Jump to content

నల్ కంద్ ప్యాలెస్

వికీపీడియా నుండి
ప్యాలెస్ ప్రవేశ ద్వారం
ప్యాలస్ ముందు భాగం

నల్ కంద్ ప్యాలస్ లేదా నలకునాడు (కన్నడ : ನಾಲ್ಕುನಾಡು ಅರಮನೆ, Nalkunadu aremane ), అనేది కర్ణాటక రాష్ట్రంలోని  కొడగు జిల్లాలో  ఉన్న ప్యాలెస్. అక్కడి స్థానిక భాష కొడవలో  దీనిని నాల్ నాడ్ అరెమనే అని కూడా అంటారు.[1] యవకపడి అనే  గ్రామానికి దగ్గర్లో ఉంది ఈ భవనం. దీనిని సా.శ. 1792 నుంచి 1794 మధ్య కాలంలో నిర్మించారు. కొడగు ప్రాంత రాజుల్లో, హేళిరి వంశానికి చెందిన ఆఖరి రాజు, ఆ ప్రాంత ఆఖరి రాజు అయిన చిక్క వీర రాజేంద్ర ఈ ప్యాలెస్ లోనే ఉండేవారు. ఈ రాజును బ్రిటిష్ వారు గద్దె నుంచి దింపి, రాజ్యాన్ని తమ వశం చేసుకునే సమయంలో  వీర రాజేంద్ర  ఈ ప్యాలెస్ లోనే ఉన్నారు. కన్నడలో తీసిన శాంతి అనే ఏక నటి సినిమా ఈ ప్యాలస్ చుట్టుపక్కలే చిత్రించారు.[2]

చరిత్ర

[మార్చు]

సా.శ. 1780లో కొడగు రాజు లింగరాజు మరణానంతరం హైదర్ అలీ కొడుగు రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకుని, చిన్న వయస్కులైన లింగరాజు కుమారులైన దొడ్డ వీరరాజేంద్ర, లింగ రాజేంద్ర, అప్పణ్ణలను తన సంరక్షణలో ఉంచారు.[3] యువరాజులను హసన్ జిల్లాలోని గొరూర్ కు పంపించి కొడుగు రాజధాని మెర్కరాలో తన సైన్యాన్ని ఉంచాడు. కొడగు కోశాధికారి మంత్రి అమల్దార్ సుబ్బరసయను తాత్కాలికంగా రాజ్యపాలను నియమించారు. ఈ పరిణామానికి కొడగు ప్రాంత ప్రజలు, ప్రముఖులు అప్రమత్తులయ్యారు. వారి పక్క రాజ్యమైన మైసూర్లోని ఉడయార్ రాజవంశం విషయంలో హైదర్ అలీ చేసినట్టు కొడుగు రాజకుమారులను తప్పించి, రాజ్యాన్ని అతను దక్కించుకుంటాడేమోనని భావించి తిరుగుబాటు చేశారు. 1782లో హైదర్ అలీ బ్రిటిష్ సైన్యంతో యుద్ధంలో తీరిక లేకుండా ఉన్నప్పుడు, అదను చూసి కొడగు ప్రజలు తిరుగుబాటు ప్రకటించారు. హైదర్ అలీ సైనికుల్ని తమ రాజ్యం నుంచి గెంటివేసి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు వారు. కానీ యువరాజులను మాత్రం హైదర్ అలీ నిర్భంధం నుంచి  తప్పించలేకపోయారు.