Jump to content

డిమాండ్ రేఖ

వికీపీడియా నుండి
డిమాండ్-సప్లై గ్రాఫ్

ఆర్థిక శాస్త్రములో ఒక వస్తువు ధరకు, ఆ ధర వద్ద ఆ వస్తువుకు ఉండు డిమాండునే డిమాండ్ రేఖ (demand curve) అని పిలుస్తారు. ఒక వస్తువు ధర పెర్గే కొలది సాధారణంగా ఆ వస్తువు డిమాండు తగ్గుతుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఒక వస్తువులు ఏయే ధరల వద్ద ఎంతెంత డిమాండు ఉన్నది పట్టిక ద్వారా రాబట్టి దాన్ని గ్రాఫ్‌లో సూచిస్తే డిమాండ్ రేఖ వస్తుంది.

రకాలు

[మార్చు]

డిమాండ్ రేఖ రెండు రకాలు

  1. వైయక్తిక డిమాండ్ రేఖ
  2. మార్కెట్ డిమాండ్ రేఖ

వైయక్తిక డిమాండ్ రేఖ

[మార్చు]

ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక ధర వద్ద ఎంతెంత పరిమాణంలో కొంటాడొ తెల్పే రేఖ వైయక్తిక డిమాండ్ రేఖ (Individual Demand Curve). ఇది ప్రతి వినియోగదారుడికి వేర్వేరుగా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుని స్వాభావాన్ని కూడా తెలుసుకోవచ్చును.

మార్కెట్ డిమాండ్ రేఖ

[మార్చు]

ఒక వస్తువుకు సంబంధించి అన్ని వినియోగదారుల డిమాండ్ పట్టికలను కల్పి గీయగా వచ్చినదే మార్కెట్ డిమాండ్ రేఖ (Market Demand Curve). ఇది వస్తువు యొక్క స్వభావాన్ని తెలియపరుస్తుంది. దీనిని రెండు విధాలుగా రాబట్టవచ్చు. మొదటి పద్ధతి ప్రకారం మార్కెట్ లోని అన్ని వినియోగదారుల డిమాండ్ పట్టికలను కూడటం. రెండవది, వినియోగదారులలో ఒకరిని నమూనాగా ఎన్నుకొని అతని డిమాండ్ పట్టికను మార్కెట్‌లోని వినియోగదారులచే హెచ్చించడం. సాధారణంగా మార్కెట్ డిమాండ్ పట్టికను మొదటి పద్ధతి ప్రకారం లెక్కించడం కష్టసాధ్యం. కాబట్టి రెండో పద్ధతి ప్రకారమే నిర్మిస్తారు.

డిమాండ్ రేఖ లక్షణాలు

[మార్చు]
  1. సాధారణంగా డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. వినియోగదారుడు ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తును తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తాడు కాబట్టి ధర పెర్గినట్లు క్రమక్రమంగా ఆ వస్తువు కొనుగోలు పరిమాణాన్ని తగ్గిస్తాడు. ధరకు, ఆ వస్తువు డిమాండ్ కు విలోమ సంబంధం ఉండుటచే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది.
  2. సాధారణంగా డిమాండ్ రేఖ సరళరేఖ వలె కాకుండా కుంభాకారంగా ఉంటుంది. ఒక వస్తువు ధర 10% తగ్గితే ఆ వస్తువును 10% కంటే ఎక్కువ అనుపాతంలో కొనుగూలు చేయబడుతుంది. అట్లే వస్తువు ధర 10% తగ్గితే ఆ వస్తువును 10% కంటే తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయబడుతుంది. కాబట్టి డిమాండ్ రేఖ కుడి నుంచి ఎడమకు కేంద్రానికి కుంభాకారంగా ఉంటుంది.

డిమాండ్ రేఖ ప్రయోజనాలు

[మార్చు]

ఆర్థిక శాస్త్రములో డిమాండ్ రేఖ ప్రయోజనం గణనీయమైనది. సమతౌల్యం ధర (equilibrium price) నిర్ణయించడానికి సప్లయ్ రేఖతో బాటు డిమాండ్ రేఖ కూడా అవసరం. ఈ రెండు రేఖలు ఖండించే చోటు వద్ద వినియోగదారుని సమతౌల్యం ఉంటుంది.

డిమాండ్ రేఖకు మినహాయింపులు

[మార్చు]

పేదవారు కొనే వస్తువులు (గిఫెన్ వస్తువులు), గౌరవ సూచల వస్తువులు, వ్యాపార చక్రములు, వినియోగదారుని ఆదాయంలో మార్పులు మొదలగు విషయాలలో డిమాండ్ రేఖ వాలులో మార్పు ఉండవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]