థగ్గిస్టులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
19వ శతాబ్దపు థగ్గుల సమూహం.

18-19 శతాబ్దాల్లో భారతదేశంలో దోపిడీలు, హత్యలను వృత్తిగా స్వీకరించిన దుండగులను థగ్గులు లేదా థగ్గిస్టులు అని వ్యవహరించారు. (ఆంగ్లం: Thuggee or Tuggee ) ఒకరు. హిందువులు, ముస్లింలు కూడా ఉండే ఈ థగ్గులు కాళికాదేవిని పూజించేవారు. తాము చేస్తున్న దొంగతనాలు, దోపిడీలు తప్పు అని భావించేవారు కారు. అన్ని వృత్తుల్లాగానే అది కూడా ఒకటని నమ్మేవారు. ప్రణాళికాయుతంగా, అత్యంత దారుణంగా అకృత్యాలు చేసే వారు. థగ్గులు స్త్రీలు, పిల్లల విషయంలో కొన్ని నియమాలు పాటించేవారు.

మతవిశ్వాసాలు

[మార్చు]

థగ్గుల్లో హిందువులు, ముస్లిములు కూడా ఉండేవారు. అయితే కులమత భేదం లేకుండా అందరూ కాళికాదేవిని పూజించేవారు. కాళికాదేవి రక్తబీజుడనే రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు అతని రక్తబిందువుల నుంచి ఒక్కొక్క రక్తబీజుడు జన్మించాడు. అయితే అతణ్ణి అంతం చేసేందుకు కొందరిని సృష్టించి యుద్దరంగమంతా నాలికలు పరవమని ఆదేశించిందని, రక్తబీజుల శరీరం నుంచి చిందిన ప్రతి రక్తబిందువూ వారు తాగేయడంతో నిర్వీర్యుడై రక్తబీజుడు నశించాడని, అలా కాళికామాత తనకు సహాయంగా సృష్టించినవారే థగ్గుల ఆదిపురుషులనీ వీరు నమ్మేవారు.[1] భగవంతుని రెండు ముఖాలని ఒకటి సృష్టి చేయడానికి అయితే, మరొకటి నాశనం చేయడానికని వీరు చెప్పేవారు. సృష్టిక్రమం వేగంగా సాగుతూ, నాశనం మందకోడిగా జరుగుతూండడంతో లయకారకులుగా తమను సృజించాడని వారు చెప్పుకునేవారు. అందువల్ల హత్యలు చేయడాన్ని తప్పుగా తీసుకునేవారు కాదు సరికదా భగవదాజ్ఞని నిర్వర్తిస్తున్నామని గర్వించేవారు.

జీవనశైలి

[మార్చు]

థగ్గులు సాధారణంగా జనం మధ్యలో తాము థగ్గులమని ఎవరికీ తెలియకుండా జీవిస్తూండేవారు. పైగా సామాన్య జీవితం గడిపేవారిలాగానే వ్యాపారాలు, వృత్తులూ చేస్తూండేవారు. కానీ హఠాత్తుగా రహస్యంగా నిర్దేశించుకున్న సమయానికి ఎవరికీ చెప్పకుండా ఊరి నుంచి మాయమయ్యేవారు. అందరూ ఊరివెలుపల సంకేత ప్రదేశంలో కలుసుకుని దోపిడీలకు బయలుదేరేవారు. సాధారణంగా ఇది దసరా సమయంలోనే జరుగుతూంటుంది. వర్షాలు వెలసి, రాత్రిళ్ళు వెన్నెల కాసే సమయం కావడంతో వీరు దోపిడీలు చేసేందుకు వీలుగా ఉంటుందనీ, పైగా తాము ఆరాధించే కాళికామాత ఆరాధన సమయం కావడం మరొకటి ఇందుకు కారణాలు. అలా కలుసుకున్నాక ముందుగా నిర్దేశించుకున్న శకునం కోసం ఎదురుచూస్తారు. ఆ శకునం కనిపించగానే అమ్మవారి అభిమతం అయిందని నమ్మి వేర్వేరు గుంపులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తారు. నిర్ణయించుకున్న దారుల్లోని ఊళ్ళల్లో ఇద్దరిద్దరు చొప్పున పెద్దమనుషులుగా వేషాలు వేసుకుని మకాం వేస్తారు. ఊళ్ళో ధనికులు వేరే ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్న సమయం చూసి వారికి దగ్గరై తాము సైనికులమని, తామూ వాళ్ళు వెళ్ళే దారిలోనే వెళ్తున్నామని తమను వారిలో చేర్చుకుంటే రక్షణ ఇస్తామని నమ్మబలికి వారితో బయలుదేరుతారు. ముందుగా నిర్దేశించుకున్న పథకం ప్రకారం అందరకూ కలిసి ఆ వర్తకులను హత్యచేసి ధనం దోచుకునేవారు.

దోపిడీలు, హత్యలు

[మార్చు]

వారు చేసే దోపిడీలు, హత్యలు ఎన్నో ఏళ్ళనుంచి అనుసరిస్తున్న విధానంలోనే ఉండేవి. థగ్గులు దోపిడీలు చేసిన ప్రతిసారీ హత్యలు చేస్తూంటారు. కేవలం దోపిడీ చేయడం వారి అభిమతం కాదు, హత్య చేయడమూ వారికి ప్రధానమే. అందుకనే హత్యలు చేసే దోపిడీ చేస్తారు. ఊరి నుంచి వ్యాపారానికి బయలుదేరుతున్నవారిని నమ్మించి వారికి రక్షణపేరుతో నటించి తీసుకువచ్చేవారిని సోథాలు అని పిలిచేవారు. వారు గుంపులో అత్యంత నైపుణ్యం కలిగినవ్యక్తులు అయివుండేవారు. వారు కొన్నాళ్ళు నమ్మకంగా ఉండి, కొంతదూరానికి తమవారితో కలిసి దోపిడీ చేసేందుకు పథకం వేసి సమాచారాన్ని పంపేవారు. వారిని ఎక్కడ చంపాలో నిర్ణయించుకున్నాకా ఆ ప్రదేశంలో వారిని పూడ్చిపెట్టేందుకు ముందుగా గోతులు తీసేందుకు లఘాలు అనేవారిని పంపేవారు. వారు తీసే గోతులను భిల్లులు అనేవారు.
ముందుగా హత్యల కోసం నిర్దేశించుకున్న ప్రదేశానికి వచ్చాకా డేరాలు దింపించి అక్కడ గానాబజానా కోసం మజిలీ వేయించేవారు. వారితో పాటుగా దారిలో కలిసిన ఇతర థగ్గుల్లో కొందరు హత్యచేసేందుకు నిర్దేశింపబడివుంటారు. వారిని భుట్టోటులని పిలుస్తారు. వీరు చంపదలుచుకున్నవారి పక్కనే కూర్చుని జమేదారుగా వ్యవహరించే తమ నాయకుని సంజ్ఞ కోసం వేచివుండేవారు. జరిగేది విందు కాబట్టి అనుమానం రాకుండా తంబాకు లావో (తంబాకు తీసుకురా) అనో, పాన్ లావో (తాంబూలం తీసుకురా) అనో ముందుగా పెట్టుకున్న సంకేతాన్ని అనేవాడు. దానితో హఠాత్తుగా తమ చేతి చుట్టూ ఒక చివర వెండి కాసుతో కట్టుకున్న పొడవైన, బలమైన పసుపురంగు రుమాల్ గుడ్డను చంపదలిచినవారి గొంతుకు బిగించి టక్కున చంపేసేవారు. వారి నైపుణ్యం, వేగం, బలం ముందు ఎలాంటివారైనా క్షణాల వ్యవధిలో, నెత్తురుచుక్క చిందకుండా మరణించేవారు.
చనిపోయినవారి బట్టలు తీసేసి, వారివద్ద ఉన్న ధనమంతా దోచుకునేవారు. ముందుగా తీసిపెట్టుకున్న భిల్లులు అనే గోతిలో వారిని పొట్టచీల్చి పాతిపెట్టేవారు. పొట్ట చీల్చుకుంటే, అది ఉబ్బి పూడ్చిన మట్టి పైకిలేస్తుందని, దాన్ని చూసి నక్కలు గుర్తుపట్టి శవాలని బయటకుతీస్తే మొత్తం పొక్కుతుందనే ఉద్దేశంతో అలా చేసేవారు. అలా చేసిన దోపిడీల్లో దొరికిన సొమ్మంతా వారి పద్ధతి ప్రకారం పంచుకుని ఎవరి గ్రామం వారు తిరిగివచ్చేవారు. మళ్ళీ సంవత్సరం వరకూ పెద్దమనుషుల్లానే వ్యవహరించేవారు.

నియమాలు

[మార్చు]

థగ్గులు శకునాలను తీవ్రంగా పాటిస్తారు, సరైన శకునం లేకుంటే ముందుకు అడుగువేయరు. అలానే బయలుదేరాకా ఒక హత్యైనా చేయకుంటే గడ్డం గీసుకోవడం కానీ, క్షవరం చేసుకోవడం కానీ చేయరు. ఒక్క హత్య అయినా చేశాకే తాంబూలం అయినా వేసుకుంటారు.

బ్రిటీష్ ప్రభుత్వ థగ్గులు నిర్మూలన

[మార్చు]

19వ శతాబ్ది నాటికి భారతదేశంలో అన్ని ప్రదేశాల్లోనూ థగ్గులు గుంపులు గుంపులుగా విస్తరించినట్టు బ్రిటీష్ పాలకులు గుర్తించారు. అప్పటికే వందలాది సంవత్సరాల నుంచి థగ్గుల బెడద దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉండేది. అక్బర్ చక్రవర్తి కాలంలో కొందరు థగ్గులను పట్టుకుని శిక్షించారు. తర్వాత బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో థగ్గుల సమస్యను నిర్మూలించేందుకు గట్టి కృషి జరిగింది. బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్ గా పనిచేసిన విలియం బెంటింగ్ థగ్గులను పట్టుకుని తీవ్రంగా శిక్షించాల్సిందిగా నిర్దేశించారు. థగ్గులు చేసే ప్రతి కార్యకలాపాన్నీ నిషేధించారు. థగ్గులను నిర్మూలించేందుకు స్లీమన్ అనే పోలీసు అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 1830ల్లో 5 ఏళ్ళలో 3వేలమంది థగ్గులను పట్టుకుని శిక్షించారు. స్లీమన్ కృషివల్ల థగ్గుల అణచివేత కంపెనీ ప్రభుత్వానికి సాధ్యమయ్యింది. స్లీమన్ పట్టుకున్నవారిలో సయ్యద్ అమీర్ అలీ అప్రూవర్‌గా మారి మరణశిక్ష తప్పించుకుని, జీవిత ఖైదు అనుభవించాడు. ఆపైన సయ్యద్ అమీర్ అలీ స్లీమన్ కు బాగా సహకరించాడు. వందలాది మృతకళేబరాలున్న ప్రదేశానికి తీసుకువెళ్ళి తవ్వించి చూపాడు. ఎలా చంపారో, ఎవరెవరు దానిలో పాల్గొన్నారో కూడా సవివరంగా చెప్పాడు. ఈ వివరాలను లోతుగా పరిశీలించి, పరిశోధించి చివరకు అలీ చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని థగ్గులను నిర్మూలించేందుకు 1835లో థగ్గీ, డెకాయిటీ డిపార్ట్ మెంట్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి, దానికి తొలి సూపరిటెండెంటుగా స్లీమన్ నియమితుడయ్యారు. ఆపైన వేలాదిమంది థగ్గులను పట్టుకుని మరణశిక్ష, దేశబహిష్కరణ, ఖైదు వంటి శిక్షలు అమలుపరిచారు.
ఆపైన దొరికిన థగ్గులు తమకు తెలిసిన ప్రతి విషయాన్నీ చెప్పే షరతుపై రక్షణ కల్పించేలా వ్యూహాన్ని రచించి, ఒకరి సహకారంతో వందమందిని, వారి సహకారంతో మరింతమందిని పట్టుకుంటూ పోయారు పోలీసులు. ఈ క్రమాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా అల్లుకున్న థగ్గుల రహస్య జాలాన్ని ఛేదించి 1870 నాటికల్లా థగ్గులను నిర్మూలించగలిగారు. థగ్గుల నిర్మూలన తర్వాత ఈ అనుభవంతో భారతదేశంలో నేర జాతుల చట్టం 1871లో తీసుకువచ్చారు. ఆ క్రమంలో పలు సంచారజాతులను నేరజాతులుగా రికార్డులకెక్కించి వారికి స్టూవర్ట్ పురం వగైరా గ్రామాల్లో సెటిల్మెంట్లు ఏర్పాటుచేశారు. వాళ్ళు గ్రామం దాటి వెళ్ళడానికి కూడా విధినిషేధాలు విధించి కట్టడిచేశారు. ఈ చట్టం వలసపాలన ముగిశాకా స్వతంత్ర భారతదేశంలో తొలగించినా నేరజాతులు, నేరకులాలన్న కాన్సెప్టు మాత్రం కొనసాగింది. 1904 వరకూ థగ్గులు, దోపిడీల విభాగం కొనసాగి తర్వాత సెంట్రల్ క్రిమినల్ ఇంటిలిజెన్స్ డిపార్టుమెంటు (సీఐడీ) గా రూపొందింది.

21వ శతాబ్ది రివిజనిస్టు దృక్కోణం

[మార్చు]

మార్టిన్ వాన్ వోర్కెన్స్ రాసిన ద స్ట్రేంగల్డ్ ట్రావెలర్: కొలొనియల్ ఇమేజినింగ్స్ అండ్ ది థగ్స్ ఆఫ్ ఇండియా (The Strangled Traveler: Colonial Imaginings and the Thugs of India (2002) ) అన్న పుస్తకంలో థగ్గుల గురించి వలసకాలంలోని బ్రిటీషర్లు భావించింది కేవలం ఊహాత్మకమని వ్రాశారు. 19వ శతాబ్దికి చెందిన థగ్ జాతి కేవలం వలసవాద ఊహల్లో భాగమనీ, భారతీయుల ధార్మిక, మత సంబంధిత కార్యకలాపాల గురించి అతికొద్దిగా తెలిసిన బ్రిటీషర్లు లేని భయాన్ని ఏర్పరుచుకున్నారని పేర్కొన్నారు. జగన్నాథ రథయాత్ర వంటివాటిని బ్రిటీషర్లు వలసపాలన దృక్కోణంలో చూసి తప్పుగా అర్థంచేసుకున్నట్టే ఇదీనని తేల్చారు. థగ్: ద ట్రూ స్టోరీ ఆఫ్ ఇండియాస్ మర్డెరస్ కల్ట్ (Thug: the true story of India's murderous cult) అన్న పుస్తకంలో రచయిత మైక్ డేష్ దేశవ్యాప్తంగా థగ్గులని భావించినవారంతా ఒకేవిధమైన పద్ధతుల్లో, రహస్య నెట్వర్కుతో హత్యలు చేశారన్న అనిర్ధారిత ప్రతిపాదనను తిరస్కరించారు. థగ్గులకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా సాధారణంగా సాగిన హైవేమెన్, దోపిడీదారులు వంటి రకాల హంతకులకు భిన్నమైన లక్షణాలు లేవని, వారందరినీ అల్లుకున్న రహస్య నెట్వర్క్ అనేది కల్పన అనీ వ్రాశారు. వలసవాద కాలపు దృక్కోణం ఈ హత్యలకు మతపరమైన ప్రేరణ ఉందంటూ చేసిన ప్రతిపాదనలు తిరస్కరించారు. కరవు కాటకాలతో దేశం బాధపడతున్న కాలంలో కేవలం పేదరికమే వారిని అటువైపుకు నడిపిందనీ, దీని వెనుక మతపరమైన కోణమేదీ లేదని వ్రాశారు. థగ్గులు కాళికాదేవిని ఆరాధించే విధానం థగ్గులు కాని సాధారణ భక్తులు ఆరాధించే విధానం కన్నా వేరైనది కాదనీ, దానికీ హత్యలకు ఏ సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే థగ్గులకు కొన్ని ప్రత్యేకమైన మూఢనమ్మకాలు ఉండేవని అంగీకరించారు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నరేంద్ర, లూథర్; పున్నా, కృష్ణమూర్తి (ప్రెజంటర్) (6 ఏప్రిల్ 2015). "థగ్గు కథ". సాక్షి సిటీ ప్లస్. narendrayan. Retrieved 28 May 2015.
  2. మైక్, డేష్ (2005). Thug: the true story of India's murderous cult. ISBN 1-86207-604-9.