డౄపల్
డ్రూపల్ స్వేచ్ఛా లైసెన్స్ తో పంపిణీ అయ్యే PHP లో రాయబడిన కంటెంట్ నిర్వహణా ఫ్రేంవర్క్. ఇది గ్నూ జీపీఎల్ ద్వారా అందుబాటులో ఉంది. కనీసం 2.1% జాలగూళ్ళు ఈ ఫ్రేంవర్క్ ను ఆధారం చేసుకొని రూపొందించినవి. వీటీలో వ్యక్తిగత బ్లాగులు మొదలు వ్యాపారపరమయిన జాలగూళ్ళు, రాజకీయ, ప్రభుత్వ జాలగూళ్ళు (whitehouse.gov, data.gov.uk తో సహా) మొ॥ ఉన్నాయి. నాలెడ్జ్ మేనేజ్మెంట్ (విజ్ఞాన నిర్వహణ), వాణిజ్య సహకారానికి కూడా డ్రూపల్ ను వాడుతున్నారు.
డ్రూపల్ ప్రామాణిక విడుదలను డ్రూపల్ కోర్ అంటారు. జూమ్లా, మూడుల్, కేక్పీహెచ్పీ, లాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం తరహాలోనే డ్రూపల్ కోర్ లో కనిష్టంగా అవసరమయ్యే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఈ ప్రాథమిక అంశాలు : వాడుకరి ఖాతా నమోదు, నిర్వహణ, మెనూ నిర్వహణ, RSS ఫీడ్ల నిర్వహణ, పేజీ లేఅవుటు మార్పు-చేర్పులు, వ్యవస్థ నిర్వహణ. డ్రూపల్ కోర్ ను స్థాపించిన వెంటనే ఒక చిన్నపాటి జాలగూడుగా, లేదా ఒకరూ లేక అనేక మంది కలిసి నిర్వహించే బ్లాగుగా, అంతర్జాల చర్చావేదికగా, లేదా ఒక సంఘపు వెబ్సైటుగా వాడుకోవచ్చు.
2013 జనవరి నాటికి 20,100 ఉచిత డ్రూపల్ ఉపకరణాలు (వీటిని మాడ్యూల్స్ అంటారు) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి డ్రూపల్ పనితనాన్ని హెచ్చించవచ్చు, మనకు అవసమయిన రీతిలో మలుచుకోవచ్చు. ఈ సదుపాయం వల్లనే డ్రూపల్ ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంగా కాక ఒక కంటెంట్ మేనేజ్మెంట్ ఫ్రేంవర్క్ గా గుర్తింపు పొందింది. డ్రూపల్ ని వెబ్ అప్లికేషన్ ఫ్రేంవర్క్ గా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే అందుకు కావాల్సిన అంశాలన్నీ డ్రూపల్ లో ఉన్నాయి. డ్రూపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు. డ్రూపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల (ఆడించగల) వెబ్ సర్వర్ (అపాచీ, ఐఐఎస్, లైట్టీపీడీ, హయావత, చెరోకీ లేదా ఇంజన్ఎక్స్), విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ (మైసీక్వెల్, మాంగోడీబీ, మారియాడీబీ, పోస్ట్గ్రెసీక్వెల్, సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డ్రూపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై, ఇంకా డ్రూపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.
చరిత్ర
[మార్చు]డ్రీస్ బాఁయ్టార్ట్ ఒక మెసేజ్ బోర్డును రూపొందిస్తూ డ్రూపల్ కోడ్ ను రాసి 2001 లో స్వేచ్ఛా సాఫ్టువేరుగా విడుదల చేసారు. డ్రూపల్ అనే పదం డచ్చి పదమైన డృప్పెల్ కి ఆంగ్లాంతరణం, దీని అర్ధం బిందువు (నీటి బిందువు అన్న సందర్భంలో). అందుకే డ్రూపల్ చిహ్నం కూడా నీటిబిందువును పోలి ఉంటుంది. ఈ పదానికి కారణం డ్రూపల్ డ్రాప్.ఆర్గ్ అనే వెబ్సైటు ద్వారా అభివృద్ధి చేయబడటం. బాఁయ్టార్ట్ దీన్ని డార్ప్ (డచ్చిఅర్థం గ్రామం అని) అందామనుకునారు కానీ, టైపాటు వలన డొమెయిన్ పేరు పంజీకరణలో తప్పుగా డ్రూపల్ అని పడింది, ఇది బాగుందనుకొని అలాగే కొనసాగించారు.
డ్రూపల్ లో ఆసక్తి 2003 లో గణనీయంగా పెరిగింది, కారణం డీన్ స్పేస్ అనే జాలగూడును హోవర్డ్ డీన్ అనే 2004 అమెరికా ఎన్నికల అభ్యర్థికి ప్రచారానికి డ్రూపల్లోనే తయారు చేసారు. డ్రూపల్లో వ్యవస్థాపరంగా ఉన్న మంచి అంశాలను అందరూ వాడగలిగారు, దాంతో కొందరు ఔత్సాహికులు సివిక్స్పేస్ ల్యాబ్స్ అనే కంపెనీని జూలై 2004లో స్థాపించి డ్రూపల్ ను ఒక పూర్తి స్థాయి రాజకీయ ప్రచార పరికరంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించి పనిచేసారు. దాంతో ఇతర వర్గాల వారు కూడా డ్రూపల్లో విశిష్టతను సంపాదించారు.
2013 నాటికి డ్రూపల్ అధికారిక జాలగూడులో వందల కంపెనీలు డ్రూపల్ సేవలు అందిస్తున్నట్టుగా తెలిసింది. నేడు డ్రూపల్ ను ఒక సంఘంగా ఏర్పడి ఔత్సాహికులు స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నారు. సమష్టి కృషికి మారుపేరుగా అభివృద్ధి జరుగుతోంది. అందువలన ప్రజాదరణ బాగా లభించింది. జూలై 2007 నుండి జూన్ 2008 మధ్య డ్రూపల్ అధికారిక జాలగూడు drupal.org నుండి 14 లక్షల సార్లు డ్రూపల్ ను దింపుకున్నారు, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే 125% అధికం. డిసెంబర్ 2012 నాటికి 8,08,000 జాలగూళ్ళు డ్రూపల్ ను వాడుతున్నాయి. ఈ జాబితాలో ఎన్నో పేరుగాంచిన సంస్థలు ఉన్నాయి. ఇంకా డ్రూపల్ స్వేచ్ఛా సాఫ్టువేరులకు అందజేసే ఎన్నో పురస్కారాలను అందుకుంది. మార్చి 5, 2009 న డ్రీస్ డ్రూపల్ 7 కి కోడ్ ఫ్రీజ్ (ఏదయినా సాఫ్టువేరులో ఉండాల్సిన అంశాలను కట్టడి చేసి అనుకున్నంత వరకే అభివృద్ధి పరచటం లేదంటే అభివృద్ధి చెయ్యలేనంతగా అంశాల సంఖ్య పెరిగిపోతుంది) ప్రకటించారు. డ్రూపల్ 7 జనవరి 5, 2011 న విడుదలయింది. దాంతో డ్రూపల్ 5 సహకారం ఆగిపోయింది, కేవలం డ్రూపల్ 6, డ్రూపల్ 7 వాడుకలో ఉన్నాయి. డ్రూపల్ సరికొత్త రూపాంతరం డ్రూపల్ 7.22 ను 3 ఏప్రిల్, 2013 న విడుదల చేసారు. డ్రూపల్ 8 ఇప్పుడు వృద్ధిచేయబడుతోంది. ఇంకా విడుదల ప్రకటించబడలేదు. డ్రూపల్ 8 అభివృద్ధిని ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు, ఇవి : ముబైల్, లేఅవుటు, జాల సేవలు, అమరికల నిర్వహణ, HTML5. గూగుల్ సమర్ ఆఫ్ కోడింగ్ వారు 20 డ్రూపల్ ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.
డ్రూపల్ చేవ
[మార్చు]డ్రూపల్ సంఘంలో వాడుకరి చేసే మార్పులుండే sites అనే దస్త్రం వెలుపల ఉన్న మూల భాగమంతా చేవగా పరిగణించబడుతుంది. చేవ అనేది డ్రూపల్ మూలభాగం. డ్రూపల్ లో జరిగే మార్పులను వివరంగా వెర్జన్ సంఖ్యలుగా వెలువరిస్తూ భద్రపరుస్తుంది.
- చేవపు మోడ్యూళ్ళు
డ్రూపల్ లోని ఒక్కో క్రియకు ఒక్కో మోడ్యూల్ ఉంటుంది. కొన్ని మోడ్యూళ్ళు తప్పనిసరిగా సచేతనం చేస్తేనా డ్రూపల్ వెబ్సైటు సరిగా పనిచేస్తుంది. మరికొన్ని చేవపు మోడ్యూళ్ళను సచేతనం చేసి మరికొంత పనితనాన్ని సాధించవచ్చు. డ్రూపల్ చేవ ద్వారా ఎన్నో విశేషాలు వెబ్సైటుకి అందుతాయి, వాటిలో కొన్ని: గణాంకాలు, ఖాతా వాడుక వివరాలు అధునాతన శోధన బ్లాగు టపాలు, పుస్తకాలు, వ్యాఖ్యలు, చర్చావేదికలు, అభిప్రాయ సేకరణ ప్రశ్నలు మెరుగయిన పనితనం కోసం కేషింగ్, ఫీచర్ థ్రాట్లింగ్
వివరణాత్మక యూఆరెళ్ళు
బహుళ స్థాయి మెనూ వ్యవస్థ ఒకే స్థాపనతో బహుళ వెబ్సైట్ల నిర్వహణా సామర్ధ్యం అనేక వాడుకరుల ద్వారా విషయాంశాలు రాసి సృష్టించి, సవరించే సామర్ధ్యం ఓపెన్ఐడీకి సపోర్ట్ ఆరెసెస్ ఫీడ్, ఫీడ్ అగ్రిగేటర్ సురక్ష, కొత్త విడుదలల-తాజాకరణల సూచన వాదుకరి ఖాతా ప్రవరలు అనేక ప్రవేశ నియంత్రణలు (వాడుకరి పాత్రలు, ఐపీ చిరునామా, ఈమెయిలు) పనితనపు ఉపకరణాలు
- చేవపు అలంకరణలు
డ్రూపల్ చెవలో భాగంగా గార్లాండ్, బార్టిక్ అలంకరణలు అప్రమేయంగా వస్తాయి. వీటిని వాడి మనం వెబ్సైటు యొక్క రూపూ-రేఖా-లావణ్యాలను తీర్చవచ్చు. కలర్ మోడ్యూల్ వాడి రంగుల అమరికలను మార్చవచ్చు.
- స్థానికీకరణ
ఆగస్టు 2013 నాటికి తెలుగు సహా 110 భాషలలో డ్రూపల్ అందుబాటులో ఉంది. ఆంగ్ల భాషలో అప్రమేయంగా డ్రూపల్ వస్తుంది. అరబ్బీ, పెర్షియన్, హీబ్రూ లాంటి కుడి నుండి ఎడమ వైపుకు రాసే భాషలకు కూడా డ్రూపల్ సహకారం అందుబాటులో ఉంది. డ్రూపల్ స్థానికీకరణ gettext అనే గ్నూ అంతర్జాతీకరణ, స్థానికీకరణ లైబ్రెరీ పై రూపొందించబడింది.
బయటి లంకెలు
[మార్చు]- డ్రూపల్ అధికారిక జాల గూడు Archived 2019-10-19 at the Wayback Machine