తెన్నేటి సుధాదేవి
తెన్నేటి సుధాదేవి తెలుగు రచయిత్రి. ఆమె వంశీ సంస్థల అధ్యక్షురాలు.[1] ఈమె విలక్షణ రచయిత్రి. ఈమె కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు, కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. [2] ఈమె కేవలం రచయిత్రిగానే కాక వంశీ సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు చూస్తూ సాహిత్య లోకానికి, సమాజానికి ఎనలేని సేవలందించింది.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె స్వస్థలం వరంగల్లు జిల్లా హన్మకొండ. ఆమె తల్లి అహల్యాదేవి హిందీ పండింట్, తండ్రి టి.వి.సుబ్బారావు తెలుగు అధ్యాపకుడు. ఇద్దరికీ సాహిత్యమంటే చాలా మక్కువ. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను - తన తల్లి చూసుకునేది. తను రాసి పిల్లలతో నాటికలు వేయించేది. అప్పుడప్పుడు సుధాదేవితో కూడా రాయించేది. రచనా రంగంలో తన తల్లి ఆమెను ప్రోత్సహించేది. ఏకపాత్రాభినయాలు బాగా రాయించేది. ఇలా తన తల్లి స్కూల్ వయసు నుండే రాయడం అలవాటు చేసింది.
తనకు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె పెద్ద. తనకు ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. అందరికీ సాహిత్యమంటే ప్రాణం. ఆమె నాన్న టి.వి.సుబ్బారావు గొప్ప రచయిత. అతను గణితంలో 15 పుస్తకాలు వ్రాశాడు. ఇంట్లో అందరూ సాహిత్యాభిమానులే కావడంతో ఇంటి నిండా పుస్తకాలుండేవి. ఆమె యద్దనపుడి సులోచనారాణి. వాసిరెడ్డి సీతాదేవి నవలలు బాగా చదివేది. కళాశాల వయసు వచ్చేసరికి మాదిరెడ్డి సులోచన, యండమూరి వీరేంద్రనాథ్, డిటెక్టివ్ నవలలు చదవడం మొదలుపెట్టింది. ఆమె తల్లి 'స్రవంతి' అనే మాస పత్రికలో అనువాద కథలు రాసేది.
ఆమె డిగ్రీ తర్వాత ఎం.ఏ (తెలుగు) ను వరంగల్లో చేసింది. తరువాత బి.ఇడి పూర్తి చేసింది. తరువాత వంశీరామరాజు గారితో పెండ్లయిన తర్వాత హైదరాబాద్ వచ్చింది. వివాహం తర్వాత ''బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళావైదుష్యం'' అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది. పీజీడీసీజే జర్నలిజం కోర్సు కూడా చేసింది.
రచనా జీవితం
[మార్చు]ఈమె రాసిన మొదటి కథ 'వేదన' 1969లో ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైంది. ఈ కథకు పారితోషకంగా 40 రూపాయలు పొందింది. వంశీ రామరాజు వారి ఇంటికి దగ్గరలో అద్దెకు ఉండేవారు. అతనితో పరిచయం ఆమెకు రచనల పట్ల ఆసక్తిని మరింత పెంచింది. వారిది ప్రేమ వివాహం. అతనికి సాహిత్యం, కళలు అంటే చాలా ఇష్టం. రామరాజు 1972లో వంశీ సంస్థను స్థాపించారు. సంస్థ పనులతో సమయం సరిపోక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. వారికి ఇద్దరు పిల్లలు. వంశీధర్, వంశీ కృష్ణ. పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం, ఉద్యోగ బాధ్యతల వల్ల కొంత కాలం రచనా ప్రస్థానానికి దూరంగా ఉంది. ఈమె సోదరుడు తెన్నేటి శ్యామకృష్ణలు కూడా రచయిత.[3]
ఈమె అమృతవాణి సంస్థలో స్క్రిప్టు రైటరుగా పనిచేసింది. అక్కడ తెలుగు సామెతలు ఇచ్చి నాటికలు రాయమన్నారు. అక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేసింది. తరువాత 15 సంవత్సరాల పాటు వాళ్ల కోసం రాసి పంపేది. అలా 500 సామెతల నాటికలు రాసింది. ఈమె తెలుగు సామెతలను తన రచనకు మకుటంగా చేసుకుని, వాటికి వివరణనిస్తూ, సులభ శైలిలో, తెలుగులో 500 కు పైగా నాటికలను రాసింది. మధ్యతరగతి జీవితాలకు ప్రతీకలైన ఈ చిరునాటికలు "రేడియో వెరిటాస్ - మనీలా" నుండి రేడియో నాటికలుగా చాలాకాలం రేడియో వేరితాస్ (ఫిలిప్పైన్స్) ద్వారా ప్రసారం చెయ్యబడ్డాయి. [4] వీటిలో నుంచి 75 నాటికలను 'తెలుగు సామెత నాటికలు' పేరుతో పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది.
ఈమె 1978లో తెలుగు అకాడమీలో చేరి సుమారు 32 సంవత్సరాలు పనిచేసింది. అందులో పబ్లికేషన్ అసిస్టెంట్‌గా చేరి డిప్యూటీ డైరెక్టర్‌గా 2010లో పదవీ విరమణ చేసింది. ఈమె జీవితంలో ఎక్కువ భాగం తెలుగు అకాడమీలోనే పనిచేసింది. అక్కడ ఎన్నో రకాల పుస్తకాలకు పబ్లికేషన్ బాధ్యతలు చూసింది. తెలుగు 'పరిశోధన పత్రిక' కు 1995 నుంచి సహ సంపాదకురాలిగా పనిచేసింది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం కోసం ఈ పత్రిక బాగా పనిచేసేది.
ఈమెకు 2005 లో ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక బహుమతి వచ్చింది.
పురస్కారాలు
[మార్చు]పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు 2005లో ఉత్తమ రచయిత్రిగా 'వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారం అందచేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సంస్థల సత్కారాలు పొందింది. భారతీయ మహిళాశక్తివారు 2006లో 'విశిష్ట మహిళా సేవా పురస్కారం' అందజేశారు. 1998లో వంగూరి ఫౌండేషన్ వారు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించిన మొదటి ప్రపంచ తెలుగు సాహిత్య కార్యక్రమాల్లోను, 2004లో చికాగోలో జరిగిన ఆటా సభల్లోనూ పాల్గొంది.
రచనలు
[మార్చు]- అమ్మ (కవితా సంపుటి)
- వినిపించని వేదన (కథా సంపుటి)
- రవళి (కథా సంపుటి)
- అరవింద (కథా సంపుటి)
- బలిజేపల్లి లక్ష్మీకాంతకవి నాటక కళా వైదుష్యము
- మహిళలు - రాజ్యాధికారం రిజర్వేషన్ సమస్య
- తెలుగు సామెత నాటికలు
- రచయిత్రుల కొత్త కథలు (కథల సంకలనం)[5]
మూలాలు
[మార్చు]- ↑ "కైకాలకు కనకాభిషేకం". సితార. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆమె ఓ సాహితీ కార్యకర్త - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
- ↑ "దేవుడు వెలిశాడు". www.teluguvelugu.in. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
- ↑ "Sujanaranjani Monthly Telugu E-Magazine". www.siliconandhra.org. Archived from the original on 2019-09-16. Retrieved 2020-07-11.
- ↑ "రచయిత్రుల కొత్త కథలు". lit.andhrajyothy.com. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.