Jump to content

తెలంగాణ చేనేత అభయహస్తం పథకం

వికీపీడియా నుండి
తెలంగాణ చేనేత అభయహస్తం పథకం
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని నేత కార్మికులు
స్థాపన10 జ‌న‌వ‌రి 2025
నిర్వాహకులుముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, వారి సమగ్ర అభివృద్ధి చేనేత అభయహస్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 సెప్టెంబ‌రు 9న‌ నేతన్న స‌మ‌గ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం పథకాన్ని ప్రకటించగా దానికి సంబంధించిన మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం 10 జ‌న‌వ‌రి 2025న రూ.168 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.[1]

ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా), తెలంగాణ నేతన్నకు భరోసాలు అమలు చేస్తుంది. తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) కోసం బడ్జెట్ ద్వారా రూ.115 కోట్లు, తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా) కోసం రూ. 9 కోట్లు, తెలంగాణ నేతన్న భరోసా పథకానికి రూ. 44 కోట్లు కేటాయింపులు జరిగాయి.[2]

తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం

[మార్చు]

తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం కింద సంక్షేమ కార్యక్రమాలకి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం జియో-ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించి సామాజిక భద్రత క‌ల్పిస్తుంది.

చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేత‌నాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్‌ (సహకారం) చేస్తారు. కాంట్రిబ్యూష‌న్ గరిష్ట పరిమితి రూ.1200. దీనికి ప్రభుత్వం రెండింతలు అధికంగా అంటే 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి జరగనుంది. ఈ పథకం 15 వేల మంది మ‌ర మ‌గ్గాల (ప‌వ‌ర్ లూమ్‌) కార్మికులకూ వ‌ర్తిస్తుంది. మ‌ర మ‌గ్గాల కార్మికులు తమ వేతనం నుంచి నెలవారీగా 8 శాతం జమ చేస్తారు. వారి గరిష్ట పరిమితి రూ.1200 ప్రభుత్వం వారి కాంట్రిబ్యూష‌న్‌కు స‌మానంగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్ చేస్తుంది. రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు త‌గ్గింది.

తెలంగాణ నేత‌న్న భద్రత (నేత‌న్న బీమా)

[మార్చు]

తెలంగాణ నేత భ‌ద్ర‌త ప‌థ‌కం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మ‌ర మ‌గ్గాల కార్మికులు, అనుబంధ కార్మికుల‌కు వ‌ర్తిస్తుంది. ఇక్కడ న‌మోదైన కార్మికుడు ఏ కార‌ణం చేత మృతి చెందితే రూ. 5 లక్షల నామినీకి అందుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల స‌హ‌కార సంఘం ద్వారా బీమా క‌వ‌రేజీ అంద‌రికీ వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కంలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న 65 ఏళ్ల గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి కూడా వ‌ర్తిస్తుంది. ఈ పథకం అమ‌లుకు ఏడాదికి బ‌డ్జెట్ అంచ‌నా వ్యయం రూ.9 కోట్లుగా నిర్దారించారు.

తెలంగాణ నేతన్నకు భ‌రోసా

[మార్చు]

ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే జియో ట్యాగ్ అయిన మ‌గ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి పరిమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గ‌రిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికుల‌కు రూ.6 వేలు వేత‌న స‌హాయం అందిస్తారు. దీంతో కార్మికుల‌కు వేతన మద్దతు లభించడంతో నాణ్యత పెరుగుతుంది. ఈ ప‌థ‌కం అమ‌లుకు వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.44 కోట్లు కేటాయించారు.

తెలంగాణ చేనేత మార్క్ లేబుల్

[మార్చు]

చేనేత‌, సిల్క్ మార్క్ మాదిరే ప్రత్యేక లోగో ద్వారా తెలంగాణ‌కు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందిస్తారు. దేశ‌, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్ బ్రాండింగ్ చేయ‌డం దీని లక్ష్యం. తెలంగాణ చేనేత వ‌స్త్రాల వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టను పెంపొందించాలని భావిస్తున్నారు. చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, స‌ముచితమైన మార్కెట్‌ను సృష్టించ‌డం జరుగుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల జీవ‌నోపాధి, సంక్షేమం, అభివృద్దికి మద్దతుగా నిలవచ్చు. పోటీని త‌ట్టుకునేలా తెలంగాణ చేనేత పరిశ్రమ సంప్రదాయ నైపుణ్యాలు,ప‌నిత‌నాన్ని సంరక్షించి కొనసాగించే వీలుంటుంది.

లేబుల్ ద్వారా తెలంగాణ చేనేత ఉత్పత్తులకు సమ‌ష్టి గుర్తింపును అందినట్టు అవుతుంది. తెలంగాణలో చేతితో నేసిన ఉత్పత్తుల ద్వారా కార్మికుల పనితనం ప్రచారంలోకి వచ్చి కొనుగోలుదారులకు ప్రామాణికత, నాణ్యతప‌ర‌మైన హామీ లభిస్తుంది. ఉత్పత్తి ప్రత్యేకత చెప్పడంతో సృజనాత్మక హస్తకళల‌ ముఖ్య లక్షణంగా గుర్తింపు దొరుకుతుంది. ఇది పోటీదారుల నుంచి వేరు చేసి వినియోగ‌దారుల‌తో అనుసంధానం చేస్తుంది.

ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం చేనేత‌, జౌళి శాఖ డైరెక్టరేట్ ద్వారా అమ‌ల‌వుతుంది. ప్రత్యేకమైన లోగా ద్వారా "తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్" రూపకల్పన చేశారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌కు ప్రత్యేకంగా రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు. జియో ట్యాగ్‌తో అనుసంధాన‌మైన మ‌గ్గాల‌న్నీ వాటంత‌ట‌వే రిజిస్టర్ అవుతాయి. ఇలా రిజిస్టర్ అయిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ మాత్రమే. కొత్త మ‌గ్గాల విషయంలో తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ న‌మోదుకు ఆన్‌సైట్ వెరిఫికేష‌న్ చేస్తారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లను ఆయా జిల్లాల అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు (ఏడీ) స‌ర‌ఫ‌రా చేస్తారు. దీనికి వార్షిక బ‌డ్జెట్ రూ.4 కోట్లు కేటాయించారు.

లేబుల్‌లో ఏముంటుందంటే.... లేబుల్ ఒక వైపు తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌తోపాటు 9 అంకెల నంబ‌ర్ ఉంటుంది. అందులో మొద‌టి రెండు అంకెలు ఆ జిల్లా/ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కోడ్‌ను చెబుతాయి. త‌ర్వాత రెండు అంకెలు సంవత్సరాన్ని తెలియ‌జేస్తాయి. త‌ర్వాత అయిదు అంకెలు ర‌న్నింగ్ సీరియ‌ల్ నెంబ‌ర్ తెలియ‌జేస్తాయి. లేబుల్ మ‌రోవైపు కార్మికుడు, ఉత్ప‌త్తి వివ‌రాలు ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రూ.168 కోట్లతో 'చేనేత అభయహస్తం'". 11 January 2025. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  2. "రూ.168 కోట్లతో నేతన్నలకు అభయహస్తం పథకం". Mana Telangana. 10 January 2025. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.