Jump to content

త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్

వికీపీడియా నుండి
థార్ ఎడారి

త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ చలనచిత్రాన్ని నిర్మించినవారు భారత ప్రభుత్వానికి చెందిన ఫిలింస్ డివిజన్ వారు; నిర్మాణ బాధ్యతను ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుసేన్కు అప్పజెప్పారు.

చిత్ర నిర్మాణం

[మార్చు]

తను ఎన్నోసార్లు బొమ్మలు గీయడానికి వెళ్ళిన రాజస్థాన్ను రంగంగా ఎన్నుకున్నాడు హుసేన్. తనకు చిరపరిచితమైన స్థలాలను, దృశ్యాలను చిత్రీకరించాడు. తన హృదయానికి దగ్గరగా వచ్చిన వాటినెల్లా ఛాయాచిత్రాలుగా తీయించి, వాటిని చలనచిత్రంగా కూర్చాడు. ఆ పదిహేను నిముషాల చలనచిత్రంలో ఒక్క పదం కూడా కామెంటరీ లేదు.

చిత్ర కథ

[మార్చు]

అక్కడో రాజసమైన రాజస్తానీ పురుషుడి ముఖం, ఇక్కడో పులిబొమ్మ ముందు తిరుగుతున్న మేక, అనంతాకాశంలోకి చూస్తూ శతాబ్దాల తరబడి నిలబడిన ఒక శిథిలం, అవతలగా ఆపైన వున్న నీలి సముద్రంలోకి ఎగిరిపోతున్న డేగ, బడిగంట కొట్టగానే ఘొల్లుమంటూ చెదిరిపోతున్న పిల్లలు, గట్టున స్నానం చేసే ఆడవారు, ఎడారి ఇసుకల గీతలు, ఆ గీతల మధ్య ఒక కాలి మువ్వ, ప్రతి అంగుళంలోనూ శిల్పవిన్నాణం శోభిస్తున్న కిటికీ, ఒక ఇంటి ముందున్న మురుగు కాలువ, - ఇట్లా ఒకదాని నుండి మరొక దానికి పసిపిల్లాడి మనసులా, పిచ్చికలా ఎగురుకుంటూ వెళ్తుంది కెమెరా. మధ్య మధ్య ఒక లాంతరు, గొడుగు, పాదరక్షా ... వస్తాయి.... ఈ చలనచిత్రానికి ప్రాణం - దాని సంగీతం. ఆ సంగీతాన్ని యిచ్చినది ఏల్చూరి విజయ రాఘవరావు - ఆంధ్రుడు. హిందుస్తానీ సంగీత ప్రియులందరూ విజయ రాఘవరావును వేణువు నూదే వారిలో మేటిగా నెరుగుదురు. ప్రముఖ వేణువాద్య కళాకారుడు, రోను మజుందార్కు విజయ రాఘవరావు కొంతకాలం వేణువును నేర్పినాడు; రవిశంకర్ సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలలో, నాటకాలలో పనిచేశాడు. "నా భావాన్ని అర్థం చేసుకొని, విజయ రాఘవరావు సరిగ్గా నేనూహించినట్లుగా అమర్చారు సంగీతం. లేకపోతే నా కొంప మునిగిపోయేది " అన్నాడు హుసేన్. ఈ చలనచిత్రానికి సౌండ్ దర్శకత్వం వహించినవారు మరొక ఆంధ్రుడు - పేరు జాస్తి రాఘవేంద్రరావు; అతనిది ఏలూరు.

పురస్కారాలు

[మార్చు]

1967 జూలై మొదటి వారంలో బెర్లిన్లో ముగిసిన 17 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నిడివి తక్కువైన చలనచిత్రాలకు ఇవ్వబడే ప్రథమ బహుమతి - బంగారు ఎలుగుబంటి, త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్కు లభించింది.

మూలం

[మార్చు]

Years of Vision, Padmabhushan P.P.Rao - nov' 2008; వాకాటి పాండురంగారావు వ్యాసం త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్.