Jump to content

పంచె

వికీపీడియా నుండి
(ధోవతి నుండి దారిమార్పు చెందింది)
పంచె కట్టు సాంప్రదాయంలో వ్యక్తులు

పంచె భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లో పురుషులు (కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు కూడా) ధరించే సాంప్రదాయక వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది.

భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్ లలో కేడియా అనే ఒక పొట్టి కుర్తాతో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి బీహార్, పశ్చిమ బెంగాల్, శ్రీలంక లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. తమిళనాడులో సట్టై (చొక్కా) తో బాటు, ఆంధ్రలో చొక్కా లేదా కుర్తా (జుబ్బా) తో ధరిస్తారు. పాకిస్థాన్, పంజాబ్ లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. లుంగీ అనే మరో వస్త్రం కూడా ఆసియా, ఆఫ్రికా లలో విరివిగా ధరించబడుతుంది.

తెలుగు సాంప్రదాయ పంచె కట్టులో చిరుతల భజన  కళాకారులు

దీనిని కుర్తా(జుబ్బా) , కండువా, తలపాగాతో కలిపి ధరించడం తెలుగువారి స్వచ్ఛమైన వస్త్రధారణ.

భారతదేశంలో వివిధ పేర్లు

[మార్చు]

సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని ఒడిశా, హిందీ లలో ధోతి అని, గుజరాతీలో ధోతియు అని, బెంగాలీలో ధుతి అని అస్సామీలో సురియా అని, పంజాబీలో లాచా అని, మళయాళంలో ముండు అని, కొంకణ్లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వే అని, మరాఠీలో ధోతార్ లేదా పంచె అని, కన్నడంలో కూడా పంచె అని పిలుస్తారు, పంజాబీలో లాచా అని, ఉత్తర ప్రదేశ్, బీహార్, తేరై ల నగరాలలో మర్దానీ అనీ, తమిళంలో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.ఇవి సుమారు 7 గజాలు పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.

వాడుక , సంప్రదాయం

[మార్చు]

యావత్ భారతదేశంలో పంచెని సాంప్రదాయిక వస్త్రంగానే పరిగణిస్తారు. ప్రభుత్వ, సాంప్రదాయిక కుటుంబ ఉత్సవాలలోనే కాకుండా గ్రామ సంఘాల (కంట్రీ క్లబ్బు) లలో సాంప్రదాయిక వస్త్రాలని కచ్చితంగా అమలు చేసే వ్యవస్థాపనలలో కూడా పంచెలు ఆమోద యోగ్యాలు. ఉపఖండంతో బాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో కూడా ఇదే వర్తిస్తుంది. ఈ దేశాలలోని రాజకీయవేత్తలు, ప్రముఖులు పంచెలనే ధరించటం పై మొగ్గు చూపటంతో ఈ వస్త్రం సంస్కృతి, సంప్రదాయాల్ని పాటించేవారికి చిహ్నంగా రూపుదిద్దుకొన్నది. సూటు-టైలు (పెళ్ళి, విందు ల వంటి) ప్రత్యేక సందర్భాలలో, రోజు వారీ ఉద్యోగాలకు షర్టు-ప్యాంటులు వేసుకొన్ననూ, సంప్రదాయాన్ని అనుసరించే వారిలో మాత్రం పంచెదే పై చేయి.

దక్షిణ భారతదేశంలో పంచె అన్ని సాంస్కృతిక, సాంప్రదాయిక వేడుకలు, ఆచారాలలో ధరించబడుతుంది. వివాహ వేడుకల్లో వరుడు, ఇతర ఆచారలను నిర్వహించే ముఖ్య వ్యక్తి/వ్యక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొనే సమయాలలో పంచెలు తప్పనిసరి.పంచె ఎలా కట్టాలన్న విషయంలో ఎటువంటి నియమనిబంధనలూ లేవు. ఇతరులను చూసి నేర్చుకోవటం, పెద్దల్ని అనుకరించటం లతో దీని కట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం సర్వత్రా పంచెని మోకాళ్ళ వరకు లేదా కొద్దిగా పైకి/క్రిందకు కడతారు. ప్రాంతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చుట్టు ప్రక్కల ఉన్న వారిని బట్టి కడతారు. (పెద్దలు, పరస్త్రీలు ఉన్నట్లయితే వారికి మర్యాద ఇచ్చే ఉద్దేశంతో ఇలా కట్టరు)

పెళ్ళికొడుకు పంచె కట్టు గతంలో తెలుగు నాట పెళ్ళికొడుకు పెళ్ళి సందర్భంలో తప్పనిసరిగా పంచె కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ నిబంధన తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు పెళ్ళికొడుకులు పంచె కడుతున్నారు.అహింసను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.

పశ్చిమ హరే కృష్ణ అనుచరగణాలు కాషాయ/తెలుపు రంగు పంచెలను సాంప్రదాయబద్ధంగా మడిచి కడతారు. గాంధీ దక్షిణ ఆఫ్రికాలో దొరల వలె సూటు-బూటు ధరించిననూ స్వాతంత్ర్యపోరులో జనానికి తెలిసిన తన తర్వాతి జీవితంలో సింహభాగము పంచెనే కట్టారు. మహర్షి మహేశ్ యోగి తెల్లని సిల్కు ధోవతీ ధరించటంలో పెట్టింది పేరు.సంపన్న వర్గాలకి చెందిన బెంగాలీ యువకులు అనగానే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, సాదా కుర్తా, ముందు వైపు కుచ్చిళ్ళతో ముడి వేసిన భారీ ధోవతి యొక్క ఒక మూలని చేత్తో పట్టుకొని రాజకీయాలు, సాహిత్యం గురించి మాట్లాడే వారే గుర్తుకు వస్తారు.అత్యంత సొగసైనవిగా భావింపబడే ఈ దుస్తులు వివాహాలకు, సాంస్కృతిక ఉత్సవాలకు ధరింపబడతాయి.మొరటుగా ఉంటుందని, ఫ్యాషన్ కాదని, యువతకి నప్పదని ఒక శతాబ్దం పైగా యువకులు పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గిననూ గ్రామాలలో పెద్దరికాన్ని, హుందాతనాన్ని ఇనుమడింపజేసేది పంచే!

వివిధ శైలులు , రకాలు

[మార్చు]

సంస్కృతంలో పంచ అనగా ఐదు. బహుశ: ఐదు ఆడుగుల పొడవు ఉన్న వస్త్రం అని కాబోలు దీనికి ఈ పేరు వచ్చింది. ధువతి అన్న సంస్కృత పదానికి ధోవతి అనే పదానికి సంబంధం ఉండవచ్చును. ఒక రకమైన దక్షిణ భారత పంచెకట్టులో ఐదు ముళ్ళు వేయవలసిన అవసరం ఉన్నది, ఇది కూడా కారణం అయి ఉండవచ్చును.సాధారణంగా తెలుపు దానికి సంబంధించిన రంగులో (క్రీం కలర్) ఉన్నా, మతసంబంధిత కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో వేరే రంగులు వాడతారు. ఉపనయనాలకి పసుపు/తెలుపు లలో లభ్యమయ్యే (తమిళనాడులో మగతం అనే) పట్టు పంచెలు ధరిస్తారు. సింధూర వర్ణంలో ఉండే సౌలే అనబడు పంచెలు మహారాష్ట్రలో గుళ్ళలోని అర్చకులు వాడతారు. రాజుల, కవుల పట్టు పంచెలు ముదురు రంగులతో ఉండగా బంగారు దారాలతో వాటికి ఎంబ్రాయిడరీలు ఉండేవి. రోజువారీ వినియోగానికి నూలు పంచెలు ఉత్తమం. పట్టు పంచెలు ఖరీదు ఎక్కువ. వీటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడతారు.

ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా రాయలసీమ) లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. యునైటెడ్ కింగ్డమ్కి చెందిన గ్లాస్గోలో ఉత్తమ నూలు ఉత్పత్తి అవటం వలన నాణ్యత గల పంచెలని గ్లాస్గో పంచెలు అని సంబోధిస్తారు. అయితే వీటి వికృతి గ్లాస్కో పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి మొలత్రాడుని వాడతారు. పంచ, పై పంచలు సాధారణంగా తెలుపు రంగులో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం అంచు అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.

పంచెకట్టు: చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)

ధోవతి కట్టు: పై విధంగా కట్టిన పంచెకి క్రిందికి వ్రేలాడే అంచును కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసుకుపోయి, నడుము వద్ద లోపలికి (మాత్రమే) దోపుతారు. వెనుకకు దోపటం తప్పని సరి కాదు. నడిచే సమయంలో పెద్ద పెద్ద అడుగులు వేసేందుకు వీలుగా దీనిని చేత పట్టుకొనవచ్చును.

దక్షిణ భారతంలో పంచె వినియోగం

[మార్చు]

దక్షిణ భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలోనూ, పంచెని కొంచెం అటు ఇటుగా ఒకే రకంగా కడతారు.

తమిళులు పంచకీ, లుంగీలకీ జారిపోకుండా వెడల్పైన బెల్టు వాడతారు. కొందరైతే బెల్టు కనబడేలా షర్టుని పంచ లోకి టక్-ఇన్ చేస్తారు.

మలయాళీలు ఎక్కువగా ఎరుపు రంగు చొక్కా, తెలుపు రంగు పంచెలను ధరిస్తారు. కేరళలో జరిగే అత్యంత పెద్ద పండుగ అయిన ఓనంకి హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు చొక్కా-తెల్ల పంచెలు ధరిస్తారు. అయితే హిందువులు సవ్య దిశగా (clockwise: free end కుడి వైపుకు), ముస్లిం, క్రైస్తవులు అయితే అపసవ్య దిశగా (anti-clockwise: free end ఎడమ వైపుకు) కడతారు. కేరళ లోని ప్రతి గుడిలో పురుషులు కేవలం పంచెలను మాత్రమే ధరించాలి. (శరీరం పై భాగం పై టవలు, పై పంచె, శాలువా వంటి ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు.)

మోకాలి వరకు (కాస్త పైకి గానీ, క్రిందకి గానీ) ఎగకట్టే పంచెని అడ్డ పంచె అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుడులలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పంచె&oldid=4354126" నుండి వెలికితీశారు