తోటకాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోటకాచార్యులు గురువు ఆదిశంకరాచార్య

తోటకాచార్యులు ఒక అద్వైతవేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో వీరు ఒకరు. శంకరాచార్యులు భారతదేశానికి ఉత్తరంలో బదరికాశ్రమాన్ని సంస్థాపించి, వీరిని ఆ మఠానికి అధిపతిగా నియమించారు.

బాల్యం

[మార్చు]

తోటకాచార్యుల గ్రంథాలలో శంకరాచార్యుని గురించి ప్రస్తావించారు కాబట్టి అతను శంకరాచార్యుని కంటే తఱువాత కానీ సమకాలంలో కానీ జీవించి ఉండాలి. శంకరాచార్యుల జీవితచరిత్రను వివరించిన అన్ని దాదాపు అన్ని గ్రంథాలలోనూ తోటకాచార్యులు శంకరాచార్యుని శిష్యులు అని ఉంది. శంకరాచార్యుల కాలం గురించి భిన్నాభిప్రాయానలు ఉన్నందున తోటకాచార్యులు ఏ కాలంలో ఉండేవారు అనేది కూడా నిర్ద్వంద్వం కాదు. కానీ, చాలా మంది చరిత్రకారుల నమ్మకం ప్రకారం తోటకాచార్యులు బహుశా 9వ శతాబ్దానికి చెందినన వారు.[1]

శంకరాచార్యుల కాలంలో అతను ఎక్కువగా వాదించవలసి వచ్చిన వైదీకులు పూర్వమీమాంసకులే. అందుకే అతను భాష్యాలలో అతను దీర్ఘంగా ఖండించినది పూర్వమీమాంసకులను. తోటకాచార్యులు రచించిన శ్రుతిసారసముద్ధరణ అనే గ్రంథంలో శంకరాచార్యుని వలే పూర్వమీమాంసను ఎక్కువగా ఖండించారు. అందుచేత వీరు సమకాలీనులై ఉండాలి. ముఖ్యంగా తోటకాచార్యులు రామానుజాచార్యుని కంటే ముందు జీవించి ఉండాలి.[2]

పూర్వాశ్రమంలో ఇతను పేరు "గిరి". ఇతను పెద్దగా చదువుకోలేదు.[3]

శంకరాచార్యుల దగ్గర శిష్యరికం

[మార్చు]

విద్యారణ్య స్వామి రచించిన మాధవీయ శంకర విజయం అనే గ్రంథం ప్రకారం శంకరాచార్యులు శృంగేరి వెళ్ళినప్పుడు (గిరిగా వ్యవహరింపబడే) తోటకాచార్యులు అతను్ని కలిసి శిష్యుడిగా చేరారు. అతనుకు గురువు పట్ల కల అభిమానం, గౌరవం, భక్తి ఎక్కువ. శంకరాచార్యునికి పరిచారకుడైనట్టుగా అతను పనులను చూస్తూ ఉండేవారు.[3]

తోటకాష్టకం

[మార్చు]

అద్వైతపరంపరానుసారం తోటకాచార్యునికి ఆ పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. తనకు తానుగా ఎక్కువగా చదువుకోని, పెద్దగా తెలివితేటలు లేని గిరి అంటే శంకరాచార్యుని ఇతర శిష్యులకు చిన్నచూపు ఏర్పడింది. ఒక రోజు శాంకరాచార్యులు, అతను శిష్యులు బ్రహ్మసూత్రాలపైన చర్చకు కూర్చుండగా తోటకాచార్యుడు ఇంకా రాలేదు. అతను గురువుగారి బట్టలను ఉతుకుతూ నది దగ్గర ఉండిపోయారు. గిరి వలన చర్చకు ఆలస్యం అవుతోంది అని మిగతా శిష్యులు, ముఖ్యంగా పద్మపాదులు, అసహనంతో ఉన్నారు. గురువు గారు చెప్పేది ఎలాగూ గిరికి అర్థం కాదు అన్న ధోరణిలో మాట్లాడారు. అది గమనించిన శంకరాచార్యులు వారి యోగబలంతో తోటకాచార్యునికి ఆత్మజ్ఞానం ప్రసాదించారు. దానితో తోటకాచార్యులు పరిగెట్టుకుంటూ వచ్చి శంకరాచార్యులను స్తుతిస్తూ తోటకం అనే ఛందస్సులో ఒక స్తోత్రాన్ని రచించారు. ఆ శ్లోకంలో ఎనిమిది శ్లోకాలు ఉండటం వలన అది తోటకాష్టకంగా ప్రసిద్ధినొందింది. అది గమనించిన మిగతా శిష్యులు ఆత్మజ్ఞానం పొందడానికి గ్రంథపరిజ్ఞానం కంటే గురువు అనుగ్రహం ముఖ్యమని గుర్తించారు.[1]

శ్రుతిసారసముద్ధరణి

[మార్చు]

తోటకాచార్యుల రచనలలో ప్రసిద్ధమైనవి రెండు. ఒకటి ముందు చెప్పబడిన తోటకాష్టకం. రెండు శ్రుతిసారసముద్ధరణి.[4]

శ్రుతిసారసముద్ధరణిలో 179 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొదటి శ్లోకం వసంతలతికా ఛందస్సులో ఉంటుంది, ఆఖరి రెండూ స్రగ్ధరా ఛందస్సులో ఉంటాయి. భగవద్గీత వలే ఒక గురువు, శిష్యుడు నడుమ సంభాషణ వలే నడుస్తుంది.[2] ఇందులో ఉన్న విషయాలు:

  • మనసు, దాని పోకడలకు సాక్షిగా ఆత్మ ఉంది
  • తత్ త్వం అసి అంటే ఏమిటి?
  • బ్రహ్మం-ఆత్మ ఐక్యత
  • శ్రుతులలో చెప్పినదానిని బట్టి జగత్తు యొక్క మిథ్యత్వాన్ని నిరూపించడం.
  • జీవన్ముక్తి

కంచి ఇంద్రసరస్వతి పరంపర సన్న్యాసులలో ఒకరైన సచ్చిదానందయోగీంద్రులు ఈ గ్రంథానికి వ్యాఖ్య వ్రాసారు. ప్రస్తుతం మైకేల్ కోమంస్ రచించిన ఆంగ్లపుస్తకానువాదం గూగుల్ బుక్స్లో ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 రోషణ్ దలాల్, Hinduism: An alphabetical guide, 420వ పుట, అక్టోబర్ 2011, "http://books.google.com/books?id=DH0vmD8ghdMC"
  2. 2.0 2.1 2.2 మైకేల్ కోమంస్, Extracting the Essence of the Śruti: The Śrutisārasamuddharaṇam of Toṭakācārya, xiii పుట, "http://books.google.com/books?id=j-eq605vuwUC"
  3. 3.0 3.1 విద్యారణ్య స్వామి, మాధవీయ శంకర విజయం, 14వ అంకం, "http://www.sringeri.net/wp-content/uploads/2011/02/sri-shankara-digvijayam.pdf Archived 2015-10-27 at the Wayback Machine"
  4. advaita-vedanta.org లో తోటకాచార్యుని గురించి, "http://www.advaita-vedanta.org/avhp/disciples.html#tot"