Jump to content

దీవి రంగాచార్యులు

వికీపీడియా నుండి

దీవి రంగాచార్యులు (జూలై 3, 1898 - ఫిబ్రవరి 6, 1976) సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు.

జివిత విశేషాలు

[మార్చు]

ఆయన బాపట్ల లో జూలై 3, 1898 లో జన్మించారు. ప్రాచీన భారతీయ వైద్యశాస్త్ర ప్రకాండుల "సంహిత" లను ఆపోసన పట్టారు. చరక మహర్షిని ఆదర్శంగా తీసుకొని, ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందజేయాలన్న మహదాశయంతో జీవిత పర్యంతం కర్మయోగిగా భాసిల్లారు.[1]

ప్రాచీన భారతీయ వైద్యాలతోపాటు అలోపతి,న్యాచురోపతి,హోమియోపతి,క్రోమోథెరపీ, హైడ్రోథెరపీ,యోగా మొదలైన చికిత్సా విధానాలన్నింటిలో శిక్షణ పొందారు. వ్యాధిగ్రస్తుల పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాథి నిర్దారణపట్ల ఏకాగ్రత ఉండి తీరాలన్న లక్ష్యంతో ఆయుర్వేద వైద్యాన్ని ఒక మహోద్యమ శైలిలో రాష్ట్రమంతటా ప్రచారం చేసారు.

బొంబాయిలో ఎలక్ట్రోథెరపీ లో ప్రత్యేక శిక్షణ పొంది, గుంటూరులో తొలిసారిగా విద్యుత్ చికిత్సాలయాన్ని స్థాపించారు. కేరళ రాష్ట్రంలోని ప్రధాన విభాగమైన "పంచకర్మ సిద్ధాంతాన్ని" అభ్యసించి, చికిత్సాపరంగా నూతన ఆవిష్కరణలు చేసారు. నిత్య విద్యార్థిగా ఉంటూ సంప్రదాయ వైద్య రంగంలో గాఢాధ్యయనం చేసి, చికిత్సారంగంలో నూతన విధానాలను కనిపెట్టారు. 1920 నుంచి రెండు దశాబ్దాలపాటు భారతీయ సంప్రదాయ వైద్యాన్ని మహోధృతంగా ప్రచారం చేసారు. 1926 లో ప్రకృతి వైద్య మహాసభలను(బాపట్ల), 1927 లో ఆయుర్వేద మహామండలి (మచిలీపట్నం) ని ఘనంగా నిర్వహించారు. "అనువంశిక ఆయుర్వేద,యునాని వైద్య సంఘము" ను స్థాపించి ఇండియన్ మెడికల్ యాక్టు (1933,ఫిబ్రవరి 1-బ్రిటిష్ ప్రభుత్వ జారీ) కు అనుగుణంగా మలచి, వైద్య సంఘానికి ఎంతో మేలు ఒనర్చారు. "ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి" ద్వారా ఆయుర్వేద వైద్యవికాసానికి అవిరళ కృషి చేసారు. శాస్త్ర పరిశోధనల ద్వారా ఆయుర్వేద వైద్య రంగానికి వెన్నుబలం కలిగించారు.[1]

ఆయనకు అమెరికా ప్రకృతి వైద్య పరిషత్ వారు డాక్టరేట్ యిచ్చి గౌరవించారు. రాష్ట్రంలో "కవి వాచస్పతి" బిరుదు గ్రహీత. ఆయుర్వేద వైద్య విద్యకు నూతన రూపురేఖలు కల్పించి, కళాశాల విద్యకు ఊపిరిలూది వైద్య విద్యార్థులకు స్ఫుర్తినందించారు. "వైద్య ప్రదీపిక" మాస పత్రికను స్థాపించి, పలు పరిశోధనాకాత్మక వ్యాసాలను ప్రచురించారు. గుంటురులో 1936 లో ఆయుర్వేద కళాశాలను నెలకొల్పి అనేకమంది విద్యార్థులను ఆయుర్వేద వైద్యులుగా తిర్చిదిద్దారు. గుంటూరులోనే 1976, ఫిబ్రవరి 6 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర శాస్త్రవేత్త;లు (కృష్ణవేణి పబ్లిషర్స్ ed.). శ్రీవాసవ్య. 2011. p. 148.

ఇతర లింకులు

[మార్చు]