తెలంగాణ రచయితల సంఘం
తెలంగాణ రచయితల సంఘం ఒక సాహిత్య సంస్థ.
స్థాపన
[మార్చు]హైదరాబాద్‌పై పోలీసుచర్య అనంతరం తెలంగాణలో తెలుగువారి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి, విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి, వైతాళికుల స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశ్యంతో 1951 సెప్టెంబర్ 6న తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిరది.
లక్ష్యాలు
[మార్చు]తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్యాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం.
తొలి కార్యవర్గం
[మార్చు]సంఘం తొలి అధ్యక్షుడు దాశరథి. కార్యదర్శి సి.నారాయణరెడ్డి. ఈ సంఘంలో మొదటి నుండి కీలక పాత్ర పోషించింది బిరుదురాజు రామరాజు, పి.మాణిక్యరెడ్డి, యశోదారెడ్డి, కాళోజి నారాయణరావు తదితరులు. తర్వాతి కాలంలో ఆళ్వారుస్వామి కూడా ఇందులో పాలుపంచుకున్నాడు. అప్పటి వరకూ ప్రజా ఉద్యమంలో ముందుండిన దాశరథి, కాళోజీలు సంఘ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.
చేపట్టిన కార్యక్రమాలు
[మార్చు]తెలంగాణ సాహిత్య సమాజం తరపున ప్రభుత్వంతో వివిధ విషయాలపై మాట్లాడేందుకు ఈ సంఘం ఒక వేదికలా పనిచేసింది. తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించి ఆయా ప్రాంతాల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించింది. ఖమ్మంలో ఊటుకూరు రంగారావు, డోకిపర్తి రామలింగం, హీరాలాల్ మోరియాలు మొదలు సిరిసిల్లలో గూడూరి సీతారామ్, జనగామలో గఱ్ఱేపల్లి సత్యనారాయణ రాజు వరకు ఎందరో ఈ సంఘం నిర్వహణలో పాలుపంచుకున్నారు.
= ప్రచురణలు
[మార్చు]తెలంగాణ రచయితల సంఘం తరపున తొలి దశలో దాశరథి, నారాయణరెడ్డిల రచనలు వెలువడ్డాయి. ఆ తర్వాత పల్లా దుర్గయ్యతో పాటుగా ఆంుధప్రాంతానికి చెందిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల రచనలు కూడా సంఘం తరపున ప్రచురితమయ్యాయి. తెలంగాణ రచయితల సంఘం వారు అతి తక్కువ కాలంలో నాగార్జున సాగరం, మహాంధ్రోదయం, పాలవెల్లి, గంగిరెద్దు, ఉపహారం, తెలుగుతీరులు, చిరుగజ్జెలు, జానపద గేయములు, ఉదయఘంటలు తదితర రచనలు వెలువరించారు. ఇవి ఆనాటి యువ సాహితీలోకాన్ని స్ఫూర్తిగా నిలిచాయి. సంఘం తరపున మొదట ‘మంజీర’ పత్రిక కొన్ని సంచికలు వెలువడ్డాయి. ఆ తర్వాత జిల్లాల్లో కూడా కొంత ప్రయత్నాలు జరిగాయి.
నిర్వీర్య దశ
[మార్చు]ఆంధ్ప్రదేశ్ అవతరణ తర్వాత సంఘం ఆంధ్ర రచయితల సంఘంగా మార్పు చెందడమే గాకుండా ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి వారి చేతికి సంఘం బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తెలంగాణ సాహిత్యానికి, ప్రతిభకు అడ్డుకట్ట పడ్డట్టయ్యింది.
పునరుజ్జీవం
[మార్చు]నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, శంకర్, వేణుసంకోజు, వి. ఆర్. విద్యార్థి వంటి కవులు, రచయితలు 2014లో సిద్ధిపేటలో తెలంగాణ రచయితల సంఘాన్ని పునః స్థాపించారు.