Jump to content

దేవులపల్లి కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
దేవులపల్లి కృష్ణమూర్తి
దేవులపల్లి కృష్ణమూర్తి
జననందేవులపల్లి కృష్ణమూర్తి
(1940-06-14) 1940 జూన్ 14 (వయసు 84)
అనంతారం, నల్గొండ జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధిరచయిత
మతంహిందూ
భార్య / భర్తకమల
పిల్లలుకవిత, క్రాంతి, కిరణ్
తండ్రిపెదనరసింహం
తల్లిరాములమ్మ

దేవులపల్లి కృష్ణమూర్తి తెలుగు రచయిత. తెలంగాణ నుడికారం, పలుకుబడి ఇతని రచనలలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు తన 70వ యేట రచనలు చేయడం ప్రారంభించాడు. పలువురు ఇతని రచనలను ప్రశంసించారు. సాహిత్యకారులచే ఇతడు "నల్గగొండ గోర్కీ"గా కొనియాడబడ్డాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

దేవులపల్లి కృష్ణమూర్తి నల్గొండ జిల్లా, అనంతారం గ్రామంలో ఒక నిరుపేద నేతకార్మికుల కుటుంబంలో 1940వ సంవత్సరంలో జన్మించాడు. ఇతడు స్వగ్రామంలో నాలుగవ తరగతి వరకు, సూర్యాపేటలో ఐదు నుండి హెచ్.ఎస్.సి. వరకు చదువుకున్నాడు. 1958లో ఇతనికి కమలతో వివాహం జరిగింది. 1959లో స్వల్పకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1960లో రెవెన్యూశాఖలో చేరి సూర్యాపేట తహసీల్ ఆఫీసులో ఎల్.డి.సి.గా ఉద్యోగం ప్రారంభించి 1998లో వేములపల్లి నుండి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు.

సాహిత్యరంగం

[మార్చు]

ఇతనికి చిన్నతనం నుండి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఉండేది. రాదుగ ప్రచురణల సోవియట్ సాహిత్యం, శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి వంటి కవుల, రచయితల రచనలతో ప్రభావితుడయ్యాడు. నోముల సత్యనారాయణ, పిట్టల రామచంద్రం, కొల్లోజు కనకాచారి, బోయ జంగయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, అంపశయ్య నవీన్ మొదలైన రచయితలతోనూ, బి.నరసింగరావు, మోహన్, చంద్ర, ఏలే లక్ష్మణ్ వంటి కళాకారులతోను ఇతనికి సన్నిహిత పరిచయం ఉంది. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక, చైతన్య సమాఖ్య, సృజన సాహితీమిత్రులు, యువరచయితల సమితి మొదలైన సాహిత్య సంస్థలతో కలిసి పనిచేశాడు. 1970లో విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి వేడుకలకు నోముల సత్యనారాయణ, చిన వెంకటరామారావు, అంపశయ్య నవీన్ తదితరులతో కలిసి హాజరయ్యాడు. తరువాత సెవెన్ స్టార్ సిండికేట్ హైదరాబాదులో నిర్వహించిన అరసం మహాసభలు, శ్రీశ్రీ విరసం నిర్మాణం అయినట్లుగా ప్రకటించడం వంటి సందర్భాలకు ఇతడు ప్రత్యక్షసాక్షి. 1983లో నల్గొండ జిల్లా రచయితల మహాసభల ఏర్పాటులో పాలుపంచుకున్నాడు.

రచనలు

[మార్చు]

ఇతడు తన 70వ యేట 2009నుండి రచనలు చేయడం మొదలుపెట్టాడు. ఊరు వాడ బ్రతుకు అనే ఆత్మకథాత్మక నవల ఇతని తొలి రచన. దీనిని గీతా రామస్వామి ఇంగ్లీషులోనికి లైఫ్ ఇన్ అనంతారం అనే పేరుతో అనువదించింది. కృష్ణమూర్తి 3 నవలలు, 4 కథా సంపుటాలు, ఒక యాత్రా రచన ప్రచురించాడు. 80కి పైగా కథలను వ్రాశాడు.

గ్రంథాలు

[మార్చు]
  1. ఊరు వాడ బతుకు (ఆత్మకథ)
  2. మా యాత్ర (యాత్రాచరిత్ర)
  3. కథలగూడు (కథాసంపుటి)
  4. బయటి గుడిసెలు (నవల)
  5. యక్షగానం (కథాసంపుటి)
  6. తారుమారు (కథాసంపుటి)
  7. మూడు ముక్కలాట (నవల)
  8. అవతలిగట్టు (కథాసంపుటి) (అముద్రితం)

కథలు

[మార్చు]

ఇతడు వ్రాసిన కథల పాక్షిక జాబితా:

  • అతడు - నేను - పిచ్చిరెడ్డి
  • అవతలి గట్టు
  • ఆమె చూపు
  • ఆవులపిచ్చయ్య దొరికిండు
  • ఆశలపల్లకి
  • ఇదీ సంగతి
  • ఉర్లగొండజాతర
  • ఎన్‌కౌంటర్
  • కోరిక
  • గుర్రం ఎగిరింది
  • గోడకున్న బొమ్మ
  • చాదస్తం
  • తమ్ముడు శ్రీశైలం
  • తారుమారు
  • తూంకుంట బంగ్లా
  • దొరలు
  • ద్రోహం
  • నళినీయం
  • నా కథ
  • పక్షులు
  • పనిలేని మనిషి
  • పూర్తి కాని వర్ణచిత్రం
  • బతికిన రోజులు
  • బాల్కని
  • భక్తి - ముక్తి
  • భూభాగోతం
  • మనోరమ
  • మళ్ళీ మొదటికొచ్చింది
  • మా ఊరు
  • మాతృప్రేమ
  • మాయజలతారు
  • మృత్యుంజయుడు
  • మొదటి కథ
  • యక్షగానం
  • రాఘవ మళ్లీ కనిపించలేదు
  • వరదరాజులు
  • వలస పక్షులు
  • శాంతి
  • సన్‌స్ట్రోక్
  • సమరయోధురాలు
  • సలోమి ఆపద్బంధువు
  • సుపుత్రులు
  • స్టార్ బుక్ హౌస్

బతుకుపుస్తకం

[మార్చు]
బతుకు పుస్తకం అభినందన సంచిక

దేవులపల్లి కృష్ణమూర్తి 82వ జన్మదినం సందర్భంగా జయమిత్ర సాహిత్య, సాంస్కృతిక వేదిక బతుకుపుస్తకం పేరుతో ఒక అభినందన సంచిక వెలువరించింది. జి.చెన్నకేశవరెడ్డి, పి.లక్ష్మీనారాయణ, అమ్మంగి వేణుగోపాల్‌ల సంపాదకత్వంలో ఈ గ్రంథం ప్రచురింపబడింది. దీనిలో ఇతని రచనల గురించి, ఉద్యోగం గురించి, సాహిత్యసేవ గురించి వివరించే వ్యాసాలు, కవితలు ఉన్నాయి. జి.చెన్నకేశవరెడ్డి, పి.లక్ష్మీనారాయణ, అమ్మంగి వేణుగోపాల్, తెలిదేవర భానుమూర్తి, అంపశయ్య నవీన్, ఎన్.వేణుగోపాల్, నగ్నముని, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, శివారెడ్డి, నోముల సత్యనారాయణ, కె.పి.అశోక్ కుమార్, వెల్దండి శ్రీధర్, జయధీర్ తిరుమలరావు, ముదిగంటి సుజాతారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, చందు సుబ్బారావు, మేరెడ్డి యాదగిరిరెడ్డి మొదలైనవారి రచనలతో పాటు దేవులపల్లి కృష్ణమూర్తి వ్రాసిన "నా బతుకు" అనే వ్యాసం కూడా ఈ పుస్తకంలో ఉంది.

పురస్కారాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

దేవులపల్లి కృష్ణమూర్తి వ్రాసిన పుస్తకాలు:

మూలాలు, వనరులు

[మార్చు]
  1. శీలం భద్రయ్య (1 April 2021). "రచయిత దేవులపల్లి కృష్ణమూర్తితో ఇంటర్వ్యూ". సబాల్టర్న్ బులెటిన్ (6): 23–27.
  • బతుకు పుస్తకం (అభినందన సంచిక) - 2021 - సంపాదకులు: ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి, ఆచార్య పి.లక్ష్మీనారాయణ, డా.అమ్మంగి వేణుగోపాల్ - జయమిత్ర సాహిత్య సాంస్కృతికవేదిక, హైదరాబాదు/నల్లగొండ - 190 పేజీలు