Jump to content

తుమ్మల రామకృష్ణ

వికీపీడియా నుండి


తుమ్మల రామృష్ణ
దస్త్రం:Tummala photo.jpg
తుమ్మల రామకృష్ణ
జననంఅక్టోబరు 12, 1957
చిత్తూరు జిల్లా ఆవుల పల్లి గ్రామం
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిఆచార్యుడు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు
మతంహిందూమతం
తండ్రిమునివెంకటప్ప
తల్లిసాలమ్మ

జీవిత విశేషాలు

[మార్చు]

తుమ్మల రామకృష్ణ 1957, అక్టోబరు 12వ తేదీన జన్మించారు. వీరి జన్మస్థలం చిత్తూరు జిల్లా, సోమల మండలం, ఆవులపల్లె గ్రామం. వీరి తల్లిదండ్రలు మునివెంకటప్ప, సాలమ్మ. ఈయన ప్రాథమిక విద్య స్వగ్రామంలో, మాధ్యమిక విద్య పెద్ద ఉప్పరపల్లి నెరబైలు (తలకోన)లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ నుంచీ పిహెచ్.డి వరకు తిరుపతిలో కొనసాగింది. ఈయనశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నుంచి ‘‘తెలులో హాస్య నవలలు’’ అనే పరిశోధక గ్రంథానికి పిహెచ్.డి పట్టా పొందారు.

1983లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో ఎం.ఫిల్., 1988లో ఆచార్య జి.ఎన్.రెడ్డి పర్యవేక్షణలో పి.హెచ్.డి పట్టాలను పొందారు. అప్పుడు ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు శ్రీవెంకటేశ్వరవిశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్ గా పనిచేసేవారు.పరిశోధన సమయంలోనే వారి దగ్గర నిఘంటు ప్రాజెక్టులో ప్రాజెక్ట్ అసిస్టెంటుగా కూడా పనిచేశారు. 1989లో కర్నూలు పి.జి.సెంటరులో తెలుగు లెక్చరర్‌గా చేరారు.

కథాసాహిత్యం

[మార్చు]

తుమ్మల రామకృష్ణ మిత్రులు రాప్తాడు గోపాల కృష్ణ, శ్రీనివాసమూర్తిలతో కలిసి ‘పల్లెమంగలి కథలు’, ‘ఫాక్షన్ కథలు’ ప్రచురించారు. ఆ తర్వాత కర్నూలు సాహితీ మిత్రులతో కలిసి ‘కథాసమయం’ కథలు, ‘హైంద్రావతి కథలు’ ప్రచురించారు. ప్రత్యేకించి తాను రాసిన కథలని ‘‘మట్టిపొయ్యి’’ పేరుతో ప్రచురించారు. రామకృష్ణగారికి ఆధునిక సాహిత్యం, ముఖ్యంగా నవల, కథానిక, నాటకం, వచనకవిత్వం అంటే మహా ఇష్టం.[1] వీరి కృషి కూడా ఎక్కువగా ఆధునిక సాహిత్యంపైనే కొనసాగింది. కందుకూరి, గురజాడ, చింతాదీక్షితులు, శ్రీపాద, చలం, కుటుంబరావు, గోపీచంద్, రావిశాస్త్రి, చాసో, మధురాంతకం, కాళీపట్నం, కేతువిశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ, పతంజలి, రాజయ్య, రఘోత్తమరెడ్డి, బి.యస్.రాములు, శివారెడ్డి మొదలైన కవులు, రచయితలపై పలు ఉపన్యాసాలిచ్చారు. 2004 నుంచీ హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో ఆచార్యులుగా ఉన్నారు. 2015 జూన్ నుంచి శాఖాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.[1]

రచనలు

[మార్చు]

ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించి ‘పరిచయం’, ‘బహుముఖం’, ‘అభిఛందనం’, ‘అవగాహన’ అనే వ్యాస సంపుటులు ప్రచురించారు. వీరు రాసిన ‘‘తెల్లకాకులు’’ కథపై వచ్చిన స్పందనలు, విమర్శలు, వ్యాసాలు ‘‘ఎక్కడివీ తెల్ల కాకులు’’ పేరుతో ఆయన విద్యార్థులు వెంకటరమణ, నాగరాజులు ప్రచురించారు.

పరిశోధన పర్యవేక్షణ

[మార్చు]

ఈయన పర్యవేక్షణలో 20 మంది పిహెచ్.డి పట్టాలు, 34 మంది ఎం.ఫిల్. పట్టాలు పొందారు. ముఖ్యంగా నవల, కథానిక, వచన కవిత్వం, సంస్కరణ, అభ్యుదయ, విప్లవోద్యమాలు, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాద, గిరిజన జీవితాలపై ప్రత్యేక శ్రద్ధతో పరిశోధనలు చేయించారు. ఇటీవల ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వృత్తికథలపై పనిచేస్తున్నారు. ‘అడపం’ పేరుతో 31 కథలతో ఒక సంకలనం తీసుకొచ్చారు. ‘రేవు’ పేరుతో మరో 30 కథలతో ఒక కథాసంకలనం రాబోతుంది. వివిధ విశ్వవిద్యాలయాలకు పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. యూ.జి.సి., యు.పి.పి.ఎస్.సి కి తన సేవలందిస్తున్నారు.

రచనలు

[మార్చు]
  1. మట్టిపొయ్యి (కథాసంకలనం)
  2. తెల్లకాకులు (కథాసంకలనం)
  3. పల్లెమంగలి కథలు (కథాసంకలనం)
  4. బారిస్టర్ పార్వతీశం - ఒక పరిశీలన
  5. పరిచయం (వ్యాస సంపుటి)
  6. బహుముఖం (సమీక్షలు - ప్రసంగాలు)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.youtube.com/watch?v=D2BEwUb-_kA ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "dn" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు