Jump to content

ది హిందూ

వికీపీడియా నుండి
(ది హిందు నుండి దారిమార్పు చెందింది)

రకముదినపత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీటు

యాజమాన్యం:కస్తూరి & సన్స్ లిమిటెడ్.
ప్రచురణకర్త:ఎన్. రామ్
సంపాదకులు:ఎన్. రామ్
స్థాపనసెప్టెంబర్ 20, 1878
రాజకీయ పక్షమువామపక్ష మొగ్గు, స్వతంత్ర [1]
వెలరూ.3.20 (వారం దినాల్లో),
రూ.5.00 (ఆదివారం సంచిక)
ప్రధాన కేంద్రముచెన్నై

వెబ్‌సైటు: ది హిందూ, ది హిందూ పాత సైట్

ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికకు భారతదేశములో ఒక విశిష్ట స్థానం ఉంది. ఇది దక్షిణ భారతదేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రిక. ఈ పత్రికను 1878 లో మద్రాసులో స్థాపించారు. దీని యాజమాన్యం ఒక కుటుంబం (కస్తూరి అండ్ సన్స్) చేతిలోనే ఉంది. రోజూ 22 లక్షల మంది ఈ పత్రికను చదువుతారు.[1]పత్రిక సంవత్సర ఆదాయము సుమారు 400 కోట్ల రూపాయలు.

పత్రిక స్థాపకులు

[మార్చు]
సుబ్రమణియ అయ్యర్

ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులు - తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణియ అయ్యర్, ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవాచారియర్ - నలుగురు న్యాయశాస్త్రవిద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్,, న్యాపతి సుబ్బారావు పంతులు (హిందూ స్థాపకుల్లో ఆంధ్రుడు) - వీళ్ళందరూ ట్రిప్లికేన్ సాహితీసంఘం సభ్యులు. ఈ సంఘం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ వైఖరుల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం లక్ష్యాలుగా ఏర్పడింది. ట్రిప్లికేన్ సిక్స్ అని పేరుబడ్డ ఆ ఆరుగురు యువకులు మొదట న్యూస్‌పేపర్ అనే సైక్లోస్టైల్ పక్షపత్రికను ప్రారంభించారు. చెన్నైలో ఆ పత్రికకు మంచి స్పందన లభించడంతో హిందూను వారపత్రికగా ప్రచురించడం మొదలుపెట్టారు.

హిందూ పత్రిక గురించి

[మార్చు]

1878లో వారపత్రికగా మొదలై,[2] 1889 నుంచి దినపత్రికగా వెలువడుతోన్న హిందూ, ప్రజాదరణను స్థిరంగా పెంచుకుంటూ ప్రస్తుతం భారతదేశంలోనూ విదేశాలలోనూ కలిపి పది లక్షలకు పైబడిన సర్కులేషన్ తో 30 లక్షల మంది పాఠకులను చేరుతోంది. ఆన్‌లైన్ ఎడిషన్ (http://www.hindu.com Archived 2009-01-06 at the Wayback Machine) ప్రారంభించి ప్రతి గంటకు తాజా వార్తలను [2] అందించడం మొదలుపెట్టిన తొలి భారతీయ పత్రికల్లో హిందూ ఒకటి. హిందూ పత్రిక ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది.

ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో హిందూ పత్రిక సాటిలేని ప్రజాదరణ కలిగి ఉంది. ఇక్కడ అది కేవలం ఒక దినపత్రిక మాత్రమే కాదు, ఇక్కడి సంస్కృతిలో ఒక భాగంగా, స్థానిక సంప్రదాయానికి ఒక చిహ్నంగా గుర్తింపు పొందింది. పత్రికను నడిపే కుటుంబంలోని రాజకీయాలు ఎలా మలుపు తిరిగినా చెక్కుచెదరని పాఠకాభిమానం ఈ పత్రిక సొంతం. ఆ పాఠకుల్లో అత్యధికులకు హిందూ పత్రికను చదవడం చిన్నవయసులోనే ఒక అలవాటుగా మారిపోతుంది. పత్రిక పేరులోనే హిందూ మతం ఉన్నా ఈ పత్రిక మాత్రం చాలా విస్తారమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద నిపుణుల విశ్లేషణలను అందించే పరిణత వ్యాఖ్యాతగా గుర్తింపు పొందింది.

న్యాపతి సుబ్బారావు పంతులు

భారతదేశంలోని అనేక ఇతర ప్రచురణ సంస్థల వలెనే ది హిందూ యాజమాన్యం, నిర్వహణ కూడా ఒకే కుటుంబం ఆధీనంలో ఉన్నాయి. పత్రికను 1965 నుంచి 1991 వరకు జి కస్తూరి, 1991 నుంచి 2003 వరకు ఎన్.రవి, 2003 జూన్ 27 నుంచి అతని సోదరుడు ఎన్.రామ్ నిర్వహిస్తున్నారు. ఇతర కుటుంబసభ్యులు నిర్మలా లక్ష్మణ్, మాలినీ పార్థసారథి, నళినీ కృష్ణన్, ఎన్.మురళి, కె.బాలాజీ, కె. వేణుగోపాల్, రమేష్ రంగరాజన్, ప్రచురణకర్త ఎస్. రంగరాజన్ ది హిందూ పత్రిక, దాని ప్రచురణసంస్థ అయిన కస్తూరి & సన్స్ లో డైరెక్టర్లు.

వార్తాపత్రికల డిజైనరుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మేరియో గార్సియా సాయంతో హిందూ పత్రిక గత సంవత్సరం సరికొత్త 'contemporary yet classic' రూపంలో మరింత ఆకర్షణీయంగా తయారైంది. వార్తల్లో కచ్చితత్వం, నిష్పాక్షిత, లోతైన విశ్లేషణలతో అంతవరకు విషయప్రాధాన్యతకే విలువనిచ్చిన ఈ పత్రిక ఇప్పుడు కంటికింపైన రూపంతో అన్ని వర్గాల, వయసుల పాఠకులను ఆకట్టుకుంటోంది.

హిందూ పత్రిక వార్తాసేకరణకు, పేజీలోని వార్తాంశాల అమరికకు, ముద్రణకు అధునాతన సదుపాయాలను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో బాటు 12 కేంద్రాలనుంచి వెలువడుతోంది: కోయంబత్తూరు, బెంగుళూరు, మదురై, హైదరాబాదు, న్యూఢిల్లీ, విశాఖపట్నం, తిరువనంతపురం, కొచ్చి, విజయవాడ, మంగుళూరు, తిరుచిరాపల్లి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ముద్రణ కేంద్రాలన్నీ వార్తావిశేషాలను ఎప్పటికప్పుడు అందుకోవడానికి వీలుగా అత్యంత వేగవంతమైన డేటా లైన్ల ద్వారా అనుసంధానం చేయబడ్డాయి.

పత్రిక ఆదర్శాలు

[మార్చు]

నమ్మకం, సాధికారత, విశ్వసనీయత, నిష్పాక్షికత, ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుండడం పత్రిక ఆదర్శాలుగా ఉన్నాయి. పత్రికను సకాలంలో పంపిణీ చేయడానికి సొంత విమానాలను ఏర్పాటు చేసుకున్న తొలి భారతీయ పత్రిక హిందూ. అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ హత్యకు గురైనప్పుడు అప్పటికే పత్రికలను తీసుకుని ఆకాశంలోకెగిరిన విమానాలను వెనక్కి రప్పించి, అప్పటికప్పుడు పత్రికలను మళ్ళీ ముద్రించి పంపారు.

రాజకీయ దృక్పథం

[మార్చు]

హిందూ పత్రిక భారతదేశంలో బ్రిటిష్ పాలనకాలంలో జాతీయవాద పత్రికగా మొదలైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పట్ల పరిణతి చెందిన విమర్శనాత్మక అభిప్రాయాలను ప్రకటించే పత్రికగా తన్ను తాను మలచుకొంది. పత్రిక మొదట స్థాపించబడిందీ, ప్రధానకార్యాలయం ఉన్నదీ, ఇప్పటికీ అత్యధిక కాపీలు అమ్ముడుపోయేదీ తమిళనాడు రాష్ట్రంలోనే. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు రాజకీయాలను శాసించే ఆ రాష్ట్రంలో బ్రాహ్మణులు స్థాపించి, బ్రాహ్మణులే నడుపుతున్న ఈ పత్రిక ఆశ్చర్యకరంగా నిలదొక్కుకోవడమే గాక బాగా బలపడింది! పత్రిక యాజమాన్యంలో తరాలు మారేకొద్దీ పత్రిక విశ్వాసాలు కూడా హిందూత్వ, సంఘపరివార్ శక్తుల మతాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మరింత బలపడ్డాయి.

అన్నాడీఎంకే ప్రభుత్వ చర్యలు

[మార్చు]

2003 సంవత్సరంలో తమిళనాడు శాసనసభాహక్కుల సంఘం హిందూ పత్రిక ప్రచురణకర్త, అదే పత్రికకు చెందిన నలుగురు పాత్రికేయులు సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు తీర్మానించడంతో అదే సంవత్సరం నవంబరు 7 వ తేదీన శాసనసభ వారికి 15 రోజుల సాధారణ కారాగారశిక్షను విధిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభలో ఏ రూపంలోనైనా సరే ప్రభుత్వంతో విభేదించేవారిపై "పెరిగిపోతున్న అసహనం" గురించి ఏప్రిల్ 2003లో ఈ పత్రికలో వచ్చిన మూడు వేర్వేరు వార్తాకథనాలలోను, ఒక సంపాదకీయంలోను పేర్కొనడమే ఈ తీర్మానానికి దారితీసింది. అసహనాన్ని ఎత్తిచూపిన పత్రికపైనే "అసహనం" ప్రదర్శించడం గమనార్హం. అన్నాడీఎంకే పార్టీకి సభలో సాధారణ మెజారిటీ ఉండడం వల్ల ఆ తీర్మానం సులభంగా నెగ్గింది. అధికార పార్టీకే చెందిన శాసనసభ స్పీకరు ఆ వార్తాకథనాలను శాసనసభా ధిక్కారంగా ప్రకటించాడు.

ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న పోలీసు చర్య - చెన్నైలోని హిందూ పత్రిక ప్రధానకార్యాలయంపై జరిగిన పోలీసుల దాడి, పాత్రికేయుల అరెస్టు - అంతటా తీవ్రమైన విమర్శలకు గురైంది. మరీ ముఖ్యంగా, జరిగింది క్రిమినల్ నేరం కాకపోయినా, అన్ని మర్యాదలకు, రూల్స్ కు విరుద్ధంగా, కేవలం హిందూ పత్రిక ఉద్యోగులను వేధించడమే ధ్యేయంగా జరిగిన ఆ చర్యను మీడియా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నేరం ఆరోపించబడిన పాత్రికేయులకు కనీసం హక్కుల కమిటీ ముందు తమ వాదనలను వినిపించే అవకాశం కూడా ఇవ్వనందుకు ఈ మొత్తం వ్యవహారం భావ ప్రకటనాస్వేచ్ఛకు విఘాతం కలిగించేదిగాను, సహజన్యాయ నియమాలకు విరుద్ధంగాను ఉందని అందరి విమర్శలకు గురైంది. సుప్రీమ్‌కోర్టు ఆ పాత్రికేయుల అరెస్టును ఆపుచేయించింది. ఆ కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది. [3]

బోఫోర్స్ కుంభకోణం

[మార్చు]

(From [3] Archived 2011-03-20 at the Wayback Machine) "155 ఎం ఎం హోవిట్జర్ శతఘ్నులను భారీ మొత్తానికి కొనడానికి భారతప్రభుత్వం స్వీడన్ కు చెందిన ఆయుధాల తయారీ కంపెనీ బోఫోర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కాంట్రాక్టును బోఫోర్స్ కంపెనీకి దక్కేలా చేయడానికి భారతదేశానికి చెందిన పెద్దపెద్ద రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, సైనికాధికారులకు ముడుపులు ముట్టాయని 1987 ఏప్రిల్ లో స్వీడిష్ రేడియో ఆరోపించడంతో బోఫోర్స్ కుంభకోణం నిశ్శబ్దంగా బద్దలైంది. జూన్ 1987లో హిందూ పత్రిక బోఫోర్స్ వ్యవహారం "చాలా తీవ్రమైన విషయం"గా పేర్కొని ఇంకా ఇలా అంది: "ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బోఫోర్స్-ఇండియా ఒప్పందంలో భారతదేశంలో తప్పు చేసినవారెవరూ - వారెంత ఉన్నతస్థానంలో ఉన్నా సరే - తప్పించుకోజాలరని పార్లమెంటుకు, దేశప్రజలకు వాగ్ధానం చేశాడు... నిజాయితీగా దర్యాప్తు చేసి, తప్పుచేసినవారిని శిక్షించవలసిన సమయం ఇదే."

కొన్ని వారాల తర్వాత ఆ పత్రిక ఇలా గర్జించింది: "రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో (అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థి) బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన ఆనందం అతి త్వరలోనే ఆవిరైపోయి ప్రధానమంత్రి పీకలోతు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోవడంతో దేశంలో ప్రస్తుతం నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని చిన్నపిల్లలకు కూడా తెలుసు లేదా తెలియాలి. గత ఎనిమిది నెలలకు పైగా శ్రీ రాజీవ్ గాంధీ వినాశకరమైన వేగంతో ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన తప్పులు చేశారు.. తన పార్టీకి, ప్రభుత్వానికి మరింత చెరుపు చేసేలా. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ప్రభుత్వం యొక్క వర్తమానం, భవిష్యత్తులపై మెడమీది కత్తిలా వేలాడుతున్నాయి." కుంభకోణం బయటపడిన నాలుగు నెలల తర్వాత కూడా ప్రభుత్వం వాస్తవాలను తేటతెల్లం చేయడానికి ఏమీ చేయకపోవడంతో పత్రిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం "తన చేతులు డబ్బుసంచిలో ఇరుక్కుపోయిన తర్వాత పాతకాలం నాటి బుకాయింపు"లనే వాడుకుంటోందని ఆరోపించింది.

హిందూ తన తొలి యాభై ఏళ్ళ నాటి స్వరంతో ధ్వనించడం మొదలుపెట్టింది. 1988 ప్రథమార్థంలో స్విట్జర్లాండులో తన పార్ట్-టైం కరస్పాండెంటు చిత్రా సుబ్రమణియం ద్వారా బోఫోర్స్ వ్యవహారంలో వెలుగుచూడని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇతరులెవ్వరికీ తెలియని వివరాలను ఆధారిత డాక్యుమెంట్లతో సహా సేకరించడం మొదలు పెట్టింది. దూకుడుగా సాగిన ఆ పరిశోధనలో ఆమెకు రామ్ తోడవడంతో ఈ అంశంతోటే హిందూ పత్రికలో కాలమ్‌లను, ఒక్కోసారి పేజీలను నింపడం మొదలుపెట్టింది. అది ఈ విషయంపై సుదీర్ఘమైన జాతీయ రాజకీయ చర్చలకు దిశానిర్దేశం చేసింది. ఆరు నెలల కాలంలో ఆ పత్రిక స్విస్ బ్యాంకు అకౌంట్లలోకి జరిగిన 5 కోట్ల అమెరికన్ డాలర్లకు పైగా రహస్య చెల్లింపులు, ఆ చెల్లింపుల వెనుక జరిగిన చర్చలు, ఇతర సమాచారాలకు సంబంధించిన వివరాలను తెలిపే అసలు పత్రాల కాపీలను పదులకొద్దీ ప్రచురించింది.

బోఫోర్స్ వ్యవహారం దేశంలో ఒక రాజకీయ తుఫానును సృష్టించి, 1989 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి నేషనల్ ఫ్రంట్ కూటమికి అధికారం కట్టబెట్టడమే గాక హిందూ పత్రిక యాజమాన్యంలో కూడా ఒక తుఫాను నే సృష్టించింది. ఆ పత్రిక వ్యవహారాల్లో అంతర్గతంగా రేగిన వివాదం తాలూకు వివరాలు వీధికెక్కాయి. 1991లో కస్తూరి సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ఈ పరిణామాలు కస్తూరి ఆధ్వర్యంలోని హిందూ పత్రికపై అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకువచ్చిందీ తేటతెల్లం చేస్తాయి.

పాఠకుల సంపాదకుడు

[మార్చు]

హిందూ బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ తరహాలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గత జనవరిలో పాఠకుల సంపాదకుడిని నియమించింది. పాఠకుల సంపాదకుడు పాఠకుల తరపున పత్రికలో పనిచేసే స్వతంత్రవ్యక్తి. పాఠకులు పత్రికకు సంబంధించి ఏ విషయంలోనైనా తమ ఫిర్యాదులను పాఠకుల సంపాదకుడి దృష్టికి తీసుకువెళితే ఆయన వాటిని పరిష్కరిస్తాడు. హిందూ నియమించిన మొట్టమొదటి పాఠకుల సంపాదకుడు కె. నారాయణన్ పత్రిక సంపాదకీయాల్లో చోటుచేసుకున్న వైరుధ్యాలను పాఠకుల తరపున నిర్మొహమాటంగా ఎత్తిచూపినా, హిందూ ఆ వ్యాసాన్ని Archived 2006-09-02 at the Wayback Machine ప్రచురించింది. ఇటీవల బ్లాగులపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హిందూ వ్యతిరేకించినా పాఠకుల ఉత్తరాల్లో ప్రభుత్వ చర్యను బలంగా సమర్థించినవారి ఉత్తరాలనూ ప్రచురించింది.

సాధించిన ముందడుగులు

[మార్చు]

హిందూపత్రికలో అనేక పత్రికా సాంకేతికత విషయాల్లో భారతీయ పత్రికలలోనే ప్రథమముగా నిలిచింది. వాటిలో కొన్ని

  • 1940 - రంగులలో ముద్రణను ప్రవేశపెట్టిన తొలి భారతీయ పత్రిక
  • 1963 - వార్తపత్రికల పంపిణీకి తమ సొంత విమానాలను వినియోగించిన తొలి భారతీయ పత్రిక
  • 1969 - పేజీల ప్రసారానికి ఫాక్సును ఉపయోగించిన తొలి భారతీయ పత్రిక
  • 1980 - కంప్యూటర్ సహాయంతో ఫోటో సెట్టింగును ప్రవేశపెట్టిన తొలి భారతీయ పత్రిక
  • 1986 - ఫాక్సు ప్రసారాలకు ఉపగ్రహాలను ఉపయోగించిన తొలి భారతీయ పత్రిక
  • 1994 - పేజీ మేకప్, రిమోట్ ఇమేజింగ్ లో పూర్తిగా కంప్యూటర్లచే పాఠ్యాన్ని, గ్రాఫిక్సును అనుసంధానించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి భారతీయ పత్రిక
  • 1995 - ఆన్లైన్లో వార్తల వెబ్సైటు ప్రారంభించిన తొలి భారతీయ పత్రిక

హిందూ పత్రికా చిహ్నము

[మార్చు]
హిందూ పత్రికా చిహ్నము

హిందూ లోగో లోని కామధేనువు పవిత్రతకు, శంఖం ప్రజావాణికి, సూర్యుడు జ్ఞానానికి - చైతన్యానికి, గడ్డిపోచలు సాఫల్యతకు/సస్యశ్యామలానికి, ఏనుగు బలానికి - సామర్థ్యానికి, పద్మం స్వచ్ఛతకు, భారతదేశ పటం మాతృభూమికి చిహ్నాలు.

హిందూ అందించే అనుబంధాలు

[మార్చు]

(మెట్రో ప్లస్ కొన్ని ముఖ్య నగరాలలో మాత్రమే వస్తుంది)

  • ప్రతి సోమవారం
  • ప్రతి మంగళవారం
    • మెట్రో ప్లస్
    • ఓపెన్ పేజ్, ఎడ్యుకేషన్ & బుక్ రివ్యూ
  • ప్రతి బుధవారం
    • మెట్రో ప్లస్
    • ఆపర్చ్యూనిటీస్ (ఉద్యోగావకాశాలు)
  • ప్రతి గురువారం
    • మెట్రో ప్లస్
  • ప్రతి శుక్రవారం
    • యంగ్ వరల్డ్, పిల్లలకు ప్రత్యేకం. దీంట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన శీర్షిక ది హిందూ యంగ్ వరల్డ్ క్విజ్
    • ఫ్రైడే రివ్యూ సినిమాలు, కళలు, సంగీతం, కాలక్షేపానికి సంబంధించిన విశేషాలతో
    • క్వెస్ట్, పిల్లలకోసం, వివిధ పాఠశాలల విద్యార్థులు వ్రాసే అంశాలతో (నెలకొకసారి).
  • ప్రతి శనివారం
    • ప్రాపర్టీ ప్లస్
  • ప్రతి ఆదివారం
    • మేగజైన్ సామాజిక అంశాలు, కళలు, సాహిత్యం, చెట్లు, మొక్కల పెంపకం, విహారయాత్రలు, పర్యటక ప్రదేశాలు, ఆరోగ్యం, వంటలు, హాబీలు మొదలైన విశేషాలతో.
    • లిటరరీ రివ్యూ - నెలకొక సారి ప్రతి నెలా మొదటి ఆదివారం

పత్రికలో ఎక్కువమందిని ఆకట్టుకునే రోజువారీ శీర్షికలు దిస్ డే దట్ ఏజ్, క్రాస్‌వర్డ్, రిలీజియన్.

ఇతర ప్రచురణలు

[మార్చు]
  • ది హిందూ బిజినెస్ లైన్ – వాణిజ్య వ్యవహారాల దినపత్రిక
  • ది హిందూ అంతర్జాతీయ సంచిక – వారానికొకసారి
  • ది స్పోర్ట్‌స్టార్ – క్రీడావిశేషాల వారపత్రిక
  • ఫ్రంట్‌లైన్ మేగజైన్ – పక్షపత్రిక
  • ప్రాక్సిస్ – యాజమాన్య విషయాలపై త్రైమాసపత్రిక
  • సర్వే ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ – భారతీయ పరిశ్రమలపై వార్షిక సమీక్ష
  • సర్వే ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ – భారతదేశంలో వ్యవసాయంపై వార్షిక సమీక్ష
  • సర్వే ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్ – ‌పర్యావరణంపై వార్షిక సమీక్ష
  • ఇండియన్ క్రికెట్ – క్రికెట్ పై వార్షిక సంకలనం
  • ది హిందూ ఇండెక్స్ – నెలవారీ, సంవత్సరం మొత్తానికి
  • ది హిందూ స్పీక్స్ ఆన్ శీర్షికన ప్రత్యేక పుస్తకాలు: విజ్ఞానశాస్త్ర విషయాలు - 2 భాగాలు, గ్రంథాలయాలు, సమాచార సాంకేతికత, యాజమాన్యం, విద్య, మత విలువలు, సంగీతం, ...
  • ది హిందూ పాత సంచికల్లో నుంచి—ది లాస్ట్ 200 డేస్ ఆఫ్ మహాత్మా గాంధీ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-12. Retrieved 2007-10-14. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. The Story Of Our Newspaper. National Book Trust. 1996.
  3. ఫ్రంట్‌లైన్ ఆంగ్ల పత్రికలో డిసెంబరు 5 2003న హిందూ పత్రిక కేసులపై ఒక వ్యాసం. సేకరించిన తేదీ: జులై 3, 2007.

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ది_హిందూ&oldid=4272620" నుండి వెలికితీశారు