మన్నార్ కోయిల్ అయిన వీరనారాయణ పురంలో జన్మించాడు. ఆళ్వారులలో చివరి వాడైన తిరుమంగై ఆళ్వారుకు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.

ఒకసారి నాథముని కుంభకోణంలో నమ్మాళ్వారు యొక్క ఆరావముదెను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో ఆయిరత్తుల్ ఇప్పత్తుల్ ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన తిరుక్కురుగూరుకు వెళ్ళాడు. అక్కడి ప్రజలు, నమ్మాళ్వారు శిష్యుడైన మధురకవి ఆళ్వారు రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.

పాశురాల సంఖ్య

[మార్చు]

వివిధ ఆళ్వారుల పాశురాల సంఖ్య క్రింది జాబితాలో ఇవ్వబడింది.[1] పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.

క్ర.సం. ప్రబంధం పేరు --- మొదటి పాశురం సంఖ్య చివరి పాశురం సంఖ్య మొత్తం పాశురాలు గానం చేసిన ఆళ్వారు
1 పెరియాళ్వార్ తిరుమొళి 1 473 473 పెరియాళ్వార్/ విష్ణుచిత్తుడు
2 తిరుప్పావై 474 503 30 ఆండాళ్
3 నాచియార్ తిరుమొళి 504 646 143 ఆండాళ్
4 పెరుమాళ్ తిరుమొళి 647 751 105 కులశేఖరాళ్వార్
5 తిరుచ్చంద విరుత్తమ్ 752 871 120 తిరుమళిశై ఆళ్వార్
6 తిరుమాలై 872 916 45 తొండరడిప్పొడియాళ్వార్
7 తిరుప్పళ్ళియెడుచ్చి 917 926 10 తొండరడిప్పొడియాళ్వార్
8 అమలనాది పిరాన్ 927 936 10 తిరుప్పానాళ్వార్
9 కణ్ణినున్ శిరుత్తాంబు 937 947 11 మధురకవి ఆళ్వార్
10 పెరియ తిరుమొళి 948 2031 1084 తిరుమంగై ఆళ్వార్
11 కురుంతాండగం 2032 2051 20 తిరుమంగై ఆళ్వార్
12 నెడుంతాండగం 2052 2081 30 తిరుమంగై ఆళ్వార్
13 ముదల్ తిరువందాది 2082 2181 100 పొయ్‌గై ఆళ్వార్
14 ఇరండాం తిరువందాది 2182 2281 100 భూదత్తాళ్వార్
15 మూండ్రాం తిరువందాడి 2282 2381 100 పేయాళ్వార్
16 నాన్ముగన్ తిరువంతాడి 2382 2477 96 తిరుమళిశై ఆళ్వార్
17 తిరువిరుత్తం 2478 2577 100 నమ్మాళ్వార్
18 తిరువాశిరియం 2578 2584 7 నమ్మాళ్వార్
19 పెరియ తిరువందాది 2585 2671 87 నమ్మాళ్వార్
20 తిరువెళుక్కుర్రిరుక్కై 2672 2672 1 తిరుమంగై ఆళ్వార్
21 సిరియ తిరుమడల్ 2673 2712 40 తిరుమంగై ఆళ్వార్
22 పెరియ తిరుమడల్ 2713 2790 78 తిరుమంగై ఆళ్వార్
23 తిరువాయ్మొళి 2791 3892 1102 నమ్మాళ్వార్
24 రామానుజ నూరందాది 3893 4000 108 తిరువరంగతముదనార్
మొత్తం పాశురాలు 4000

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Table showing details of 4000 pasurams". srivaishnavam.com srivaishnavam.com.

బయటి లింకులు

[మార్చు]