Jump to content

నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి

వికీపీడియా నుండి
నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి
వ్యక్తిగతం
జననం(1926-05-01)1926 మే 1
మరణం2018 అక్టోబరు 13(2018-10-13) (వయసు 92)
వరంగల్ లోని శివనగర్
చివరి మజిలీవరంగల్ లోని శివనగర్
మతంహిందూమతము
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లురఘూనథాచార్యులు
Senior posting
Postగురువు, ఆచార్యుడు, సంస్కృత పండితుడు, సాహితీకారుడు

నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి సంస్కృత భాషా పండితుడు, సాహితీకారుడు. అతను వేద వేదాంగాలను అధ్యయనం చేసిన వ్యక్తి. అతను గ్రంథరచన, పాఠప్రవచన, ధార్మిక వేదాంత శాస్త్ర విషయ ప్రబోధములతో జీవనయానాన్ని కొనసాగించారు.[1] అతను త్రిదండి చినజీయర్‌ స్వామికి గురువు. చినజీయర్‌కు తర్కశాస్త్రం, సంస్కృతం బోధించారని చెబుతారు. శ్రీవైష్ణవ పీఠాధిపతుల్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1926 మే 1 న శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వారి స్వస్థలం కృష్ణా జిల్లా, గుడివాడలోని మోటూరు. తల్లి శేషమ్మ, తండ్రి శ్రీనివాసతాతాచార్యులు. విద్యాభ్యాసం మొదట తాతాతండ్రుల వద్దనే జరిగింది. తండ్రి వద్ద సంస్కృతం, దివ్యప్రబంధాలు, సాంప్రదాయిక తదితర విషయాలను 1942 వరకు అభ్యసించాడు. 1946లో వరంగల్‌ వచ్చి శివనగర్‌లో స్థిరపడ్డారు. అతను హైదారాబాద్‌లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శ్రీభాష్యాది శాస్త్ర విషయాలను అధ్యయనం చేశాడు. అనంతరం వరంగల్‌లో సింహాద్రిబాగ్‌లోని వైదిక కళాశాలలో ప్రధానాచార్యులుగాను, ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేసి ఎందరినో సంస్కృతాంధ్ర భాషా పండితులుగా తీర్చిదిద్ది పదవీ విరమణ చేసాడు. బాల్యంలోనే కాంచీపుర పీఠాధిపతి ప్రతివాది భయంకర అణ్ణంగాచార్య స్వామివారితో మధిరేక్షణ శబ్దార్థ విషయంలో వివాదపడి ప్రసిద్ధులయ్యాడు. రాష్ట్రంలోని జీర్ణ దేవాలయోద్ధరణ కార్యక్రమాలను చేపట్టి కొన్ని దేవాలయాలను పునఃప్రతిష్ఠగావించాడు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు.[2] సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్, శ్రీ పాంచరాత్ర ఆగమ పాఠశాలను నెలకొల్పి బ్రాహ్మణ విద్యార్థులకు వేదపాఠాలు, ఆగమం, స్మార్తం, దివ్యప్రబందం నేర్పించి ఎంతో మంది విద్యార్థులను అందించాడు. భగవత్‌ కైంకర్యనిధి పేరుతో ధార్మిక సంస్థను నెలకొల్పి 28 శ్రీమద్రామాయణ క్రతువులను నిర్వహించాడు.[3]

సాహితీ ప్రస్థానం

[మార్చు]

సత్సంప్రదాయ పరిరక్షణ సభ, సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్‌ అను సంస్థలను స్థాపించి తొంభైకి పైగా గ్రంథాలను రచించి ముద్రింపచేశారు.అనేకనూతన దేవాలయాలను,శిథిలావస్థలో ఉన్నదేవాలయాలను ప్రతిష్ఠించారు. సంస్కృత విజ్ఞానవర్ధిని పరిషత్‌ను స్థాపించి దీని ద్వారా ఆరు గ్రంథాలను ప్రచురించాడు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మరో 54 గ్రంథాలను ముద్రించాడు.

  • శ్రీవిష్ణుసహస్రనామభాష్యమ్‌,
  • ముండకోపనిషత్‌, కఠోపనిషత్‌,
  • ఈశావాస్యోపనిషత్‌, కేనోపనిషత్‌,
  • శ్రీభాష్యము (బ్రహ్మసూత్ర రామానుజ భాష్యమ్‌) నకు తెలుగు వ్యాఖ్యానము,
  • వేదప్రామాణ్యము,
  • ఆధ్యాత్మచింత
  • వేద సామ్రాజ్యం,
  • సత్సంప్రదాయ సుధ,
  • తత్వోపహారం,
  • శ్రీరంగపతి స్తుతి,
  • క్షమాషోడషి (తెలుగు వివరణ),
  • విశిష్టాద్వైతము (తెలుగు-సంస్కృతం),
  • శ్రీమాలికాస్తుతి,
  • సంప్రదాయసుధాసారం,
  • గోదాపురేశ మహత్యం (తెలుగు అనువాదం),
  • శ్రీవైష్ణవ సౌభాగ్యము,
  • అమృతవర్షిణి,
  • భక్త రసాయనము,
  • బుధరంజని (రెండు భాగాలు),
  • గౌతమధర్మ సూత్రము,
  • శ్రీవైౖష్ణవ సంప్రదాయ సౌరభము,
  • లక్ష్మీస్తుతి మంజరి (సంస్కృత వ్యాఖ్య), శ్రీ
  • వరవరముని వైభవస్తుతి,
  • కేనోపనిషత్‌ (తెలుగు వ్యాఖ్యానం),
  • ఉత్తర రామచరిత్ర,
  • శ్రీకుమార తాతాచార్య వ్యాఖ్య.

పురస్కారాలు[4]

[మార్చు]
  • త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ జీయర్‌ స్వామి 1970లో ఉభయ వేదాంతచార్య బిరుదు ప్రదానం చేశాడు.
  • 1972లో రాష్ట్రపతి వి.వి. గిరి చేతులమీదుగా రాష్ట్రపతి పురస్కారం.
  • 1999లో తిరుమల తిరుపతి విశ్వవిద్యాలయం మహామహోపాధ్యాయ పురస్కారం,
  • 1996లో కవిశాస్త్రకేసరవి అవార్డు,
  • కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
  • విజయవాడలో 2006లో గజారోహణము, కనకాభిషేకం జరిగాయి. తులాభార, స్వర్ణకంకణం, అశ్వారోహణము గౌరవాలూ అందుకున్నారు.
  • 2015 లో సంస్కృత పండితుల విభాగంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2[5]
  • అమెరికాలోని అజో-విభో ఫౌండేషన్‌ కందాళం విశిష్ట పురస్కారంతో సన్మానించింది.

అస్తమయం

[మార్చు]

అతను 2018 అక్టోబరు 13న వరంగల్‌ శివనగరలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.[6] అతని భార్య సీతమ్మ. వారికి నలుగురు కుమార్తెలు శేషమ్మ, శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి.

మూలాలు

[మార్చు]
  1. "ఉభయ వేదాన్తాచార్య (08-May-2015)". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-28.
  2. "మూగబోయిన సాహిత్యనిధి".[permanent dead link]
  3. "కవిశాబ్దిక కేసరి రఘునాథాచార్యులు ఇకలేరు".[permanent dead link]
  4. రాష్ట్ర స్థాయి అవార్డులకు ఏడుగురి ఎంపిక[permanent dead link]
  5. "State Awards for 46". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-28.
  6. "రఘునాథాచార్యులు దేహాంతం".[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]